illegal sand
-
నది గర్బం నుంచి ఇసుకను తోడేస్తున్నారు
-
అక్రమదందా!
ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కాసులు కురిపిస్తున్న అక్రమ ఇసుక ఆరు నెలల్లో రూ.25 కోట్ల అక్రమార్జన అక్రమ రీచ్‌ల కోసం ఆధిపత్య పోరు కొన్నదానికంటే కొట్టుకొచ్చిన జాంపండుకు రుచి ఎక్కువ అంటారు... అదెంత నిజమో తెలీదు కాని జిల్లాలో అక్రమంగా తవ్వుకొచ్చిన ఇసుకకు మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇది ఏకంగా ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమ తవ్వకాల కోసం సిగపట్లు పట్టుకునేంతవరకు వెళ్లింది. వరహా నదిలో తామే అక్రమంగా తవ్వుకుంటామంటే... కాదు కాదు మేమే తవ్వుకుంటామంటూ వివాదానికి దిగుతున్నారు. ఎందుకంటే ఆ అక్రమార్జన విలువ నెలకు రూ.4 కోట్ల పైమాటే మరి. విశాఖపట్నం : యలమంచిలి, ఎస్.రాయవరం సరిహద్దుల్లోని వరహా నది ఇసుక జిల్లాలో ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కాసుల పంట పండిస్తుండటంతో పాటు వారిద్దరి మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. అధికారికంగా జిల్లాలో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయలేదు. కానీ యలమంచిలి, ఎస్.రాయవరం మండలాల సరిహద్దుల్లో గార్లపూడి, రామచంద్రాపురం, గొట్టివాడ సమీపం తదితర చోట్ల అధికార టీడీపీ నేతలు అక్రమ ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు. యలమంచిలి నియోజకవర్గానకి చెందిన ప్రజాప్రతినిధి పార్టీ మండల స్థాయి నేతకు బాధ్యతలు అప్పగించి జేసీబీలతో అక్రమంగా ఇసుక తవ్వకాల దందాకు తెరతీశారు. దాంతో ఈ రీచ్‌లపై పాయకారావుపేట నియోజకవర్గ టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను పడింది. తమ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఇసుకను యలమంచిలి నియోజకవర్గ నేతలు తవ్వుకుపోవడమేమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రజాప్రతినిధి ఎస్.రాయవరం మండల ప్రజాప్రతినిధిని ఇన్చార్జిగా పెట్టి జేసీబీలతో అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. ఈ వ్యవహారం అంతా రాత్రి పూట జరుగుతోంది. చీకటిపడిన తరువాత భారీ సంఖ్యలో వాహనాలతో ఇసుకను తవ్వుకుపోతున్నారు. ఆరు నెలల్లో రూ.25 కోట్లు కొల్లగొట్టారు రెండు నియోజకవర్గాల నేతలు ఆరునెలలుగా ఇష్టానుసారంగా అక్రమ తవ్వకాలు జరిపేస్తున్నారు. రెవెన్యూ వర్గాల అంచనా ప్రకారం రోజుకు దాదాపు 50 లారీలు, 100 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. లారీ ఇసుక లోడ్‌ను రూ.20 వేలు, ట్రాక్టరు ఇసుక లోడ్‌ను రూ.4వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఆ ప్రకారం రోజుకు రూ.14 లక్షల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. అంటే నెలకు రూ.4.20 కోట్ల చొప్పున గత ఆరు నెలలుగా రూ.25 కోట్ల వరకు భారీ దోపిడీకి పాల్పడ్డారని తెలిసింది. ముందుముందు ఈ అక్రమ ఇసుక దందాతో ఇంకెంతగా అక్రమార్జనకు పాల్పడతారన్నది ఊహింప శక్యం కాకుండా ఉంది. ఇసుకపై ఆధిపత్యం కోసం విభేదాలు ఇసుక అక్రమార్జన పూర్తిగా తమకే చెందాలని ఎవెరికి వారు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు. అందుకే ఒకరివర్గంపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీరిద్దరి ఒత్తిడితో పోలీసులు కొన్ని కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఇద్దరికీ సన్నిహితుడైన జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద పంచాయతీ పెట్టినట్లు తెలిసింది. ఇసుక ఆదాయం అంతా తనకు చెందాలంటే కాదు తనకే చెందాలని ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. పాయకారావుపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కీలక నేత సహకారాన్ని కూడా కోరినట్లు తెలిసింది. ఆయన ద్వారా ఈ వివాదం తనకు అనుకూలంగా పరిష్కరించుకోవాలన్నది ఎత్తుగడ వేశారు. దాంతో ఇద్దరు ప్రజాప్రతినిధుల అక్రమ ఇసుక దందా వివాదం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. -
100 ట్రాక్టర్ల ఇసుక సీజ్
పెద్దకబుదూరు : కర్నూలు జిల్లా పెద్దకబుదూరు మండలం రాజీమాన్దొడ్డి గ్రామంలో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం ఆర్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని 100 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. కుంభరి లక్ష్మన్న, లెండి వెంకన్న, వెంకటేశ్‌పై కేసు నమోదు చేశారు. -
టీడీపీ మార్కు ఆందోళన
- డ్వాక్రా మహిళలను పావులుగా వాడుకున్న చింతమనేని - ఇదేం తీరంటూ ముక్కున వేలేసుకున్న నగర ప్రజ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేయడం ఇప్పటి వరకూ చూశాం. అన్యాయం చేసిన వారికి అనుకూలంగా ఆందోళన చేయడం టీడీపీ ప్రభుత్వంలోనే సాధ్యమయిందని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. టీడీపీ నాయకుల అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా సాధారణ ప్రజలు, ప్రత్యర్థి వర్గాలే కాక అధికారులపై దాడులు చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించడానికి ప్రయత్నించిన ఒక తహసిల్దార్‌పై దాడికి తన అనుచరులను ప్రోత్సహించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాన్నుంచి బయటపడ్డానికి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆందోళనలు చేయడం విచిత్రంగా ఉందంటున్నారు. కృష్ణాజిల్లా ముసునూరు తహసిల్దార్ వనజాక్షిపై బుధవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడిచేసిన నేపథ్యంలో గురువారం నగరంలో హైడ్రామా నడిచింది. చింతమనేనిని తక్షణం అరెస్ట్ చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండగా చింతమనేని వర్గీయులు ఎదురుదాడికి దిగారు. గురువారం ఉదయానికల్లా నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని నగరానికి వాహనాలలో తరలించారు. ప్రభుత్వ అనుమతి మేరకు జిల్లా పరిధిలోని తమ్మిలేరులో ఇసుక తవ్వుకుంటున్న డ్వాక్రా మహిళలను అడ్డుకుని, దాడి చేసిన కృష్ణాజిల్లా ముసునూరు మండల తహసిల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని అక్కడ తిరిగి ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని డ్వాక్రా మహిళలనుఅసభ్య పదజాలంతో దూషించి, తన అనుచరులతో దాడి చేయించిన తహసిల్దార్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎస్పీ భాస్కర్ భూషణ్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ విప్ చింతమనేని పట్ల ఆమె అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. కాగా చింతమనేని డ్వాక్రా మహిళలను భయభ్రాంతులకు గురిచేసి కొందరిని, ప్రలోభాలతో కొందరిని పెద్దఎత్తున తరలించినట్టు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో ఆందోళన సందర్భంగా కొందరు సొమ్మసిల్లిపడిపోయారు. ప్లేట్ల కోసం పెనుగులాట స్థానిక ఇండోర్ స్టేడియంలో ఆందోళనకారులకు చింతమనేని ఏర్పాటు చేసిన విందు కూడా రసాభాసగా మారింది. భోజనానికి ప్లేట్లు పంచుతుండగా అందరూ ఒక్కసారి ఎగబడ్డారు. దీంతో చింతమనేని అనుచరులు ప్లేట్లు ఉన్న ఆటోను ఆ ప్రాంతం నుంచి తీసుకువెళ్లిపోతుండగా మహిళలు ఆటో వెంట పరుగులు పెట్టారు. పెనుగులాటలో పలువురు కిందపడిపోయి స్వల్పంగా గాయాల పాలయ్యారు. భోజనం ప్లేట్లు దొరకని మహిళలు.. విందు భోజనాలని ఇక్కడికి తీసుకువచ్చి ముష్టివాళ్లలా పరుగులు తీయించి చింతమనేని అవమానించారని బాహాటంగానే దుమ్మెత్తి పోశారు. -
తోడేస్తున్నారు..
- నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు - సాయంత్రం ఆరు తర్వాతా కొనసాగింపు - పట్టించుకోని టీఎస్ఎండీసీ అధికారులు - సర్కారు ఇసుక క్వారీలో ఇష్టారాజ్యం.. - పుష్కరాల పనుల్లో నాణ్యతాలోపం - స్నానఘట్టాల క్యూరింగ్‌కు నీటి కొరత - అధికారుల పర్యవేక్షణ కరువు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఇసుక అక్రమ రవాణాకు చెక్‌పెట్టడమే కాకుండా, ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక సరఫరా చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన సర్కారు క్వారీలోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నీల్వాయి ఇసుక రీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఇసుక తవ్వకాలు జరపాలి. కానీ రీచ్‌లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. ఒక్కోరోజు అర్ధరాత్రి వరకూ తవ్వకాలు సాగుతున్నాయి. అక్రమ తవ్వకాలను అరికట్టాలని నీల్వాయి గ్రామ పంచాయతీలో తీర్మానం కూడా చేశారంటే ఇసుక ఏ స్థాయిలో తోడేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నీల్వాయి వాగులో 1.92 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుకునేందుకు భూగర్భ గనుల శాఖ టీఎస్ఎండీసీ(ప్రభుత్వ రంగ సంస్థ)కి లీజుకు ఇచ్చింది. ఈ రీచ్ నుంచి సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో స్టాక్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. టీఎస్ఎండీసీ ఈ స్టాక్ పాయింట్ నుంచి ఇసుక విక్రయాలు చేపడుతోంది. ఒక్కో క్యూబిక్ మీటరుకు రూ.550 చొప్పున విక్రయిస్తోంది. నీల్వాయి వాగులో ఇసుకను తవ్వి.. ట్రాక్టర్ల ద్వారా ఆ ఇసుకను స్టాక్ పాయింట్‌కు తరలించడం, స్టాక్‌పాయింట్ నుంచి ఇసుకను లారీల్లో నింపే పనుల కోసం టీఎస్ఎండీసీ టెండర్లు పిలిచింది. అతి తక్కువకు కోట్ చేసిన కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్‌కు ఈ కాంట్రాక్టు దక్కింది. ఇసుకను తవ్వి.. లారీల్లో లోడు చేసినందుకు సదరు కాంట్రాక్టరుకు ఒక్కో క్యూబిక్ మీటరుకు రూ.156 చొప్పున టీఎస్ఎండీసీ చెల్లిస్తోంది. ఒప్పందం ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలి. కానీ ఒక్కో రోజు రాత్రి పది గంటల వరకు కూడా యథేచ్ఛగాఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని నీల్వాయి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు లీజుకు తీసుకున్న ఇసుక క్వారీల్లో అక్రమ తవ్వకాలు జరగడం సర్వ సాధారణం. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వమే నిర్వహిస్తున్న క్వారీల్లోనే నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం. టీఎస్ఎండీసీ వైఖరిపై విమర్శలు.. స్వయంగా సర్కారు సంస్థ నిర్వహిస్తున్న క్వారీలో అక్రమాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీఎస్ఎండీసీ అధికారులకు ఉంటుంది. కానీ ఈ సంస్థ అధికారులు సదరు కాంట్రాక్టరును వెనుకేసుకు రావడం పలు ఆరోపణలకు దారితీస్తోంది. ఇసుక కొనుగోలు చేసేందుకు వచ్చిన లారీలకు వెయిటింగ్ పడుతుందనే ఉద్దేశంతో ఒక్కో రోజు రాత్రి వరకు ఇసుక తవ్వకాలు జరపాల్సి వస్తోందని టీఎస్ఎండీసీ అధికారులు కాంట్రాక్టరుకు వెనుకేసుకొస్తున్నారు. వర్షం పడిన రోజు, ఆలస్యంగా తవ్వకాలు ప్రారంభమైన రోజు రాత్రి వరకు ఇసుక తవ్వాల్సి వస్తోందని పేర్కొన్నారు. టీఎస్ఎండీసీ బాధ్యత వహిస్తుంది.. ప్రదీప్, మైనింగ్ ఏడీ లీజు ఒప్పందం ప్రకారం రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరపరాదు. టీఎస్ఎండీసీకి లీజుకు ఇచ్చిన నీల్వాయి రీచ్‌లో ఇసుక తవ్వకాలకు ఆ సంస్థనే బాధ్యత వహిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపడితే ఆ సంస్థపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
కర్నూలు : ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆకే రవిక్రిష్ణ సబ్ డివిజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ శివకోటి బాబురావుతో కలిసి మంగళవారం సాయంత్రం పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నేరాలపై డీఎస్పీలతో సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన రీచ్‌ల నుంచి కాకుండా ఇతర ఏ ప్రాంతాల నుంచి ఇసుక తరలించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఇందుకోసం నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్‌ను కూడా మరింత కట్టుదిట్టంగా నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని కట్టడి చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌పై ట్రాఫిక్ డీఎస్పీ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మూడున్నర నుంచి నాలుగున్నర వరకు గంటపాటు సమావేశం జరిగింది. జిల్లాలో నమోదైన ముఖ్యమైన కేసుల పురోగతితో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ దర్యాప్తు పురోగతి గురించి చర్చించారు. ఆదోని సబ్ డివిజనల్ పరిధిలోని గ్రామాల్లో చౌక డిపోల వల్ల పెరుగుతున్న గ్రామ కక్షల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి చర్చించారు. ఇటీవల జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న దారిదోపిడీల గురించి కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. నిర్దేశించిన కాల వ్యవధిలోనే దొంగలు, దోపిడీదారులను పట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రౌడీ షీటర్లు, ఇతర సస్పెక్ట్ షీటులు ఉన్న వారి పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని, అందుకు అవసరమైన కసరత్తు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏఎస్పీ శశికుమార్, డీఎస్పీలు డివి.రమణమూర్తి, బాబు ప్రసాద్, వీరరాఘవరెడ్డి, మురళీధర్, వినోద్‌కుమార్, హుసేన్‌పీరా, బీఆర్.శ్రీనివాసులు, పీఎన్.బాబు, రామచంద్ర, ఏజి.క్రిష్ణమూర్తి, వై.హరినాథరెడ్డి, వివి.నాయుడు, కె.సుప్రజ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
జిల్లా ఎల్లలు దాటుతున్న ఇసుక
సాక్షి, రాజమండ్రి :నగర పరిధిలో, ధవలేశ్వరంలో ప్రస్తుతం నాలుగురేవుల్లో ‘సామాన్యుల ఇసుక అక్కరను తీర్చేందుకు’ జరుగుతున్న తవ్వకాలతో దండిగా సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులకు జిల్లాలో 27 రీచ్‌లకు పర్యావరణ అనుమతులు దక్కడం చేదుకబురుగా మారింది. ఆ రీచ్‌లలో తవ్వకాలు మొదలైతే ఇసుక ధర దిగి రావచ్చు. అప్పుడు ఇప్పటిలా భారీ లాభాలకు అవకాశం ఉండదు. దీంతో అక్రమార్కులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ఈలోగానే వీలైనంత ఎక్కువ సొమ్ము రాబట్టుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రిలో కుమారి టాకీస్ సమీపంలోని రెండు రేవులు, జీవకారుణ్య సంఘం ఎదురుగా ఉన్న రేవు, ధవళేశ్వరం వద్ద ఉన్న గాయత్రీ రేవుల్లో రెండు రోజులుగా ఇసుక తవ్వకాలు రెట్టింపయ్యాయి. ఈ నాలుగు రేవుల నుంచి ఇసుక నిబంధనలకు విరుద్ధంగా జిల్లా దాటి పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాలకు తరలిపోతోంది. అంతే కాక ముందుగా ఇసుకను నగర శివారు ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి రాత్రిళ్లు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు పది చక్రాల లారీలపై తరలిస్తున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం ఇసుకను లారీల్లో తరలించకూడదు. కానీ అధికారులు కళ్లు మూసుకున్నటు నటిస్తుండగా, ప్రజా ప్రతినిధుల సాక్షిగా ఇసుక జిల్లా ఎల్లలు దాటుతోంది. అధికారులు కళ్లకు కట్టుకున్న గంతలు విప్పడంలేదు. ‘పశ్చిమ’ లారీలు ఇక్కడికే.. పశ్చిమగోదావరి జిల్లా గోంగూరతిప్పలో ఉన్న రెండు రేవుల్లో ఒకచోట ఇసుక తవ్వకాలు బోటు నిర్వాహకులు, కూలీల నిరసన వల్ల సోమవారం నుంచి నిలిచి పోయాయి. అక్కడ ఇప్పటికే ఇసుకకు డీడీలు తీసిన వారు 11 వేలకు పైగా ఉండడంతో అక్కడి లారీలు కూడా రాజమండ్రి వచ్చేస్తున్నాయి. సోమ, మంగళవారాలు రాజమండ్రి రేవుల వద్ద ఇతర జిల్లాల వాహనాలు బారులు తీరి కనిపించాయి. ముందుగా డీడీలు ఇచ్చామన్న వంకతో ధవళేశ్వరం గాయత్రి రేవు నుంచి రాత్రిళ్లు భారీగా ఇసుక ఇతర జిల్లాలకు తరలిపోతోంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇసుక తవ్వకం, రవాణా నిలిపివేయాలి. కానీ ఆరు లోపే డీడీలు కట్టలుగా తెచ్చి డ్వాక్రా మహిళలకు ఇచ్చేసి రవాణా రాత్రంతా కొనసాగిస్తున్నారు. దీనిపై కొందరు నిలదీయగా స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధి వారించినట్టు తెలుస్తోంది. స్థానికంగా ఉండే బినామీలు వివిధ పేర్లతో డీడీలు తీయించి వాటిని ప్రాధాన్యక్రమంలో లోడు చేయించినందుకు ఇతర జిల్లాల దళారుల నుంచి లారీకి ఇంత అని అదనపు ఫీజు కూడా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ బోట్లకున్నాయి అనుమతులు..? ఇసుక తవ్వకాల్లో నిబంధనలు గోదావరి నీళ్లలో కలిసిపోతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. రీచ్‌లలో కొత్తగా స్థానం సంపాదించిన బోటు సంఘాలకు బోట్లే లేవని తెలుస్తోంది. పశ్చిమగోదావరి నుంచి బోట్లు అద్దెకు తీసుకుని వాటితో పని నడిపిస్తున్నారు. వాటికి లెసైన్సులు లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఒక రెవెన్యూ అధికారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ‘అసలు ఏ బోట్లకు ఉన్నాయి అనుమతులు?’ అని ఎదురు ప్రశ్నించడం ఇసుక అడ్డగోలు దందాకు ఒక సాక్ష్యం. -
మొద్దు నిద్ర వీడరే..
చీరాల, న్యూస్‌లైన్: సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక దిబ్బల్ని తవ్వేస్తున్నారు..కొండల్ని పిండి చేస్తున్నారు..అంతా అనధికారికంగా సాగిపోయే దోపిడీ. వేటికీ ప్రభుత్వ అనుమతులుండవు. ప్రకృతి సంపద కొల్లగొడుతున్న అక్రమార్కులకు, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులు, సిబ్బందికి మాత్రం కాసులే..కాసులు. ఈ అక్రమాన్ని అరికట్టాల్సిన మైనింగ్ శాఖ మౌనంగా కళ్లకు గంతలు కట్టుకుని ఉంది. బరితెగిస్తున్న అక్రమార్కుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ శాఖలోని అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఈనెల 19న రోడ్డెక్కనున్నారు. అక్రమాలకు వంత పలుకుతున్న మైనింగ్ అధికారులను సాగనంపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టనున్నారు. వేటపాలెం, చినగంజాం, చీరాల మండలాల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఇసుక మాఫియా గురించే. సీజన్, అన్‌సీజన్ అన్న తేడా లేకుండా ఈ ప్రాంతం నుంచి రోజుకు 300 నుంచి 400 లారీల వరకు ఇసుక తరలిపోతోంది. వీటిలో తొంభై శాతం అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నవే. కేవలం పది మందికి సిలికా పేరుతో ఇసుకను ఒక పరిధిలో మాత్రమే తవ్వుకునే అవకాశం ఉంది. కానీ జరుగుతున్న దందా మరో విధంగా ఉంది. కేవలం ఇసుకను తరలించేందుకు ప్రత్యేకమైన క్యాబిన్ తయారు చేసిన లారీల్లో ముప్పై నుంచి నలభై టన్నుల ఇసుకను నింపి హైదరాబాద్‌తో పాటు పలు నగరాలకు తరలిస్తున్నారు. ఒకనాటి ఇసుక దిబ్బలన్నీ పెద్ద గొయ్యిలుగా మారి చెరువులను తలపిస్తున్నాయి. ఈ విధంగా కొన్నేళ్లు సాగితే గతంలో ఇక్కడ ఇసుక దిబ్బలు ఉండేవంటా అని భావి తరాల వారు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇందులో అధికార పార్టీకి చెందిన పెద్ద నాయకులతో పాటు చాలా మంది హస్తం ఉంది. ఈ విషయంపై అనేక సార్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాల్టా చట్టం ప్రకారం ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిషేధం. అయినప్పటికీ మైనింగ్ శాఖ మాత్రం మౌనం వీడటం లేదు. రోజు వందల సంఖ్యలో వెళ్తున్న లారీల జోలికి అసలు వెళ్లడం లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చి ఒకటి, రెండు లారీలను పట్టుకొని తమ పని అయిపోయినట్లుగా భావిస్తోంది. -
ఇసుక అక్రమ రవాణాపై దాడులు
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: ఇసుక అక్రమ రావాణాపై దాడులు చేసిన అధికారులు గురువారం తెల్లవారుజామున కర్నూలు మండలం మునగాలపాడు సమీపంలో నాలుగు లారీలను సీజ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులిచ్చిన సమాచారం మేరకు తహశీల్దారు బాలగణేశయ్య సిబ్బందిని అప్రమత్తం చేసి దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను తహశీల్దార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అక్టోబరు 21వతేదీన మునగాలపాడు సమీపంలో రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుక డంప్‌పై కన్నేసినపంచలింగాలకు చెందిన ఓ ప్రజాప్రతినిధి దాన్ని హైదరాబాద్‌కు తరలించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఈ మేరకు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాదుకు చెందిన లారీల యాజమానులతో మాట్లాడి మెహిదీపట్నం ప్రాంతానికి ఇసుక తరలించేందుకు ఒప్పందం చేసుకున్నారు. లారీ ఇసుక రూ.35 వేల ప్రకారం రేటు కుదుర్చుకున్నాడు. కర్నూలు-కడప కాలువ దగ్గర అక్రమంగా డంపు చేసిన ఇసుకను జేసీబీ సాయంతో లారీల్లో నింపి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు తహశీల్దారు సిబ్బందితో దాడులు చేశారు. ఈ సమయంలో లారీల డ్రైవర్లు తీవ్ర వాగ్వాదానికి దిగడంతో తహశీల్దారు పోలీసులను రప్పించి నాలుగు లారీలను సీజ్ చేసి తాలూకా ఆఫీస్‌కు తరలించారు. సమైక్యాంధ్ర సమ్మె అనంతరం దాడులు ముమ్మరం చేశామని చెప్పిన తహశీల్దార్ ఇప్పటి వరకు 12 ట్రాక్టర్లను సీజ్ చేశామన్నారు. ఇసుక మాఫీయాకు రాజకీయ అండ ఉన్నట్లు తెలుస్తోందని, అయితే ఎంతటి వారినైనా వదలబోమని హెచ్చరించారు.