mental pressures
-
జీతం ఎంతైనా పర్లేదు.. అటెన్షన్.. బట్ నో టెన్షన్.. కోవిడ్ తెచ్చిన మార్పు
సాక్షి, అమరావతి: మానసిక ప్రశాంతత లేని కొలువుల్లో పనిచేసేది లేదని భారతీయ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. ఇందుకోసం అధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలను సైతం వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు. కోవిడ్–19 తర్వాత ఉద్యోగులు మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించారు. అమెరికా ఆధారిత వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్ సంస్థ యూకేజీ నిర్వహించిన సర్వేలో.. భారతదేశంలో 88 శాతం మంది ఉద్యోగులు మానసిక క్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు నివేదించింది. ఒత్తిడి లేని ఉద్యోగాల్లో తక్కువ జీతానికైనా పని చేసేందుకు వెనుకాడటం లేదని వెల్లడించింది. ఇదే అమెరికాలో 70 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయంతో పోలిస్తే భారత్‌లోనే ఈ అభిప్రాయం గల ఉద్యోగులు అధికంగా ఉండటం విశేషం. భారత్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోని ఉద్యోగాల్లో వర్క్‌ఫోర్స్, ప్రోత్సాహకాలు, మానసిక ఆరోగ్యం తదితర అంశాలపై ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. కుటుంబానికే తొలి ప్రాధాన్యం భారతీయ ఉద్యోగుల్లో ఇటీవల కుటుంబ సభ్యులకు ఇచ్చే ప్రాధాన్యతలో తీవ్ర మార్పు వచ్చింది. 46 శాతం మంది ఉద్యోగం కంటే కుటుంబమే తొలి ప్రాధాన్యం అని అభిప్రాయపడుతున్నట్టు సర్వేలో తేలింది. రెండో స్థానంలో 37 శాతం మంది పని (ఉద్యోగం).. ఆ తర్వాతే ఆరోగ్యం, స్వీయ సంరక్షణ, వ్యాయామం, స్నేహితులతో సంబంధాలు కోరుకుంటున్నట్టు తెలిపింది. అయితే, ఇక్కడ చాలామంది ఉద్యోగులు తమ ఆందోళనలను మేనేజర్లతో పంచుకునేందుకు వెనుకాడుతున్నట్టు చెప్పింది. భారత్‌లో 51 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ప్రతి వారం తమ మేనేజర్‌తో పనిభారంపై చర్చిస్తుండగా.. 30 శాతం మంది నెలకు ఒకసారి కూడా మాట్లాడలేకపోతున్నారని నివేదించింది. ఒత్తిడి ఇంత పని చేస్తోందా! 33% భారతీయ ఉద్యోగులు ఆఫీసుల్లో ఎక్కువ గంటలు గడపటం పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణమని సర్వే పేర్కొంది. దీనివల్ల 34 శాతం మందిలో గతంతో పోలిస్తే పని గంటలు పెరగడంతో ఏకాగ్రత కోల్పోతున్నట్టు గుర్తించింది. 31 శాతం మందిలో సహాద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించలేని పరిస్థితి కనిపించింది. మిగిలిన వారిలో పని ఉత్పాదకత, సామర్థ్యం కొరవడుతున్నట్టు తేల్చింది. ఉద్యోగానికి ఉండే డిమాండ్, హార్డ్ వర్క్ చేయాలనే తపన కూడా ఒత్తిడికి కారణంగా పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ‘ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూల వాతావరణం ఉండాలి. అప్పుడు వారు మెరుగ్గా పని చేయగలుగుతారు. సాంకేతిక వనరులపై పెట్టుబడులు పెంచడం ద్వారా ఉద్యోగులపై కొంతమేర ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇది ఆ సంస్థ స్థిరత్వానికి ఎంతో దోహదం చేస్తుంది’ అని యూకేజీ ఇండియా కంట్రీ మేనేజర్ సుమిత్ దోషి చెప్పారు. -
పిల్లలపై కోవిడ్ ప్రతాపం.. 29% మంది విద్యార్థుల్లో లోపించిన ఏకాగ్రత
సాక్షి, అమరావతి: కరోనా క్రమంగా కనుమరుగైనా విద్యార్థులను మాత్రం మానసిక వేదనకు గురి చేస్తూనే ఉంది. వీటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) పలు సూచనలు చేసింది. కోవిడ్ తరువాత విద్యార్థుల మానసిక స్థితిగతులపై మనోదర్పణ్ సర్వే నివేదికను ఎన్సీఈఆర్టీ ఇటీవల విడుదల చేసింది. 29 శాతం మంది విద్యార్థుల్లో ఏకాగ్రత లోపించి చదువులపై దృష్టి కేంద్రీకృతం చేయడం లేదని సర్వేలో తేలింది. టీచర్లు, తల్లిదండ్రులు వీటిని అధిగమించేలా పిల్లలకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఎన్సీఈఆర్టీ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా 6 నుంచి 12 తరగతి చదివే 3.79 లక్షల మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 9,660 మంది విద్యార్థులను ప్రశ్నించి ఫలితాలు రూపొందించారు. సర్వే చేయడంతోపాటు మానసిక ఆందోళన, ఇతర సమస్యల నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఎన్సీఈఆర్టీ సూచించింది. సర్వేలో తేలిన సమస్యలు ►29 శాతం మంది విద్యార్థులలో ఏకాగ్రత లోపించగా 43 శాతం మందిని మానసిక ఆందోళన వెంటాడుతోంది. పాఠశాలలు తెరిచిన తరువాత పరిస్థితులు బాగున్నట్లు 73 శాతం మంది విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ►దీర్ఘకాలం పాఠశాలలు మూతపడటం, ఆటపాటలకు దూరం కావడంతో పిల్లల శరీరాకృతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తమ శరీర ఆకృతిపై 55 శాతం మంది సంతృప్తితో ఉండగా 45 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ►బోధనాంశాలను గ్రహించడం, ప్రతి స్పందించడంలో మాధ్యమిక స్థాయిలో 43 శాతం మంది విద్యార్ధులు చురుగ్గా ఉండగా 57 శాతం మంది తక్కువ చొరవతో ఉన్నారని సర్వేలో తేలింది. సెకండరీ స్థాయిలో 46 శాతం మంది ప్రతిస్పందిస్తున్నట్లు వెల్లడైంది. ►ఆన్లైన్ అభ్యసనాలను అనుసరించడంలో 49 శాతం మంది నైపుణ్యాన్ని ప్రదర్శించగా 51 శాతం మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్థంకాని అంశాలను టీచర్ల ద్వారా నివృత్తి చేసుకునేందుకు 28 శాతం మంది సందేహిస్తున్నారు. మాధ్యమిక స్థాయి నుంచి పైదశకు మారిన పిల్లలు చదువులపై పూర్తి ఆసక్తిని కనబర్చడం లేదు. చదువుల్లో అలసట, శక్తి హీనతకు గురవుతున్నట్లు 48 మంది పేర్కొన్నారు. సెకండరీలో 29 శాతం మంది, మాధ్యమికలో 25 శాతం మంది ఒంటరితనంతో బాధ పడుతున్నట్లు తెలిపారు. సర్వేలో కొన్ని ముఖ్యాంశాలు ఇవీ.. ఏకాగ్రత లేమి: 29 శాతం చదువుల్లో వెనుకబడని వారు: 22 శాతం చదువు అలవాటు లేమి: 16 శాతం సమయ నిర్వహణ చేయలేనివారు: 14 శాతం చదువులకు ఆటంకాలున్న వారు: 12 శాతం చదివింది అర్థంకాని వారు: 7 శాతం చదువంటే ఆందోళనతో ఉన్న వారు: 50 శాతం పరీక్షలంటే భయపడేవారు: 31 శాతం ఆందోళన చెందని వారు: 15 శాతం భావోద్వేగాల పరిస్థితి ఇలా భావోద్వేగాల్లో తరచూ మార్పు: 43 శాతం తీవ్రమైన భావోద్వేగాలు లేనివారు: 27 శాతం తీవ్రమైన భావోద్వేగాలున్నవారు: 14 శాతం భయంతో ఉన్న వారు: 7 శాతం నిద్ర అలవాటులో మార్పులు మాధ్యమిక విద్యార్ధులు: 32 శాతం సెకండరీ విద్యార్ధులు: 43 శాతం రోజూ ఒకేమాదిరిగా ఉన్న వారు: మాధ్యమిక: 28 శాతం సెకండరీ: 24 శాతం ఏం చేయాలంటే.. ►విద్యార్థుల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు తల్లిదండ్రులు, పెద్దలకు టీచర్లు దిశానిర్దేశం చేయాలి. విద్యార్థుల్లో ప్రత్యేక లక్షణాలను గుర్తించి ప్రోత్సహించాలి. ►మానసిక, భావోద్వేగ పరిస్థితులు నియంత్రించే అంశాలను పాఠ్యాంశాలకు అనుసంధానించాలి. భావోద్వేగాలను నియంత్రించేలా నైపుణ్యాలను పెంపొందించాలి. ►కుటుంబం పరిస్థితులు, ఆత్మన్యూనతతో ఒత్తిడికి గురయ్యే కౌమార దశ విద్యార్థుల్లో భయాలను టీచర్లు పోగొట్టాలి. తల్లిదండ్రులతో సంప్రదిస్తూ సున్నితంగా వ్యవహరించాలి. అవసరమైతే మానసిక నిపుణులతో చర్చించేలా సూచనలు చేయాలి. -
Stress Management: వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఒత్తిడిని ఇలా దూరం చేయండి..
కరోనా మూలంగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇంటి నుంచి పని చేయడం చాలా సులువుగా ఉంటుంది అనుకుంటారు. ఇంట్లోంచి పనిచేస్తే ఆఫీసు/ కాలేజీ/ బడికి వెళ్లే ప్రయాణ సమయం కొంత మిగిలినట్లే కనిపించినా, రానురానూ దానివల్ల ఇబ్బందులు తప్పించి, అంతగా ప్రయోజనాలు లేకపోయినా, థర్డ్ వేవ్ మూలంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగిస్తున్నట్లు సాఫ్ట్వేర్ సంస్థల ఉద్యోగులకు ఉత్తర్వులు అందాయి. దాంతో తిరిగి ఇంటినుంచి పనిని కొనసాగించక తప్పడం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసే వారు ఒత్తిడికి, అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వారం చూద్దాం... ఆఫీసులో ఉంటే ఉండే వాతావరణం వేరు. ఇంటిలో ఉండి పని చేస్తే ఉండే వాతావరణ వేరు. ఎందుకంటే, చాలామందికి ఇంటినుంచి పని చేయడానికి కావలసిన సాధన సంపత్తి అందుబాటులో ఉండదు. చిన్న చిన్న గదులు గలవారికి మరీ ఇబ్బంది. ప్రశాంతంగా వుండే ప్రత్యేకమైన గది, చుట్టుపక్కలవారు పని చేస్తుంటే వారితో కలిసి పని చేయడం, ఏమైనా సందేహాలు వస్తే సీనియర్లను, లేదంటే విషయ పరిజ్ఞానం కల కొలీగ్స్‌ను అడిగి తెలుసుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేయడం సులువు. అయితే ఇంటిలో ఉండి పని చేసేటప్పుడు అందరికీ తగిన వసతులు ఉండకపోవచ్చు. ముఖ్యంగా సరైన ఎత్తులో వుండే మేజా బల్ల, కుర్చీ, దానికి వీపు ఆన్చడానికి వీలుగా వుండే వాలు, చేతులు మోపడానికి ఆర్మ్ రెస్ట్ వంటివి ఇంటిలో అందుబాటులో ఉండవు. ►చాలామంది ఒళ్లో లాప్ టాప్ పెట్టుకుని మంచం మీదో, సోఫాలోనో ఒరిగిపోయి లేదా వాలిపోయి రోజంతా వేళ్లను టప టపలాడిస్తూ అదేపనిగా పని చేస్తూ ఉండడం వల్ల రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు. నాలుగైదు గంటలు గడిచేసరికి విపరీతమైన వీపు నొప్పి, మెడనొప్పి, మౌస్ ఎక్కువగా వాడే వారికి మణికట్టు నొప్పులతోబాధ పడినట్లు ఇటీవల జరిగిన ఒక సర్వేలో తెలియ వచ్చింది. చదవండి: Beauty Tips: కళ్ల చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గాలంటే... ► గ్రాఫిక్స్ మీద పనిచేసేవారు తీక్షణంగా రెప్ప వాల్చకుండా దృష్టి మరల్చకుండా స్క్రీన్ కేసి అదేపనిగా చూడటం వల్ల కళ్లు లాగేసి తలనొప్పి వస్తోంది. బయటికి కదలకుండా ఇంట్లోనే కూర్చోడం మూలంగా డీ విటమిన్ లోపాలు తలెత్తే అవకాశం మెండుగా వుంది. కాబట్టి ఇంట్లోంచి పని చేసినా ఆఫీసు కి వెళుతున్నట్లే ఒక నిత్యకృత్యంలా నిబద్ధతతో ఆఫీస్/ చదువు టైం ప్రకారం ముగించి, కాసేపు దుకాణం కట్టేసి, వీలుంటే డాబా మీదో, వరండాలోనో, పెరట్లోనో కాసేపు అటూ ఇటూ తిరిగి గాలిపోసుకోవడం వల్ల రిఫ్రెష్మెంట్తోపాటు కంటికి, ఒంటికి కొంత మేలు. ►ఆఫీస్‌లో అయితే పొద్దున 10 నుంచి సాయంత్రం 5 లేదా 6 వరకు అనే టైమింగ్స్ ఉంటాయి. ఇంటినుంచి పని చేసేవారు అలాంటి నిబంధన పెట్టుకోకుండా వీలు కుదిరినప్పుడు మొదలు పెట్టి, అది పూర్తి అయ్యే వరకు దానితోనే కుస్తీలు పడుతుంటారు. అయితే అలాకాకుండా ఆఫీస్‌లో ఉండి పని చేస్తున్నట్లే ఇంటి దగ్గర కూడా మనకు మనమే టైమింగ్స్ సెట్ చేసుకోవాలి. అదే ఆఫీస్ వాళ్లకు మనం చెప్పాలి. ఈ సమయంలో నేను అందుబాటులో ఉంటాను. తర్వాత ఉండనని సంకేతాలు ఇవ్వాలి. లేదా వారితో ముందుగానే సూటిగా చెప్పాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడగలరు. చదవండి: ఒక ఊరికథ..మంచిపని ఊరకే పోలేదు...ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇచ్చింది ఆఫీసు వాతావరణం ఎలా? ఇంటినుండి పనిచేసేటపుడు ఒక ప్రత్యేకమైన గదిలో ఆఫీసు లో కూర్చున్నట్లు కూర్చొని పని చేసుకోడం మంచిది. ఆ సమయంలో ఇంట్లో వారితో మాట్లాడటం లేదా కొన్ని ఇంటి పనులు చేయడం పెట్టుకోవద్దు. సాధారణంగా కొంత మంది ఇంటిపని ఆఫీసు పని కలిపి అక్కడో కాలు ఇక్కడో కాలు అన్నట్లుగా చేస్తూ ఉంటారు. అప్పుడు ఆందోళన ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లు వంటచేసుకోవడం, పిల్లలను చూసుకోవడం, ఆఫీసు పని చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఆందోళన పెరుగుతుంది. అలాంటప్పుడు పిల్లలను చూసుకోవడానికి, వంట చేయడానికి వేరేవారి సహాయం తీసుకోవడం కొంత మెరుగు. ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉబకాయమే కాకుండా ఇతర సమస్యలు వస్తున్నాయి. వాటితో పాటుగా నడుం నొప్పి , మెడనొప్పి వంటి సమస్యలు చాలా మందిలో సాధారణం. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ నొప్పి తగ్గే అవకాశం ఉంది. నిద్ర పోయేటప్పుడు తల కింద ఎల్తైన దిండు పెట్టుకోకుండా మెత్తటి క్లాత్‌ను మడిచి దిండులా వాడటం వల్ల మెడ నొప్పి రాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు నడుము నొప్పి తగ్గాలంటే మకరాసనం, శలభాసనం, మర్కటాసనం, భుజంగాసనం వేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చదవండి: Shanta Balu: పూనా పవార్.. వయసు 86.. అయినా తగ్గేదేలే.. ధైర్యంగా.. ఒత్తిడినుంచి ఇలా తప్పుకోవచ్చు ►అదేపనిగా పని చేస్తూ ఉండకుండా రోజూ సాయంత్రం కాసేపు నడవటం, ►పిల్లతో ఆడుకోవడం, పెద్దలతో మనసు విప్పి మాట్లాడటం, ►తల్లి/భార్యకు ఇంటి పనుల్లో సాయం చేయడం, ►కూరగాయలు/పండ్ల మార్కెట్‌కు వెళ్లడం ►కొత్త వంటలను వండేందుకు ప్రయత్నించడం ►టెర్రస్ గార్డెన్ లేదా బాల్కనీ గార్డెనింగ్ చేయడం, ►ఫ్రెండ్స్, బంధువులతో అప్పుడప్పుడు వీడియో కాల్స్ మాట్లాడుకోవడం ►క్యారమ్స్, షటిల్ వంటి ఆటలను ఆడటం వల్ల కాస్త రిలాక్సింగ్‌గా ఉంటుంది. ►స్క్రీన్ మీద పని చేసేటప్పుడు 20–20 20 చిట్కా పాటించడం మంచిది. -
మాకొద్దు విధులు
- ‘టిమ్’ విధులతో డ్రైవర్ల ఆందోళన - రెండు విధులు నిర్వహించడం కష్టమని ఆవేదన - అధికారుల నుంచి వేధింపులు - జిల్లా నుంచి రోజుకు 86 బస్సుల రాకపోకలు - పొరుగు జిల్లావాసుల కష్టాలు ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలోని ఆరు డిపోల్లో కండక్టర్ లేకుండా టికెట్ ఇష్యూ మిషన్(టిమ్)తో డ్రైవింగ్ వ్యవస్థ కొనసాగుతోంది. అధికారులు డ్రైవర్లకు ఇష్టం లేకున్నా డ్రైవింగ్‌తోపాటు టికెట్ ఇచ్చే విధులు నిర్వహించాలని వేధిస్తున్నారు. ఇలా చేయని వారికి వారం, పది రోజులపాటు విధులు కేటాయించడం లేదు. దీంతో ఆ కార్మికుడి వేతనంలో సుమారు రూ.3 వేల వరకు కోత పడుతుంది. రీజినల్‌లో 86 టిమ్‌తో బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో ఆదిలాబాద్ డిపో నుంచి 27, ఆసిఫాబాద్ 12, భైంసా 2, మంచిర్యాల 23 , నిర్మల్ 20, ఉట్నూర్ నుంచి 2 బస్సులు టిమ్ డ్రైవర్లతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి హైదరాబాద్, కరీంనగర్, గుంటూర్, ఇతరత్రా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లతో ప్రమాదాలు కండక్టర్ లేకుండా టికెట్లు ఇచ్చుకుంటూ డ్రైవింగ్ చేయాలంటే డ్రైవర్లు జంకుతున్నారు. బస్సు నడుపుతూ.. ప్రయాణికులను పర్యవేక్షిస్తూ.. టికెట్లు ఇస్తూ.. లోపల పరిశీలిస్తూ బస్సు నడపాలంటే భయపడుతున్నారు. అధిక మంది ప్రయాణిస్తున్నప్పుడు, రాత్రి వేళల్లో మానసిక వేదనకు గురవుతున్నారు. అందరూ టికెట్ తీసుకున్నారా.. బస్సు ఆగిన ప్రాంతంలో దిగారా.. అలా పలు కారణాలతో ప్రయాణికులతోనూ తిప్పలు పడుతూ ఆర్టీసీ టిమ్ డ్రైవర్లు నరకయాతన పడుతున్నారు. కండక్టర్, డ్రైవర్ ఇద్దరు పనులు ఒక్కరే చేయాల్సి రావడంతో మానసికంగా కృంగిపోతున్నారు. బస్సు నడిపే సమయంలో ఒత్తిళ్లకు గురికావడంతో వారి ఏకాగ్రత పూర్తిస్థాయిలో కేటాయించలేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ ఉన్నతాధికారులు, కార్మిక సంఘాలు పట్టించుకుని ఎవరి విధులు వారికి కేటాయిస్తే సులభం అవుతుంది. భవిష్యత్‌లో కండక్టర్ భద్రమేనా? ఆర్టీసీలో టిమ్ డ్రైవర్ విధానాలతో కండక్టర్ ఉద్యోగాలకు యాజమాన్యం మంగళం పాడే అవకాశం ఉంది. జిల్లాలో గత విధానాన్ని బట్టి చూస్తే 86 మంది డ్రైవర్లతోపాటు 86 మంది కండక్టర్ విధులు నిర్వర్తించేవారు. కానీ, ప్రస్తుతం తరుణంలో టిమ్ విధానంతో డ్రైవర్లే కండక్టర్ల విధులు నిర్వహిస్తుండటంతో భవిష్యత్తులో కండక్టర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఆర్టీసీలో కండక్టర్ విధానం ప్రస్తుతం సాగుతున్నా భవిష్యత్తులో పూర్తిస్థాయిలో తీసేయనున్నారని సమాచారం. దీంతో కండక్టర్లలో ఆందోళన నెలకొంది. ఇటు డ్రైవర్లు, కండక్టర్లు టిమ్ డ్రైవర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వాసుల కష్టాలు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన సుమారు 30 మంది వరకు జిల్లాలో పనిచేస్తున్నారు. 2010లో వారికి జిల్లాలో వారి అవసరం ఉందని తీసుకొచ్చిన ప్రస్తుతం వారికి కష్టాలు తప్పడం లేదు. వారిలో టిమ్ విధులు చేయాలని డ్రైవర్లను వే ధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. టిమ్ చేయని పక్షంలో వారికి విధుల్లోకి తీసుకోవడం లేదు. గత్యంతరం లేని స్థితిలో డ్రైవర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి జిల్లాకు వారిని పంపించే యత్నం కూడా చేయడం లేదు. తిప్పలు పెడుతూ విధులు చేయించుకుంటున్నారని, నిబంధలకు విరుద్ధంగా వాహనాలు నడపమని వేధిస్తున్నరని కార్మికులు ఆరోపిస్తున్నారు.