జీతం ఎంతైనా పర్లేదు.. అటెన్షన్‌.. బట్‌ నో టెన్షన్‌.. కోవిడ్‌ తెచ్చిన మార్పు | Indians who want a stress-free job says UKG Survey | Sakshi
Sakshi News home page

జీతం ఎంతైనా పర్లేదు.. అటెన్షన్‌.. బట్‌ నో టెన్షన్‌.. కోవిడ్‌ తెచ్చిన మార్పు

Published Sun, Apr 23 2023 3:40 AM | Last Updated on Sun, Apr 23 2023 8:24 AM

Indians who want a stress-free job says UKG Survey - Sakshi

సాక్షి, అమరావతి: మానసిక ప్రశాంతత లేని కొలువుల్లో పనిచేసేది లేదని భారతీయ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. ఇందుకోసం అధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలను సైతం వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు. కోవిడ్‌–19 తర్వాత ఉద్యోగులు మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించారు. అమెరికా ఆధారిత వర్క్‌ఫోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ యూకేజీ నిర్వహించిన సర్వేలో.. భారతదేశంలో 88 శాతం మంది ఉద్యోగులు మానసిక క్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు నివేదించింది.

ఒత్తిడి లేని ఉద్యోగాల్లో తక్కువ జీతానికైనా పని చేసేందుకు వెనుకాడటం లేదని వెల్లడించింది. ఇదే అమెరికాలో 70 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయంతో పోలిస్తే భారత్‌లోనే ఈ అభిప్రాయం గల ఉద్యోగులు అధికంగా ఉండటం విశేషం. భారత్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోని ఉద్యోగాల్లో వర్క్‌ఫోర్స్, ప్రోత్సాహకాలు, మానసిక ఆరోగ్యం తదితర అంశాలపై ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. 

కుటుంబానికే తొలి ప్రాధాన్యం 
భారతీయ ఉద్యోగుల్లో ఇటీవల కుటుంబ సభ్యులకు ఇచ్చే ప్రాధాన్యతలో తీవ్ర మార్పు వచ్చింది. 46 శాతం మంది ఉద్యోగం కంటే కుటుంబమే తొలి ప్రాధాన్యం అని అభిప్రాయపడుతున్నట్టు సర్వేలో తేలింది. రెండో స్థానంలో 37 శాతం మంది పని (ఉద్యోగం).. ఆ తర్వాతే ఆరోగ్యం, స్వీయ సంరక్షణ, వ్యాయామం, స్నేహితులతో సంబంధాలు కోరుకుంటున్నట్టు తెలిపింది. అయితే, ఇక్కడ చాలామంది ఉద్యోగులు తమ ఆందోళనలను మేనేజర్లతో పంచుకునేందుకు వెనుకాడుతున్నట్టు చెప్పింది. భారత్‌లో 51 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ప్రతి వారం తమ మేనేజర్‌తో పనిభారంపై చర్చిస్తుండగా.. 30 శాతం మంది నెలకు ఒకసారి కూడా మాట్లాడలేకపోతున్నారని నివేదించింది.  

ఒత్తిడి ఇంత పని చేస్తోందా! 
33% భారతీయ ఉద్యోగులు ఆఫీసుల్లో ఎక్కువ గంటలు గడపటం పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణమని సర్వే పేర్కొంది. దీనివల్ల 34 శాతం మందిలో గతంతో పోలిస్తే పని గంటలు పెరగడంతో ఏకాగ్రత కోల్పోతున్నట్టు గుర్తించింది. 31 శాతం మందిలో సహాద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించలేని పరిస్థితి కనిపించింది. మిగిలిన వారిలో పని ఉత్పాదకత, సామర్థ్యం కొరవడుతున్నట్టు తేల్చింది.

ఉద్యోగానికి ఉండే డిమాండ్, హార్డ్‌ వర్క్‌ చేయాలనే తపన కూడా ఒత్తిడికి కారణంగా పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ‘ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూల వాతావరణం ఉండాలి. అప్పుడు వారు మెరుగ్గా పని చేయగలుగుతారు. సాంకేతిక వనరులపై పెట్టుబడులు పెంచడం ద్వారా ఉద్యోగులపై కొంతమేర ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇది ఆ సంస్థ స్థిరత్వానికి ఎంతో దోహదం చేస్తుంది’ అని యూకేజీ ఇండియా కంట్రీ మేనేజర్‌ సుమిత్‌ దోషి చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement