
ఒత్తిడి ఉంటేనే కొన్ని పనులు పూర్తవుతాయని కొందరి అభిప్రాయం. కానీ అది మితిమీరితే వచ్చే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కాసేపు ఒత్తిడిని భరిస్తే సరిపోతుంది కదా అని సరిపెట్టుకోవాలనుకునేవారు మరికొందరు. కానీ అప్పటి ఒత్తిడి... ఆ అనంతరం కాలంలోనూ తన దుష్ప్రభావాలను చూపుతుంది. అంతేకాదు... మానసిక ఒత్తిడి అన్నది అలా చాలాకాలం పాటు అలా కొనసాగుతుంటే అది శారీరకంగా కూడా అనేక సమస్యలను... ముఖ్యంగా అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. మానసిక ఒత్తిడి తెచ్చిపెట్టే అనేక శారీరక సమస్యలూ, వ్యాధుల గురించి తెలుసుకుందాం.
ఒత్తిడి ఎప్పుడూ తాత్కాలికం కాదు. దాని వల్ల శరీరంలో అనేక ప్రతికూలమైన మార్పులు వస్తాయి. అన్నిటికంటే ముందు ప్రభావితమయ్యేది మన వ్యాధి నిరోధక వ్యవస్థ. దాంతో అది అనేక జబ్బులకూ, శారీరక సమస్యలకు తావిస్తుంది. ఫలితంగా ఎన్నిరకాల వ్యాధులు వస్తాయో చూద్దాం.
ప్రధాన ప్రభావం...
వ్యాధి నిరోధక వ్యవస్థపైనే!
మామూలుగా ఎవరికైనా ఎక్కడైనా గాయమైనప్పుడు అక్కడ ఇన్‌ఫ్లమేషన్ రావడం (వాపు వచ్చి ఎర్రబారి మంటగా అనిపించడం) మామూలే. సాధారణంగా దేహంలో ఎక్కడ గాయమైనప్పటికీ ఇలా జరుగుతుంది. గాయాన్ని మానేలా చేయడమనే ప్రక్రియలో వ్యాధి నిరోధక వ్యవస్థ ద్వారా కార్యకలాపాలు వల్ల ఇలా వాపు, మంట రావడమనేవి సహజంగా జరుగుతాయి. ఆ తర్వాత అవి మెల్లగా తగ్గిపోతాయి. అయితే ఎవరిలోనైనా అపరిమితమైన ఒత్తిడి ఉన్నప్పుడు ఇన్‌ఫ్లమేషన్ మానడం అనేది బాగా ఆలస్యమవుతుంది.
ఈ విషయం కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన షెల్డన్ కోహెన్ అనే అధ్యయనవేత్త ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన ఫలితాల ద్వారా స్పష్టంగా వెల్లడయ్యింది. ఈ అధ్యయన ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాలూకు మార్గదర్శకాల్లో చోటుచేసుకున్నాయి కూడా. ఒత్తిడి అన్నది శరీరంపై ఎలా దుష్ప్రభావం చూపుతుందన్న విషయం మొదటిసారిగా స్పష్టమైన తార్కాణాలతో వెలుగుచూసింది.
నిజానికి ఎవరిలోనైనా ఇన్‌ఫ్లమేషన్ వచ్చినప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలై, అది వ్యాధి నిరోధక అంశాలను ప్రేరేపిస్తుంది. దాంతో ఆ నిరోధక అంశాలు మెల్లగా ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రిస్తాయి. దాంతో ఇన్‌ఫ్లమేషన్ త్వరగా తగ్గిపోవాలి. కానీ అదేపనిగా చాలాకాలం పాటు ఒత్తిడి కొనసాగుతూపోతూ ఉంటే ఆ కారణంగా వ్యాధి నిరోధక అంశాలు కార్టిజోల్ వల్ల సరిగా ప్రేరణ చెందవు. ఫలితంగా ఇన్‌ఫ్లమేషన్ తగ్గదు.
ఇది మాత్రమే కాకుండా... ఇంకొన్ని ఉదాహరణల ద్వారా కూడా ఈ థియరీ వాస్తవమని తేలింది. సాధారణంగా ఎవరికైనా జలుబు వస్తే, ఒకటి రెండు రోజుల్లో అది దానంతట అదే తగ్గుతుంది. కానీ దీర్ఘకాలం ΄ాటు ఒత్తిడికి గురయ్యే వారిలో జలుబు తగ్గడానికి చాలాకాలం పడుతుంది. ఒత్తిడి ప్రభావం కారణంగా వ్యాధినిరోధక అంశాలపై ప్రతికూల ప్రభావాలు పడటమే ఇందుకు కారణం.
ఇలా చూసినప్పుడు మానసికమైన ఒత్తిడి కేవలం మానసికంగానే కాకుండా అది శారీరక సమస్యలైన స్థూలకాయం వంటి వాటిని తెచ్చిపెడుతుంది. ఇలా ఒక్క బరువు పెరగడమనే కారణమే కీళ్లనొప్పులూ వంటి ఇంకా ఎన్నో సమస్యలకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. అంతేకాదు... గుండెజబ్బులు, డయాబెటిస్, జీర్ణకోశ సమస్యలు, డిప్రెషన్, ఆస్తమా, అలై్జమర్స్ వంటి వ్యాధులకు దారితీస్తుందని పరిశోధకులు స్పష్టంగా తెలుసుకున్నారు.
ఒత్తిడి ఉన్నట్లు గుర్తించడమిలా...
కొందరు వ్యక్తులు నిత్యం ఒత్తిడికి గురవుతున్నప్పుడు వాళ్లలో తీవ్రమైన ఒత్తిడి ఉన్న విషయమే వారికి తెలియక΄ోవచ్చు. కానీ కొన్ని శారీరక లక్షణాలతో వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయం తెలుస్తుంది. ఆ లక్షణాలివి..
ఆకలి లేకపోవడం
బాగా ఆలస్యంగా నిద్రపట్టడం లేదా అస్సలు నిద్రపట్టకపోవడం (నిద్రలేమి)
మాటిమాటికీ తలనొప్పి వస్తుండటం
తరచూ కండరాలు పట్టేస్తుండటం (మజిల్ క్రాంప్స్)
తరచూ గ్యాస్, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఇవి చాలా సాధారణంగా కనిపించేవే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు.
ఆస్తమా : తీవ్రమైన ఒత్తిడి ఊపిరి అందకుండా చేసే ఆస్తమాను ప్రేరేపిస్తుందని వైద్య పరిశోధనల్లో అనేక సార్లు వెల్లడైంది. ఇలా జరగడాన్ని సైకలాజికల్ ఇండ్యూస్‌డ్ ఆస్తమా అంటారు. నిజానికి పెద్దల్లో ఒత్తిడి కలగడం వల్ల అది వాళ్లకు మాత్రమే పరిమితం కాదు... తల్లిదండ్రుల ఒత్తిడి చూసి, పిల్లలూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు.
దాంతో అది వారి చిన్నపిల్లల్లోనూ ప్రతికూల ప్రభావం చూపి, ఆ చిన్నారుల్లోనూ ఆస్తమా రూపంలో వ్యక్తమయ్యే అవకాశమున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్న గర్భవతులనూ, అలాగే తీవ్రమైన కాలుష్యం నెలకొని ఉన్న పరిసరాల్లో నివసిస్తున్న ఇంకొందరిని ఒక అధ్యయనం కోసం ఎంపిక చేశారు.
ఈ అధ్యయన ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. నిజానికి కాలుష్యపు పొగకు గురైన గర్భిణులకు పుట్టిన సంతానం కంటే... తీవ్రమైన ఒత్తిడికి లోనైన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో చాలా మందికి ఆ తర్వాతికాలంలో ఆస్తమా వస్తుండటం పరిశోధకలను అబ్బుర పరిచింది. అంటే కాలుష్య ప్రభావం కంటే తీవ్రమైన ఒత్తిడి తాలూకు ప్రతికూల ప్రభావాలే ఎక్కువనేది గత కొంతకాలం కిందట తెలిసి వచ్చిన వాస్తవం.
గుండెజబ్బులు : తీవ్రమైన ఆవేశానికి లోనైనవాళ్లు గుండెపట్టుకుని కుప్పకూలిపోతుండటం సినిమాల్లో చాలా తరచుగా చూసే దృశ్యం. అయితే అది పూర్తిగా సత్యదూరం కాదంటున్నారు పరిశోధకులు. ఏవైనా సమస్యల ఒత్తిడి కారణంగా గట్టిగా అరుస్తుండేవాళ్లు, త్వరగా వాదనల్లోకి దిగేవాళ్లు, త్వరగా కోపగించుకునేవాళ్లలో అనేక మంది ఆ ఒత్తిడి తాలుకు దుష్ప్రభావానికి లోనై గుండె జబ్బులు తెచ్చుకుంటారనేది నిపుణుల మాట.
ఒత్తిడి తాలూకు ప్రతికూల ఫలితాలు గుండెజబ్బుల రూపంలో వ్యక్తమవుతుంటాయంటున్నారు కొందరు పరిశోధకులు. గుండెజబ్బులు ఉన్నవారిలో చాలామందిని పరిశీలించి, వారిపై అధ్యయనాలు నిర్వహించినప్పుడు వాళ్లలో నిత్యం భావోద్వేగాలకు లోనయ్యేవాళ్లూ, త్వరగా కోపం వచ్చేవారే ఎక్కువగా ఉంటారని ఆ అధ్యయన ఫలితాల్లో తేలింది. అలా ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘకాలిక గుండెజబ్బులు వస్తుండటంతోపాటు అవే ఒక్కోసారి గుండెపోటుకు దారితీస్తాయంటున్నారు అధ్యయనవేత్తలు, గుండెజబ్బుల నిపుణులు.
స్థూలకాయం: శరీరంలోని మిగతా భాగాలతో పోలిస్తే... సాధారణంగా పోట్ట, తొడలు, పృష్టభాగం(హిప్స్) వంటి భాగాల్లోనే కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది. వీటన్నింటిలో తొడలు, పృష్టభాగంలో పేరుకునే కొవ్వు కంటే... పోట్టలో పేరుకునే కొవ్వు వల్ల తీవ్రమైన హాని కలుగుతుందంటున్నారు నిపుణులు. అయితే ఇలా పొట్టభాగంలో కొవ్వు పేరుకోవడమన్నది... ఒత్తిడి అనుభవించే వారిలోనే ఎక్కువగా జరుగుతుందని స్పష్టమైందని అధ్యయనవేత్తలు వెల్లడిస్తున్నారు.
మామూలుగా ఇతర చోట్లలో కొవ్వు పేరుకునేవారికంటే పొట్టలో కొవ్వు పేరుకోవడం వల్ల (ఆబ్డామినల్ ఒబేసిటీ) వల్ల ఎక్కువగా హాని జరుగుతుందని తేలడం వల్ల... ఒత్తిడి అనేది మొదట పోట్టభాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకునేందుకు దారితీయడంతోపాటు ఆ తర్వాత అది గుండెజబ్బుల వంటి వాటి ద్వారా తీవ్రమైన హానిచేస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది.
అధిగమించడం మేలు...
అది చేయాల్సిందిలా...
మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరకంగానూ సమస్యలు ఎదురవుతాయని గుర్తించినప్పుడు చేయాల్సిందల్లా ఆ సమస్యను అధిగమించడానికీ లేదా నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలే ఉంటాయని తేలింది.
ఉదాహరణకు మొదటిసారి గుండెపోటుకు గురైనవారు, ఒత్తిడిని బాగా నియంత్రించుకోగలిగితే 74 శాతం మందిలో రెండో స్ట్రోక్ రాకుండా నివారించుకోగలగడం సాధ్యమేనని కొన్ని అధ్యయనాల్లో తేలింది. పైగా ఇలా ఒత్తిడి నియంత్రణ కారణంగా వ్యాధి నిరోధకశక్తి కూడా పెరిగి అది కూడా జబ్బులను దూరం చేస్తుందని నిరూపితమైంది. ఒత్తిడిని అధిగమించడానికి అనుసరించాల్సిన మార్గాలివి...
ఏ కారణంగా ఒత్తిడి కలుగుతుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండటం. ఉదాహరణకు ఒక వృత్తి వల్ల ఒత్తిడి పెరుగుతుందని గుర్తిస్తే, ఒకవేళ ప్రొఫెషన్‌ను పూర్తిగా మార్చుకునే అవకాశం ఉంటే దాన్ని మార్చుకోవడమే మేలు. అలా మార్చుకునే అవకాశం లేక΄ోతే ఒత్తిడిని అధిగమించడానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడం అవసరం. అవి...
బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. దాంతోపాటు యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి ∙ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరో వ్యాపకంలో పడిపోయి దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడానికి ప్రయత్నించడం
పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడాలి. సమస్యలను అధిగమించాల్సిన పరిస్థితుల్లో ఏ మార్గం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి. లేదంటే ఆ పరిస్థితిని అధిగమించడానికి తోడ్పడే నిపుణులను సంప్రదించాలి
దేహానికి అవసరమైన వ్యాయామాలు చేయాలి. దీని వల్ల మెదడులో దేహాన్ని రిలాక్స్ చేసే, ఆహ్లాదంగా ఉంచే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవేవీ పనిచేయనప్పుడు అవసరమైతే వృత్తినిపుణులైన సైకాలజిస్టులు, కౌన్సెలర్స్‌ను సంప్రదించాలి.
డయాబెటిస్ : తీవ్రమైన మానసిక ఒత్తిడి డయాబెటిస్‌కు దారితీయవచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. మళ్లీ ఇది రెండు రకాలుగా బాధిస్తుంది. డయాబెటిస్ కారణంగా పెరిగే ఆకలి వల్ల అప్పటికప్పుడు దొరికే... తినడానికి ఆరోగ్యకరం కాని ఆహార పదార్థాలైన వేపుళ్లు, నిల్వ పదార్థాలూ, బేకరీ ఐటమ్స్ తినేలా చేస్తుంది.
ఇవి తిన్న తర్వాత మళ్లీ రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరగడంతో బాధితులు అనారోగ్యానికి గురవుతారు. డయాబెటిస్ కారణంగా ఇదొక సైకిల్‌లా సాగుతూ అనారోగ్యానికీ, చక్కెర పెరుగుదలకూ దారితీస్తుంది.
వయసు త్వరగా పైబడటం : ఒత్తిడి వల్ల వయసు పైడాల్సిన సమయం కంటే ముందే వృద్ధులై΄ోయే మరో దుష్పరిణామానికి అవకాశముంది. తల్లుల, పిల్లల డీఎన్‌ఏలను పరిశీలిస్తూ జరిగిన ఒక అధ్యయనంలో ఈ ఫలితాలు స్పష్టమయ్యాయి. ఒత్తిడికి గురైన వారు, వారి తల్లిదండ్రులతో పోలిస్తే మీరే త్వరగా వృద్ధాప్య దశకు చేరుకున్నట్లు ఆ అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి.
నిర్దిష్టంగా చె΄్పాలంటే తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్న కొందరు ఆ వయసుకు కనపడాల్సిన లక్షణాలను చాలా త్వరగా అంటే... 9 నుంచి 17 ఏళ్ల ముందుగానే కనబరుస్తున్నట్లు ఆ అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
అల్జిమర్స్ డిసీజ్ : ఒత్తిడి వల్ల మెదడులో కలిగే గాయాలు తీవ్రమై అలై్జమర్స్ డిసీజ్‌కు దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒత్తిడి వల్ల అలై్జమర్స్ డిసీజ్ తీవ్రం కావడంతో ΄ాటు దానివల్ల వచ్చే మరుపు మరింత వేగవంతం కావడం చాలా త్వరత్వరగా జరుగుతుంది. అంటే ఒత్తిడి లేనివారిలో అలై్జమర్స్ డిసీజ్ కాస్త ఆలస్యమైతే... ఒత్తిడి వల్ల అది రావాల్సిన సమయం కంటే ముందుగా వచ్చే అవకాశాలూ ఉన్నాయని స్పష్టమవుతోంది.
చాలా ముందుగా మరణించడం (ప్రీ–మెచ్యుర్ డెత్) : ఒకరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిలో మరణం ఎప్పుడు సంభవించవచ్చో కొంతమేరకు అంచనా వేయడం చాలా సాధారణ ప్రజలు కూడా చేస్తుంటారు. ఉదాహరణకు ‘ఆయన ఇప్పుడే చనిపోవాల్సిన వ్యక్తి కాదు. ఇంకా చిన్నవయసు’ లాంటి వ్యాఖ్యానాలు చేస్తుండటం కొందరి విషయంలో వింటుండటం పరిపాటే. తీవ్రమైన దీర్ఘకాలిక ఒత్తిడికి లోనయ్యేవారిలో మరణం చాలా ముందుగానే వస్తుందని అధ్యయనవేత్తలు హెచ్చరిస్తున్నారు.
(చదవండి: ప్రధాని మోదీ స్ఫూర్తితో ‘భారత్ డిష్'..! ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..)
Comments
Please login to add a commentAdd a comment