కామారెడ్డి: ఓ మహిళ చేసిన ఆరోపణలతో అవమానాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడో యువకుడు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన మేతరి ప్రమోద్(18) ఈనెల 4న తన ఇంటికి కొద్ది దూరంలో మూత్ర విసర్జన చేశాడు. సమీపంలో నివసించే ఓ మహిళ తన సెల్‌ఫోన్‌లో ఫొటోతీసి.. రోజు నన్ను చూస్తూ.. నా ఎదుటే మూత్ర విసర్జన చేస్తున్నాడంటూ ఆ ఫొటోను భర్తకు చూపించింది.
దీంతో ఆయన కుల పెద్దలతో పంచాయితీ పెట్టించాడు. తాను ఉద్దేశపూర్వకంగా అక్కడ మూత్ర విసర్జన చేయలేదని, వర్షం పడుతుండడంతో అలా చేశానని ప్రమోద్ చెప్పినా వినకుండా తీవ్రంగా మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రమోద్.. అదే రోజు ఆర్మూర్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బైక్‌పై వెళ్లి ఆర్మూర్ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని స్నేహితులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పి నిప్పంటించుకున్నాడు.
ప్రమోద్ స్నేహితులు ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలిపి సంఘటన స్థలానికి వెళ్లేసరికి తీవ్రంగా గాయపడి ఉన్నాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆర్మూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ప్రమోద్ తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం కాగా ప్రమోద్ చివరివాడు. తల్లి చిన్నప్పుడే మృతిచెందగా నాన్నే పెంచాడు. ప్రమోద్ ఇంటర్ పూర్తిచేసి ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. ఈ విషయమై ఆర్మూర్ సీఐ సురేష్‌బాబును వివరణ కోరగా కేసు నమోదు చేశామని, మాక్లూర్‌కు కేసును బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment