మాకొద్దు విధులు
- ‘టిమ్’ విధులతో డ్రైవర్ల ఆందోళన
- రెండు విధులు నిర్వహించడం కష్టమని ఆవేదన
- అధికారుల నుంచి వేధింపులు
- జిల్లా నుంచి రోజుకు 86 బస్సుల రాకపోకలు
- పొరుగు జిల్లావాసుల కష్టాలు
ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలోని ఆరు డిపోల్లో కండక్టర్ లేకుండా టికెట్ ఇష్యూ మిషన్(టిమ్)తో డ్రైవింగ్ వ్యవస్థ కొనసాగుతోంది. అధికారులు డ్రైవర్లకు ఇష్టం లేకున్నా డ్రైవింగ్‌తోపాటు టికెట్ ఇచ్చే విధులు నిర్వహించాలని వేధిస్తున్నారు. ఇలా చేయని వారికి వారం, పది రోజులపాటు విధులు కేటాయించడం లేదు. దీంతో ఆ కార్మికుడి వేతనంలో సుమారు రూ.3 వేల వరకు కోత పడుతుంది. రీజినల్‌లో 86 టిమ్‌తో బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో ఆదిలాబాద్ డిపో నుంచి 27, ఆసిఫాబాద్ 12, భైంసా 2, మంచిర్యాల 23 , నిర్మల్ 20, ఉట్నూర్ నుంచి 2 బస్సులు టిమ్ డ్రైవర్లతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి హైదరాబాద్, కరీంనగర్, గుంటూర్, ఇతరత్రా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి.
మానసిక ఒత్తిళ్లతో ప్రమాదాలు
కండక్టర్ లేకుండా టికెట్లు ఇచ్చుకుంటూ డ్రైవింగ్ చేయాలంటే డ్రైవర్లు జంకుతున్నారు. బస్సు నడుపుతూ.. ప్రయాణికులను పర్యవేక్షిస్తూ.. టికెట్లు ఇస్తూ.. లోపల పరిశీలిస్తూ బస్సు నడపాలంటే భయపడుతున్నారు. అధిక మంది ప్రయాణిస్తున్నప్పుడు, రాత్రి వేళల్లో మానసిక వేదనకు గురవుతున్నారు. అందరూ టికెట్ తీసుకున్నారా.. బస్సు ఆగిన ప్రాంతంలో దిగారా.. అలా పలు కారణాలతో ప్రయాణికులతోనూ తిప్పలు పడుతూ ఆర్టీసీ టిమ్ డ్రైవర్లు నరకయాతన పడుతున్నారు.
కండక్టర్, డ్రైవర్ ఇద్దరు పనులు ఒక్కరే చేయాల్సి రావడంతో మానసికంగా కృంగిపోతున్నారు. బస్సు నడిపే సమయంలో ఒత్తిళ్లకు గురికావడంతో వారి ఏకాగ్రత పూర్తిస్థాయిలో కేటాయించలేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ ఉన్నతాధికారులు, కార్మిక సంఘాలు పట్టించుకుని ఎవరి విధులు వారికి కేటాయిస్తే సులభం అవుతుంది.
భవిష్యత్‌లో కండక్టర్ భద్రమేనా?
ఆర్టీసీలో టిమ్ డ్రైవర్ విధానాలతో కండక్టర్ ఉద్యోగాలకు యాజమాన్యం మంగళం పాడే అవకాశం ఉంది. జిల్లాలో గత విధానాన్ని బట్టి చూస్తే 86 మంది డ్రైవర్లతోపాటు 86 మంది కండక్టర్ విధులు నిర్వర్తించేవారు. కానీ, ప్రస్తుతం తరుణంలో టిమ్ విధానంతో డ్రైవర్లే కండక్టర్ల విధులు నిర్వహిస్తుండటంతో భవిష్యత్తులో కండక్టర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఆర్టీసీలో కండక్టర్ విధానం ప్రస్తుతం సాగుతున్నా భవిష్యత్తులో పూర్తిస్థాయిలో తీసేయనున్నారని సమాచారం. దీంతో కండక్టర్లలో ఆందోళన నెలకొంది. ఇటు డ్రైవర్లు, కండక్టర్లు టిమ్ డ్రైవర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా వాసుల కష్టాలు
మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన సుమారు 30 మంది వరకు జిల్లాలో పనిచేస్తున్నారు. 2010లో వారికి జిల్లాలో వారి అవసరం ఉందని తీసుకొచ్చిన ప్రస్తుతం వారికి కష్టాలు తప్పడం లేదు. వారిలో టిమ్ విధులు చేయాలని డ్రైవర్లను వే ధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. టిమ్ చేయని పక్షంలో వారికి విధుల్లోకి తీసుకోవడం లేదు. గత్యంతరం లేని స్థితిలో డ్రైవర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి జిల్లాకు వారిని పంపించే యత్నం కూడా చేయడం లేదు. తిప్పలు పెడుతూ విధులు చేయించుకుంటున్నారని, నిబంధలకు విరుద్ధంగా వాహనాలు నడపమని వేధిస్తున్నరని కార్మికులు ఆరోపిస్తున్నారు.