silica
-
సిలికా పై సిల్లీ రాతలు పరువు పోగొట్టుకున్న ఈనాడు..!
-
తప్పుడు రాతలెందుకో.. చెప్పవే ‘సిలికా’
సాక్షి, అమరావతి: తప్పుడు కథనాల్లో ఈనాడుది అందె వేసిన చేయి. అదే కోవలో సిలికా శాండ్ విక్రయాలపై మరో కట్టు కథనం ప్రచురించింది. గనుల శాఖకు సంబంధం లేని విషయాలను ఆ శాఖకు ముడిపెట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. పరస్పర విరుద్ధ వాదనలతో కథనాన్ని అల్లింది. ఈనాడు కథనమంతా పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని గనుల శాఖ స్పష్టం చేసింది. సిలికా శాండ్ మైనింగ్‌పై అసలు వాస్తవాలను ఆ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి వివరించారు. అసత్యాలు, వక్రీకరణలతో ప్రభుత్వంపై బురదచల్లేలా ఈ కథనం ఉందని చెప్పారు. సిలికా శాండ్ మైనింగ్, రవాణా, విక్రయాలు, జీఎస్టీ చెల్లింపులపై ఆ కథనంలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. గనుల శాఖ నలుగురికే అనుకూలంగా ఉందన్న ఆరోపణా అసత్యమని చెప్పారు. ఆ నలుగురికే అనుకూలంగా ఉంటే ఇటీవల కొత్తగా 11 మందికి ఎలా లీజులు జారీ చేస్తామని ప్రశ్నించారు. ఈ అంశంపై సోమవారం ఆయన మీడియాతో చెప్పిన వివరాలు.. చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే.. సిలికా శాండ్ లీజు అనుమతులు, చెల్లింపులు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. సిలికా శాండ్‌కు లీజుదారుల నుంచి సీనరేజీ, డీఎంఎఫ్, మెరిట్, కన్సిడరేషన్ మొత్తాలను గనుల శాఖ ఆన్లైన్లోనే స్వీకరిస్తుంది. అన్ని అనుమతులున్న లీజుదారులకు రవాణా పత్రాలను కూడా ఆన్లైన్లోనే జారీ చేస్తుంది. లీజుదారులు మైనింగ్ చేసిన మెటీరియల్‌ను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా> బహిరంగ మార్కెట్లో ఎవరికైనా అమ్ముకోవచ్చు. లీజుదారులు వారికి అనుకూలమైన సంస్థలకే మినరల్‌ను విక్రయించుకుంటారు. ఇందులో గనుల శాఖ ప్రమేయం ఉండదు. ఒత్తిడి చేసే అవకాశమే ఉండదు. నష్టం వచ్చేలా ఎవరైనా వ్యాపారం చేస్తారా? వ్యాపార రంగంలో విస్తరించి ఉన్న ఈనాడు సంస్థకు ఈ విషయం తెలియదా? ఆసక్తి ఉంటే ఈనాడు యాజమాన్యం కూడా నిబంధనల ప్రకారం సిలికా శాండ్ లీజులు పొందవచ్చు, అలాగే లీజుదారుల నుంచి శాండ్‌ను కొనుక్కోవచ్చు. నిబంధనల ప్రకారం అవసరమైన సహకారాన్ని అందిస్తాం. నిష్పాక్షికతకు నిదర్శనమిది కేవలం నలుగురు డీలర్లకే మేలు చేకూర్చేలా, లీజుదారులు సిలికా శాండ్‌ను వారికి మాత్రమే విక్రయించేలా గనుల శాఖ జరిమానాల పేరుతో వారిపై ఒత్తిడి తెచ్చిందనడం పూర్తిగా నిరాధారం. ఇటీవల గనుల శాఖ కొత్తగా 11 మందికి సిలికా శాండ్ మైనింగ్ లీజులు జారీ చేసింది. నిజంగా ఆ నలుగురికే మేలు చేసే ఉద్దేశం ఉంటే ఈ లీజులు వారే దక్కించుకొని ఉండే వారు. కొత్త వారికి అవకాశం లభించేదా? గనుల శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరించబట్టే కొత్త వారికి లీజులు లభించాయి. గనుల శాఖకేం సంబంధం? లీజుదారులు డీలర్లకు విక్రయిస్తున్న సిలికా శాండ్‌కు సగం మొత్తాన్ని ఆన్లైన్లో, మిగిలిన దాన్ని నగదుగా తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై గనుల శాఖకు ఎటువంటి బాధ్యత ఉండదు. లీజుదారులు, విక్రయదారుల మధ్య జరిగే లావాదేవీల్లో గనుల శాఖ జోక్యం చేసుకోదు. నిబంధనల ప్రకారమే లీజుదారులు జీఎస్టీ చెల్లింపులు చేస్తున్నారు. ఏడాదికి సగటున 20 లక్షల టన్నులు సిలికా శాండ్ విక్రయిస్తున్నారు. దానిలో సగం మాత్రమే ఆన్లైన్లో స్వీకరిస్తూ, దానికి మాత్రమే జీఎస్టీ చెల్లిస్తున్నారంటూ చేసిన ఆరోపణకు ఆధారాలున్నాయా? పరస్పర విరుద్ధ వాదనలేమిటి? సిలికా శాండ్ మైనింగ్‌లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూనే, మరోవైపు గనుల శాఖ జరిమానాలు విధించిందని, ఆ తర్వాత వాటిని సర్దుబాటు చేసిందని పరస్పరం విరుద్ధంగా రాస్తున్నారు. జిల్లా స్థాయిలో విజిలెన్స్ స్క్వాడ్, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్ పోస్ట్‌లు, కీలక ప్రాంతాల్లో నిఘా బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా సిలికా శాండ్ మైనింగ్‌లో అక్రమాలను గనుల శాఖ పూర్తి స్థాయిలో నియంత్రిస్తోంది. ఆరోపణలు వచ్చిన చోట తనిఖీలు చేసి, జరిమానాలు విధిస్తున్నాం. ఈ జరిమానాలపై లీజుదారులు రివిజన్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. ఇది అన్ని మినరల్స్ మైనింగ్‌లోనూ సర్వసాధారణంగా జరుగుతుంది. అథారిటీ ఆ జరిమానాలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. కేవలం ఎవరికో లబ్ధి చేకూర్చేందుకు జరిమానాలను సర్దుబాటు చేశారని రాయడం తప్పు. తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లోని 1150.975 హెక్టార్లలో 73 సిలికా శాండ్ లీజులున్నాయి. శుద్ధి చేయని సిలికా శాండ్‌ను టన్ను రూ.700 కి విక్రయిస్తారు. శుద్ధి చేసిన ఇసుకను దానికి అయిన వ్యయాన్ని బట్టి రేటు నిర్ణయిస్తారు. శుద్ధి చేయని ఇసుకకు లీజుదారులు టన్నుకు రూ.100 సీనరేజీ, కన్సిడరేషన్ కింద రూ.212, డీఎంఎఫ్ కింద రూ.30, మెరిట్ కింద రూ.2 కలిపి రూ.346 ప్రభుత్వానికి చెల్లించాలి. కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నాం సిలికా శాండ్ మైనింగ్‌పై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నాం. 2019లో 73 లీజులను గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి ఉల్లంఘనలు గుర్తించి 61 లీజులకు జరిమానా విధించారు. వారిలో 52 మంది లీజుదారులు రివిజన్ అథారిటీకి అప్పీల్ చేసుకున్నారు. అథారిటీ వాటిని సమీక్షించి పరిష్కరించింది. సిలికా శాండ్ మైనింగ్, రవాణాపై మూడంచెల నిఘా వ్యవస్థ కొనసాగుతోంది. ఇంటర్నల్ బృందాలు, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ తనిఖీలు, జిల్లా విజిలెన్స్ బృందాలు ఎప్పటికప్పుడు మైనింగ్‌ను పర్యవేక్షిస్తున్నాయి. ఆకస్మిక తనిఖీల ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. తిరుపతి జిల్లా మోమిడి, బల్లవోలు, వేల్లపాలెం తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూముల్లో అక్రమ సిలికా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు అవాస్తవం. తిరుపతి జిల్లా తడ మండలం బీవీ పాలెం వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్రమ మైనింగ్ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రిస్తున్నాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంగా నిఘా బృందాలు ఎప్పటికప్పుడు సిలికా శాండ్ మైనింగ్‌ను పర్యవేక్షిస్తున్నాయి. సిలికా శాండ్ మైనింగ్‌లో లీజుదారులది ప్రేక్షక పాత్రని, వందల కోట్ల దందా జరుగుతోందని, కొందరు పెద్దలకు ఈ మొత్తాలు చేరుతున్నాయంటూ ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కలిగించేలా ఈనాడులో తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని ఖండిస్తున్నాం. నిబంధనల ప్రకారమే మైనింగ్, విక్రయాలు, రవాణా జరుగుతుంటే, అక్రమాలు, పెద్దల పాత్రంటూ ఊహాత్మక అంశాలను జోడించి, అసత్య కథనాలు రాయడం మానుకోవాలి. -
‘సిలికా’ పరిహారంపై సుమోటో పిల్
సాక్షి, హైదరాబాద్: సిలికా గనుల్లో పనిచేసి కాలుష్యం బారిన పడిన వారికి తగిన నష్టపరిహారం అందించాలన్న తమ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదంటూ పత్రిక ల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు స్పందిం చింది. ఈ కథనాలను హైకోర్టులో సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్లు, కేంద్ర గనుల శాఖ కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొంది. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరపనుంది. రంగారెడ్డి జిల్లాలోని సిలికా గనుల్లో పనిచేసి కాలుష్యం వల్ల పలువురు మృత్యువాత పడ్డా రు. దీనిపై హైకోర్టులో 2013లో పిల్ దాఖ లైంది. ఈ పిల్ విచారణ సందర్భంగా అప్ప టి అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సిలికా బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరపున హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటి వరకు అమలు కాకపోవడంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. మరోవైపు ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో ఉస్మానియా ఆస్పత్రికి ఉన్న స్థలా న్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించింది. దీనిపై కూడా సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరపనుంది. -
నాలుగు సిలికా లారీలు పట్టివేత
చిల్లకూరు : నిబంధనలకు విరుద్ధంగా సిలికాను తరలిస్తున్న నాలుగులారీలను శుక్రవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాలు.. తీరప్రాంత గ్రామాల్లోని గనుల నుంచి అధికలోడుతో పాటు సరైన ధ్రువీకరణపత్రాలు సిలికాను తర లిస్తున్న నాలుగు లారీలను విజిలెన్స్ డీఎస్పీ వెంకట్‌నాథ్‌రెడ్డి, సీఐ సత్యనారాయణ, ఏజీ రాములు పట్టుకున్నారు. వాటిలో ఒక లారీని రవాణాశాఖాధికారులకు అప్పగించారు. మరోలారీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేదిగా తెలిసింది. లారీని పట్టుకున్నట్లు తన సిబ్బంది ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు దానికి ఎలాంటి జరిమానా విధించలేదని సమాచారం. మరో రెండు లారీలను మాత్రం చిల్లకూరు పోలీసులకు అప్పగించి గనులశాఖకు సిపార్సు చేశారు. ఎమ్మెల్యే లారీ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులను వివరణ కోరేందకు ప్రయత్నించగా వారు అందుబాటుకి రాలేదు. -
‘అక్రమ’ సిలికా.. నీరు ఊరదిక..
గూడూరు, న్యూస్‌లైన్: సిలికా పేరు చెప్పగానే గుర్తొచ్చేది గూడూరు ప్రాంతం. గిరాకీ పెరిగి సిరులు కురుపిస్తుండటంతో సిలికా అడ్డగోలు తవ్వకాలు ఇటీవల అధికమయ్యాయి. మైన్ య జమానుల స్వార్థం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ ప్రాంతంలో జీవనదుల్లా ఉన్న సొనకాలువలు ఇంకిపోయి కనుమరుగవుతున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంట సాగు పశ్నార్థకం గా మారింది. ఏటా మూడు పంటలు పండే పొ లాలు.. పాలకుల నిర్లక్ష్యంతో ప్రస్తుతానికి ఒక కారుకే పరిమితమయ్యాయి. ఆ ప్రాంతాల్లో ప ర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటోంది. నియోజకవర్గంలోని చిల్లకూరు, కోట మండలాల్లో సుమారు 2వేల ఎకరాల్లో సిలికా భూములు ఉన్నాయి. కోట మండలంలోని కర్లపూడి, సిద్ధవరం, కొత్తపట్నం పంచాయతీల పరిధినూ, చిల్లకూరు మండంలోని బల్లవోలు, తూర్పుకనుపూరు, చింతవరం, వరగలి, మోమిడి, ఏరూరు, వేళ్లపాళెం, ఆద్దేపూడి, కొమరావారిపాళెం, మన్నేగుంట తదితర గ్రామాల్లో సిలికా గనులు విస్తారంగా ఉన్నాయి. సిలికాను ఉపయోగించి ఉక్కు, గాజు, కంప్యూటర్ చిప్స్‌ను తయారు చేస్తుండటంతో సిలికాకు మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో సిలికా తవ్వకాలకు అనుమతి కొంతైతే, అక్రమంగా తరలించేది కొండంత. గనుల శాఖాధికారుల నుంచి అనుమతులు పొందిన గనుల యజమానులకు హద్దులను నేటికీ చూపలేదు. అనుమతులు పొందిన భూముల పక్కనే ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండటంతో అక్రమార్కులు తమ భూముల్లోని సిలికాను పక్కన పెట్టి ముందుగా ప్రభుత్వ భూముల్లోని సిలికాను తవ్వేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని బల్లవోలు, మన్నేగుంట, తూర్పుకనుపూరు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న సర్వేనంబరు 1లో ఉన్న ప్రభుత్వ భూముల గుండా సిలికాను అడ్డగోలుగా తవ్వుతూ రాత్రికి రాత్రే లారీల్లో తరలిస్తున్నా మైనింగ్ శాఖ నిద్రపోతోంది. కోట, చిల్లకూరు మండలాల్లో 72 గనులకు ఆ శాఖాధికారులు అనుమతులిచ్చారు. వాటిలో 10 గనులకు 2013వ సంవత్సరంతోనే లీజుదారులకు అనుమతుల కాలపరిమితి ముగిసింది. అయినా ఇప్పటికీ తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు. ఐదువేల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకమే... నిబంధనలకు విరుద్ధంగా సిలికాను యంత్రాలతో తవ్వేస్తుండటంతో సొనకాలువ ఎండిపోయి కోట, చిల్లకూరు మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకం కానున్నాయి. గతంలో సొనకాలువను ఆధారంగా చేసుకుని ఈ భూముల్లో వరి, వేరుశనగ, పుచ్చ తదితర పంటలను కాలానుగుణంగా మూడు కార్లు పండించే వారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సిలికాను 10 అడుగుల మేర మాత్రమే తవ్వాల్సి ఉన్నా యంత్రాలతో సుమారు 30 అడుగుల వరకు తవ్వుతున్నారు. సిలికా అడ్డగోలు తవ్వకాలతో సొనకాలువల్లో నీరు ఉండకపోవడంతో కేవలం ఒక్కకారు మాత్రమే పండుతోంది. నిబంధనలకు విరుద్ధంగా సిలికా తవ్వకాలు యంత్రాలతో సాగితే భవిష్యత్‌లో పంటలు పండేది అనుమానమే. కోర్టు ఆదేశాలూ బేఖాతర్.. సిలికా గనుల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగిస్తుండటంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తడంతోపాటు కాలుష్యంబారిన పడుతున్నామని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సిలికా గనుల్లో అక్రమ తవ్వకాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టడంతోపాటు, కాలుష్య నివారణకుఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలు ఇవ్వాలని కోర్టు మైనింగ్ శాఖను ఆదేశించింది. కాలుష్యానికి కారణాలైన సిలికా అక్రమ తవ్వకాలను, రవాణాను అడ్డుకుని మైనింగ్ అధికారులు నివేదిక సమర్పించాల్సిందిపోయి, సిలికా గనుల యజమానులకు పర్మిట్ల మంజూరులో మాత్రమే కోత విధించి చేతులు దులుపుకున్నారు. దీంతో సిలికా అక్రమ రవాణా కొనసాగుతోంది. అక్రమ సిలికా తరలింపుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. అయితే తమకు ముడుపులు అందుతుండటంతో గనుల శాఖ అధికారులు అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. -
మొద్దు నిద్ర వీడరే..
చీరాల, న్యూస్‌లైన్: సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక దిబ్బల్ని తవ్వేస్తున్నారు..కొండల్ని పిండి చేస్తున్నారు..అంతా అనధికారికంగా సాగిపోయే దోపిడీ. వేటికీ ప్రభుత్వ అనుమతులుండవు. ప్రకృతి సంపద కొల్లగొడుతున్న అక్రమార్కులకు, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులు, సిబ్బందికి మాత్రం కాసులే..కాసులు. ఈ అక్రమాన్ని అరికట్టాల్సిన మైనింగ్ శాఖ మౌనంగా కళ్లకు గంతలు కట్టుకుని ఉంది. బరితెగిస్తున్న అక్రమార్కుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ శాఖలోని అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఈనెల 19న రోడ్డెక్కనున్నారు. అక్రమాలకు వంత పలుకుతున్న మైనింగ్ అధికారులను సాగనంపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టనున్నారు. వేటపాలెం, చినగంజాం, చీరాల మండలాల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఇసుక మాఫియా గురించే. సీజన్, అన్‌సీజన్ అన్న తేడా లేకుండా ఈ ప్రాంతం నుంచి రోజుకు 300 నుంచి 400 లారీల వరకు ఇసుక తరలిపోతోంది. వీటిలో తొంభై శాతం అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నవే. కేవలం పది మందికి సిలికా పేరుతో ఇసుకను ఒక పరిధిలో మాత్రమే తవ్వుకునే అవకాశం ఉంది. కానీ జరుగుతున్న దందా మరో విధంగా ఉంది. కేవలం ఇసుకను తరలించేందుకు ప్రత్యేకమైన క్యాబిన్ తయారు చేసిన లారీల్లో ముప్పై నుంచి నలభై టన్నుల ఇసుకను నింపి హైదరాబాద్‌తో పాటు పలు నగరాలకు తరలిస్తున్నారు. ఒకనాటి ఇసుక దిబ్బలన్నీ పెద్ద గొయ్యిలుగా మారి చెరువులను తలపిస్తున్నాయి. ఈ విధంగా కొన్నేళ్లు సాగితే గతంలో ఇక్కడ ఇసుక దిబ్బలు ఉండేవంటా అని భావి తరాల వారు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇందులో అధికార పార్టీకి చెందిన పెద్ద నాయకులతో పాటు చాలా మంది హస్తం ఉంది. ఈ విషయంపై అనేక సార్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాల్టా చట్టం ప్రకారం ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిషేధం. అయినప్పటికీ మైనింగ్ శాఖ మాత్రం మౌనం వీడటం లేదు. రోజు వందల సంఖ్యలో వెళ్తున్న లారీల జోలికి అసలు వెళ్లడం లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చి ఒకటి, రెండు లారీలను పట్టుకొని తమ పని అయిపోయినట్లుగా భావిస్తోంది.