టీడీపీ మార్కు ఆందోళన
- డ్వాక్రా మహిళలను పావులుగా వాడుకున్న చింతమనేని
- ఇదేం తీరంటూ ముక్కున వేలేసుకున్న నగర ప్రజ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేయడం ఇప్పటి వరకూ చూశాం. అన్యాయం చేసిన వారికి అనుకూలంగా ఆందోళన చేయడం టీడీపీ ప్రభుత్వంలోనే సాధ్యమయిందని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. టీడీపీ నాయకుల అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా సాధారణ ప్రజలు, ప్రత్యర్థి వర్గాలే కాక అధికారులపై దాడులు చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించడానికి ప్రయత్నించిన ఒక తహసిల్దార్‌పై దాడికి తన అనుచరులను ప్రోత్సహించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాన్నుంచి బయటపడ్డానికి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆందోళనలు చేయడం విచిత్రంగా ఉందంటున్నారు.
కృష్ణాజిల్లా ముసునూరు తహసిల్దార్ వనజాక్షిపై బుధవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడిచేసిన నేపథ్యంలో గురువారం నగరంలో హైడ్రామా నడిచింది. చింతమనేనిని తక్షణం అరెస్ట్ చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండగా చింతమనేని వర్గీయులు ఎదురుదాడికి దిగారు. గురువారం ఉదయానికల్లా నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని నగరానికి వాహనాలలో తరలించారు. ప్రభుత్వ అనుమతి మేరకు జిల్లా పరిధిలోని తమ్మిలేరులో ఇసుక తవ్వుకుంటున్న డ్వాక్రా మహిళలను అడ్డుకుని, దాడి చేసిన కృష్ణాజిల్లా ముసునూరు మండల తహసిల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని అక్కడ తిరిగి ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి జిల్లా ఎస్‌పీ కార్యాలయం వద్దకు చేరుకుని డ్వాక్రా మహిళలనుఅసభ్య పదజాలంతో దూషించి, తన అనుచరులతో దాడి చేయించిన తహసిల్దార్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎస్పీ భాస్కర్ భూషణ్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ విప్ చింతమనేని పట్ల ఆమె అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. కాగా చింతమనేని డ్వాక్రా మహిళలను భయభ్రాంతులకు గురిచేసి కొందరిని, ప్రలోభాలతో కొందరిని పెద్దఎత్తున తరలించినట్టు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో ఆందోళన సందర్భంగా కొందరు సొమ్మసిల్లిపడిపోయారు.
ప్లేట్ల కోసం పెనుగులాట
స్థానిక ఇండోర్ స్టేడియంలో ఆందోళనకారులకు చింతమనేని ఏర్పాటు చేసిన విందు కూడా రసాభాసగా మారింది. భోజనానికి ప్లేట్లు పంచుతుండగా అందరూ ఒక్కసారి ఎగబడ్డారు. దీంతో చింతమనేని అనుచరులు ప్లేట్లు ఉన్న ఆటోను ఆ ప్రాంతం నుంచి తీసుకువెళ్లిపోతుండగా మహిళలు ఆటో వెంట పరుగులు పెట్టారు. పెనుగులాటలో పలువురు కిందపడిపోయి స్వల్పంగా గాయాల పాలయ్యారు. భోజనం ప్లేట్లు దొరకని మహిళలు.. విందు భోజనాలని ఇక్కడికి తీసుకువచ్చి ముష్టివాళ్లలా పరుగులు తీయించి చింతమనేని అవమానించారని బాహాటంగానే దుమ్మెత్తి పోశారు.