కరోనా నష్టం.. ‘బ్రిడ్జి కోర్సు’ పాఠం | Bridge course for several years in public schools at Telangana | Sakshi
Sakshi News home page

కరోనా నష్టం.. ‘బ్రిడ్జి కోర్సు’ పాఠం

Published Wed, Jun 15 2022 1:50 AM | Last Updated on Wed, Jun 15 2022 1:50 AM

Bridge course for several years in public schools at Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నాళ్లపాటు బ్రిడ్జి కోర్సు నిర్వహించాలని రాష్ట్ర విద్య, శిక్షణ, పరిశోధన మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) జిల్లా విద్యాశాఖ అధికారులను మంగళవారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి పాఠ్య ప్రణాళికను కూడా రూపొందించినట్టు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కరోనా మూలంగా విద్యార్థులు అభ్యసన నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. దీన్ని దూరం చేసి తిరిగి గాడిలో పెట్టడమే దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. మొదటి తరగతిలో చేరే విద్యార్థులకు 12 వారాలపాటు విద్యాప్రవేశ్‌ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

అలాగే 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఉన్న విద్యార్థులకు 4 వారాలపాటు బ్రిడ్జి కోర్సు చేపట్టాలని, ఇందుకు పాఠశాల హెచ్‌ఎంలు బాధ్యత తీసుకోవాలని ఎస్‌సీఈఆర్‌టీ సూచించింది. చదవడం, రాయడం, ప్రమాణాలు పెంచేలా పాఠ్య ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జి కోర్సు మాడ్యూళ్లు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది.
 
భయం పోగొట్టేలా... 
విద్యాప్రవేశ్‌ పేరుతో మొదటి తరగతి విద్యార్థులకు అందించే ప్రత్యేక మాడ్యూల్స్‌లో ఎక్కువ భాగం విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్లుగా విద్యార్థులు కరోనా కారణంగా స్కూళ్లకు దూరమయ్యారు. పాఠశాల వాతావరణం అంటే కొంత భయం నెలకొంది. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నా అవి గ్రామీణ ప్రాంతాలకు చేరలేదన్న వాదన ఉంది.

ముఖ్యంగా మొదటి తరగతిలో చేరుతున్న విద్యార్థులకు పాఠశాలకు హాజరుకావడం ఇదే తొలిసారి అవుతుందని అధికారులు చెబుతున్నారు. వారిని స్కూల్‌ వాతావరణానికి అలవాటు చేసి భయం పోగొట్టేలా ఆటపాటలతో చదువు వైపు మళ్లించాలని ఎస్‌సీఈఆర్‌టీ భావించింది. ఆహ్లాదకరంగా, ఆనందంగా, స్కూళ్లకు వెళ్లాలనే ఆలోచన విద్యార్థులకు కలిగేలా విద్యాప్రవేశ్‌ శిక్షణ ఉండాలని సూచించారు. మూడు నెలలపాటు ఈ తరహాలో విద్యార్థులను చదువుకు సిద్ధం చేశాక బోధన ప్రక్రియ మొదలు పెట్టాలని నిర్ణయించారు. 

మళ్లీ గుర్తుకు తెచ్చేలా... 
ప్రస్తుతం 2–10 తరగతుల విద్యార్థుల్లో ఆంగ్లం, తెలుగు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు తగ్గాయని ఎస్‌సీఈఆర్‌టీ గుర్తించింది. చాలా మంది విద్యార్థులు కనీస స్థాయికన్నా తక్కువగా ఉన్నారని, సాధారణ స్థాయి ప్రమాణాలు దాటిన వారు 15 శాతం మించి లేరని నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే కూడా తేల్చిచెప్పింది. విద్యార్థులు పాఠాలను అర్థం చేసుకొనే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొంది.

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని 2–10 తరగతుల విద్యార్థులను నాలుగు విభాగాలుగా అధికారులు విభజించారు. లెవెల్‌–1లో 2 నుంచి 5వ తరగతి విద్యార్థులను, లెవెల్‌–2లో 6, 7 తరగతులు, లెవెల్‌–3లో 8, 9 తరగతులు, లెవెల్‌–4లో 10వ తరగతి విద్యార్థులను చేర్చారు. బ్రిడ్జి కోర్సు మాడ్యూళ్లను కూడా నాలుగు విభాగాలుగా తయారు చేశారు. ముందు తరగతులకు లింక్‌ ఉండే పాఠ్యాంశాలను తీసుకొని సరైన పునశ్చరణ ఉండేలా ఇవి ఉంటాయని అధికారులు తెలిపారు. 

పుస్తకాలు రానందునేనా? 
స్కూళ్లు తెరిచినా ఇంతవరకూ పుస్తకాల ముద్రణ పూర్తవ్వలేదు. 2.10 కోట్ల పుస్తకాలు కావాల్సి ఉంటే ఇప్పటివరకూ కేవలం 20 లక్షలే ముద్రించారు. మిగతావి రావడానికి ఇంకా రెండు నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు బ్రిడ్జి కోర్సును తెరపైకి తెచ్చారనే వాదన విద్యావర్గాల నుంచి వినిపిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement