చీరాల, న్యూస్‌లైన్: సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక దిబ్బల్ని తవ్వేస్తున్నారు..కొండల్ని పిండి చేస్తున్నారు..అంతా అనధికారికంగా సాగిపోయే దోపిడీ. వేటికీ ప్రభుత్వ అనుమతులుండవు. ప్రకృతి సంపద కొల్లగొడుతున్న అక్రమార్కులకు, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులు, సిబ్బందికి మాత్రం కాసులే..కాసులు. ఈ అక్రమాన్ని అరికట్టాల్సిన మైనింగ్ శాఖ మౌనంగా కళ్లకు గంతలు కట్టుకుని ఉంది. బరితెగిస్తున్న అక్రమార్కుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ శాఖలోని అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఈనెల 19న రోడ్డెక్కనున్నారు. అక్రమాలకు వంత పలుకుతున్న మైనింగ్ అధికారులను సాగనంపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టనున్నారు.
వేటపాలెం, చినగంజాం, చీరాల మండలాల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఇసుక మాఫియా గురించే. సీజన్, అన్‌సీజన్ అన్న తేడా లేకుండా ఈ ప్రాంతం నుంచి రోజుకు 300 నుంచి 400 లారీల వరకు ఇసుక తరలిపోతోంది. వీటిలో తొంభై శాతం అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నవే. కేవలం పది మందికి సిలికా పేరుతో ఇసుకను ఒక పరిధిలో మాత్రమే తవ్వుకునే అవకాశం ఉంది. కానీ జరుగుతున్న దందా మరో విధంగా ఉంది. కేవలం ఇసుకను తరలించేందుకు ప్రత్యేకమైన క్యాబిన్ తయారు చేసిన లారీల్లో ముప్పై నుంచి నలభై టన్నుల ఇసుకను నింపి హైదరాబాద్‌తో పాటు పలు నగరాలకు తరలిస్తున్నారు. ఒకనాటి ఇసుక దిబ్బలన్నీ పెద్ద గొయ్యిలుగా మారి చెరువులను తలపిస్తున్నాయి.
ఈ విధంగా కొన్నేళ్లు సాగితే గతంలో ఇక్కడ ఇసుక దిబ్బలు ఉండేవంటా అని భావి తరాల వారు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇందులో అధికార పార్టీకి చెందిన పెద్ద నాయకులతో పాటు చాలా మంది హస్తం ఉంది. ఈ విషయంపై అనేక సార్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాల్టా చట్టం ప్రకారం ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిషేధం. అయినప్పటికీ మైనింగ్ శాఖ మాత్రం మౌనం వీడటం లేదు. రోజు వందల సంఖ్యలో వెళ్తున్న లారీల జోలికి అసలు వెళ్లడం లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చి ఒకటి, రెండు లారీలను పట్టుకొని తమ పని అయిపోయినట్లుగా భావిస్తోంది.
మొద్దు నిద్ర వీడరే..
Published Mon, Nov 18 2013 2:27 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement