Location people
-
టీడీపీ మార్కు ఆందోళన
- డ్వాక్రా మహిళలను పావులుగా వాడుకున్న చింతమనేని - ఇదేం తీరంటూ ముక్కున వేలేసుకున్న నగర ప్రజ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేయడం ఇప్పటి వరకూ చూశాం. అన్యాయం చేసిన వారికి అనుకూలంగా ఆందోళన చేయడం టీడీపీ ప్రభుత్వంలోనే సాధ్యమయిందని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. టీడీపీ నాయకుల అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా సాధారణ ప్రజలు, ప్రత్యర్థి వర్గాలే కాక అధికారులపై దాడులు చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించడానికి ప్రయత్నించిన ఒక తహసిల్దార్‌పై దాడికి తన అనుచరులను ప్రోత్సహించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాన్నుంచి బయటపడ్డానికి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆందోళనలు చేయడం విచిత్రంగా ఉందంటున్నారు. కృష్ణాజిల్లా ముసునూరు తహసిల్దార్ వనజాక్షిపై బుధవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడిచేసిన నేపథ్యంలో గురువారం నగరంలో హైడ్రామా నడిచింది. చింతమనేనిని తక్షణం అరెస్ట్ చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండగా చింతమనేని వర్గీయులు ఎదురుదాడికి దిగారు. గురువారం ఉదయానికల్లా నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని నగరానికి వాహనాలలో తరలించారు. ప్రభుత్వ అనుమతి మేరకు జిల్లా పరిధిలోని తమ్మిలేరులో ఇసుక తవ్వుకుంటున్న డ్వాక్రా మహిళలను అడ్డుకుని, దాడి చేసిన కృష్ణాజిల్లా ముసునూరు మండల తహసిల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని అక్కడ తిరిగి ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని డ్వాక్రా మహిళలనుఅసభ్య పదజాలంతో దూషించి, తన అనుచరులతో దాడి చేయించిన తహసిల్దార్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎస్పీ భాస్కర్ భూషణ్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ విప్ చింతమనేని పట్ల ఆమె అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. కాగా చింతమనేని డ్వాక్రా మహిళలను భయభ్రాంతులకు గురిచేసి కొందరిని, ప్రలోభాలతో కొందరిని పెద్దఎత్తున తరలించినట్టు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో ఆందోళన సందర్భంగా కొందరు సొమ్మసిల్లిపడిపోయారు. ప్లేట్ల కోసం పెనుగులాట స్థానిక ఇండోర్ స్టేడియంలో ఆందోళనకారులకు చింతమనేని ఏర్పాటు చేసిన విందు కూడా రసాభాసగా మారింది. భోజనానికి ప్లేట్లు పంచుతుండగా అందరూ ఒక్కసారి ఎగబడ్డారు. దీంతో చింతమనేని అనుచరులు ప్లేట్లు ఉన్న ఆటోను ఆ ప్రాంతం నుంచి తీసుకువెళ్లిపోతుండగా మహిళలు ఆటో వెంట పరుగులు పెట్టారు. పెనుగులాటలో పలువురు కిందపడిపోయి స్వల్పంగా గాయాల పాలయ్యారు. భోజనం ప్లేట్లు దొరకని మహిళలు.. విందు భోజనాలని ఇక్కడికి తీసుకువచ్చి ముష్టివాళ్లలా పరుగులు తీయించి చింతమనేని అవమానించారని బాహాటంగానే దుమ్మెత్తి పోశారు. -
మెరుగైన సేవల కోసమే కమిషనరేట్
మహిళలకు రక్షణ, భద్రత కల్పిస్తాం షీ టీంలు బలోపేతం చేస్తాం రౌడీలపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం రూరల్ కార్యాలయం ఏర్పాటుపై చర్చలు రాజకీయ పెత్తనంపై పరిశీలన ఫ్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్‌ను ప్రోత్సహిస్తాం : సుధీర్‌బాబు వరంగల్ క్రైం : వరంగల్ నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజల రక్షణే లక్ష్యంగా తాను విధులు నిర్వహిస్తానని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. వరంగల్ నగర తొలి పోలీస్ కమిషనర్‌గా జి.సుధీర్‌బాబు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్, సైబరాబా ద్ కమిషనరేట్‌తోపాటు వరంగల్ నగరాన్ని కమిషనరేటుగా ప్రకటిస్తూ ఈ ఏడాది జనవరి నెల 25న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుధీర్‌బాబుకి డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ నగర పోలీసు కమిషనర్‌గా బదిలీ చేసింది. శుక్రవారం ఉదయం పోలీసు కమిషనరేటు కార్యాలయూనికి చేరుకున్న ఆయన పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తన కార్యాలయంలో వరంగల్ అర్బన్ ఇన్చార్జి ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబర్ కిషోర్‌ఝా నుంచి వరంగల్ నగర కమిషనర్‌గా సుధీర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, వరంగల్ నగర కమిషనరేట్ అడిషనల్ డీసీపీ యాదయ్య, ఓ ఎస్డీ సన్ప్రీత్సింగ్తోపాటు వరంగల్ కమిషనరేట్‌కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐ, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐ, పోలీసు అధికారుల సంఘం, పరిపాలన సిబ్బంది నూతన కమిషనర్‌కు పుష్పగుచ్ఛాలు అందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహిస్తాం.. రాణిరుద్రమదేవి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధీర్‌బాబు మాట్లాడారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ స్థాయిలో పోలీసులు తమ విధులు నిర్వహిం చడం జరుగుతుందన్నారు. ఇందుకోసం వరంగల్ పట్టణ ప్రజల సహకారం అవసరమని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోపాటు కమ్యూనిటీ పోలీసింగ్ విధానాన్ని ప్రోత్సహించ డం జరుగుతుందని తెలిపారు. మహిళల భద్రత కోసం ‘షీ’ టీంలను బలోపేతం చేస్తామన్నారు. ఏసీపీ, డీసీపీలను పెంచుతాం.. దేశవ్యాప్తంగా పోలీసు పరంగా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపి వరంగల్ కమిషనరేట్‌కు స్వీకరిస్తామని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం కృషి చేయడంతోపాటు విధుల్లో రాణిస్తున్న వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. కమిషనరేట్ పరిధిలో డీసీపీ, ఏసీపీలను నియమించడంతోపాటు ఠాణాల సంఖ్యను పెంచి.. అందుకు తగ్గట్టుగా సిబ్బందిని ఏర్పాటు చేసి విధులు నిర్వహిస్తారని తెలిపారు. వరంగల్ నగర పోలీసు కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఇరువురు పోలీసు అధికారులు కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలపై విషయాలపై చర్చించారు. రాజకీయ జోక్యంపై పరిశీలన పోలీసుల విషయాల్లో రాజకీయ జోక్యంపై పరి శీలిస్తామని కమిషనర్ అన్నారు. ఇటీవల పోలీ సు విషయాల్లో రాజకీయ జోక్యం అతిగా ఉం దని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా... అతిగా రాజకీయ జోక్యం ఉంటే అలాంటి ఇబ్బంది ఉంటుందన్నారు. రౌడీలపై ఉక్కుపాదం నగర పరిధిలోని రౌడీలపై ఉక్కుపాదం మోపుతామని, కరడు కట్టిన రౌడీలపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఆయా స్టేషన్లవారీగా రౌడీలతోపాటు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిఘా ఉంటుందన్నారు. గుడుంబాను అణచివేయడానికి అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు. నగర పరిధిలో రూరల్ కార్యాలయంపై పరిశీలన తాను ఇప్పుడే విధుల్లో జాయిన్ అయ్యాయని రూరల్ కార్యాలయం నగర పరిధిలో ఏర్పాటు చేయడానికి అధికారులతో మాట్లాడతాననన్నా రు. రూరల్ కార్యాలయ ఏర్పాటుపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు కమిషనర్‌పై విధంగా స్పందిం చారు. అదేవిధంగా కానిసేబుళ్ల బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని, పోలీసు సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటానని అన్నారు. -
‘స్మార్ట్’ ఖమ్మంపై ఆశలు
సాక్షి, ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ సిటీల జాబితాలో ఖమ్మానికి చోటుదక్కాలని నగర ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. రూ.కోట్ల నిధులతో నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర తీసుకుంటున్న ఈ కార్యక్రమంలో ఖమ్మంకు అవకాశం వస్తే నగర రూపు రేఖలే మారనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంను కూడా స్మార్ట్ సిటీల జాబితాలోకి చేర్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని ప్రకటించడంతో నగరవాసులు ఆశలు పెట్టుకున్నారు. ఖమ్మంఅర్బన్ మండలంలోని తొమ్మిది గ్రామాలను విలీనం చేయడంతో 2012లో ఖమ్మం కార్పొరేషన్‌గా ఏర్పడింది. మూడు లక్షల పై చిలుకు జనాభాతో 50 డివిజన్లను చేశారు. అయితే కార్పొరేషన్ హోదా పెరిగినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఖమ్మానికి నిధులు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. నిత్యం పెరగుతున్న జనాభాకు తగిన మంచినీటి సరఫరా లేక, డ్రైనేజీ వ్యవస్థ అస్తవస్థంగా ఉంది. రోడ్ల విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోతున్నారు. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే పార్కులు కూడా తక్కువే. కార్పొరేషన్ స్థాయిలో వసతులు లేకపోవడంతో ‘పేరుగొప్ప ఊరు దిబ్బ’ చందంగా నగరం పరిస్థితి తయారైంది. ఖమ్మాన్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చితే నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందనుంది. ఈ ఉద్దేశంతో ఈ జాబితాలో నగరాన్ని చేర్చాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. * ప్రస్తుతం నగరంలో 71 మురికివాడల్లో 66, 918 మంది జనాభా ఉన్నారు. వీరిలో 15 వేల మందికి కూడా మంచినీటి సరఫరా కావడం లేదు. 42 కుటుంబాలు ఉన్నా కేవ లం 24,500 ఇళ్లకే మంచినీటి కనెక్షన్లు ఉన్నా యి. నగర శివారు ప్రాంతాల వాసుల కు ఇప్పటికీ మంచినీటి సమస్య తప్పడం లేదు. * నగరం కార్పొరేషన్ అయినా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మాత్రం లేదు. చిన్నపాటి వర్షానికే మామిళ్లగూడెం, బస్టాండ్ సెంటర్, కస్పాబజార్, మార్కెట్ ప్రాంతం చెరువులను తల పిస్తున్నాయి. నగరవ్యాప్తంగా ప్రస్తుతం 397 కి.మీ మేర డ్రైనేజీ వ్యవస్థ ఉంది. మురుగు నీరంతా నగరం నుంచి పంపించాలంటే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థే శరణ్యం. * నగరం నిత్యం రద్దీ కేంద్రంగా మారింది. ఇటు హైదరాబాద్, అటు విజయవాడ, వరంగల్ వెళ్లేందుకు సెంటర్‌గా ఉండటంతో నిత్యం ప్రయాణీకుల ప్రాంగణంగా నగరం మారింది. దీనికితోడు వాహనాల సంఖ్య పెరగడం.. రోడ్ల విస్తరణ లేకపోవడంతో నగరం అంతా ఎక్కడ చూసినా ట్రాఫిక్. * ఇక నగర వాసులకు ఆహ్లాదం అందనిద్రాక్షే. ఆహ్లాదాన్ని పంచే పార్కులు వెళ్లమీద లెక్కబెట్టవచ్చు. గ్రీన్ బెల్టు స్థలాలు అన్యాక్రాంతం కావడంతో కాలుష్య కోరల్లోకి నగరం వెళ్లుతోంది. స్మార్ట్ సిటీ అయితే ఇలా.. * కేంద్రం నుంచి మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరువుతాయి. * అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు రోడ్ల విస్తరణ జరిగి నగరం సుందరీకరణ సాధ్యమవుతుంది. * సెంట్రల్ లైటింగ్, ప్రధాన కూడళ్లలో విద్యుత్ వెలుగులు విరజిమ్మనున్నాయి. * అర్హులైన నగర వాసులందరికీ ఇళ్ల స్థలాలు రానున్నాయి. * మంచినీటి వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీటి సరఫరా కానుంది. * నగరంలో నివసించే పౌరులందరికీ నగర పాలక సంస్థ ద్వారా పూర్తి స్థాయిలో సేవలు అందించడం స్మార్ట్ సిటీ ఉద్దేశం. -
ఒత్తిడిని అధిగమిస్తేనే జీవితం
మానవ జీవితంలో మానసిక ఒత్తిడి అనేది సహజమే అరుునా.. శృతిమించడం వల్లే సమస్యలు అధికమవుతున్నాయి.. ఎల్కేజీ చదివే చిన్నారి నుంచి తల నెరిసిన తాతయ్య వరకు అందరికీ సమస్యలే. చదువు, ఉద్యోగం, కుటుంబరీత్యా, ఒంటరితనం ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో అనేక సమస్యలపై పోరాడుతున్నవారే. ప్రేమించిన యువతి దక్కలేదనే అక్కసుతో ప్రేమోన్మాదిగా మారడం, అనుకున్నది సాధించలేక పోతున్నాననే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన, భార్యపై అనుమానంతో నిత్యం వేధింపులకు గురిచేయడం వంటివి సమాజంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మానసిక సమస్యలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మానసిక అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - ముంబై కాలంతో పాటు పరుగెడుతున్న సిటీ లైఫ్‌లో మానసిక ప్రశాంతత లోపించింది. గతంలో ఇళ్ల వద్ద అమ్మమ్మ, బామ్మ, తాతయ్య, బాబాయి ఇలా పెద్దలనే వారు ఉండేవారు. కొడుకు-కోడలు, కూతురు-అల్లుడు ఇలా చిన్నవాళ్లు కలహించుకున్నా, ఏదైనా సమస్య వచ్చినా ఆదిలోనే పరిష్కరించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించి పోవడంతో ఒత్తిడికి గురవుతున్న వారిని ఓదార్చేవారు లేక మానసిక సమస్యలకు గురవుతున్నారు. తల్లిదండ్రుల మధ్య గొడవల ప్రభావం పిల్లలపై పడుతుంది. వారు మానసికంగా కుంగిపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఏటా మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నెల నాలుగో తేదీ నుంచి 10 వరకూ నిర్వహించే వారోత్సవాల్లో మానసిక వైద్యులు, మానసిక విశ్లేషకులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతీ, యువకులు అంటే 16 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో మానసిక వైకల్యం (స్కిజోఫ్రీనియా), నివారణోపాయూలపై డబ్ల్యూహెచ్‌వో అవగాహన కలిగించాలని నిర్ణయించింది. ప్రతి వెయ్యిమందిలో ఐదుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. నగర ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు * మానసిక ఒత్తిడికి గురవుతున్న వారిలో అధికశాతం మంది డిప్రెషన్‌కు గురవుతుండగా, మరికొంతమంది పర్సనాలటీ డిజార్డర్స్, లైంగిక సమస్యలు, భాగస్వామితో విభేదాలు, స్మోకింగ్, మద్యపానానికి అలవాటుపడుతున్నారు. * పారానాయిడ్ సైకోట్రిక్ అనే సమస్యకు గురయిన వారికి సకాలంలో చికిత్స అందించనట్లయితే సైకోలుగా మారడం, కుటుంబసభ్యులను హింసించడం, హత్యాయత్నం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. సంతోషంగా ఉండాలంటే.. * మానసిక ఒత్తిడిని గురవరాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒకే పనిని నిరంతరం చేస్తుండటం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కొంత విరామం తీసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. * ఇతరుల గురించి మంచిగా మాట్లాడండి, మంచిగా ప్రవర్తించండి. అప్పుడే మంచి సంబంధాలు ఏర్పడతాయి. * కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు అదుపు తప్పుతున్నప్పుడు కోపాన్ని ఆరోగ్యకరంగా ప్రదర్శించే తీరు నేర్చుకోండి. ఈర్ష, ద్వేషాలకు అతీతంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడటంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. * ఇతరులను చిరునవ్వుతో పలకరించండి.. అభినందించంది.. స్నేహం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి స్నేహితుల కోసం అన్వేషించి స్నేహం చేయండి. * సమస్య ఏర్పడినప్పుడు దానికి కారణాలు తెలుసుకుని పరిష్కరించుకోవాలి. సమస్యల వలయంలో చిక్కుకుని డిప్రెషన్‌కు లోనుకావద్దు. * జీవితంలో ఓటమి కూడా సామాన్యమే. ఓటమి పొందినప్పుడు నిరాశ, నిస్పృహలకు లోను కావద్దు. అవి అనుభవాలుగా విజయానికి నాంది అవుతాయి. * పిల్లల్ని కొట్టడం, తిట్టడం వల్ల వారిలో వ్యక్తిత్వ వికాసం ఏర్పడదు. తెలియచెప్పండి, పొరపాట్లు సరిదిద్దండి. * మీలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాదు. తెలివిగా వీటిని అనుకూలంగా మలుచుకునే నేర్పరితనం నేర్చుకోండి. * భయం వీడితే జయం మీదే అవుతుంది. భయానికి ఒక కారణం ఉంటుంది. దానిని సరిచేసుకుంటే అది మీకు దూరంగా ఉంటుంది. * ఆత్మన్యూనతా భావాన్ని తొలగించుకుంటే మీరు ఎన్నో రంగాల్లో విజయం సాధిస్తారు. * పిల్లలతో సరదాగా గడపండి.. మాట్లాడండి. యోగా, మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఆరోగ్యంగా ఉండండి. -
ఎల్ఎండీ నుంచి నీరు విడుదల
కార్పొరేషన్ : వరంగల్ నగర ప్రజలకు మంచినీటి కబురు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి ప్రతీ రోజు రెండు దఫాలుగా నీటిని విడుదల చేయాలని ఇంజినీర్లు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉదయం 9-30 గంటలకు 500 క్యూసెక్కులు, సాయంత్రం 6 గంటలకు మరో 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున మరో 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నీరు వరంగల్ నగరానికి శుక్రవారం సాయంత్రం వరకు చేరుకునే అవకాశం ఉందని బల్దియా ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. పది రోజుల పాటు నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు వివరించారు. వరంగల్ నగరపాలక సంస్థ సమ్మర్ స్టోరేజీలలోని ధర్మసాగర్ డెడ్ స్టోరేజీకి మారింది. భద్రకాళి, వడ్డేపల్లి చెరువుల్లో నీరు చాల తక్కువగా ఉంది. దీంతో జిల్లా కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి కిషన్, కమిషనర్ సువర్ణ పండాదాస్, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు కొండాసురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్ ఎల్ఎండీ నుంచి ఒక టీఎంసీ(1,000 ఎంసీఎఫ్‌టీలు) నీరు విడుదల కోసం ప్రయత్నాలు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరిష్‌రావు చొరవ చూపడంతో ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించాయి. అయితే ఎల్ఎండీ ఇంజినీర్లు మాత్రం 500 ఎంసీఎఫ్‌టీల నీరు మాత్రమే విడుదల చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నీటిని విడుదల చేసిన సందర్భంగా డ్యామ్ వద్ద బల్దియా ఈఈలు సుచరణ్, నిత్యాం నదం, నందకిశోర్, ఏఈలు భాస్కర్‌రావు, ప్రభువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కెనాల్ నీటిపై నిఘా కాకతీయ కెనాల్ నుంచి నగరానికి వచ్చే నీటిని మధ్యలో మళ్లించకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు మూడు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు. 65 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ కెనాల్ వెంట నిఘా బృందాలు రాత్రింబ వళ్లు కాపుకాస్తాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక బృందం, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు మరో బృందం నిరంతరం పెట్రోలింగ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా లీకేజీలు ఏర్పడినా, నీటిని మళ్లించే ప్రయత్నం జరిగినా వెంటనే నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల 24వ తేదీ వరకు బృందాలు విధులు నిర్వర్తించనున్నారు. పంపింగ్‌కు ఏర్పాట్లు పూర్తి :ఎస్ఈ ఉపేంద్రసింగ్ ఎల్ఎండీ నుంచి నీరు విడుదల అయినందున సమ్మర్ స్టోరేజీల్లో నింపేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్ఈ ఉపేంద్రసింగ్ తెలిపారు. భద్రకాళి, వడ్డేపల్లి చెరువులను సామర్థ్యం మేరకు నింపేందుకు మోటార్లు సిద్ధం చేశామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం నాటికి నీరు చేరుతుందని, పది రోజుల పాటు విడుదలయ్యే ఈ నీటిని పొదుపుగా వాడుకుంటామన్నారు. ఒక్కపక్క సమ్మర్ స్టోరేజీలకు పంపింగ్ చేస్తూనే మరోవైపు కేయూసీ, దేశాయిపేట, వడ్డేపల్లి ఫిల్టర్బెడ్ల ద్వారా నీటిని శుద్ధిచేసి నగర ప్రజలకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి నగరంలో తాగునీటి సరఫరా జరుగుతుందని వివరించారు.