అమరావతి, సాక్షి: అబద్దాలు, ఆరోపణలతో ఏపీలో మరో శ్వేతపత్రం విడుదలయ్యింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సచివాలయంలో భూములు, గనులు, అటవీ సంపద దోపిడీ జరిగిందంటూ ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఒకపక్క.. వాస్తవాలు అన్నీ ఎస్టాబ్లిష్ చేయలేమంటూ, మరోపక్క.. గత పాలనపై బురద చల్లారు. ఇంతకాలం ఎల్లో పేపర్‌లో వచ్చిన వార్తలనే వైట్‌పేపర్‌గా ప్రొజెక్ట్ చేసి చూపించారాయన.
కోర్టుకు వెళ్లి మరీ పేదల ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీ అడ్డుకోవాలని చూసిన టీడీపీ.. ఏ కోర్టులోను అవినీతి అని నిరూపించలేకపోయింది. ఇప్పుడేమో అధికారం ఉందని పేదల ఇళ్ల పట్టాల భూములపై అవినీతి ముద్ర వేస్తూ శ్వేతపత్రం విడుదల చేసింది. జగన్ హయాంలో పేదలకు భూములను పంచడం.. 14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు సెంట్ భూమి కూడా పంచని చంద్రబాబు దృష్టిలో ఇప్పుడు పెద్ద స్కామ్ అయ్యింది.
పేదల ఇళ్ల పట్టాలకు భూములను సేకరించడం, రైతులకు పరిహారం చెల్లించడం, దళితులకు అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడం గత ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసింది. దళితులకు భూములపై హక్కులు కల్పించడం, వాళ్లను యజమానులుగా చేయడం అది చంద్రబాబుకి స్వతహాగానే నచ్చనట్లుంది. అందుకే ఇందులోనూ స్కామ్ అంటూ అడ్డగోలుగా ఆరోపణలు చేశారు ఇవాళ.
ఇక.. గతంలో చంద్రబాబు ఇచ్చిన జీవో 340 ఆధారంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయింపు జరిగింది. అయితే.. టీడీపీ ఆఫీస్ లకు స్థలాలు కేటాయిస్తే ఒప్పు అయ్యిందేమో. అదే వైఎస్సార్ సీపీ ఆఫీస్ లకు స్థలాలు ఇస్తే అవినీతంటూ సీఎం చంద్రబాబు బురద జల్లారు. దీనికి తోడు లోకేష్ తోడల్లుడు భరత్‌కి చెందిన గీతం ఆక్రమణల్ని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండగా స్వాధీనం చేసుకుంది. అది మాత్రం ఇవాళ్టి శ్వేతపత్రంలోకి మాత్రం ఎక్కలేదు.
పైగా 10 వేల ఎకరాల అసైన్డ్ భూములు లాగేసుకున్నారంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఎక్కడి అసైన్డ్ భూములో మాత్రం శ్వేతపత్రంలో చెప్పలేదు.
కొసమెరుపు: గతంలో చంద్రబాబు పాలనలో రైతుల భూములను చుక్కల భూముల జాబితాలో చేర్చేసింది. అయితే జగన్ పాలనలో నిజమైన యాజమానులకు వాటిని తిరిగి అప్పగించారు. అయితే ఆ చుక్కల భూములను నిజమైన యజమానులకు ఇవ్వడం పెద్ద స్కామ్ అంటూ సీఎం చంద్రబాబు ఇవాళ శ్వేతప్రతం విడుదల సందర్భంగా గగ్గోలు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment