సిలికా లభ్యమయ్యే భూముల్లో పర్యటిస్తున్న పరిశ్రమల సిబ్బంది, స్థానిక నాయకులు
రూ.వందల కోట్ల విలువైన సిలికా శాండ్‌పై ముఖ్య నేత దృష్టి
భారీగా కొల్లగొట్టేందుకు కూటమి నేతలతో కలిసి స్కెచ్
స్థానిక నాయకులను రంగంలోకి దింపి భూముల పరిశీలన
పరిశ్రమ ప్రతినిధులను ముందుంచి మంత్రాంగం
పరిశ్రమలకు కేటాయించిన బీడు భూముల్లో తవ్వకాలకు వ్యూహం
పరిశ్రమ అవసరాల పేరుతో తవ్వకాలకు అనుకూలంగా జీవో విడుదల
30 గ్రామాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని రైతుల ఆందోళన
సాక్షి టాస్క్‌ఫోర్స్: ప్రకృతి సంపద కొల్లగొట్టడమే లక్ష్యంగా కూటమి నేతలు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఇసుక, మైకా క్వార్ట్‌జ్ ఖనిజాలను కొల్లగొడుతున్న అధికార పార్టీ నేతలు.. తాజాగా సిలికా శాండ్ కోసం రంగంలోకి దిగారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లోని సిలికాను తవ్వి, విక్రయించేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఎటువంటి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా, సిలికా కోసమే అని అనుమానం రాకుండా.. జాతీయ, రాష్ట్ర ప్రాజెక్టుల కోసం మైనర్ మినరల్స్‌ను లీజు ప్రాతిపదికన తవ్వుకోవచ్చని డిసెంబర్ 24న ఒక జీవో జారీ చేయించారు.
ఈ జీవో ఆధారంగా ఒక ముఖ్య నేత ఆదేశాలతో తవ్వకాలు జరిపేందుకు కృష్ణపట్నం పోర్టు సిబ్బంది, స్థానికంగా ఉన్న కూటమి శ్రేణులు సిలికా ఉన్న భూముల ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు, కోట మండలాల పరిధిలో సుమారు 28 వేల ఎకరాల్లో విస్తారంగా సిలికా శాండ్ ఉంది. ఇందులో వివిధ పరిశ్రమలకు కేటాయించిన భూములు, సిలికా లీజు దారులకు చెందిన భూములు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చిల్లకూరు, కోట పరిధిలోని సుమారు 87 మంది లీజు దారులను సిలికా మైన్‌లోకి వెళ్లకుండా అడ్డుకుంది. కూటమి నేతలు యజమానులను భయపెట్టి, కొన్ని మైన్‌లను బలవంతంగా లాక్కున్నారు. మరి కొందరు కూటమి నేతల ఆగడాలకు భయపడి వారు చెప్పినట్లు చేస్తున్నారు.
బీడు భూములపై కన్ను
చిల్లకూరు, కోట మండలాల పరిధిలో వివిధ పరిశ్రమల కోసం ఏపీఐఐసీ కేటాయించిన వేలాది ఎకరాల భూములు ఏళ్ల తరబడి బీడుగా దర్శనమిస్తున్నాయి. ఇందులో కృష్ణపట్నం పోర్టు, నవయుగకు కేటాయించిన భూమలున్నాయి. చిల్లకూరు మండలం చిలతవరం సెజ్ కోసం 550.48 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో మాస్ అపెరల్ పార్కు పరిశ్రమను 2011లో 15 ఎకరాల్లో శ్రీలంకకు చెందిన యాజమాన్యం ప్రారంభించింది. మూడేళ్ల పాటు నిరాటంకంగా కొనసాగిన పరిశ్రమను అప్పట్లో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అనుచరులు చేసిన గొడవ వల్ల మూసి వేసారు. దీంతో కోట, చిల్లకూరు, గూడూరు మండలాలకు చెందిన సుమారు 700 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉపాధి పోయింది.
ప్రస్తుతం ఆ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో 3,931.86 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయించారు. ఇందులో సుమారు 800 ఎకరాల్లో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. అందులో జిందాల్ సింహపురి పవర్ ప్రాజెక్టు, వేదాంత, మీనాక్షి పవర్ ప్రాజెక్టులు పని చేస్తున్నాయి. మోమిడి రెవెన్యూ పరిధిలోని మన్నేగుంట ప్రాంతంలో కెనేటా పవర్ ప్రాజెక్టు పేరుతో 200 ఎకరాలు కేటాయించినప్పటికి, ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. మిగిలిన భూమి కృష్ణపట్నం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కింద ఖాళీగా ఉంది.
చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు, తమ్మినపట్నం, కోట మండలంలోని కొత్తపట్నం, సిద్దవరం రెవెన్యూ పరిధిలో క్రిస్ సిటీ ఏర్పాటు కోసం ఏపీఐసీసీ.. పట్టా, ప్రభుత్వ భూములు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. అంకులపాటూరు రెవెన్యూలో 151 ఎకరాలు, ఉడతావారిపాళెం, కలవకొండ రెవెన్యూ పరిధిలో 122.280 ఎకరాల్లో ఎస్‌బీ క్యూ స్టీల్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమ నష్టాల బాట పట్టడంతో మూత పడింది. భూములు బీడుగా ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల్లోని పేద రైతులు ఎకరం, రెండెకరాల చొప్పున చదునుచేసి వేరుశనగ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలా ఖాళీకా ఉన్న భూములన్నింటిపై కూటమి నేతలు కన్ను వేశారు.
30 గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు
⇒ సిలికా శాండ్ తవ్వకాలతో 30 గ్రామాలకు ప్రమాదం తప్పదని తెలిసినా, ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను అడ్డు పెట్టుకుని, పరిశ్రమల ప్రతినిధులను ముందు పెట్టి.. కూటమి నేతలు తెర వెనుక నుంచి దందాకు తెర లేపారు.
⇒ బీడు భూముల్లో కనీసం రెండు మీటర్ల మేర సిలికాను తవ్వుకుంటే వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టవచ్చని ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ తవ్వకాలు సాగించాలనే విషయమై పరిశీలనకు వచ్చిన బృందాలను పలు చోట్ల రైతులు అడ్డుకున్నారు. వెనక్కు వెళ్లిపోవాలని ఆదేశించారు. భూముల్లో సిలికా తవ్వకాలు జరిపితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.
⇒ పరిశ్రమల కోసం కేటాయించి ఉంటే.. ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. సముద్ర మట్టానికి 30 మీటర్ల ఎత్తులో ఉండే భూములు.. ప్రస్తుతం తొమ్మిది మీటర్లకు చేరాయని, మరో రెండు మీటర్లు తవ్వితే తుపాను ధాటికి గ్రామాలు కొట్టుకుపోయి జల సమాధి కావాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment