ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్.. ఈ శీర్షిక చూడగానే మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. కానీ ఇలాంటిదొకటి ఉందని నాకు 15 ఏళ్ల కిందటే తెలుసు. సమాజంలో వస్తున్న కొత్త ట్రెండ్ లను ఎప్పటికప్పడు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం సైకాలజిస్టుగా నాకు అవసరం. అలా దాని గురించి తెలుసుకున్నా. ఆ మధ్య కాలంలో అలాంటి కేస్ ఒకటి నా దగ్గరకు వచ్చింది. దాని గురించే ఈరోజు మీతో పంచుకుంటా.
అసలేంటీ కాన్సెప్ట్?
ఆఫీస్ వైఫ్/ఆఫీస్ హజ్బండ్ అనే పదాలు ఒకరి వర్క్ లైఫ్ లో ముఖ్యమైన సహాయక పాత్ర పోషించే కొలీగ్ గురించి చెప్పేవి. లైఫ్ పార్టనర్ కు సమానమైన ఎమోహనల్ సపోర్ట్, గైడెన్స్, కంపాయిన్షిప్ అందించే వ్యక్తిని ఆఫీస్ స్పౌజ్ అంటారు. వారిద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్, కొలాబరేషన్ ఉంటుంది. ఇతర కొలీగ్స్ తో పంచుకోని, పంచుకోలేని వృత్తిగత, వ్యక్తిగత విషయాలు వారితో పంచుకుంటారు. వారి బంధం అంతవరకే పరిమితం, ఎలాంటి లైంగిక సంబంధం ఉండదు.
ఎమోషనల్ డిపెండెన్సీ...
హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పొరేషన్‌లో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ గా పని చేస్తున్న ప్రియా శర్మ తన సహోద్యోగి రాజీవ్ పటేల్ ఐదేళ్లుగా కలిసి పనిచేస్తున్నారు. చాలా ప్రాజెక్టులు పూర్తి చేయడంలో రాజీవ్ ఆమెకు తన సహకారం అందించాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇరువురి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, బాధ్యతలు, బాధలు పంచుకునేవారు.
ఒత్తిడి సమయాల్లో ప్రియకు రాజీవ్ ఎమోషనల్ సపోర్ట్ అందించగా, రాజీవ్ కు కష్ట సమయాల్లో ప్రియ భరోసాగా నిలిచింది. అలా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది వృత్తిపరమైన సరిహద్దు రేఖలను చెరిపేయడం ప్రారంభించింది. తరచుగా తమ వ్యక్తిగత వివరాలను పంచుకునేవారు. ఆఫీస్ తో పాటు బయట కూడా తరచూ కలుసుకునేవారు.
రాజీవ్ పై ఆమె ఎమోషనల్ గా బాగా ఆధారపడింది. ఎప్పుడు ఒత్తిడి, ఆందోళన అనిపించినా అతనితో మాట్లాడి రిలాక్స్ అయ్యేది. అతను అందుబాటులో లేనప్పుడు అభద్రతకు, ఆందోళనకు లోనయ్యేది. అతను లేకుంటే సరిగా పనిచేయలేకపోయేది.
పుకార్లు షికారు...
ఇవన్నీ కలిసి ఆఫీసులో వారిద్దరి రిలేషన్ షిప్ పై అనుమానాలకు కారణమయ్యాయి. టీమ్ లో కూడా సమస్యలు మొదలయ్యాయి. తామెంత పనిచేసినా రాజీవ్ ప్రియనే సపోర్ట్ చేస్తాడని, తమకు అన్యాయం చేస్తాడని మిగతావాళ్లు భావిస్తున్నారు. వారిని ‘ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్’ అని అనుకోవడం మొదలుపెట్టారు.
ఈ మాటలు ప్రియ వరకు వచ్చేసరికి తల్లడిల్లిపోయింది. ఫ్రెండ్లీగా ఉన్నంతమాత్రాన ఇలా మాట్లాడతారా.. అని బాధపడుతోంది. ఇదంతా ఆమె కుటుంబ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కౌన్సెలింగ్ కోసం వచ్చింది.
ఇలాంటి సమస్య మీకూ ఎదురై ఉండవచ్చు. మీరు క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్ తో సంబంధం అంటగట్టేవాళ్లు మీ పక్కనే ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ తుఫాన్ ను కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. అలాంటి సందర్భాల్లో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అవసరం. అలానే ప్రియ కౌన్సెలింగ్ కోసం వచ్చింది.
మూడు నెలల థెరపీ...
ప్రియాశర్మ తన సమస్య గురించి వివరించాక సైకోడయాగ్నస్టిక్స్ ద్వారా ఆమె తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జయిటీకి లోనవుతున్నట్లు నిర్ధారణైంది. దీంతో ఆమెకు సైకోథెరపీ ప్రారంభించాను. ఈ థెరపీ లక్ష్యం ప్రియ, రాజీవ్ మద్య ప్రొఫెషనల్ బౌండరీస్ ను తిరిగి ఏర్పాటు చేయడం, అతనిపై ఎమోషనల్ డిపెండెన్సీని తగ్గించి, స్వంత కోపింగ్ మెకానిజమ్ లను మెరుగుపరచడం, వర్క్ ప్లేస్ డైనమిక్స్ ను మెరుగుపరచడం.
వారానికో సెషన్ చొప్పున మూడు నెలలపాటు రోల్-ప్లేయింగ్ బౌండరీస్, కాగ్నిటివ్ బిహేవియరల్ టెక్నిక్స్, ఎమోషనల్ రెగ్యులేషన్, వర్క్ ప్లేస్ డైనమిక్స్ ను మెరుగుపరిచేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ తదితర టెక్నిక్స్ ద్వారా ఆమె మామూలు మనిషి కాగలిగింది. రాజీవ్ తో ఫ్రెండ్లీగా ఉంటూనే తన సైకలాజికల్ వెల్ బీయింగ్ ను కాపాడుకోగలిగింది.
ముందిలా చేయండి..
అంటే ఏంటి సర్, ఇప్పుడే సమస్య వచ్చినా మీ దగ్గరకు రావాలంటారా? అని మీరు అనుకోవచ్చు. అలా నేనెప్పుడూ చెప్పను. ఎవరైనా సరే మొదట తన సమస్యను తానే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు, చేయాలి కూడా. అలా చేసినా ఫలితం లేనప్పుడే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలి. మీకోసం కొన్ని సెల్ఫ్ హెల్ప్ టిప్స్...
1.సహోద్యోగులతో మీ సరిహద్దులను స్పష్టంగా నిర్దేశించుకోండి. ఆఫీస్ టైంలో పర్సనల్ ఇష్యూస్ చర్చించవద్దు. ఆ తర్వాత కమ్యూనికేషన్ ను పరిమితం చేయండి.
2. రోజూ డైరీ రాయడం మీ ఆలోచనలను, చర్యలను గమనించడానికి, అవి మీ ప్రొఫెషనల్ బౌండరీస్ కు అనుగుణంగా ఉన్నాయో లేవో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
3. మీ కొలీగ్ పై ఆధారపడేలా చేసే ట్రిగ్గర్ లను గుర్తించి, వాటిని మేనేజ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి.
4.మిమ్మల్ని మానసికంగా సంతృప్తి పరిచే హాబీల్లో కొంత సమయం గడపండి. ఇది ఇతరులపై ఎమోషనల్ గా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
5. ఏ ఒక్కరికో పరిమితం కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులు లతో సపోర్ట్ నెట్‌వర్క్‌ను రూపొందించండి,
6. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోండి.
7. ఒత్తిడిని మేనేజ్ చేసేందుకు మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నెస్, మెడిటేషన్ లను రోజూ ప్రాక్టీస్ చేయండి.
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
www.psyvisesh.com
Connections corner
Comments
Please login to add a commentAdd a comment