
గోశాలను కూల్చివేసిన కూటమి ప్రభుత్వం
కాశీ నాయన క్షేత్రంలో పలు నిర్మాణాలను కూల్చివేసిన కూటమి ప్రభుత్వం
అటవీ శాఖకు ప్రత్యామ్నాయంగా 50 ఎకరాలను గతంలోనే అందించిన నిర్వాహకులు
కాశినాయన క్షేత్రం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలు తొలుత తిరుమల లడ్డూ నాణ్యతపై లేనిపోని విమర్శలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఆపై అదే తిరుమలలో ఎలాంటి జాగ్రత్త తీసుకోకపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మరణించారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు మరో హిందూ వ్యతిరేక చర్యకు నడుం బిగించారు. ఇందుకు కాశీనాయన క్షేత్రం వేదికైంది. దీనులకు దేవాలయం.. అన్నార్తులను ఆదరించి అక్కున చేర్చుకునే అపర అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రంలో కనిపించేదల్లా.. నిత్యాన్నదానం, స్వచ్ఛంద విరాళాల తత్వం, లాభాపేక్షలేని సేవా భావం! పచ్చటి నేలలోని ఆ ప్రశాంత క్షేత్రంలో ఒక్కసారిగా కల్లోలం చెలరేగింది.
కూటమి సర్కారు వరుసగా కూల్చివేతలు కొనసాగించింది. కాశీనాయన క్షేత్రంలో పలు నిర్మాణాలను కూల్చివేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాషాయ వ్రస్తాలు ధరించి దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తూ పలు ఆలయాలు దర్శించిన, సనాతన ధర్మానికి పరిరక్షకునిగా చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. ఆయన మాత్రం దీనిపై నోరుమెదపడంలేదు. ఎన్నో ఏళ్లుగా పేదల కడుపునింపుతున్న ఓ ధార్మీక క్షేత్రంపై కూటమి ప్రభుత్వం ఇలా కత్తిగట్టినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు.
నిత్యాన్నదానం, గో సంరక్షణ
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసు పల్లి గ్రామానికి చెందిన మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మల రెండో సంతానమైన కాశిరెడ్డి యవ్వనంలోనే ఇంటిని వదిలి ఆథ్యాత్మికత వైపు అడుగులు వేశారు. వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ గరుడాద్రి వద్ద తపస్సులో నిమగ్నమయ్యారని, ఆయనకు జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమై మార్గ నిర్దేశం చేశారని ప్రతీతి.
తన గురువు అతిరాస గురవయ్య ఉపదేశం మేరకు ఆలయాల జీర్ణోద్ధరణకు పూనుకున్నారు. నిత్యాన్నదానం, గో సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. 1995 డిసెంబరు ఆరో తేదీ దత్తపౌర్ణమి రోజు మహాసమాధి అయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా 1999లో కలసపాడు, బి.కోడూరు పరిధిలోని పలు పంచాయతీలతో శ్రీ అవధూత కాశినాయన (ఎస్‌ఎకేఎన్) మండలం ఏర్పాటైంది.
ఎంతో పవిత్రమైన కాశినాయన క్షేత్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూల్చివేతలు మొదలయ్యాయి. గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి, మార్చి 7వతేదీన జ్యోతి క్షేత్రంలోని కుమ్మరి అన్నదాన సత్రం, విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం, గోవుల దాణా షెడ్డు, గోశాల షెడ్డు, మరుగుదొడ్లను కూల్చి వేశారు. జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో శివరంగారెడ్డి నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను కూలగొట్టారు. ఓ వర్గానికి చెందిన వారు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ ద్వారా ఈ పని చేయించారనే అనుమానాలు కాశినాయన భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఎండలో అలమటిస్తున్న గోవులు
వందకు పైగా అన్నదాన సత్రాలు
రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన కాశిరెడ్డి అవధూత కాశీనాయనగా పూజలు అందుకున్నారు. స్థానిక ప్రజలు ఆయనకు నిత్యం పూజలు నిర్వహిస్తూ 13 హెక్టార్ల పరి«ధిలో గుడి, గోశాల, అన్నదాన సత్రాలు, వసతి గృహాలు నిర్మించారు. పలు నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. కాశీనాయన క్షేత్రాన్ని నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. రాయలసీమతో పాటు వివిధ ప్రాంతాల్లో కాశీనాయన పేరిట వందకు పైగా అన్నదాన సత్రాలు కొనసాగుతున్నాయి.
అటవీశాఖకు 50 ఎకరాలు..
నల్లమల అటవీ ప్రాంతంలో వందల ఏళ్లుగా జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఆ గుడి వద్ద అన్నదానం ఏర్పాటుకు చేరుకున్న కాశీనాయన అక్కడే శివైక్యం చెందారు. 1997 నుంచి క్షేత్రం దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. అటవీశాఖ తొలుత అటవీప్రాంతంగా, ఆ తరువాత రిజర్వు ఫారెస్టుగా 2000–2003 నుంచి చెబుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని 50 ఎకరాలను క్షేత్రం నిర్వాహకులు అటవీశాఖకు కేటాయింపజేశారు. గతంలో రాష్ట్ర, కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. విషయం కోర్టు వరకు కూడా వెళ్లింది. దానిపై అటవీశాఖ సానుకూల దృక్పథంతో ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
అన్నదానసత్రంలో భోజనం చేస్తున్న భక్తులు
కొసమెరుపేమిటంటే.. తిరుమల తొక్కిసలాట
ఘటనపై పవన్ కళ్యాణ్ హడావిడి చేయగా ఇపుడు కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై నారాలోకేష్ తాపీగా రంగంలోకి దిగారు. క్షమాపణలు చెబుతున్నానని, కూల్చిన నిర్మాణాలను పునరి్నర్మీస్తామని చెబుతుండడం ఏదో డ్రామాలా కనిపిస్తున్నదని పలు హిందూ ధార్మీక సంస్థలు విమర్శిస్తున్నాయి.
దాతల సహకారం అపూర్వం
ఎక్కడి నుంచి వస్తాయో.. ఎలా వస్తాయో మాకే అంతుబట్టదు. దాతల సహకారం మేం ఊహించిన దానికన్నా ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నామంటే పదివేల మందికి సరిపడా సరుకులు స్వచ్ఛందంగా క్షేత్రానికి చేరుతుంటాయి. ఆలయ నిర్మాణానికి కూడా అదేవిధంగా సాయం అందుతోంది. వారి తోడ్పాటుతోనే మహత్తర క్షేత్రం నిర్మితమవుతోంది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భక్త కోటి కోరుకుంటోంది.
– బి.చెన్నారెడ్డి, ఆలయ ప్రధాన నిర్వాహకులు
ధర్మానికి అండగా నిలవండి
ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న ధార్మిక ఆశ్రమాలను సాకులు చెబుతూ కూల్చడం అభ్యంతరకరం. ఇలాంటి వందలాది ఆశ్రమాలను, ధార్మికవేత్తలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలుండాలి. ధర్మ ప్రచారానికి అండగా నిలవాలి.
– శ్రీనివాసానందస్వామి, కాశీనాయన క్షేత్రం
50 ఎకరాలు ఇచ్చాం..
కాశీనాయన క్షేత్రం సుమారు 13 హెక్టార్లలో విస్తరించింది. అభివృద్ధి పనులు కొన్నేళ్లుగా ఆగిపోయాయి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అటవీభూమికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే 50 ఎకరాలను పెనగలూరు మండలంలో ఇచ్చాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశిస్తున్నాం.
– జీరయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు
Comments
Please login to add a commentAdd a comment