
పని గంటలపై ప్రముఖులు స్పందిస్తుండడంతో దీనిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ముకేశ్ అంబానీ తనయుడు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ అధిక పని గంటలపై తన అభిప్రాయం వెల్లడించారు. ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు.. చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలంటూ దాని గురించి మాత్రమే ఆలోచిస్తానని చెప్పారు. ఇటీవల ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ సుబ్రహ్మణియన్..వంటి ప్రముఖులు ఈ పని గంటలపై స్పందిస్తూ ఆఫీస్‌లో ఎక్కువసేపు పని చేయాలని చెప్పారు. పని గంటలు, పని నాణ్యతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నిపుణులు అందులోని విభిన్న అంశాలను విశ్లేషిస్తున్నారు.
పని గంటలు
నిర్దిష్ట వ్యవధిలో పనులు పూర్తి: సరైన పని గంటలు ఉండడం వల్ల ఉద్యోగులు క్రమశిక్షణతో, ఫోకస్‌గా పని చేసేందుకు వీలవుతుంది. నిర్దిష్ట కాలవ్యవధిలో పనులు పూర్తయ్యేలా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం ఉత్పాదకతకు దోహదం చేస్తుంది.
సమన్వయం, సహకారం: టీమ్ సభ్యుల మధ్య సమన్వయం, సహకారాన్ని సులభతరం చేయడానికి పని గంటలు తోడ్పడుతాయి. అందరూ ఒకేసారి అందుబాటులో ఉన్నప్పుడు సమావేశాలను షెడ్యూల్ చేయడం, ప్రాజెక్టులను చర్చించడం, సమష్టి నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్: నిర్దిష్ట పని గంటలు వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాల మధ్య స్పష్టమైన సరిహద్దును సృష్టించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ సమతుల్యతను నిర్వహించడానికి కీలకం అవుతాయి.
పని నాణ్యత
క్లయింట్లు సంతృప్తి: పని నాణ్యతపై దృష్టి పెట్టడం వల్ల ఉద్యోగులు మెరుగైన ఫలితాలు అందించే అవకాశం ఉంది. దీనివల్ల క్లయింట్లు సంతృప్తి చెందుతారు.
ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ: క్వాలిటీ ఆధారిత పని ఆవిష్కరణలను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. కఠినమైన పనిగంటలకు పరిమితం కాని ఉద్యోగులు కొత్త ఆలోచనలు, విభిన్న విధానాలను అన్వేషించవచ్చు.
ఉద్యోగుల సంతృప్తి: పనిలో నిత్యం అధిక నాణ్యమైన అవుట్‌పుట్ ఇవ్వడం వల్ల ఉద్యోగులు సంతృప్తి చెందుతూ, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ప్రేరణ పొందే అవకాశం ఉంది. ఇది సానుకూల పని వాతావరణానికి దారితీస్తుంది.

పని గంటలు, పని నాణ్యత ప్రాముఖ్యం
ఉత్పాదకత పెంచడానికి పని గంటలు, పని నాణ్యత రెండూ చాలా ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసం కొన్ని విధానాలను సూచిస్తున్నారు.
ఫ్లెక్సిబుల్ పని వేళలు: ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూళ్లలో పని చేసేందుకు వీలుగా ఉద్యోగులకు అవకాశం కల్పించాలి. దానివల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా అధిక నాణ్యత కలిగిన అవుట్ పుట్ వస్తుంది.
అవుట్ పుట్‌పై దృష్టి: పని గంటల సంఖ్యకు బదులుగా అవుట్ పుట్ నాణ్యతపై దృష్టి కేంద్రీకరించాలి. అందుకోసం సంస్థలు స్పష్టమైన లక్ష్యాలు, అంచనాలను నిర్ణయించాలి. సహేతుకమైన కాలపరిమితిలో అధిక నాణ్యత పనిని అందిస్తే కలిగే ప్రయోజనాలను నొక్కి చెప్పాలి.
విరామాలు: క్రమం తప్పకుండా విరామాలు, డౌన్‌టైమ్‌ను ప్రోత్సహించడం సృజనాత్మకతను పెంచుతుంది. కొంతమంది ఉద్యోగులు పని సమయాల్లో కాసేపు రిలాక్స్ అవ్వలనుకుంటారు. అలాంటివారికి రీఛార్జ్ అయ్యేందుకు కొంత సమయం ఇస్తే నాణ్యమైన అవుట్‌పుట్ అందించే అవకాశం ఉంటుంది.
నైపుణ్యాలు అభివృద్ధి: ఉద్యోగులకు శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి అవకాశాలను అందించాలి. దాంతో వారి పని నాణ్యత మెరుగుపడుతుంది. నిరంతర అభ్యాసం సృజనాత్మకతకు దోహదం చేస్తుంది.
ఇదీ చదవండి: రూ.1,700తో అమెరికా వెళ్లి రూ.16,400 కోట్లు సంపాదన
పని గంటలు, పని నాణ్యత రెండూ ముఖ్యమైనవే. అయినప్పటికీ ఒకదాని కంటే మరొకదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అసమతుల్యతకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను కాపాడుకుంటూ ఉద్యోగులు అధిక నాణ్యమైన పనిని అందించడానికి కృషి చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment