భూములు, సహజ వనరులపై శ్వేతపత్రం విడుదలలో సీఎం చంద్రబాబు
వైఎస్సార్‌సీపీ అనాలోచితంగా రీ సర్వే చేపట్టింది.. గతంలో నేనూ ఆ ప్రయత్నం తలపెట్టి విరమించుకున్నా
ఇకపై భూ యజమానులు వచ్చి కోరితే మినహా సర్వేలు చేయం
మీ భూమి కబ్జా చేస్తే ఫిర్యాదు చేయండి.. వెంటనే తిరిగి ఇప్పిస్తాం.. గుజరాత్ మోడల్‌లో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన హయాంలో ఒకసారి రీ సర్వే చేయాలని భావించామని, కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోతుండటంతో ముందుకు వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీ సర్వేను చేపట్టిందని విమర్శించారు. ఇకపై భూ యజమానులు వచ్చి తమ హద్దులు నిర్ణయించాలని కోరితే మినహా ఎవరికీ సర్వే చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
భూములు, సహజ వనరులకు సంబంధించి సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఎం శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో భూ యజమానులకు రక్షణ కలి్పంచేందుకు గుజరాత్ తరహాలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తెస్తామని చెప్పారు. ఈ చట్టం ప్రకారం కబ్జాదారులే భూమి తమదని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. తమ భూములు కబ్జాకు గురైనట్లు బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే వారి భూములను వెనక్కి ఇప్పిస్తామన్నారు.
ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరుతో గత సర్కారు భూ దోపిడీకి కుట్రలు పన్నితే తాము రద్దుకు క్యాబినెట్‌లో తీర్మానం చేశామన్నారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం దేశంలో ఎక్కడా అమలులో లేదన్నారు. ప్రజల భూములు లాక్కునేందుకే ఏపీలో అమలు చేశారన్నారు. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంతో పేదలకు హక్కులు కలి్పంచినట్టే చేసి వైఎస్సార్ సీపీ నాయకులు దోచేశారన్నారు. భూ దందాలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామన్నారు.
రూ.35 వేల కోట్ల భూ దోపిడీ
వైఎస్సార్ సీపీ హయాంలో భూములతో పాటు ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూములు కబ్జాలకు గురయ్యాయన్నారు. రీ సర్వేతో భూ హద్దులు మార్చేశారన్నారు. అసైన్‌మెంట్, అసైన్డ్, చుక్కల, నిషేధిత భూముల విషయంలో కొత్త రకం దోపిడీకి పాల్పడ్డారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో మార్కెట్ కంటే ఐదు రెట్లు అధిక ధర చెల్లించి భూములు కొన్నారని ఆరోపణలు చేశారు. వైఎస్సార్ సీపీ కార్యాలయాలకు రూ.300 కోట్ల విలువైన 40.78 ఎకరాలను కేటాయించుకున్నారని చెప్పారు.
తమకున్న సమాచారం మేరకు రూ.35 వేల కోట్ల భూ దోపిడీ జరిగినట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. 22–ఏలో భూములను చేర్చి అక్రమాలు చేశారని, అసైన్డ్ భూములను వైఎస్సార్‌సీపీ నాయకులు దోచేసి పట్టాలు పొందారని ఆరోపించారు. పుంగనూరులో భూ వ్యవహారాలను పునఃపరిశీలన చేస్తున్నామన్నారు. మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
బెదిరింపులు, భారీ జరిమానాలతో లీజులను లాక్కుని గనులు కొల్లగొట్టారన్నారు. అధికారులను డిప్యూటేషన్లపై తెచ్చి పథకం ప్రకారం దోపిడీ చేశారన్నారు. ఇసుక, లేటరైట్, ఇతర ఖనిజ నిక్షేపాలతో రూ.19 వేల కోట్లు దారి మళ్లించారన్నారు. తమ హయాంతో పోలిస్తే ఎర్ర చందనం విక్రయాల ద్వారా గత ఐదేళ్లలో 27 శాతం మాత్రమే ఆదాయం వచి్చందన్నారు. వీటన్నింటిపై ప్రజల్లో, అసెంబ్లీలో విస్తృతంగా చర్చించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఏం చేయాలో అర్థం కావట్లేదు..
రూ.500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండపై భవంతులు కట్టారని సీఎం చంద్రబాబు విమర్శించారు. వాటిని ఇప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదన్నారు. మద్యం, గంజాయికి బానిసలై సంఘ విద్రోహ శక్తులుగా మారిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాజకీయ వివక్షకు తావులేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. ఒక్క కిలో కూడా ఖనిజం దోపిడీకి గురికాకుండా అడ్డుకుంటామన్నారు. గతంలో దోపిడీని ప్రశి్నస్తే దాడులు చేశారని, మడ అడవులను కబ్జా చేసి ఇళ్ల స్థలాలిచ్చారని చెప్పారు.
తప్పులు చేసిన అధికారులను తొలగిస్తే దోమల మందు కొట్టించేందుకు కూడా ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. విశాఖలో రామానాయుడు స్టూడియో భూమిలో వాటా కొట్టేయాలని చూశారన్నారు. దసపల్లా భూముల్లో అక్రమంగా అపార్ట్‌మెంట్లు నిరి్మంచారని చెప్పారు. హయగ్రీవ భూముల్ని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కొట్టేయాలని చూశారని చెప్పారు. టీడీఆర్ బాండ్లలోనూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. శారదా పీఠానికి ఎకరా రూ.లక్షకే 15 ఎకరాలు ఇచ్చారని చెప్పారు. ఒంగోలులో రూ.101 కోట్ల ఆస్తులు, తిరుపతిలో మఠం భూములనూ కొట్టేశారన్నారు.
చిత్తూరు జిల్లాలో 982 ఎకరాలు 22ఏ జాబితా నుంచి తొలగించి రిజి్రస్టేషన్ చేసుకున్నారని చెప్పారు. భూ కబ్జాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 10 వేల ఎకరాలు లాక్కున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ లీజ్ ఓనర్లను బెదిరించి వైఎస్సార్‌సీపీ నాయకులకే అమ్మేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. క్వార్జ్, లేటరైట్‌ను దోచేసి సొంత సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసుకున్నారన్నారు. పెద్దిరెడ్డి మనుషులకు ఇష్టానుసారం లీజులిచ్చారన్నారు. పోలవరం కుడి కాల్వ పనుల్లో రూ.800 కోట్ల మట్టిని తరలించారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment