
రంగారెడ్డి: అనారోగ్య సమస్యలు భరించ లేక ఓ ఆర్టీసీ కండక్టర్ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలూరులో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి ప్రభాకర్(39) ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు.
ఆయన కొన్ని రోజులుగా కడుపునొప్పి తదితర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగానికి కూడా వెళ్లడం లేదు. ఆయన భార్య నవనీత తన పిల్లలతో సహా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నెల 23న ప్రభాకర్ భార్యాపిల్లలను చూసి మధ్యాహ్నం స్వగ్రామానికి వచ్చాడు.
సోమవారం ఉదయం పురుగు మందు సేవించి వచ్చి ఇంటి ఎదుట పడిపోవడంతో స్థానికులు గమనించి చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.