పిల్లలపై కోవిడ్‌ ప్రతాపం.. 29% మంది విద్యార్థుల్లో లోపించిన ఏకాగ్రత | corona virus impact on students NCERT Reference for Parents, Teachers | Sakshi
Sakshi News home page

పిల్లలపై కోవిడ్‌ ప్రతాపం.. 29% మంది విద్యార్థుల్లో లోపించిన ఏకాగ్రత

Published Mon, Jan 23 2023 4:35 AM | Last Updated on Mon, Jan 23 2023 4:35 AM

corona virus impact on students NCERT Reference for Parents, Teachers - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా క్రమంగా కనుమరుగైనా విద్యార్థులను మాత్రం మానసిక వేదనకు గురి చేస్తూనే ఉంది. వీటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) పలు సూచనలు చేసింది. కోవిడ్‌ తరువాత విద్యార్థుల మానసిక స్థితిగతులపై మనోదర్పణ్‌ సర్వే నివేదికను ఎన్‌సీఈఆర్టీ ఇటీవల విడుదల చేసింది. 29 శాతం మంది విద్యార్థుల్లో ఏకాగ్రత లోపించి చదువులపై దృష్టి కేంద్రీకృతం చేయడం లేదని సర్వేలో తేలింది. టీచర్లు, తల్లిదండ్రులు వీటిని అధిగమించేలా పిల్లలకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఎన్‌సీఈఆర్టీ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా 6 నుంచి 12 తరగతి చదివే 3.79 లక్షల మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 9,660 మంది విద్యార్థులను ప్రశ్నించి ఫలితాలు రూపొందించారు. సర్వే చేయడంతోపాటు మానసిక ఆందోళన, ఇతర సమస్యల నుంచి బయటపడేందుకు తీసు­కోవా­ల్సిన చర్యలను ఎన్‌సీఈఆర్టీ సూచించింది.

సర్వేలో తేలిన సమస్యలు
►29 శాతం మంది విద్యార్థులలో ఏకాగ్రత లోపించగా 43 శాతం మందిని మానసిక ఆందోళన వెంటాడుతోంది. పాఠశాలలు తెరిచిన తరువాత పరిస్థితులు బాగున్నట్లు 73 శాతం మంది విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. 
►దీర్ఘకాలం పాఠశాలలు మూతపడటం, ఆటపాటలకు దూరం కావడంతో పిల్లల శరీరాకృతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తమ శరీర ఆకృతిపై 55 శాతం మంది సంతృప్తితో ఉండగా 45 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 
►బోధనాంశాలను గ్రహించడం, ప్రతి స్పందించడంలో మాధ్యమిక స్థాయిలో 43 శాతం మంది విద్యార్ధులు చురుగ్గా ఉండగా 57 శాతం మంది తక్కువ చొరవతో ఉన్నారని సర్వేలో తేలింది. సెకండరీ స్థాయిలో 46 శాతం మంది ప్రతిస్పందిస్తున్నట్లు వెల్లడైంది. 
►ఆన్‌లైన్‌ అభ్యసనాలను అనుసరించడంలో 49 శాతం మంది నైపుణ్యాన్ని ప్రదర్శించగా 51 శాతం మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అర్థంకాని అంశాలను టీచర్ల ద్వారా నివృత్తి చేసుకునేందుకు 28 శాతం మంది సందేహిస్తున్నారు. మాధ్యమిక స్థాయి నుంచి పైదశకు మారిన పిల్లలు చదువులపై పూర్తి ఆసక్తిని కనబర్చడం లేదు. చదువుల్లో అలసట, శక్తి హీనతకు గురవుతున్నట్లు  48 మంది పేర్కొన్నారు. సెకండరీలో 29 శాతం మంది, మాధ్యమికలో 25 శాతం మంది ఒంటరితనంతో బాధ పడుతున్నట్లు తెలిపారు.

సర్వేలో కొన్ని ముఖ్యాంశాలు ఇవీ..
ఏకాగ్రత లేమి: 29 శాతం
చదువుల్లో వెనుకబడని వారు: 22 శాతం
చదువు అలవాటు లేమి: 16 శాతం
సమయ నిర్వహణ చేయలేనివారు: 14 శాతం
చదువులకు ఆటంకాలున్న వారు: 12 శాతం
చదివింది అర్థంకాని వారు: 7 శాతం

చదువంటే ఆందోళనతో ఉన్న వారు: 50 శాతం
పరీక్షలంటే భయపడేవారు: 31 శాతం
ఆందోళన చెందని వారు: 15 శాతం

భావోద్వేగాల పరిస్థితి ఇలా
భావోద్వేగాల్లో తరచూ మార్పు: 43 శాతం
తీవ్రమైన భావోద్వేగాలు లేనివారు: 27 శాతం
తీవ్రమైన భావోద్వేగాలున్నవారు: 14 శాతం
భయంతో ఉన్న వారు: 7 శాతం

నిద్ర అలవాటులో మార్పులు
మాధ్యమిక విద్యార్ధులు: 32 శాతం
సెకండరీ విద్యార్ధులు: 43 శాతం
రోజూ ఒకేమాదిరిగా ఉన్న వారు: 
మాధ్యమిక: 28 శాతం
సెకండరీ: 24 శాతం 

ఏం చేయాలంటే..
►విద్యార్థుల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు తల్లిదండ్రులు, పెద్దలకు టీచర్లు దిశానిర్దేశం చేయాలి. విద్యార్థుల్లో ప్రత్యేక లక్షణాలను గుర్తించి ప్రోత్సహించాలి.

►మానసిక, భావోద్వేగ పరిస్థితులు నియంత్రించే అంశాలను పాఠ్యాంశాలకు అనుసంధానించాలి. భావోద్వేగాలను నియంత్రించేలా నైపుణ్యాలను పెంపొందించాలి.

►కుటుంబం పరిస్థితులు, ఆత్మ­న్యూనతతో ఒత్తిడికి గురయ్యే కౌమార దశ విద్యార్థుల్లో భయాలను టీచర్లు పోగొట్టాలి. తల్లిదండ్రులతో సంప్రదిస్తూ సున్నితంగా వ్యవహరించాలి. అవసరమైతే మానసిక నిపుణులతో చర్చించేలా సూచనలు చేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement