రంగారెడ్డి: ఆన్‌లైన్ గేమ్‌లు, దురలవాట్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీల బాటపట్టిన నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కీసర పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ల్యాప్‌టాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం ఎల్‌బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లా, నంగునేరికి చెందిన రామకృష్ణన్(35) పాత నేరస్తుడు. కొంత కాలం క్రితం హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌కు వలస వచ్చి చిరుధాన్యాల వ్యాపారం ప్రారంభించాడు. అదే ప్రాంతంలోని దేవేంద్రనగర్ కాలనీ చెందిన కాగ్ గోవింద్(36) స్థానికంగా బఠాణీలు, మరమరాలు వంటివి విక్రయించే షాపు నిర్వహిస్తున్నాడు.
► రామకృష్ణన్ తరుచూ గోవింద్ షాపు వద్దకు వచ్చేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేవారు. ఇద్దరూ పలు దురలవాట్లకు బానిసయ్యారు. అవసరమైన డబ్బులను సులువుగా సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
► రామకృష్ణన్ తాను చోరీలు చేస్తానని, చోరీ సొత్తును ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని గోవింద్‌కు పురమాయించాడు. రామకృష్ణకు కీసర, కుషాయిగూడ, జవహర్‌నగర్ పరిధిలోని ప్రాంతాలపై అవగాహన ఉండటంతో అక్కడ చోరీలు మొదలెట్టాడు.
► వీరికి అదే ప్రాంతానికి చెందిన బైక్ మెకానిక్ మహేందర్ పవార్(36), బాలాజీనగర్‌లో జ్యువెలరీ వర్క్ షాపు నిర్వహిస్తున్న బచ్చు సంతోష్(40) జత కలిశారు. రామకృష్ణన్ చోరీ చేసిన బంగారాన్ని గోవింద్‌కు ఇస్తే.. దానిని అతను మహేందర్ పవార్, సంతోష్‌లకు ఇచ్చి ఇతర ప్రాంతాల్లో అమ్మించేవాడు. వచ్చిన డబ్బును నలుగురూ పంచుకొనేవారు.
► రామకృష్ణన్ మంకీ క్యాప్, మాస్కు ధరించి తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల సమయంలో బైక్‌పై కాలనీలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి దొంగతనం చేసేవాడు.
బంధువుల ఇంట్లోనే దొంగతనం..
మహేందర్ పవార్ తన బంధువుల ఫంక్షన్‌కు వెళ్లాడు. ఈ విషయంపై రామకృష్ణన్‌కు సమాచారం ఇచ్చిన అతను బంధువుల ఇంట్లో ఎవ్వరూ లేరని, తాళం వేసి ఉందని చోరీ చేయమని చెప్పాడు. దీంతో రామకృష్ణన్ ఆ ఇంటి తాళం పగులగొట్టి లాకర్‌లో ఉన్న బంగారం, వెండి అభరణాలను చోరీ చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను సోమవారం తెల్లవారుజామున అరెస్టుచేశారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణన్‌పై 22 చోరీ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. సమావేశంలో మల్కాజిగిరి ఎస్‌ఓటీ డీసీపీ గిరిధర్, కుషాయిగూడ ఏసీపీడీసీపీ వెంకట్‌రెడ్డి, కీసర సీఐ వెంకటయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment