Work From Home Tips: 10 Best Tips To Avoid Stress And Pressure In Telugu - Sakshi
Sakshi News home page

Work From Home Tips: ఒత్తిడి, అనారోగ్యానికి గురి కాకుండా ఇలా చేయండి..

Published Sat, Jan 29 2022 11:36 AM | Last Updated on Sat, Jan 29 2022 3:51 PM

Best Tips to Handle the Stress And Pressure Of Working From Home - Sakshi

కరోనా మూలంగా చాలా మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. ఇంటి నుంచి పని చేయడం చాలా సులువుగా ఉంటుంది అనుకుంటారు. ఇంట్లోంచి పనిచేస్తే ఆఫీసు/ కాలేజీ/ బడికి వెళ్లే ప్రయాణ సమయం కొంత మిగిలినట్లే కనిపించినా, రానురానూ దానివల్ల ఇబ్బందులు తప్పించి, అంతగా ప్రయోజనాలు లేకపోయినా, థర్డ్‌ వేవ్‌ మూలంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను కొనసాగిస్తున్నట్లు సాఫ్ట్‌వేర్‌ సంస్థల ఉద్యోగులకు ఉత్తర్వులు అందాయి. దాంతో తిరిగి ఇంటినుంచి పనిని కొనసాగించక తప్పడం లేదు.  వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జాబ్‌ చేసే వారు ఒత్తిడికి, అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వారం చూద్దాం...

ఆఫీసులో ఉంటే ఉండే వాతావరణం వేరు. ఇంటిలో ఉండి పని చేస్తే ఉండే వాతావరణ వేరు. ఎందుకంటే, చాలామందికి ఇంటినుంచి పని చేయడానికి కావలసిన సాధన సంపత్తి అందుబాటులో ఉండదు. చిన్న చిన్న గదులు గలవారికి మరీ ఇబ్బంది. ప్రశాంతంగా వుండే ప్రత్యేకమైన గది, చుట్టుపక్కలవారు పని చేస్తుంటే వారితో కలిసి పని చేయడం, ఏమైనా సందేహాలు వస్తే సీనియర్లను, లేదంటే విషయ పరిజ్ఞానం కల కొలీగ్స్‌ను అడిగి తెలుసుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేయడం సులువు. అయితే ఇంటిలో ఉండి పని చేసేటప్పుడు అందరికీ తగిన వసతులు ఉండకపోవచ్చు. ముఖ్యంగా సరైన ఎత్తులో వుండే మేజా బల్ల, కుర్చీ, దానికి వీపు ఆన్చడానికి వీలుగా వుండే వాలు, చేతులు మోపడానికి ఆర్మ్‌ రెస్ట్‌ వంటివి ఇంటిలో అందుబాటులో ఉండవు. 

►చాలామంది ఒళ్లో లాప్‌ టాప్‌ పెట్టుకుని మంచం మీదో, సోఫాలోనో ఒరిగిపోయి లేదా వాలిపోయి రోజంతా వేళ్లను టప టపలాడిస్తూ అదేపనిగా పని చేస్తూ ఉండడం వల్ల రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు. నాలుగైదు గంటలు గడిచేసరికి విపరీతమైన వీపు నొప్పి, మెడనొప్పి, మౌస్‌ ఎక్కువగా వాడే వారికి మణికట్టు నొప్పులతోబాధ పడినట్లు ఇటీవల జరిగిన ఒక సర్వేలో తెలియ వచ్చింది.
చదవండి: Beauty Tips: కళ్ల చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గాలంటే...

► గ్రాఫిక్స్‌ మీద పనిచేసేవారు తీక్షణంగా రెప్ప వాల్చకుండా దృష్టి మరల్చకుండా స్క్రీన్‌ కేసి అదేపనిగా చూడటం వల్ల కళ్లు లాగేసి తలనొప్పి వస్తోంది. బయటికి కదలకుండా ఇంట్లోనే కూర్చోడం మూలంగా డీ విటమిన్‌ లోపాలు తలెత్తే అవకాశం మెండుగా వుంది. కాబట్టి ఇంట్లోంచి పని చేసినా ఆఫీసు కి వెళుతున్నట్లే ఒక నిత్యకృత్యంలా నిబద్ధతతో ఆఫీస్‌/ చదువు టైం ప్రకారం ముగించి, కాసేపు దుకాణం కట్టేసి, వీలుంటే డాబా మీదో, వరండాలోనో, పెరట్లోనో కాసేపు అటూ ఇటూ తిరిగి గాలిపోసుకోవడం వల్ల రిఫ్రెష్‌మెంట్‌తోపాటు కంటికి, ఒంటికి కొంత మేలు. 

►ఆఫీస్‌లో అయితే పొద్దున 10 నుంచి సాయంత్రం 5 లేదా 6 వరకు అనే టైమింగ్స్‌ ఉంటాయి. ఇంటినుంచి పని చేసేవారు అలాంటి నిబంధన పెట్టుకోకుండా వీలు కుదిరినప్పుడు మొదలు పెట్టి, అది పూర్తి అయ్యే వరకు దానితోనే కుస్తీలు పడుతుంటారు. అయితే అలాకాకుండా ఆఫీస్‌లో ఉండి పని చేస్తున్నట్లే ఇంటి దగ్గర కూడా మనకు మనమే టైమింగ్స్‌ సెట్‌ చేసుకోవాలి. అదే ఆఫీస్‌ వాళ్లకు మనం చెప్పాలి. ఈ సమయంలో నేను అందుబాటులో ఉంటాను. తర్వాత ఉండనని సంకేతాలు ఇవ్వాలి. లేదా వారితో ముందుగానే సూటిగా చెప్పాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడగలరు. 
చదవండి: ఒక ఊరికథ..మంచిపని ఊరకే పోలేదు...ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇచ్చింది

ఆఫీసు వాతావరణం ఎలా?
ఇంటినుండి పనిచేసేటపుడు ఒక ప్రత్యేకమైన గదిలో ఆఫీసు లో కూర్చున్నట్లు కూర్చొని పని చేసుకోడం మంచిది. ఆ సమయంలో ఇంట్లో వారితో మాట్లాడటం లేదా కొన్ని ఇంటి పనులు చేయడం పెట్టుకోవద్దు. సాధారణంగా కొంత మంది ఇంటిపని ఆఫీసు పని కలిపి అక్కడో కాలు ఇక్కడో కాలు అన్నట్లుగా చేస్తూ ఉంటారు. అప్పుడు ఆందోళన ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లు వంటచేసుకోవడం, పిల్లలను చూసుకోవడం, ఆఫీసు పని చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఆందోళన పెరుగుతుంది. అలాంటప్పుడు పిల్లలను చూసుకోవడానికి, వంట చేయడానికి వేరేవారి సహాయం తీసుకోవడం

కొంత మెరుగు. 
ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉబకాయమే కాకుండా ఇతర సమస్యలు వస్తున్నాయి. వాటితో పాటుగా నడుం నొప్పి , మెడనొప్పి వంటి సమస్యలు చాలా మందిలో సాధారణం. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ  నొప్పి తగ్గే అవకాశం ఉంది. నిద్ర పోయేటప్పుడు తల కింద  ఎల్తైన దిండు పెట్టుకోకుండా మెత్తటి క్లాత్‌ను మడిచి దిండులా వాడటం వల్ల మెడ నొప్పి రాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు
నడుము నొప్పి తగ్గాలంటే మకరాసనం, శలభాసనం, మర్కటాసనం, భుజంగాసనం వేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.  
చదవండి: Shanta Balu: పూనా పవార్‌.. వయసు 86.. అయినా తగ్గేదేలే.. ధైర్యంగా..

ఒత్తిడినుంచి ఇలా తప్పుకోవచ్చు 
►అదేపనిగా పని చేస్తూ ఉండకుండా రోజూ సాయంత్రం కాసేపు నడవటం,
►పిల్లతో ఆడుకోవడం, పెద్దలతో మనసు విప్పి మాట్లాడటం,
►తల్లి/భార్యకు ఇంటి పనుల్లో సాయం చేయడం, 
►కూరగాయలు/పండ్ల మార్కెట్‌కు వెళ్లడం 
►కొత్త వంటలను వండేందుకు ప్రయత్నించడం
►టెర్రస్‌ గార్డెన్‌ లేదా బాల్కనీ గార్డెనింగ్‌ చేయడం, 
►ఫ్రెండ్స్, బంధువులతో అప్పుడప్పుడు వీడియో కాల్స్‌ మాట్లాడుకోవడం 
►క్యారమ్స్, షటిల్‌ వంటి ఆటలను ఆడటం వల్ల కాస్త రిలాక్సింగ్‌గా ఉంటుంది. 
►స్క్రీన్‌ మీద పని చేసేటప్పుడు 20–20 20 చిట్కా పాటించడం మంచిది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement