ఒత్తిడిని అధిగమిస్తేనే జీవితం
మానవ జీవితంలో మానసిక ఒత్తిడి అనేది సహజమే అరుునా.. శృతిమించడం వల్లే సమస్యలు అధికమవుతున్నాయి.. ఎల్కేజీ చదివే చిన్నారి నుంచి తల నెరిసిన తాతయ్య వరకు అందరికీ సమస్యలే. చదువు, ఉద్యోగం, కుటుంబరీత్యా, ఒంటరితనం ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో అనేక సమస్యలపై పోరాడుతున్నవారే. ప్రేమించిన యువతి దక్కలేదనే అక్కసుతో ప్రేమోన్మాదిగా మారడం, అనుకున్నది సాధించలేక పోతున్నాననే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన, భార్యపై అనుమానంతో నిత్యం వేధింపులకు గురిచేయడం వంటివి సమాజంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మానసిక సమస్యలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మానసిక అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - ముంబై
కాలంతో పాటు పరుగెడుతున్న సిటీ లైఫ్‌లో మానసిక ప్రశాంతత లోపించింది. గతంలో ఇళ్ల వద్ద అమ్మమ్మ, బామ్మ, తాతయ్య, బాబాయి ఇలా పెద్దలనే వారు ఉండేవారు. కొడుకు-కోడలు, కూతురు-అల్లుడు ఇలా చిన్నవాళ్లు కలహించుకున్నా, ఏదైనా సమస్య వచ్చినా ఆదిలోనే పరిష్కరించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించి పోవడంతో ఒత్తిడికి గురవుతున్న వారిని ఓదార్చేవారు లేక మానసిక సమస్యలకు గురవుతున్నారు.
తల్లిదండ్రుల మధ్య గొడవల ప్రభావం పిల్లలపై పడుతుంది. వారు మానసికంగా కుంగిపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఏటా మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నెల నాలుగో తేదీ నుంచి 10 వరకూ నిర్వహించే వారోత్సవాల్లో మానసిక వైద్యులు, మానసిక విశ్లేషకులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతీ, యువకులు అంటే 16 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో మానసిక వైకల్యం (స్కిజోఫ్రీనియా), నివారణోపాయూలపై డబ్ల్యూహెచ్‌వో అవగాహన కలిగించాలని నిర్ణయించింది. ప్రతి వెయ్యిమందిలో ఐదుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా.
నగర ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు
* మానసిక ఒత్తిడికి గురవుతున్న వారిలో అధికశాతం మంది డిప్రెషన్‌కు గురవుతుండగా, మరికొంతమంది పర్సనాలటీ డిజార్డర్స్, లైంగిక సమస్యలు, భాగస్వామితో విభేదాలు, స్మోకింగ్, మద్యపానానికి అలవాటుపడుతున్నారు.
* పారానాయిడ్ సైకోట్రిక్ అనే సమస్యకు గురయిన వారికి సకాలంలో చికిత్స అందించనట్లయితే సైకోలుగా మారడం, కుటుంబసభ్యులను హింసించడం, హత్యాయత్నం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు.
సంతోషంగా ఉండాలంటే..
* మానసిక ఒత్తిడిని గురవరాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒకే పనిని నిరంతరం చేస్తుండటం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కొంత విరామం తీసుకుంటే ప్రశాంతంగా ఉంటారు.
* ఇతరుల గురించి మంచిగా మాట్లాడండి, మంచిగా ప్రవర్తించండి. అప్పుడే మంచి సంబంధాలు ఏర్పడతాయి.
* కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు అదుపు తప్పుతున్నప్పుడు కోపాన్ని ఆరోగ్యకరంగా ప్రదర్శించే తీరు నేర్చుకోండి. ఈర్ష, ద్వేషాలకు అతీతంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడటంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
* ఇతరులను చిరునవ్వుతో పలకరించండి.. అభినందించంది.. స్నేహం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి స్నేహితుల కోసం అన్వేషించి స్నేహం చేయండి.
* సమస్య ఏర్పడినప్పుడు దానికి కారణాలు తెలుసుకుని పరిష్కరించుకోవాలి. సమస్యల వలయంలో చిక్కుకుని డిప్రెషన్‌కు లోనుకావద్దు.
* జీవితంలో ఓటమి కూడా సామాన్యమే. ఓటమి పొందినప్పుడు నిరాశ, నిస్పృహలకు లోను కావద్దు. అవి అనుభవాలుగా విజయానికి నాంది అవుతాయి.
* పిల్లల్ని కొట్టడం, తిట్టడం వల్ల వారిలో వ్యక్తిత్వ వికాసం ఏర్పడదు. తెలియచెప్పండి, పొరపాట్లు సరిదిద్దండి.
* మీలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాదు. తెలివిగా వీటిని అనుకూలంగా మలుచుకునే నేర్పరితనం నేర్చుకోండి.
* భయం వీడితే జయం మీదే అవుతుంది. భయానికి ఒక కారణం ఉంటుంది. దానిని సరిచేసుకుంటే అది మీకు దూరంగా ఉంటుంది.
* ఆత్మన్యూనతా భావాన్ని తొలగించుకుంటే మీరు ఎన్నో రంగాల్లో విజయం సాధిస్తారు.
* పిల్లలతో సరదాగా గడపండి.. మాట్లాడండి. యోగా, మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఆరోగ్యంగా ఉండండి.