బ్యాగరి రాజు, మోత్కుపల్లి శ్రీశైలం (ఫైల్)
సాక్షి, రంగారెడ్డి: ఇద్దరు మిత్రుల ఐదేళ్ల ప్రయాణం విద్యార్థుల రాష్ డ్రైవింగ్‌తో ఆగిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ఇరువురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన బుధవారం మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం మండల పరిధిలోని జనవాడకు చెందిన బ్యాగరి రాజు(40) శేరిలింగంపల్లిలోని ఓ కంపెనీలో సూపర్‌వైజర్, మోత్కుపల్లి శ్రీశైలం(31) ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. రోజు మాదిరిగానే వారు బైక్‌పై విధులకు బయలుదేరారు.
గ్రామ శివారులోకి కొల్లూరు రోడ్డులో ఇక్ఫాయి కళాశాల విద్యార్థులు అతివేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో రాజు ఘటనాస్థలిలోనే మృతి చెందగా.. శ్రీశైలంను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచాడు. రాజుకు భార్య మమత, ముగ్గురు సంతానం. శ్రీశైలంకు ఏడాదిన్నర క్రితం సంధ్యతో వివాహమైంది. మృతదేహాలను చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇద్దరు మిత్రుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కళాశాల ఎదుట ధర్నా..
మృతుల కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని.. ప్రమాదానికి కారణమైన విద్యార్థులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
గతంలోనూ శంకర్‌పల్లి–హైదరాబాద్ ప్రధాన రహదారిపై కార్ రేసింగ్ నిర్వహించి ఓ మహిళ ప్రాణాలను బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు గంజాయి, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆరోపించారు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోకిల సీఐ నరేశ్, శంకర్‌పల్లి సీఐ వినాయకరెడ్డి కళాశాల వద్దకు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment