Office Work
-
వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. మరో ఎత్తు వేసిన ఇన్ఫోసిస్!
దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి మరో ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్-ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ENG-IoT) ప్రాజెక్ట్‌లలో పనిచేసే ఉద్యోగులకు 'ఇన్-పర్సన్ కొల్లాబ్ వీక్స్'ని అమలు చేస్తోంది. తాము సమీక్షించిన ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఈమెయిల్స్ ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్ ఈమేరకు పేర్కొంది. వీటి ప్రకారం.. తమకు కేటాయించిన వారాల్లో ఉద్యోగులు వారి సంబంధిత క్యాంపస్‌లలో హాజరు కావాలి. ఆఫీస్ నుంచి పనిచేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి త్రైమాసికంలో ఉద్యోగులకు నిర్దిష్ట వారాలను నిర్దేశిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం, ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు లేదా త్రైమాసికానికి 30 రోజులు ఆఫీస్ నుంచి పని చేయాలి. ఈ హైబ్రిడ్ వర్క్ అప్రోచ్ ద్వారా టీమ్ వర్క్, ఉత్పాదకతను పెంపొందించడం ఇన్ఫోసిస్ లక్ష్యం. బేస్ లొకేషన్లకు దూరంగా ఉన్న ఉద్యోగులు ఈ వారాల్లో డెవలప్మెంట్ సెంటర్లకు తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని కంపెనీ కోరింది. కొల్లాబ్ వీక్స్‌లో పాల్గొనే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ఇంకా నిర్ణయించలేదని, ప్రతి త్రైమాసికానికి కనీసం ఆరు వారాలు ఆఫీస్ నుంచి పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విధానాన్ని ఈ త్రైమాసికం నుంచి అమలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్దేశిత వారాలలో ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగులకు వారికి అనువైన రోజులను ఎంచుకోవడంలో సౌలభ్యాన్ని కంపెనీ అందిస్తోంది. 10 రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, క్యాంపస్ హాజరును పెంచాలని ఇన్ఫోసిస్ చూస్తోంది. -
‘అవసరమైతే ఉద్యోగం మానేస్తాం.. కానీ..’ ఐటీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
కొవిడ్ పరిణామాల్లో ఐటీ పరిశ్రమలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ప్రధానమైంది పూర్తిగా ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేయడం. వారంలో కొన్ని రోజులపాటు ఇంటి నుంచి పనిచేయడం కొవిడ్ ముందునుంచే ఉంది. అయితే కరోనా సమయంలో ఐటీ ప్రాజెక్టులకు ఆటంకం ఏర్పడకుండా, పూర్తిగా ఇంటి నుంచే పనికి అనుమతించారు. కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత పలు సంస్థలు క్రమంగా కార్యాలయాలు తెరిచాయి. ఉద్యోగులను కార్యాలయాలకు రావాల్సిందిగా ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు మెయిళ్లు పంపాయి. కానీ రోజూ ఆఫీస్‌కు వచ్చి పనిచేయడానికి ఉద్యోగులు విముఖత చూపుతున్నారని తేలింది. ప్రతిరోజూ తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సిందిగా సంస్థలు ఆదేశిస్తే ఉద్యోగం మారడానికి సైతం సిద్ధపడుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాడ్యూల్‌కు మారాలంటే మెజారిటీ ఉద్యోగులు భయంతో ఉన్నట్లు తెలిసింది. ఈ విధానానికి హఠాత్తుగా మారడం సాధ్యం కాదని తాజా సర్వేలో పాల్గొన్న వారిలో 69 శాతం మంది స్పష్టం చేశారని స్టాఫింగ్ సొల్యూషన్స్ హెచ్ఆర్ సర్వీస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ రిపోర్ట్ తెలిపింది. కేవలం 25 శాతం మంది మాత్రమే వర్క్ ఫ్రం హోం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సర్వే వెల్లడించింది. బ్యాంకింగ్ ఫైనాన్స్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ, ఐటీఈఎస్, తయారీ వంటి రంగాల్లో పనిచేసే 1,213 మందిని పరిగణించి గతేడాది అక్టోబర్ 26 నుంచి నవంబర్ 30 వరకు రిపోర్ట్ తయారు చేశారు. ఆఫీసుకు రమ్మని ఆదేశించడం వల్ల రాజీనామాలు పెరిగే అవకాశం ఉందని రిపోర్ట్ అంచనా వేసింది. 12 శాతం మంది రాజీనామాలను ప్రధాన సమస్యగా భావించలేదు. 82 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: బయోమాస్ సేకరణపై ఫోకస్.. ఖర్చు ఎంతంటే.. కంపెనీలు ఫ్లెక్సిబిలిటీకి అవకాశం ఇవ్వాలని చాలా మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇంటితోపాటు ఆఫీసు నుంచీ పనిచేయడానికి అనుమతించాలని కోరారు. ముఖ్యంగా ఆఫీసు నుంచి ఇల్లు దూరం ఉన్న వారికి మినహాయింపులు ఉండాలని 56 శాతం మంది అన్నారు. దీనికి విరుద్ధంగా, 33 శాతం మంది మాత్రం మినహాయింపులు అవసరం లేదన్నారు. -
ఉద్యోగులు ఆఫీసుల బాట.. ఇక వాటి అమ్మకాలకు ఊపు!
దేశంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home) విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. దీంతో ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ ఆసక్తికర నివేదికను విడుదల చేసింది. ప్రభుత్వం ఓ వైపు పన్నులు పెంచకపోవడం, మరోవైపు ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్న నేపథ్యంలో సిగరెట్ల అమ్మకాలు (Cigarette sales) పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ (Crisil Ratings) అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సిగరెట్ల డిమాండ్ 7 నుంచి 9 శాతం పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. సిగరెట్ల డిమాండ్ పెరిగితే అందుకు అనుగుణంగా అమ్మకాలు కూడా పెరగనున్నాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత దేశంలో సిగరెట్ అమ్మకాలు అమాంతం పెరిగాయి. 2022లో సిగరెట్ అమ్మకాలు అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సారాలతో పోలిస్తే 18 శాతం పెరిగాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం క్రిసిల్ రేటింగ్స్ విశ్లేషణ ప్రకారం 7 నుంచి 9 శాతం పెరుగుదలను చూడవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగి ప్రభుత్వం పెద్ద ఎత్తున పన్నును పెంచకపోతే సగటున ఏడాదికి 5 శాతం సిగరెట్ విక్రయాలు పెరిగే అవకాశం ఉంది. ఆఫీసులో పనికి, సిగరెట్ల అమ్మకాలకు సంబంధమేంటి? ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల్లో పని ఒత్తిడి కారణంగా చాలా మందికి సిగరెట్ అలవాటు ఉంటుంది. ఇక ఐటీ కంపెనీల్లో పనిచేసేవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫీసులో ఉద్యోగులు సిగరెట్ కోసం బ్రేక్ తీసుకోవడం మామూలే. అలా బయటకు వచ్చి రోడ్డు పక్కనున్న టీ స్టాల్స్, బడ్డీ కొట్ల వద్ద చాలా మంది టీలు, సిగరెట్లు తాగుతుంటారు. ఆఫీసులకు వచ్చి పనిచేసేవారి సంఖ్య గతేడాది 40 శాతం ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం 65 నుంచి 70 వరకు ఉండవచ్చని అంచనా. -
టీ బ్రేక్ మిస్ అయ్యాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా హైబ్రిడ్ పని విధానం కొనసాగుతోంది. అయితే ఆఫీస్‌కు వెళ్లి సహోద్యోగులతో కలిసి విధులు నిర్వర్తించేందుకు 78 శాతం మంది భారతీయ నిపుణులు ఆసక్తి కనబరిచారని లింక్డ్ఇన్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2023 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 6 మధ్య సెన్సస్‌వైడ్ చేపట్టిన సర్వేలో 18 ఏళ్లు ఆపైన వయసున్న 1,001 మంది ఉద్యోగులు పాలుపంచుకున్నారు. ఈ నివేదిక ప్రకారం.. కార్మికులు సాధారణంగా కార్యాలయానికి వెళ్లడానికే మక్కువ చూపుతారు. ఈ విషయంలో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు తాము సానుకూలంగా ఉన్నట్టు 86 శాతం మంది తెలిపారు. ఉద్యోగులతో ముచ్చట్లు, మరింత సమర్థవంతమైన ముఖాముఖి సమావేశాలు, పని సంబంధాలను నిర్మించడం కోసం ఆఫీస్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. ఉద్యోగులతో కలిసి చాయ్.. కార్యాలయంలో చాయ్ విరామం (టీ బ్రేక్) బంధాన్ని కోల్పోయామని 72 శాతం మంది చెప్పారు. పని, వ్యక్తిగత జీవితాల గురించి సహోద్యోగులతో పరిహాసమాడవచ్చని వారు చెబుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా సహచరులు వచ్చి మరో ఉద్యోగితో సంభాషించడాన్ని (డెస్క్ బాంబింగ్) అత్యధికులు ఇష్టపడుతున్నారు. ఆకస్మిక సంభాషణలకు డెస్క్ బాంబింగ్‌ను గొప్ప మార్గంగా 62 శాతం మంది చూస్తున్నారు. జనరేషన్–జడ్‌కు చెందిన 60 శాతం మంది ఇటువంటి సంభాషణలను అనుభవించారు. ఇంటి నుంచి పనిచేయడం వల్ల తమ కెరీర్‌పై ఎటువంటి హానికర ప్రభావం పడలేదని 63 శాతం మంది వెల్లడించారు. అలాగే కార్యాలయానికి వెళ్లకపోతే కెరీర్ వృద్ధి అవకాశాలు తగ్గుతాయని ఇదే స్థాయిలో నమ్ముతున్నారు. -
ఆఫీస్ నుంచి వర్క్ చేయాలనేది ఇందుకే: హర్ష గోయెంకా వైరల్ ట్వీట్
వర్క్ ఫ్రం హోమ్.. కరోనా సమయంలో బాగా వినిపించిన పేరు. కోవిడ్ వచ్చాక దాదాపు ప్రతి కంపెనీ కార్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఇటీవల కోవిడ్ కేసులు తగ్గిపోవడంతో మళ్లీ కార్యాలయాలు తెరుచుకున్నాయి. మెల్లమెల్లగా ఉద్యోగులు కంపెనీల బాట పడుతున్నారు. కానీ కొంతమంది ఇంకా ఇంటి నుంచే పని చేయడానికి ఇష్టపడుతున్నారు. సుమారు ఏడాది, రెండేళ్లపాటు ఇంట్లో ఉండటంతో చాలామంది వర్క్ ఫ్రం హోంకు అలవాటు పడిపోయారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా తాజాగా వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీస్ గురించి తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. ఇంటి నుంచి కంటే ఆఫీస్ నుంచి పనిచేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పోస్టులో రెండు పై చార్ట్‌లు ఉండగా.. పై దానిలో వర్క్ ఫ్రం హోమ్‌కు సంబంధించింది. ఇందులో మొత్తం పని కోసమే కేటాయించి ఉంది. చదవండి: ఆఫీస్ నుంచి వర్క్ చేయాలనేది ఇందుకే: హర్ష గోయెంకా వైరల్ ట్వీట్ Here is a reason why you should work from office 😀😀😀! pic.twitter.com/rMcjD9ahl8 — Harsh Goenka (@hvgoenka) September 29, 2022 ఇక రెండో చార్ట్ వర్క్ ఫ్రం ఆఫీస్‌కు సంబంధించింది. ఇందులో వర్క్‌తో పాటు మిగతా పనులకు కూడా అవకాశం ఉంది. టీ, లంచ్ బ్రేక్ తీసుకోవడం, ట్రాఫిక్‌లో ఉండటం. మన పని చేసుకోవడంతోపాటు ఇతరులకు సాయపడటం వంటివి కూడా ఉన్నాయి. ఈ కారణాలతోనే ఆఫీస్ నుంచి వర్క్ చేయాలనేది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీస్ వల్ల కలిగే అసలైన ప్రయోజనాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఆఫీస్ వాతావరణం ఉద్యోగి, కంపెనీకి ఇద్దరికీ అనకూలమైనదని హర్ష గోయంకాకు కొందరు మద్దతిస్తున్నారు -
వారంలో 4 రోజులే పని, మిగిలిన టైంలో ఐటీ ఉద్యోగులు ఏం చేస్తున్నారో తెలుసా?
కోవిడ్ -19 కారణంగా ప్రపంచ దేశాల్లో ఉద్యోగస్తుల పని దినాలు తగ్గాయి. ముఖ్యంగా ఐటీ విభాగంలో పని దినాలు తగ్గించేందుకు ఇంకా కసరత్తు చేస్తున్నాయి. గతంలో వారానికి 6 రోజులు, ఆ తర్వాత 5 రోజులు, ఇప్పుడు కొన్ని దేశాల్లో వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసేలా సంస్థలు ఉద్యోగులకు వెసలుబాటు కల్పించాయి. అయితే వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసిన ఉద్యోగులు మిగిలిన రోజుల్లో ఏం చేస్తున్నారు? రెండో ఉద్యోగం చేస్తున్నారా? ఇంకేమైనా చేస్తున్నారా? అంటూ బోస్టన్ కాలేజీ ఎకనమిస్ట్, రిసెర్చర్ జూలియట్ షోర్ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 'హే డ్యూడ్'..అమ్మా..తల్లి నేను నీ బాస్‌ను..నన్ను అలా పిలవద్దు ప్లీజ్! జూలియట్ షోర్ ఆరు నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 180 సంస్థలకు చెందిన ఉద్యోగుల అభిప్రాయాల్ని సేకరించారు. ఈ అభిప్రాయ సేకరణలో.. వారానికి 4 రోజుల పనిచేస్తున్న ఉద్యోగులు 8 గంటల పాటు నిద్రకే కేటాయిస్తున్నట్లు తేలింది. వారానికి 40 గంటలు వర్క్ చేస్తున్నప్పుడు ఇలా నిద్రపోలేదన్నారు. ఆఫీస్ వర్క్, ఆరోగ్యం విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయనే విషయాన్ని గమనించినట్లు రీసెర్చర్ జూలియట్ షోర్ తెలిపారు. మరో మాటలో చెప్పాలంటే, స్నేహితులతో కాలక్షేపం, సినిమాలు, షికార్ల పేర్లతో ఎంజాయ్ చేయడం కంటే..వారానికి ఎనిమిది గంటల సమయంలో ఏడు గంటల పాటు నిద్రిస్తున్నట్లు గుర్తించారు. వారానికి నాలుగు రోజుల పని సమయాల్లో రాత్రిపూట 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నట్లు భావించే ఉద్యోగుల శాతం 42.6 శాతం నుండి 14.5 శాతానికి పడిపోయింది. ఈ సందర్భంగా జూలియట్ షోర్ మాట్లాడుతూ..‘ఉద్యోగులు ఎక్కువ సేపు నిద్రపోవడంపై నేను ఆశ్చర్యపోలేదు. కానీ ఉద్యోగుల్లో చోటు చేసుకుంటున్న బలమైన మార్పులపై ఆశ్చర్యపోయాను’ అని షోర్ చెప్పారు. ఈ అనూహ్య మార్పుల కారణంగా ఆఫీస్ వర్క్ ఎప్పుడు, ఎక్కడ జరగుతుందోనని యాజమాన్యాలు పునరాలోచనలో పడ్డాయని అన్నారు. చదవండి👉 ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్! -
Hyderabad: సిటీలో కొత్త ట్రెండ్.. ‘వర్కేషన్’ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొండాపూర్‌లో నివసించే కార్పొరేట్ ఉద్యోగి వర్థన్.. గత ఏడాదిగా గోవా, మధురై, కేరళలలో ప్రకృతి అందాలను సతీసమేతంగా ఆస్వాదిస్తున్నారు. కనీసం 15 నుంచి 20 రోజుల వ్యవధి ఉండే ట్రిప్ పూర్తయిన తర్వాత నగరానికి రావడం ఓ వారం పదిరోజులు గడపడం ఆ వెంటనే మరో టూర్.. దీనిని బట్టి ఆయనను మనం వర్క్‌కి బంక్ కొట్టే వెకేషన్ లవర్‌గా భావిస్తాం. కానీ ఆయన ఆస్వాదిస్తోంది వర్కేషన్. పిక్నిక్లోనూ పనిచేసే విధానం. ట్రావెల్ కంపెనీ బుకింగ్ డాట్ కామ్ సర్వే ప్రకారం గత ఏడాదిలోనే 68 శాతం మంది భారతీయ ప్రయాణికులు రాబోయే సంవత్సరానికి తమ వర్కేషన్స్‌ను బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పర్వత ప్రకృతి దృశ్యాలు బ్యాక్‌డ్రాప్‌గా వర్క్స్టేషన్ల పోస్ట్‌లు..బీచ్‌లకు ఆనుకుని ఉన్న గది ఇన్‌స్టా రీల్స్‌తో సోషల్ మీడియా పని–ప్రకృతి ప్రేమికుల వేదికగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్కేషన్ దాకా కోవిడ్ దెబ్బకు కార్పొరేట్ ఉద్యోగుల పనితీరు ఆన్లైన్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్/రిమోట్ వర్కింగ్ సిస్టమ్...ఇలా రూపాంతరం చెందుతూ ఇప్పుడు వర్కేషన్‌గా ఊపందుకుంది. ‘ఇంటి నుంచి కాకుండా ఇష్టమైన టూర్లో ఉంటూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూనే అసైన్డ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమనే వర్కింగ్ ట్రెండ్‌నే వర్కేషన్’గా పేర్కొంటున్నారు. ఈ వర్కేషన్ ప్రియుల్ని డిజిటల్ నోమాడ్స్‌గా పిలుస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, అన్ అకాడమీ తదితర కార్పొరేట్ సంస్థలు ‘నిరవధిక వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రకటన తర్వాత ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. వర్క్‌తో పాటే విందు, వినోదం ‘మా రిసార్ట్స్‌లో 80 శాతం వరకూ వర్కేషన్కు అనువుగా మార్చాం. బెస్ట్ వైఫై నెట్ వర్క్, ఫుడ్ ప్రీ ఆర్డర్స్ పెద్దలు పని టైమ్‌లో పిల్లల కోసం హ్యాపీ హబ్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం’ అంటూ క్లబ్ మహీంద్రా రిసార్ట్స్ ప్రతినిధి చెప్పారు. కరావొకే లాంటి సరదా సంగీతాల ఈవెంట్స్‌తో పాటు సర్ఫింగ్, కయాకింగ్, స్టాండప్ పాడ్లింగ్, స్కీయింగ్, స్పిన్నింగ్, స్కేటింగ్ వంటివి వర్క్‌తో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. రిషికేశ్, ధర్మశాల, కేరళ, కూర్గ్, గోవా తదితర ప్రాంతాలు నగర వర్కేషన్ ప్రియుల ఎంపిక జాబితాలో టాప్‌లో ఉన్నాయని ట్రావెల్ ఆపరేటర్ మీర్ చెప్పారు. నగరానికి చెందిన ఓ కంపెనీలో స్ట్రాటజీ హెడ్ గా పనిచేస్తున్న సూర్య తేజ గత రెండేళ్లుగా వారణాసి నుంచి గోవా..మధురై వరకు 65,000 కి.మీ ప్రయాణించాడు, మరి అత్యవసర పరిస్థితుల్లో ఎలా? అంటే సమాధానంగా సూర్య ఏమంటారంటే ‘గత 2021 అక్టోబర్‌లో నేను కేరళలోని, అరూకుట్టిలోని ఓ రిసార్ట్స్‌లో కయాకింగ్ యాక్టివిటీలో బిజీగా ఉంటూనే ఆన్లైన్ మీటింగ్‌కు హాజరయ్యా. కయాకింగ్ లాంటి యాక్టివిటీస్‌కి వెళ్లినప్పుడు నా వెంట వాటర్‌ప్రూఫ్ బ్యాగ్ తప్పనిసరిగా ఉంటుంది’ అంటూ చెప్పడం పనితో పిక్నిక్ని కలిపిన వైనానికి అద్దం పడుతుంది. ఇటీవల బాగా పాపులరయిన వాటిలో డే కేషన్స్, వర్కేషన్స్. వీటికి అనుగుణంగా మేం మా ట్రావెల్ ప్యాకేజ్‌లను డిజైన్ చేస్తున్నాం. అడ్వంచర్ యాక్టివిటీస్, నేచర్ వాక్స్, ఇగ్లూ స్టేయింగ్, హార్స్ రైడింగ్, చెట్ల మీద విందు, ఎటివి బైక్స్, పెయింట్ బాల్... ఫ్యామిలీతో సహా వచ్చేవారికి అనుగుణంగా తీర్చిదిద్దాం. మా సభ్యుల్లో దక్షిణాది నుంచి 30 శాతం ఉంటే అందులో హైదరాబాద్ వాటా పెద్దదే. –ప్రతినిధి, క్లబ్ మహేంద్రా హాలిడేస్– రిసార్ట్స్ -
ఆఫీస్‌లో పనికి ఉద్యోగుల ససేమిరా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మా రి తదనంతరం ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ఇంటి నుంచి పని విధానానికి కంపెనీలు క్రమంగా స్వస్తి పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక నివేదికను విడుదల చేసింది. పని విషయంలో అంతర్జాతీయంగా ఉద్యోగుల మనోగతంపై రూపొందిన ఈ నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి విధులు నిర్వర్తించాల్సిందేనని కంపెనీలు పట్టుబడితే రాజీనామాకు సిద్ధమని 25–34 ఏళ్ల వయసున్న యువ ఉద్యోగులు తేల్చిచెబుతున్నారట. పూర్తి స్థాయిలో కార్యాలయంలో పని చేయాల్సిందేనని కంపెనీలు ఒత్తిడి చేస్తే 18–24 ఏళ్ల వయసున్న వారిలో 71 శాతం, 25–34 ఏళ్ల వయసున్న ఉద్యోగుల్లో 66 శాతం కొత్త జాబ్ వెతుక్కాంటామని స్పష్టం చేస్తున్నారట. అదే 45–54 ఏళ్ల వయసున్న సిబ్బంది విషయంలో ఇది 56 శాతంగా ఉంది. ప్రతిరోజు ఆఫీస్‌లో పని చేయడానికి తప్పనిసరిగా రావాలని యజమాని (కంపెనీ) షరతు విధిస్తే.. అంతర్జాతీయంగా ఉద్యోగుల్లో మూడింట రెండు వంతుల మంది (64 శాతం) ఇంటి నుంచే పని కల్పించే జాబ్‌ను వెతుక్కునే యోచనతో ఉన్నారని నివేదిక వెల్లడించింది. భారత్‌లోనూ అదే తరహా.. విధులు ఎక్కడ నుంచి నిర్వర్తించాలన్న విషయంలో భారతీయ ఉద్యోగులూ ఇంటి నుంచి పనికే మొగ్గుచూపుతున్నారు. ఆఫీస్‌కు రావాల్సిందేనని ఒత్తిడి చేస్తే ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగం నుంచి నిష్క్రమించే ఆలోచనలో ఉన్నట్టు సర్వేలో పాల్గొన్న 76.38 శాతం మంది స్పష్టం చేశారు. ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు తమ బృందాలతో సంపూర్ణ సహకారం కొనసాగించామని 75 శాతం మంది సిబ్బంది భావించారు. అందువల్ల చాలా మంది పూర్తి సమయం కార్యాలయానికి తిరిగి రావడానికి ఇష్టపడడం లేదని నివేదిక వివరించింది. 17 దేశాల నుంచి మొత్తం 32,924 మంది ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. వీరిలో భారత్ నుంచి 1,600 మంది ఉన్నారు. 2021 నవంబర్ 1–24 తేదీల మధ్య ఏడీపీ ఈ సర్వే నిర్వహించింది. ‘లాక్డౌన్లు సడలించిన తర్వాత కార్మికులను తిరిగి కార్యాలయాలకు రావాలని అడగవచ్చా లేదా బలవంతం చేయవచ్చా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. చాలా మందికి ఇది వారి నిష్క్రమణ నిర్ణయంలో నిర్ణయాత్మక అంశం. కెరీర్ పురోగతి కోసం యువకులు తహతహలాడుతుంటారనే నమ్మకాలకు విరుద్ధంగా సర్వే ఫలితాలు వచ్చాయి’ అని ఏడీపీ ఇండియా ఎండీ రాహుల్ గోయల్ వ్యాఖ్యానించారు. చదవండి: ఓ సీఈవో వేడుకోలు: ఆఫీస్‌కు రండయ్యా! -
ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు భారీ డిమాండ్, మారిపోతున్న ఇళ్ల రూపురేఖలు!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి గృహ కొనుగోలుదారుల అభిరుచులను మార్చేసింది. విశాలమైన గృహాలతో పాటు ఐసోలేషన్ కోసం ప్రత్యేకంగా ఒక గది, ఆన్లైన్ క్లాస్‌లు, ఆఫీస్ పని చేసుకునేందుకు వీలుగా వర్క్ స్పేస్, భవిష్యత్తు అవసరాల కోసం ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు వంటివి కావాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను డిజైన్ చేస్తున్నాయి. గతంలో క్లబ్‌హౌస్‌లలో బాంక్వెట్ హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, యోగా, జిమ్, స్పా, క్రచ్ వంటి వసతులు ఉండేవి. కానీ, ఇప్పుడు వీటితో పాటు ఆఫీస్ వర్క్ స్టేషన్లు, ప్రత్యేక క్యాబిన్స్, సమావేశ గదులను ఏర్పాటు చేస్తున్నారు. ఇండోర్ గేమ్స్‌లలో కూడా షటిల్, స్క్వాష్ వంటి లగ్జరీ గేమ్స్‌కు చోటు కల్పిస్తున్నారు. బిల్టప్ ఏరియాలో 3 శాతం క్లబ్‌హౌస్ ఉండాలనే నిబంధనలను పాటిస్తూనే ఆయా అదనపు వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ► వర్క్ ఫ్రం హోమ్‌తో ఉత్పాదకత పెరగడంతో చాలా వరకు కంపెనీలు కూడా దీన్నే కొనసాగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్లో పనిని కేటాయిస్తున్నాయి. దీంతో గృహాలతో పాటు ఆఫీస్ స్పేస్‌కు కూడా డిమాండ్ తగ్గడం లేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐసోలేషన్ అనేది అనివార్యమైన పరిస్థితి. దీంతో ఒకటే ఫ్లోర్లో నాలుగైదు ఫ్లాట్లు, ఎక్కువ మంది నివాసితులు ఉండే అపార్ట్మెంట్లకు బదులుగా ప్రధాన నగరానికి దూరమైన సరే శివారు ప్రాంతాలలో విల్లాలను కోరుకునేవారి సంఖ్య పెరిగింది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో అయితే పెద్ద సైజు ఫ్లాట్లను కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. గతంలో రెండు పడక గదులలో నివసించే వాళ్లు కరోనా రెండో దశ తర్వాత మూడు పడక గదులకు మారేందుకు ఇష్టపడుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,200 చ.అ.లలోని 2 బీహెచ్‌కే నివాసితులు 1,600 నుంచి 1,800 చ.అ.లకు ఫ్లాట్లకు, 2 వేల చ.అ. నుంచి 2,200 చ.అ.లోని 3 బీహెచ్‌కే వాళ్లు 2,400 నుంచి 2,500 చ.అ. పైన అపార్ట్మెంట్లకు మారాలని కోరుకుంటున్నారు. రేటు కాస్త ఎక్కువైనా సరే పెద్ద సైజు గృహాలే కావాలంటున్నారు. లిఫ్ట్, జనరేటర్ వంటి పనిచేస్తాయో లేదో అనే అపోహ కారణంగా గతంలో హైరైజ్ అపార్ట్మెంట్లు అంటే పెద్దగా కొనుగోలుదారులు ఇష్టపడేవాళ్లు కాదు. కానీ, ఇప్పుడు హైరైజ్ భవనాలపై అవగాహన పెరిగింది. దీంతో డిమాండ్ ఏర్పడింది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో నిర్మాణ సంస్థలు కూడా వాటికి తగ్గట్టుగా నిర్మాణ డిజైన్లలో మార్పులు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో వాటికి అవసరమైన మౌలిక వసతులను గృహ, వాణిజ్య సముదాయాలలో ఏర్పాటు చేస్తున్నారు. నివాస సముదాయాల పార్కింగ్ స్పేస్‌లలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ప్రత్యేకంగా స్థలం కేటాయించి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. ► గతంలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఏటీఎంలను ఏర్పాటు చేసిన తరహాలోనే ప్రైవేట్ వెండర్లకు ఈవీ స్టేషన్ల కోసం స్థలాన్ని కేటాయిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్ట్‌లలో సెక్యూరిటీ లాబీ దగ్గరే బ్యాటరీ కార్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎవరైనా అతిథులు వస్తే అందులో ఎక్కి ప్రయాణించవచ్చు. అలాగే స్కూల్ విద్యార్థుల కోసం పికప్ డ్రాప్ కోసం వినియోగించుకోవచ్చు. -
ఇదేం పద్దతి.. జీతం పెంచకుండా ఆఫీస్‌కి రమ్మంటే ఎలా?
కోవిడ్ సంక్షోభం సమయంలో ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్న కార్పొరేట్ కంపెనీలను ఇప్పుడు మరో రకమైన చిక్కులు పలకరిస్తున్నాయి. ఉద్యోగులు కోరుతున్న సహేతుకమైన డిమాండ్లు నెరవేర్చేలేక.. ఇటు పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలు రచించలేక కార్పోరేట్ ‘హెచ్ఆర్’లు నెత్తి బొప్పి కడుతోంది. ఎడ్టెక్ యూనికార్న్ సంస్థ బైజూస్‌కి చెందిన వైట్‌హ్యాట్ జూనియర్‌కు ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు గుడ్‌బై చెబుతున్నారు. నువ్వు వద్దు.. నీ జాబు వద్దు.. నీకో దండం అంటూ ఒక్కొక్కరుగా ఆ సంస్థను వీడి వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఆ సంస్థ చేసిన తప్పేంటి అంటే వాళ్లని ఆఫీసుకు వచ్చి పని చేయండి అని అడగడం! వర్క్ ఫ్రం హోం కంప్యూటర్ కోడింగ్, మ్యాథమేటిక్స్ బోధించే ఎడ్టెక్ కంపెనీగా వైట్‌హ్యాట్ జూనియర్ ప్రారంభమైంది. కోవిడ్ సంక్షోభం మొదలైన తర్వాత ఒక్కసారిగా ఎడ్టెక్ కంపెనీలకు గిరాకీ పెరిగింది. అప్పుడే దీన్ని బైజూస్ సంస్థ 300 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. విస్తరణలో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగులను చేర్చుకుంది. వారంతా వర్క్‌ఫ్రం హోంలో పని చేస్తున్నారు. ఆఫీసులకు వచ్చేయండి వైట్‌హ్యాట్ జూనియర్ సంస్థ నుంచి మార్చి 18న ఉద్యోగులకు ఈమెయిళ్లు వెళ్లాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టినందు వల్ల నెలరోజుల్లోగా అంటే ఏప్రిల్ 18లోగా మీరంతా ఆఫీసులకు వచ్చి పని చేయాలంటూ తేల్చి చెప్పింది. ఈ సంస్థకు బెంగళూరు, గురుగ్రామ్, ముంబైలలో ఆఫీసులు ఉన్నాయి. కాబట్టి మీకు కేటాయించిన ఆఫీసులకు నెలరోజుల్లోరా రావాలంటూ ఉద్యోగులకు హుకుం జారీ చేసింది. రాజీనామాల పర్వం హెచ్ఆర్ నుంచి లెటర్ రావడం ఆలస్యం మాకు నువ్వు వద్దు. నీ ఉద్యోగం వద్దంటూ ఉద్యోగులు రాజీనామా చేయడం మొదలు పెట్టారు. తొలి గడువు ఏప్రిల్ 18 ముగిసే నాటికే ఏకంగా 800ల మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. మరో నెల గడిస్తే ఈ సంఖ్య రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది. ఉద్యోగులు చెబుతున్న కారణాలు - మాకంటూ కొన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. తల్లిదండ్రులను చూసుకోవాలి, పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి. ఉన్నపళంగా నెల రోజులు టైం ఇచ్చి సొంతూళ్లను వదిలి రావాలని చెప్పడం సరికాదు. అలా చేయలేం కాబట్టే రిజైన్ చేస్తున్నాను - ఇంటర్వ్యూ చేసినప్పుడు రెండేళ్ల పాటు వర్క్ ఫ్రం హోం ఉంటుందని చెప్పారు. దానికి తగ్గట్టుగానే మా జీతభత్యాలు ఫైనల్ అయ్యాయి. ఇప్పుడు రెండేళ్లు పూర్తి కాకుండానే లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉండే బెంగళూరు, గురుగ్రామ్ లాంటి నగరాలకు రమ్మంటే ఎలా ? మా జీతాలు అక్కడి ఖర్చులకు సరిపోవు అందుకే వైట్‌హ్యాట్ జూనియర్‌కి గుడ్‌బై చెబుతున్నాం - మరికొందరు నష్టాల్లో ఉన్న వైట్హ్యట్ కంపెనీ.. వాటిని తగ్గించుకునేందుకు తెలివిగా వేసిన ఎత్తుగడనే వర్క్ ఫ్రం హోంకి మంగళం పాడటం అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపళంగా ఉద్యోగులను రమ్మని చెప్పడం ద్వారా.. ఉద్యోగులు వాళ్లంత వాళ్లే బయటకు వెళ్లి పోయేలా ప్లాన్ చేశారని అంటున్నారు. మినహాయింపు ఉంది ఉద్యోగుల రాజీనామా పర్వంపై వైట్‌హ్యాట్ జూనియర్ సిబ్బంది స్పందిస్తూ.. మా ఆదేశాలను అనుసరించి చాలా మంది బెంగళూరు, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో రిపోర్టు చేశారు. మెడికల్, ఇతర అవసరాలు ఉన్నాయన్న ఉద్యోగుల విషయంలో.. పరిశీలించి పలువురికి మినహాయింపులు కూడా ఇచ్చామని తెలిపారు. చదవండి: అప్పడు వర్క్ ఫ్రం హోం అడిగితే.. దారుణంగా... -
ఉద్యోగుల కోసం క్యాబిన్లు, ఇకపై ట్రైన్లలో ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు
ప్రపంచ దేశాల్లో టెక్నాలజీతో పాటు అన్నీ రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంధన వాహనల నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి హైబ్రిడ్ వర్క్ కల్చర్ మారుతుంది. తాజాగా జపాన్ దేశం మరో అడుగు ముందుకు వేసింది. ఉద్యోగులు ఆఫీస్ వర్క్ చేసేందుకు వీలుగా ఈస్ట్ జపాన్ రైల్వే సంస్థతో కలిసి 'ఆఫీస్ కార్స్'ను లాంఛ్ చేసింది. ఇప్పుడు ఈ బుల్లెట్ రైళ్లు కార్పొరేట్ ఆఫీసుల్ని తలపిస్తున్నాయి. ట్రైన్లలో ఆఫీస్ క్యాబిన్లు జపాన్ ప్రభుత్వం షింకన్సెన్ బుల్లెట్ ట్రైన్ మార్గంలో ఈ ఆఫీస్ కార్లును ప్రారంభించింది. దేశ రాజధాని టోక్యోతో పాటు దేశంలోని నార్తన్, సెంట్రల్ భాగాలను కలుపుతూ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫీస్ కార్స్లో అదనపు ఛార్జీలు లేకుండా ఉద్యోగులు ఆఫీస్ పనులు చేసుకోవచ్చు. ఇందుకోసం ట్రైన్లో ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం క్యాబిన్లను ఏర్పాటు చేసింది. ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఆఫీస్‌లో జరిగే వర్చువల్ మీటింగ్స్ సైతం పాల్గొనేలా సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చినట్లు జపాన్ మీడియా 'జిన్హువా' తన కథనంలో పేర్కొంది. ఉద్యోగుల కోసం స్మార్ట్ గ్లాసెస్ ఈ ఆఫీస్ కార్స్లో ఉద్యోగులు తమ ల్యాప్‌టాప్ స్క్రీన్లను దగ్గరగా మరింత ఆసక్తికరంగా చూసేందుకు స్మార్ట్ గ్లాసెస్‌ను వినియోగించుకోవచ్చు. 'తోహోకు' బుల్లెట్ ట్రైన్ మార్గంలో బుల్లెట్ రైళ్లలో సీట్ల చుట్టూ చిన్న డివైడర్లను ఉద్యోగులు ఉచితంగా ఉపయోగించవచ్చు. అయితే జపాన్ తెచ్చిన ఈ ఆఫీస్ కల్చర్‌ను వినియోగించుకునేందుకు ఉద్యోగుల తాకిడి ఎక్కువైంది. వారిని కట్టడి చేసేందుకు వీకెండ్స్ తో పాటు కొన్ని గవర్నమెంట్ హాలిడేస్‌లో వర్క్‌స్పేస్ సేవల్ని నిలిపివేస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా తగ్గిన వ్యాపార ప్రకటనల డిమాండ్‌ను పెంచేందుకు ఈ ఆన్లైన్ వర్క్ కల్చర్ తోడ్పడుతుందని ఈస్ట్ జపాన్ రైల్వే భావిస్తున్నాయి. కాగా ,సెంట్రల్ జపాన్ రైల్వే , వెస్ట్ జపాన్ రైల్వే సైతం అక్టోబర్ నుండి ప్రధాన నగరాల గుండా నడిచే రైళ్లలో ఆన్‌బోర్డ్ వర్క్‌స్పేస్‌లను ప్రవేశపెట్టేందుకు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. -
వారంలో మూడు రోజులు పనిచేస్తే చాలు..! తెరపైకి మరో కొత్త పాలసీ
3-Day Work Week: కరోనా రాకతో అన్ని కంపెనీలు వర్క్ ఫ్రంహోంకే జై కొట్టాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కాస్త తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. దీంతో పలు కంపెనీలు వర్క్‌ఫ్రం హోంకు ఎండ్‌కార్డు పెడుతూ ఉద్యోగులను ఆఫీసులకు పిలుస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు నెలలో కొన్ని రోజులు ఆఫీసులకు వస్తే సరిపోతుందంటూ పిలుపునిస్తున్నాయి. వర్క్‌ఫ్రంహోంకు క్లారిటీ రాకముందే ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ టీఏసీ సెక్యూరిటీస్ సరికొత్త వర్కింగ్ కాన్సెప్ట్‌ను ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. వారానికి నాలుగు రోజులు పనిచేస్తే సరిపోతుందంటూ టీఏసీ సెక్యూరిటీస్ సంస్థ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: అగ్రరాజ్యాలకు పోటీగా నిలుస్తోన్న భారత్...! మూడు రోజులు వస్తే చాలు..! తాజాగా బెంగుళూరుకు చెందిన ఫిన్‌టెక్ సంస్థ స్లైస్ మరో అడుగు ముందుకేసి కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ ఉద్యోగులు వారంలో మూడు రోజులు పనిచేస్తే సరిపోతుందని స్లైస్ వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ వ్యవస్ధాపకుడు రాజన్ బజాజ్ మాట్లాడుతూ...‘దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది వర్క్’ భవిష్యత్తులో ఇలాంటి వర్కింగ్ పాలసీలకే పలు కంపెనీలు మొగ్గుచూపుతాయన్నారు. ఈ సరికొత్త విధానంతో ఉద్యోగులను కేవలం జాబ్‌కే కట్టిపాడేయకుండా వారికి మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి దోహదం చేస్తోందని అభిప్రాయపడ్డారు. స్లైస్‌లో సుమారు 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కొత్త పాలసీతో రాబోయే మూడేళ్లలో కొత్తగా వెయ్యి మందిని రిక్రూట్ చేసుకోవాలని స్లైన్ భావిస్తోంది. భారీ పెట్టుబడులు..భారీ ఒత్తిడి..! గ్లోబల్ ఇన్వెస్టర్లు భారత టెక్ స్టార్టప్‌లపై బిలియన్ డాలర్లను కుమ్మరిస్తున్నాయి. దీంతో పలు స్టార్టప్‌ల్లో వేగవంతంగా పనిచేసేందుకు స్టార్టప్ యాజమానులు ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నుట్లు తెలుస్తోంది. దీంతో ఆఫీసులో ఉద్యోగుల పనితీరు,మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం తదితర అంశాల భారీ ప్రభావం పడుతుంది. ఆఫీస్ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందులో చాలా మంది ఆఫీసు జీవితంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఉద్యోగులు ఫెయిల్ అవుతున్నారు. చదవండి: ఆ వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..! -
వర్క్‌ఫ్రమ్ హోం లేదా ఆఫీస్.. ఇక మీ ఇష్టం!
కరోనా వల్ల మొదలైన వర్క్‌ఫ్రమ్ కల్చర్‌కు ఎండ్‌కార్డ్ వేసేందుకు మెజార్టీ కంపెనీలు పావులు కదుపుతున్నాయి. 2022 జనవరి వరకు వర్క్‌ఫ్రమ్ ఆఫీస్ నిర్ణయాన్ని వాయిదా వేసినప్పటికీ.. ఆలోపే ఆఫీసులను తెరిచేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాయి. బలవంతంగా అయినా సరే ఎంప్లాయిస్ను రప్పించేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తుండగా, మరికొన్ని కంపెనీలు మాత్రం రోస్టర్ విధానాన్ని పాటించాలని నిర్ణయించాయి. ఈ తరుణంలో కొన్ని స్వదేశీ కంపెనీలు ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించాయి. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యం నడుమే కంపెనీలు తెరిచేందుకు కంపెనీలు సిద్ధపడ్డాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులు ఆఫీసులకు రావాలా? లేదంటే వర్క్ఫ్రమ్లో కొనసాగాలా? అనే ఛాయిస్‌ను ఉద్యోగులకే వదిలేస్తున్నాయి. నెస్లే, కోకా-కోలా, గోద్రేజ్ కన్జూమర్, డాబర్, ఆమ్వే, టాటా కన్జూమర్.. మరికొన్ని కంపెనీలు ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల్లో మూడు వంతుల ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది. అయినా కూడా ఎంప్లాయిస్‌కే ‘వర్క్‌ఫ్రమ్’ ఆఫ్షన్‌ను వదిలేయడం. వర్క్ వాట్ వర్క్స్ పాలసీ కరోనా వల్ల కమర్షియల్‌గా జరిగిన నష్టానికి పూడ్చడం కోసం, అదనపు ఆదాయం కోసం ప్రభుత్వాలు.. ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో కనీసం యాభై శాతం ఉద్యోగులతోనైనా ఆఫీసులను నడిపించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఆఫీసుల్లో రిపోర్టింగ్ చేయడం(ఆఫీసులకు రావాల్సిన అవసరంలేదని) తప్పనిసరేం కాదని ఉద్యోగులకు చెప్పేశాయి. ఈ క్రమంలోనే ‘వర్క్ వాట్ వర్క్స్’ పాలసీని అమలు చేయబోతున్నాయి. అంటే.. ఉద్యోగులకు ఎలా వీలుంటే అలా పని చేయాలని సూచిస్తున్నాయి. అయితే ‘ఎమర్జెన్సీ, తప్పనిసరి విభాగాల’ ఉద్యోగులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆఫీసులకు రావాల్సిందేనని స్పష్టం చేశాయి. కారణాలివే.. వర్క్‌ఫ్రమ్ హోం ఎత్తేయడానికి ఈ కంపెనీలు తటపటాయించడానికి ప్రధాన కారణం.. మూడో వేవ్ హెచ్చరికలు, పైగా పండుగ సీజన్లు ముందు ఉండడం. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రిస్క్ తీసుకోదల్చుకోవట్లేదని ఈ స్వదేశీ కంపెనీలు చెప్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం ఒక డోసు తీసుకుని ఉన్నారని, సగం శాతం ఉద్యోగులు రెండు డోసులు పూర్తి చేసుకున్నారని జీఈ ఇండియా టెక్నాలజీ సెంటర్ సర్వే చెబుతోంది. అయినప్పటికీ ఆఫీసులకు రావాలా? వద్దా? అనే ఆప్షన్‌ను ఉద్యోగులకే ఇచ్చేస్తున్నాయి ఈ స్వదేశీ కంపెనీలు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్.. అయినా స్మోక్ చేయకూడదు! ఆఫీసులు 24 గంటలు తెరిచే ఉంటాయని, రావడం రాకపోవడం ఉద్యోగుల ఇష్టమని తేల్చేశాయి. ఈ నిర్ణయంపై ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ముందు ముందు పరిస్థితి ఏంటన్నది తర్వాతి పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని చెప్తున్నారు నెస్లే చైర్మన్ సురేష్ నారాయణన్. ఇక టాటా స్టీల్, జీఈ ఇండియా, పెప్సికో కంపెనీలు చాలామంది ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోంలోనే కొనసాగుతున్నారు. మారూతీ సుజుకీ, మెర్కెడెస్ బెంజ్ ఇండియా, ఐటీసీ లాంటి కంపెనీలు మాత్రం రోస్టర్ సిస్టమ్‌ను ఫాలో అవుతున్నాయి. టెక్ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్లతో పాటు టీసీఎస్, విప్రో లాంటి స్వదేశీ ఎమ్ఎన్సీలు జనవరి నుంచి ఆఫీసులను పూర్తిస్థాయిలో తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. చదవండి: వారానికి నాలుగు రోజులే ఆఫీస్!! -
వారానికి నాలుగు రోజులే ఆఫీస్.. తెరపైకి కొత్త పాలసీ
4 - Day Work Week : ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్టు దిగిందా, లేదా... సూపర్‌హిట్ మూవీ పోకిరిలో పాపులర్ డైలాగ్. ఈ సినిమాతో సంబంధం లేకపోయినా ఉద్యోగుల్లో ఇలాంటి స్ఫూర్తినే నింపుతోంది ఓ ఇండియన్ కంపెనీ. ఎంత సేపు పని చేశామన్నది కాదు క్వాలిటీ వర్క్ ఉందా లేదా అంటోంది. అందులో భాగంగానే ఇండియాలో ఇంత వరకు లేని వర్క్ కల్చర్‌ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలా లేక వర్క్‌ఫ్రం హోం కంటిన్యూ చేయాలా అనే విషయంపై అనేక కంపెనీలు కిందా మీద పడుతున్నాయి. వర్క్‌ఫ్రం హోంపై ఓ క్లారిటీ ఇంకా రాకముందే తాజాగా వారానికి నాలుగు పని దినాల కాన్సెప్ట్‌ని టీఏసీ సెక్యూరిటీస్ సంస్థ తెర మీదకు తెచ్చింది. ఉద్యోగులు ఏమన్నారంటే ఆఫీసులో పనితీరు, ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం తదితర అంశాలపై ఇటీవల టీఏసీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. అందులో చాలా మంది ఆఫీసు జీవితంలో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎప్పుడూ ఆఫీసులో గంటల తరబడి పనిలో ఉంటే పనిలో ఉత్సాహం, ఉత్తేజం లోపిస్తున్నాయని వెల్లడించారు. కుటుంబ, వ్యక్తిగత పనులు చక్కబెట్టుకునేందుకు వీకెండ్స్ సరిపోతున్నాయంటూ చెప్పారు. లాంగ్ వీకెండ్ ఉద్యోగుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా టీఏసీ యాజమాన్యం కొత్త ప్రతిపాదన ఉద్యోగుల ముందుకు తెచ్చింది. వారానికి ఐదు లేదా ఆరు రోజుల పని, రోజుకు ఎనిమిది గంటలు వంటి విధానాలు పక్కన పెట్టాలని నిర్ణయించింది. వారానికి నాలుగు పని దినాలు, లాంగ్ వీకెండ్ ఉండేలా కొత్త టైం టేబుల్ సిద్ధం చేసింది. వర్క్ లోడ్‌ను బట్టి పని దినాల్లో లాంగ్ అవర్స్ పని చేయాల్సి ఉంటుందని ఉద్యోగుల ముందు ప్రతిపాదనలు ఉంచింది. ఉద్యోగుల్లో 80 శాతం మంది వీటికి ఓకే చెప్పారు. దీంతో అర్జంటుగా వారానికి నాలుగు రోజులే పని అనే కాన్సెప్టు అమలుకు శ్రీకారం చుట్టింది. టార్గెట్ రీచ్ అయితే చాలు వ్యక్తిగత జీవితం ఆనందంగా ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే ఉద్యోగుల నుంచి ఎక్కువ అవుట్ పుట్ వస్తుంది. అందుకే వారు లాంగ్ వీకెండ్, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. అందుకే ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఫలితాలు సానుకూలంగానే వస్తాయని ఆశిస్తున్నట్టు టీఏసీ ఫౌండర్ త్రిష్నీత్ తెలిపారు. ఉద్యోగులు ఎన్ని రోజులు ఎన్ని గంటలు పని చేశారన్నది మాకు ముఖ్యం కాదు. మేం పెట్టుకున్న గడువులోగా పని జరిగిందా లేదా అన్నదే మాకు ప్రధానం అని ఆయన అన్నారు. ఉద్యోగుల్లో ఆనందం టీఏసీ సీఈవో త్రిష్నిత్ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో ఆసక్తి నెలకొంది. ఈ కొత్త ప్రయోగం తీరు తెన్నులు పరిశీలిస్తున్నాయి. మరోవైపు టీఏసీ ఉద్యోగులు ‘కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు... ఆనందంగా గడపడానికి కావాలొక దీవి’ అన్నట్టుగా జోష్‌లో ఉన్నారు. టీఏసీ మొదలు పెట్టింది స్టార్టప్‌గా మొదలై రాబోయే మూడేళ్లలో వన్ బిలియన్ డాలర్ కంపెనీగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేస్తోన్న టీఏసీ సెక్యూరిటీ సొల్యూషన్ సంస్థ 4 డే వర్క్ వీక్ కాన్సెప్టుని తెర మీదకి తెచ్చింది. 2013లో ఈ సంస్థని త్రిష్నీత్‌కి అరోరా స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 5 మిలియన్ డాలర్లు ఉండగా 2025 కల్లా వన్ బిలియన్ డాలర్లు సంస్థగా ఎదుగుతామంటూ ఇటీవల అరోరా ప్రకటించారు. వీడు సామాన్యుడు కాదు టీఏసీ సెక్యూరిటీస్ సీఈవో త్రిష్నీత్‌కి వినూత్నంగా ఆలోచిస్తాడనే పేరు బిజినెస్ సర్కిల్లో ఉంది. స్కూల్ఏజ్లో బ్యాక్ బెంచర్‌గా ఉంటూ మిడిల్ డ్రాప్ అయ్యాడు. ఫ్యామిలీలో ఎవరికి కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే కేవలం 19 ఏళ్ల వయస్సులో టీఏసీ సెక్యూరిటీస్ సంస్థను 2013లో స్థాపించాడు. ఎంట్రప్యూనర్‌గా ఉంటూనే హ్యకింగ్‌పై పలు పుస్తకాలు కూడా రాశాడు. సైబర్ సెక్కూరిటీకి సంబంధించి గుజరాత్, పంజాబ్ పోలీసు శాఖలతో కలిసి త్రిష్నీత్ పని చేస్తున్నాడు. టీఏసీ క్లయింట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఉంది.2018లో ప్రఖ్యాత ఫోర్బ్ప్ ప్రచురించిన అండర్ 30 ఏషియా లిస్టులో త్రిష్నీత్‌కి చోటు దక్కింది. చదవండి : వర్క్‌ఫ్రమ్ హోమ్: కంపెనీల కొత్త వ్యూహం -
అసలు మేం చెప్పొచ్చేదేమిటంటే..
వర్క్ ఫ్రం హోం.. దీని గురించి కంపెనీలు ఏమనుకుంటున్నాయి? ఎప్పటివరకూ దీన్ని పొడిగించాయి? ఇవన్నీ పక్కనపెట్టేయండి.. అసలు వర్క్ ఫ్రం హోం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏమనుకుంటున్నారు? దీనిపై తాజాగా ఓ సర్వే నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అత్యధికులు 39 ఏళ్ల వయసు లోపు వారే. పదండి ఈ సర్వేపై ఓ లుక్కేద్దాం.. -
తూకం తప్పుతోంది
‘‘నాన్నా...’’ రాత్రి పొద్దుపోయాక వచ్చిన ప్రసాద్‌ను ఆప్యాయంగా పలకరించింది పదేళ్ళ చిన్నారి రమ్య. ప్రసాద్ ముఖంలో జీవం లేని చిరునవ్వు! ఓపిక లేకనో ఏమో, కూతుర్ని దగ్గరకు తీసుకోను కూడా లేదు. బూట్లు, సాక్సులు విప్పేసి, అలసటగా హాలులో నుంచి తన పర్సనల్ బెడ్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. రమ్య ముఖం చిన్నబోయింది. ఆ మనసులో తెలియని బెంగ. రోజూ పొద్దున్న 6.30 కల్లా తాను స్కూలుకు వెళ్ళేటప్పుడు నిద్ర లేవని నాన్న... ఇంట్లో అమ్మ, తను నిద్రపోయాక, రాత్రి పొద్దుపోయి ఆఫీసు నుంచి వచ్చే నాన్న... ఎప్పుడూ ఆఫీసు పనిలో మునిగి తేలుతూ, ఇంటి ధ్యాస పట్టని నాన్న... అప్పటికి అయిదారురోజులుగా నాన్నను చూడలేదనే బెంగ. ఆ రోజు ఎలాగైనా చూడాలనే... అమ్మ వద్దన్నా అంతసేపు మెలకువగా ఉంది. కానీ... నాన్న... ఇలా.... బెంగుళూరులో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న ప్రసాద్‌కు కూతురంటే ప్రేమే! కానీ, రోజూ ఏదో ఒక ఆఫీసు పని. ఉన్న ఓపికంతా ఆఫీసులోనే హరీ. ఇంటికొచ్చినా, ఏవో ఆఫీసు ఫోన్లు... మొబైల్, మెసేజ్‌లు... మెయిల్స్... ఇంటికీ, ఆఫీసు పనికీ మధ్య ప్రసాద్ సమతూకం పాటించలేకపోతున్నాడు. ఈ రకమైన ప్రవర్తన ప్రసాద్ కుటుంబ సభ్యులకే కాదు... చివరకు ప్రసాద్‌కే తన మీద తనకు చీకాకు అనిపిస్తోంది. ఇండియాలో పెరుగుతున్న సమస్య! ఒక్క ప్రసాదే కాదు... ఇవాళ చాలామంది ఎదుర్కొంటున్న సమస్య – ఇంటి పని, ఆఫీసు పని మధ్య బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం! ప్రపంచం మొత్తం మీద చూస్తే, భారతదేశంలోనే వారంలో ఎక్కువ రోజులు ఉద్యోగులు పని చేస్తారు. ఇక సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ పెరిగిపోవడంతో, ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు... ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా... ఆఫీసుకూ, ఆఫీసు పనికీ అందుబాటులో ఉన్నట్లే. అలా ఆఫీసు పనికీ, తీరిక వేళలకూ మధ్య గీత క్రమంగా చెరిగిపోతోంది. గడచిన అయిదారేళ్ళుగా ఇలా ఆఫీసు పనితో తల మునకలై, ఇంటిని అశ్రద్ధ చేస్తున్నవారి సంఖ్య మన దేశంలో గణనీయంగా పెరుగుతున్నట్లు ప్రసిద్ధ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ (ఇ.వై) సంస్థ వారి సర్వేలో తేలింది. ‘వర్క్ – లైఫ్ బ్యాలెన్స్’ గురించి భారతదేశంతో సహా ఎనిమిది దేశాల్లో ఆ సంస్థ గత ఏడాది సర్వే చేసింది. ఒకపక్క ఆఫీసు పనినీ, ఇటు కుటుంబ, వ్యక్తిగత బాధ్యతలనూ – రెండిటినీ సమతూకం చేసుకుంటూ ముందుకు సాగడం చాలా కష్టంగా మారినట్లు 30 శాతం భారతీయులు చెప్పారు. సెలవులున్నాయ్! వాడుకొనే తీరిక లేదు!! ఇటీవలి కాలంలో ‘మీ పని టైమింగ్స్ ఏమిటి?’ అని ఎవరినైనా అడిగి చూడండి. ఒక నవ్వు నవ్వేసి, ‘ఆల్వేస్ ఆన్ డ్యూటీ’ అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో జరిపిన సర్వేలో తేలింది ఏమిటంటే... ఉద్యోగుల్లో సగటున సుమారు 10 శాతం మంది సెలవుల్లో కూడా రోజూ ‘ఒకటికి పది సార్లు’ ఇ–మెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటారట! ఆ మేరకు అందరూ పని ఒత్తిడిని అనుభవిస్తున్నారన్న మాట! అధికారికంగా మంజూరైన సెలవులు వాడుకోవడం కూడా చాలా దేశాల్లో తక్కువే. ఆస్ట్రియా, బ్రెజిల్, ఫిన్లాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఇచ్చిన సెలవులన్నీ వాడేసుకుంటున్నారు కానీ, మన దేశంలో మాత్రం సగటున 21 రోజుల సెలవులిస్తే, 15 రోజులే వాడుకోగలుగుతున్నారు. జపాన్‌లో అయితే, సగటున 20 రోజుల సెలవులిస్తే, 10 రోజులే వాడుకుంటున్నారు. ప్రపంచస్థాయిలో పూర్ ర్యాంక్ భారతదేశంలో దుకాణాల్లో పని చేసేవారి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉన్నట్లు తేలింది. వ్యక్తిగత జీవితాన్ని తాకట్టుపెట్టి మరీ ఆఫీసుల్లో అధిక గంటలు పనిచేసే దుఃస్థితి. ఆమ్స్టర్డామ్కు చెందిన ఒక కన్సల్టెన్సీ సంస్థ ప్రపంచంలోని 100 ప్రధాన నగరాల్లో ఇటీవల ఒక సర్వే జరిపింది. అప్పుడు మనదేశంలోని 5 ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబయ్, ఢిల్లీలు వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌లో అతి తక్కువ ర్యాంకుల్లో ఉన్నట్లు తేలింది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతాల ర్యాంకులు 70లలో ఉంటే, ముంబయ్ 86వ ర్యాంకులో, ఢిల్లీ 87వ ర్యాంకులో నిలిచాయి. వర్క్ – లైఫ్ బ్యాలెన్స్‌ను లెక్క కట్టడం కోసం ఆ సంస్థ ప్రతి నగరంలో సగటు వార్షిక పని గంటల లెక్క తీసింది. దాన్ని బట్టి ఈ అంశంలో అగ్రశ్రేణి మూడు నగరాల్లో ఒకటిగా నిలిచిన హ్యామ్‌బర్గ్‌లో సగటున ఏటా 1,473 గంటలే పనిచేస్తారు. కానీ, భారతీయులు సగటున ఏటా 2,195 గంటలు పనిచేస్తున్నారు. ఆడాళ్ళూ... మీకు జోహార్లు! మన దేశంలో ఉద్యోగినులు అటు గృహిణిగా తమ బాధ్యతలు తగ్గకుండానే, ఇటు ఆఫీసు పనిలో ఎక్కువ గంటలు వెచ్చిస్తూ, విపరీతమైన ఒత్తిడికి లోనవ్వాల్సి వస్తోంది. అలా వర్క్ – లైఫ్ బ్యాలెన్స్ తప్పుతోంది. చెన్నై శివార్లలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అపర్ణ సమస్యా ఇలాంటిదే. ఒకపక్క ఏడేళ్ళ బాబు ఆలనాపాలన, మరోపక్క ఉద్యోగం. ఇంటి సంగతి పట్టకుండా ప్రైవేట్ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి సతమతమయ్యే భర్త. బాబు పుట్టాక కొద్దిరోజులు విజయవాడలోని పుట్టింటి నుంచి అమ్మానాన్న వచ్చి, ఆమెకు కొంత సాయపడ్డారు. ఆ తరువాత వాళ్ళు తప్పనిసరై విజయవాడకు వెళ్ళిపోవాల్సి రావడంతో, అపర్ణ ఇప్పుడు బాబు సంరక్షణ కోసం ఇంట్లోనే ఉండే ఆయాను పెట్టుకోవాల్సి వచ్చింది. దానికి తోడు కంపెనీకి బిజినెస్ క్లయింట్స్ ఉన్న అమెరికా లాంటి ఇతర టైమ్ జోన్లతో సమన్వయం చేసుకుంటూ, పని చేయాల్సి రావడంతో జీవితం నరకంగా మారుతోంది. ఆఫీసు పని – ఇంటి బాధ్యతల మధ్య నలిగిపోతున్న ఉద్యోగుల ఒత్తిడిని క్రమంగా సంస్థలు కూడా అర్థం చేసుకుంటున్నాయి. హిందుస్తాన్ లీవర్, ఇన్ఫోసిస్, జి.ఇ. లాంటి వివిధ రంగాల్లోని ప్రముఖ సంస్థలు పని గంటల విషయంలో వెసులుబాటు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇంటి నుంచే ఆఫీసు పని చేసే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ లాంటి అవకాశాలిస్తున్నాయి. ఆఫీసు దగ్గర చైల్డ్ కేర్ లాంటి వసతులు కల్పిస్తున్నాయి. అలాగే, బిడ్డ పుట్టినప్పుడు మగవాళ్ళకు ఇచ్చే ‘పెటర్నిటీ లీవ్’, ఆడవారికి ఇచ్చే ‘మెటర్నిటీ లీవ్’లను కూడా మునుపటి కన్నా పెంచాయి. అంతా మన చేతుల్లోనే! నిజానికి పని ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉన్నా... దాన్నీ, కుటుంబ బాధ్యతల్నీ బ్యాలెన్స్ చేసుకోవడం మన చేతుల్లోనే చాలా భాగం ఉందని నిపుణుల మాట. పెరిగిపోయిన సాంకేతిక, సమాచార సాధనాలు కూడా తెలియని ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇవాళ స్మార్ట్ఫోనే మాట్లాడడానికీ, మెయిల్స్‌కూ, వాట్సప్కూ – అన్నిటికీ మార్గం కావడంతో మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు అధ్యయనవేత్తలు తేల్చారు. మొబైల్ ఫోన్లను అతిగా వాడితే తెలియకుండానే డిప్రెషన్లోకి జారిపోతామని అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ వారు జరిపిన పరిశోధనలో తేలింది. కాబట్టి, రోజూ కనీసం గంట సేపైనా ఫోన్ స్విచ్చాఫ్ చేస్తే మంచిది. అలాగే, మనకు ఇష్టమైన వ్యాపకం ఏదైనా పెట్టుకొని, పని దినాల్లోనే వారంలో ఏదో ఒక రోజున దానికి కాస్తంత టైమ్ కేటాయించాలి. ఇక, మనదేశంలో వర్కింగ్ జనాభాలో దాదాపు 26 శాతం మంది ప్రతి రోజూ గంటన్నర పైగా టైమ్ ఉద్యోగాలకు ప్రయాణం చేయడంలోనే గడిపేస్తున్నారని ఒక లెక్క. కాబట్టి, ఆఫీసుకు కాస్తంత దగ్గరగా ఇల్లు అద్దెకు తీసుకొని ఉండడం మంచిదని నిపుణుల సలహా. ఆఫీసుకు వెళ్ళి, వచ్చే ప్రయాణసమయాన్ని తగ్గించుకోగలిగితే, ఆ మిగిలిన టైమ్‌ని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవచ్చు. మీతో మీరు గడపడానికీ, మీ కుటుంబంతో గడపడానికీ వీలుంటుంది. అలా మానసికంగా ఉల్లాసంగా ఉంటేనే... ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా మన చుట్టూ వాతావరణం బాగుంటుంది. సామర్థ్యం పెరుగుతుంది. వ్యక్తిగత బాధ్యతలైనా, ఆఫీసు బాధ్యతలైనా సంతృప్తిగా చేయగలుగుతాం. సో... లెటజ్ ట్రై టు బి మోర్ బ్యాలెన్స్›్డ! అద్భుతమైన అరగంట టెక్నిక్ ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా సామర్థ్యం పెరగాలంటే, దానికి నిపుణులు ఒక టెక్నిక్ చెప్పారు. ప్రతి పనికీ అరగంటేసి వంతున టైమ్ కేటాయించాలి. ఏ పని మీద అయినా 25 నిమిషాల చొప్పున ఏకాగ్రతతో దృష్టి పెడితే, ఎఫెక్టివ్‌గా ఉంటుందని నిపుణుల మాట. 25 నిమిషాలు కాగానే, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. దీని వల్ల పనిచేస్తూనే, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకొని, పుంజుకున్నట్లు అవుతుంది. ఆ తరువాత చేసే అరగంట పనికి కొత్త శక్తి వస్తుంది. అయితే, మధ్యలో విరామం అయిదు నిమిషాలు మించి, పక్కవాళ్ళతో పూర్తిగా ముచ్చట్లలో పడిపోతే లాభం లేదు. టైమ్ మేనేజ్మెంట్లో ‘పొమొడోరో టెక్నిక్’గా పేర్కొనే ఈ అరగంటేసి పనుల టెక్నిక్ చాలా ఎఫెక్టివ్ అని ప్రపంచంలో చాలామంది అంగీకరించారు. దీని వల్ల పనీ అవుతుంది. పని కాలేదనే ఒత్తిడీ తగ్గుతుంది. ఇంటి పనికీ, ఆఫీసు పనికీ మధ్య బ్యాలెన్స్ కుదురుతుంది. ఇక... వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్కే! వర్క్ – లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి – ట్రాఫిక్. ఈ మాట సశాస్త్రీయంగా నిపుణులు తేల్చిన సంగతి. మన దేశంలోని నగరాలు ఇప్పటికే జనంతో కిక్కిరిసి ఉన్నాయి. వచ్చే 2050 నాటి కల్లా ఈ నగర జనాభా మరో 30 కోట్లు పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. మన సిటీల్లో ఇప్పటికే రవాణా సౌకర్యాలు అంతంత మాత్రం. ఇంకా జనాభా పెరిగితే ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు! ఉదాహరణకు, ముంబయ్ పరిసరాల్లో ఇప్పటికే చాలామంది ఉద్యోగులు ఆఫీసుకు వెళ్ళి రావడానికే రోజూ ఎనిమిదేసి గంటలు పడుతోంది. ఇక, ‘భారతదేశపు సిలికాన్ వ్యాలీ’గా పేరున్న బెంగళూరులో ట్రాఫిక్ ఇప్పటికే ఎంత దారుణంగా ఉందంటే, ఉద్యోగుల జీవితంలో ప్రతి రోజూ సగటున రెండేసి గంటలు ట్రాఫిక్‌లో ప్రయాణానికే సరిపోతోంది. అంటే, ప్రతి ఉద్యోగీ ఏటా 470 గంటలు ఈ రద్దీ ప్రయాణాల్లోనే గడిపేస్తున్నారన్నమాట! ఇప్పుడిక ‘వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్’ అనే ఆప్షన్ వస్తుందని ఆ మధ్య ఒక జోక్ ప్రచారంలోకి వచ్చింది. ఆ మాటకొస్తే, ట్రాఫిక్‌లో ఇరుక్కున సాఫ్ట్వేర్ ఇంజనీర్లు క్యాబ్‌లో కూర్చొనే ల్యాప్‌టాప్ మీద పనిచేస్తున్న సంఘటనలు ఇప్పటికే చూస్తున్నాం కదా! ట్రాఫిక్‌తో ఆఫీసు పని మొదలవడమే ఆలస్యమవుతుంటే, సాయంకాలం సుదీర్ఘంగా సాగే మీటింగ్‌లతో పని ఆలస్యం కావడం, ఇంటికి ఆలస్యంగా చేరడం షరా మామూలే! ఇలా చేస్తే... అంతా బ్యాలెన్స్! వర్క్ – లైఫ్ బ్యాలెన్స్ కుదరాలంటే... కొన్ని మార్గాలు ఇవీ... ⇔ఇష్టమైన వ్యాపకం ఏదైనా పెట్టుకొని, దానికి కాస్తంత టైమ్ కేటాయిస్తే, మానసికంగా ఉత్సాహం వస్తుంది. అది ఇల్లు, ఆఫీసు మధ్య సమతూకానికి సాయపడుతుంది ⇔ ఉద్యోగంలో పై స్థాయికి వెళుతున్న కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి, కష్టపడి పనిచేయడంతో పాటు, సులువుగా, చులాగ్గా ఎలా పనిచేయాలన్నది నేర్చుకోవడం చాలా ముఖ్యం ⇔ ప్రతి రోజూ ఉదయం లేవగానే ఆ రోజు ఆఫీసులో, ఇంట్లో చేయాల్సిన పనులేమిటో జాబితా రాసుకోండి. వాటిలో ఏది యమ అర్జెంట్, ఏది అర్జెంట్, ఏది ముఖ్యమైనది, ఏది తాపీగా చేయవచ్చో చూసుకొని, ప్రాధాన్యాల ప్రకారం పని చేయండి. ఈ పద్ధతిని అనుసరిస్తే, ముఖ్యమైన పనులేవీ ఆగవు. అవి ఇంకా కాలేదే అన్న మానసిక ఒత్తిడి ఉండదు ⇔ వారానికి కనీసం రెండు సార్లయినా ఆఫీసుకు డ్యూటీ కన్నా ఒక అరగంట ముందే వెళ్ళండి. ప్రశాంతంగా ఆలోచించి, ఆనాటి రెగ్యులర్ వర్క్ మొదలవడాని కన్నా ముందే కీలకమైన ఇ–మెయిల్స్ వగైరా చూసి, సమాధానాలివ్వండి ⇔ ఆఫీసులో పని చేసే టైమ్‌లో దాని మీదే ఏకాగ్ర దృష్టి పెట్టండి. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్‌లు తీసుకుంటూ, ఆఫీసు టైమ్‌లోనే పని మొత్తం పూర్తయ్యేలా చూసుకోవాలి. మధ్యలో ముచ్చట్లు పెట్టుకొని, డ్యూటీ టైమ్ అయిపోయాక పనిచేయడం, ఎక్కువ సేపు పనిచేస్తున్నామని ఆ తర్వాత వాపోవడం లాంటివి శుద్ధ వేస్ట్ ⇔ సెలవు రోజుల్లో ఆఫీసు మెయిల్స్, స్మార్ట్ఫోన్లలో ఛాటింగ్లకు దూరంగా ఉండాలి. దానివల్ల ఇంట్లో వాళ్ళతో క్వాలిటీ టైమ్ గడపగలుగుతాం. ఒళ్ళు బాగుంటే... ఇల్లు బాగుంటుంది! ⇔ శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే, ఇంట్లోనూ, ఆఫీసులోనూ ఉత్సాహంగా ఉంటామని గ్రహించాలి. అందుకు ప్రతిరోజూ పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. అదీ టైమ్‌కి తినాలి ⇔ రోజూ రాత్రి పూట కనీసం 7 గంటలు బాగా నిద్ర పోవాలి. గాఢమైన నిద్ర అలసిపోయిన శరీరానికీ, మనస్సుకూ మంచి టానిక్ ⇔ రోజూ వ్యాయామం చేయాలి. జిమ్‌కు వెళ్ళడం కుదరకపోతే, కనీసం వాకింగ్ అయినా చేయాలి. వాకింగ్ వల్ల మానసిక ఆందోళన స్థాయి తగ్గుతుంది ⇔ వారానికి కనీసం నాలుగు రోజులైనా, ప్రతిసారీ కనీసం ముప్పావు గంట వంతున యోగా, ధ్యానం లాంటివి చేయాలి. ప్రాణాయామం కూడా చాలా మంచిది. వీటివల్ల శారీరకంగా, మానసికంగా ఉత్తేజం కలుగుతుంది ⇔ స్ట్రెస్ మేనేజ్మెంట్లో మరో ముఖ్యమైన విషయం – మనకు బాగా ఆప్తులైన మిత్రుల్నీ, చుట్టాల్నీ కలవడం, అడపాదడపా ఫోన్లో మాట్లాడడం. అలా మీ మనసులోని భావాలు మరొకరితో పంచుకోవడం వల్ల భారం తగ్గుతుంది. అయితే, అది మరీ అతిగా ఆధారపడడంగా మారిపోకూడదు ⇔ మనకు మనం అందంగా, ఆహ్లాదంగా కనిపించడం కూడా ముఖ్యం. అందుకని, అడపాదడపా ఫేషియల్స్, మసాజ్‌ల లాంటివి చేయించుకోవాలి. ఇనుమడించిన అందంతో, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయని గమనించాలి. -
తనపై ఆసక్తి పోయింది... ఇప్పుడెలా?
జీవన గమనం నా వయసు 40. నాకు ఒక్కతే కూతురు. వయసు పద్దెనిమిదేళ్లు. నా భర్త, నేను విడిగా ఉంటున్నాం. నా కూతురూ నేనే ఉండటం వల్ల తనమీద విపరీతమైన ప్రేమను పెంచుకున్నాను. మొన్నీ మధ్య వరకూ తను ప్రతి విషయం నాతో చెప్పేది. ప్రతి విషయానికీ నామీదే ఆధారపడేది. కానీ ఇప్పుడు తను స్వతంత్రంగా ప్రవర్తిస్తోంది. అది నేను భరించలేకపోతున్నాను. ఏం చేయాలి? - ప్రతిభ, వెంట్రప్రగడ మీ అమ్మాయి తన పనులు తాను చేసుకుంటోంది... అంతే కదా! అలా కాకుండా ప్రతి విషయానికీ మీమీదే ఆధారపడి ఉంటే, ‘పద్దెనిమిదేళ్లు దాటినా నా కూతురు ప్రతి చిన్నదానికీ నామీదే ఆధారపడుతోంది, ఏం చేయాలి’ అంటూ ఇదే శీర్షికకి మీరు ఉత్తరం రాసి ఉండేవారు. చెప్పాలంటే చాలామంది సింగిల్ పేరెంట్స్‌కి వచ్చే సమస్య ఇది. తమ పిల్లలు ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా తమ మీదే ఆధారపడాలని కోరుకుంటారు. నిజానికి యుక్త వయసు వచ్చిన పిల్లలు, తల్లిదండ్రుల పరిధి నుంచి దూరంగా వెళ్లడం ఎంతో సర్వ సాధారణమైన విషయం. కాబట్టి మారాల్సింది మీరే. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపయినా మీ అమ్మాయి మిమ్మల్ని విడిచి వెళ్లిపోవలసిందే కదా! మొదట్లో కొంత శూన్యత ఉంటుంది. తర్వాత అలవాటు అవుతుంది. అందుకే మీరు ఇప్పట్నుంచీ ఏదైనా మంచి అభిరుచిని పెంచుకోండి. బంధంలో ఇరుక్కోకుండా మనల్ని ‘మంచి అభిరుచి’ కాపాడుతుంది. అలాగే మీకు నచ్చిన మతగ్రంథం చదవండి. పాజిటివ్‌గా ఆలోచించి ప్రశాంతంగా ఉండండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను కూడా నన్ను ప్రేమించింది. మేము ప్రేమించుకోవడం మొదలుపెట్టి ఒక సంవత్సరం అయ్యింది. కానీ అప్పుడే నాకు తనమీద నిరాసక్తత వచ్చేసింది. కొత్తదనం లేనట్లు అనిపిస్తోంది. పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇలా ఒకే వ్యక్తితో ఉండాలా అని ఓ రకమైన కాంప్లెక్స్‌కి లోనవుతున్నాను. నిజానికి నేను ఉద్యోగం కూడా ఎక్కడా సంవత్సరానికి మించి చేయను. ప్రతిసారీ కొత్తదనాన్ని కోరుకుంటాను. ఈ కాంప్లెక్స్ నుంచి బయటపడే మార్గం చెప్పండి. - రఘువర, రాజమండ్రి ప్రతిసారీ కొత్తదనాన్ని కోరుకుంటాను అని రాశారు. అంటే భోజనం, దుస్తులు... అన్నీ సంవత్సరం అయ్యేసరికి మారుస్తున్నారా? లేక ఉద్యోగాన్ని, ప్రియురాలిని మాత్రమేనా? ఎంత కొత్తదనాన్ని ఆశించేవాడైనా సంవత్సరానికో పెళ్లి చేసుకోడు కదా! మీకు నిరాసక్తత వచ్చింది మీ స్వభావం వల్ల కాదు. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించకపోవడం వల్ల. ఈ కోణంలో ఓసారి ఆలోచించి చూడండి తెలుస్తుంది. ప్రేమ వేరు. బంధం వేరు. మీకు సంతానం కలిగి, ఒక పొదరిల్లు నెమ్మదిగా అల్లుకోవడం మొదలుపెడితే రోజూ కొత్తగానే ఫీలవుతారు. పిల్లలతో తప్పటడుగులు వేయించడం నుంచి అక్షరాలు దిద్దించడం వరకు ప్రతి విషయాన్నీ ఆస్వాదిస్తారు. వివాహబంధం లేకుండా ప్రేమించుకోవడమే చేశారు కాబట్టి బహుశా మీకది బోరు కొట్టింది. దాన్ని మీ మనస్తత్వానికి అన్వయించుకుని అదేదో కాంప్లెక్స్‌లాగా బాధపడుతున్నారు. మనం చాలా విషయాల్ని రొటీన్‌గానే కొనసాగిస్తుంటాం. ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. ఒక నెల భోజనం, మరొక నెల పులిహోర, ఆపై బిర్యానీ, తర్వాత చపాతీలు అంటూ వెరైటీగా తినం కదా! దుస్తులు, ఇల్లు అనే ఉదాహరణ ఇచ్చింది అందుకే! నేను ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాను. ఇక్కడ మా బాస్ తన ఆఫీస్ పనులన్నీ మాతోనే చేయిస్తాడు. దాంతో వర్క్‌లోడ్ ఎక్కువై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. మెమోలు ఇచ్చేది బాసే కదా! అందుకే మొహమాటంతో ఆయన ఎంత పని చెప్పినా ‘నో’ అనలేకపోతున్నాను. ఈ సమస్య నుంచి బయటపడేదెలా? - రామోజీ, నల్లమర్ల మీరు మొహమాటంతో ‘నో’ చెప్పలేకపోతున్నారా లేక మీ ఉద్యోగం బాసు మీద ఆధారపడి ఉంది కాబట్టి నో చెప్పలేకపోతున్నారా? మీ ఉద్యోగాన్ని తీసేసే అధికారం మీ బాసుకి ఉన్నట్లయితే మీకు రెండే దార్లు. ఆయన చెప్పిన పనంతా చేయడం లేదా ఉద్యోగాన్ని వదిలేయడం. కానీ మీరు మొహమాటం అన్న పదం వాడారు. ఒకవేళ మీరు నో చెప్పినా కూడా మీ బాస్ మిమ్మల్ని ఏమీ చేయలేడు అనుకున్నా, మీ ప్రమోషన్‌కి అడ్డుపడే అధికారం ఆయనకి ఏమాత్రం లేకపోయినా... ‘ఆ పని నేను చేయ(లే)ను’ అని నిర్మొహమాటంగా చెప్పేయండి. అలా చెప్పడానికి కూడా మొహమాటం అయితే... ఆఫీసులో ఎన్ని గంటలు పని చేసినా తరగని పని ఒత్తిడి, మీరు నిర్వహిస్తోన్న బాధ్యతల గురించి వివరంగా ఉత్తరం రాసి ఆయన టేబుల్ మీద పెట్టండి. ఏం చేయాలన్నా ముందు మీ బాస్‌కి ఉన్న అధికారాల గురించి నిర్దిష్టమైన అవగాహనకు వచ్చి, ఆ తర్వాత చేయండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
ఫన్ స్పేస్
హోమ్ వర్క్ భార్య: వంట చేస్తున్నాను... ఆ కిటికీ దగ్గర ఉప్పు డబ్బా ఉంది. ఇలా తెచ్చివ్వండి... భర్త: ఇక్కడ లేదు... భార్య: మీరు అలా అంటారని నాకు తెలుసు. మీలాంటి బద్దకస్తుడిని నేనింత వరకు చూడలేదు. ఉప్పు డబ్బా తెచ్చివ్వడానికి కూడా ఇంత బద్దకమా! భర్త: లేదంటే వినవేం? భార్య: మీరిలా అంటారని తెలిసే...ఉప్పు డబ్బాను నేను ముందే తీసుకొచ్చి పెట్టాను. భర్త: !!!!!!!!!!!! ఆఫీస్ వర్క్ ఆరోజు కూడా రమణ మందు కొట్టాడు. భార్య అనుమానిస్తుందని, నిజం తెలిసి పోతుందని భయపడిపోయాడు. ‘ల్యాప్‌టాప్ తీసి పని చేస్తున్నట్లు నటిస్తే ఆమెకు అనుమానం రాదు’ అనుకున్నాడు. తన ఐడియాకు తానే గర్వపడ్డాడు. కొద్ది సేపటి తరువాత... ‘‘మళ్లీ మందు కొట్టి వచ్చావా?’’ కోపంతో కళ్లెర్ర చేసింది రమణ భార్య రాధ. ‘‘ఆఫీసులో వర్క్ ఎక్కువై చస్తున్నాను. ఆఫీస్‌లో మిగిలిన వర్క్‌ను ఇలా ల్యాప్‌టాప్‌లో చేసుకుంటున్నాను. నీకు మాత్రం మందు కొట్టి వచ్చినట్లు అనిపిస్తోంది. నిన్ను ఎవరూ బాగు చేయలేరు’’ విసుక్కున్నాడు రమణ. ‘‘చాల్లేండి సంబడం...మీ చేతుల్లో ఉంది ల్యాప్‌టాప్ కాదు సూటుకేసు. ఓవర్ యాక్షన్ ఆపండి’’ అని గట్టిగా అరిచింది రాధ.