
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా హైబ్రిడ్ పని విధానం కొనసాగుతోంది. అయితే ఆఫీస్‌కు వెళ్లి సహోద్యోగులతో కలిసి విధులు నిర్వర్తించేందుకు 78 శాతం మంది భారతీయ నిపుణులు ఆసక్తి కనబరిచారని లింక్డ్‌ఇన్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2023 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 6 మధ్య సెన్సస్‌వైడ్ చేపట్టిన సర్వేలో 18 ఏళ్లు ఆపైన వయసున్న 1,001 మంది ఉద్యోగులు పాలుపంచుకున్నారు. ఈ నివేదిక ప్రకారం.. కార్మికులు సాధారణంగా కార్యాలయానికి వెళ్లడానికే మక్కువ చూపుతారు. ఈ విషయంలో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు తాము సానుకూలంగా ఉన్నట్టు 86 శాతం మంది తెలిపారు. ఉద్యోగులతో ముచ్చట్లు, మరింత సమర్థవంతమైన ముఖాముఖి సమావేశాలు, పని సంబంధాలను నిర్మించడం కోసం ఆఫీస్‌కు వెళ్లాలని భావిస్తున్నారు.
ఉద్యోగులతో కలిసి చాయ్..
కార్యాలయంలో చాయ్ విరామం (టీ బ్రేక్) బంధాన్ని కోల్పోయామని 72 శాతం మంది చెప్పారు. పని, వ్యక్తిగత జీవితాల గురించి సహోద్యోగులతో పరిహాసమాడవచ్చని వారు చెబుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా సహచరులు వచ్చి మరో ఉద్యోగితో సంభాషించడాన్ని (డెస్క్ బాంబింగ్) అత్యధికులు ఇష్టపడుతున్నారు. ఆకస్మిక సంభాషణలకు డెస్క్ బాంబింగ్‌ను గొప్ప మార్గంగా 62 శాతం మంది చూస్తున్నారు. జనరేషన్–జడ్‌కు చెందిన 60 శాతం మంది ఇటువంటి సంభాషణలను అనుభవించారు. ఇంటి నుంచి పనిచేయడం వల్ల తమ కెరీర్‌పై ఎటువంటి హానికర ప్రభావం పడలేదని 63 శాతం మంది వెల్లడించారు. అలాగే కార్యాలయానికి వెళ్లకపోతే కెరీర్ వృద్ధి అవకాశాలు తగ్గుతాయని ఇదే స్థాయిలో నమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment