కొవిడ్ పరిణామాల్లో ఐటీ పరిశ్రమలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ప్రధానమైంది పూర్తిగా ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేయడం. వారంలో కొన్ని రోజులపాటు ఇంటి నుంచి పనిచేయడం కొవిడ్ ముందునుంచే ఉంది. అయితే కరోనా సమయంలో ఐటీ ప్రాజెక్టులకు ఆటంకం ఏర్పడకుండా, పూర్తిగా ఇంటి నుంచే పనికి అనుమతించారు.
కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత పలు సంస్థలు క్రమంగా కార్యాలయాలు తెరిచాయి. ఉద్యోగులను కార్యాలయాలకు రావాల్సిందిగా ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు మెయిళ్లు పంపాయి. కానీ రోజూ ఆఫీస్‌కు వచ్చి పనిచేయడానికి ఉద్యోగులు విముఖత చూపుతున్నారని తేలింది. ప్రతిరోజూ తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సిందిగా సంస్థలు ఆదేశిస్తే ఉద్యోగం మారడానికి సైతం సిద్ధపడుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాడ్యూల్‌కు మారాలంటే మెజారిటీ ఉద్యోగులు భయంతో ఉన్నట్లు తెలిసింది. ఈ విధానానికి హఠాత్తుగా మారడం సాధ్యం కాదని తాజా సర్వేలో పాల్గొన్న వారిలో 69 శాతం మంది స్పష్టం చేశారని స్టాఫింగ్ సొల్యూషన్స్ హెచ్‌ఆర్ సర్వీస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ రిపోర్ట్ తెలిపింది.
కేవలం 25 శాతం మంది మాత్రమే వర్క్ ఫ్రం హోం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సర్వే వెల్లడించింది. బ్యాంకింగ్ ఫైనాన్స్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్‌ఆర్ సొల్యూషన్స్, ఐటీ, ఐటీఈఎస్, తయారీ వంటి రంగాల్లో పనిచేసే 1,213 మందిని పరిగణించి గతేడాది అక్టోబర్ 26 నుంచి నవంబర్ 30 వరకు రిపోర్ట్ తయారు చేశారు. ఆఫీసుకు రమ్మని ఆదేశించడం వల్ల రాజీనామాలు పెరిగే అవకాశం ఉందని రిపోర్ట్ అంచనా వేసింది. 12 శాతం మంది రాజీనామాలను ప్రధాన సమస్యగా భావించలేదు. 82 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బయోమాస్ సేకరణపై ఫోకస్.. ఖర్చు ఎంతంటే..
కంపెనీలు ఫ్లెక్సిబిలిటీకి అవకాశం ఇవ్వాలని చాలా మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇంటితోపాటు ఆఫీసు నుంచీ పనిచేయడానికి అనుమతించాలని కోరారు. ముఖ్యంగా ఆఫీసు నుంచి ఇల్లు దూరం ఉన్న వారికి మినహాయింపులు ఉండాలని 56 శాతం మంది అన్నారు. దీనికి విరుద్ధంగా, 33 శాతం మంది మాత్రం మినహాయింపులు అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment