Google Employees Oppose vaccination Mandatory : టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు వర్క్‌ఫ్రమ్ హోంలో ఉద్యోగులు భారీ షాకిచ్చారు. వ్యాక్సినేషన్ తప్పనిసరి అని కంపెనీ జారీ చేసిన ఆదేశాలపై నిరసన వ్యక్తం చేయడమే కాదు.. ఈ సాకుతో వర్క్‌ఫ్రమ్ హోంను మరికొంతకాలం పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా సంతకాలతో ఓ మ్యానిఫెస్టో తయారుచేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గూగుల్ సంస్థ ఉద్యోగులు తమ కంపెనీకి వ్యతిరేకంగా ఓ మ్యానిఫెస్టోను సిద్ధం చేశారు. వ్యాక్సినేషన్ తప్పనిసరి అంటూ జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ వందల మంది సంతకాలతో ఆ మ్యానిఫెస్టో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పైగా పోను పోను ఆ సంతకాల సంఖ్య పెరుగుతుండడం విశేషం. త్వరలో వర్క్‌ఫ్రమ్ హోం ముగిసి.. ఉద్యోగులు ఆఫీసులకు వస్తారనుకుంటున్న తరుణంలో ఈ పరిణామం గూగుల్‌కు మింగుడుపడడం లేదు.
సర్కార్ ఉత్తర్వుల నేపథ్యంలోనే..
ఇదిలా ఉంటే కరోనా ప్రభావం తగ్గని నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం తాజాగా అమెరికన్ కంపెనీలకు కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ కంపెనీలో వంద, అంతకంటే ఎక్కువ మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాల్సిందేనని, కంపెనీలు ఈ అంశాన్ని పర్యవేక్షించాలని తేల్చి చెప్పింది. ఇందుకోసం జనవరి 4వ తేదీని డెడ్‌లైన్‌గా విధించింది. ఈ తరుణంలో గూగుల్ తమ కంపెనీలో పని చేసే లక్షా యాభై వేల మంది ఉద్యోగులకు మెయిల్ పంపించింది. ఆఫీసులకు వచ్చినా, వర్క్‌ఫ్రమ్ హోంలో కొనసాగుతున్నా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలంటూ అందులో పేర్కొంది. అంతేకాదు డిసెంబర్ 3వ తేదీకల్లా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను తమ కంపెనీ ప్రొఫైల్‌లో అప్‌డేట్ చేయించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది.
అయితే ‘తప్పనిసరి’ అనే ఆదేశాల్ని ఉద్యోగులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఆ ఆదేశాల్ని వ్యతిరేకిస్తూ.. వ్యాక్సినేషన్‌లో తమకు స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. అంతేకాదు కరోనా ప్రభావం కారణంగా తాము మరికొంత కాలం వర్క్‌ఫ్రమ్ హోంలోనే కొనసాగుతామని, బలవంతం చేస్తే ఉద్యోగాలకు రాజీనామాలు చేయాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. అయితే గతంలో చాలాసార్లు ఉద్యోగుల బ్లాక్‌మెయిలింగ్‌లకు తలొగ్గినప్పటికీ.. ఈసారి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు గూగుల్ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇంకోవైపు వ్యాక్సినేషన్ తప్పనిసరి ఆదేశాలు గూగుల్‌కు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద కంపెనీలకు తలనొప్పిగా మారింది.
క్లిక్ చేయండి: గూగుల్ అసిస్టెంట్‌తో టీకాల బుకింగ్
Comments
Please login to add a commentAdd a comment