ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో మళ్లీ భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఐదు నెలల తర్వాత.. రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2, 151 కేసులు నమోదు కాగా, క్రియాశీలక కేసుల సంఖ్య 11,903కి చేరినట్లయ్యింది.
గత ఐదు నెలల కాలంలో కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళతో పాటు యూపీలోనూ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అయితే.. సోమవారంతో పోలిస్తే మంగళవారం దేశవ్యాప్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. కానీ, తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల్లో కొత్త కేసులు 2 వేలకుపైగా వెలుగు చూశాయి.
కేంద్రం ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్ష జరిగింది కూడా. ఒమిక్రాన్ ఉపవేరియెంట్ ఎక్స్‌బీబీ 1.16 విజృంభణ వల్లే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. టెస్టుల సంఖ్య పెంచితే.. కేసుల సంఖ్య కూడా ఎక్కువే బయటపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ఇక మ్యూటెంట్ వేరియెంట్‌తో రిస్క్ రేట్ తక్కువే అయినప్పటికీ.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, వ్యాక్సినేషన్‌లోనూ పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ.
Comments
Please login to add a commentAdd a comment