సాధారణంగా గనుల్లో పనిచేసేందుకు పురుషులనే నియమిస్తుంటారు. గనుల్లోని పనులు ఎంతో కష్టమైనందున వాటిని పురుషులతోనే చేయిస్తుంటారు. అయితే ఆఫ్రికాలోని ఒక దేశంలో దీనికి విరుద్ధమైన పనితీరు కలిగిన ఒక గని ఉంది. దీనిలో మహిళలు మాత్రమే పని చేస్తుంటారు. దీని వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అంతే కాదు ఈ గనిలో పని చేసే మహిళలకు భారీ వేతనం కూడా లభిస్తుంది .
ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచంలోని పలు దేశాలు ఆ గనిలో జరిగే పనితీరును ప్రశంసిస్తుంటాయి. ఉత్తర జింబాబ్వేలోని డుంగుజా నది వద్ద మైనింగ్ జరుగుతుంటుంది. ‘జింబాకువా’ లాంటి అనేక కంపెనీలు ఇక్కడ రత్నాల కోసం వెదుకులాట సాగిస్తుంటాయి. ఇక్కడ పనిచేసేందుకు మహిళలను మాత్రమే తీసుకుంటారు. డ్రిల్లింగ్ అయినా, సుత్తితో కొట్టే పని అయినా, పెద్ద పెద్ద రాళ్లను రవాణా చేయడమైనా.. ప్రతీపనిని మహిళలే చేస్తుంటారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ గనిలో పేలుళ్లు లాంటి పనులు చేయరు.
జాతి రాళ్లు, రత్నాలు భూమి లోపలి పొరలలో కనిపిస్తాయి. ఉలి, సుత్తి సహాయంతోనే ఇక్కడ తవ్వకాల పనులు చేపడతారు. ఈ విధమైన పనితీరుతో పర్యావరణానికి హాని కలగదు. ఈ ప్రక్రియలో రసాయనాలు ఉపయోగించరు. నీటిని కూడా తక్కువగానే ఉపయోగిస్తారు. ఇక్కడ పనిచేసే మహిళలకు ప్రతినెలా 180 (ఒక యూరో రూ.91) యూరోలు అందుతుంటాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఇక్కడ పనిచేసే మహిళలు తమ తీరిక సమయంలో కూరగాయలు పండిస్తూ, వాటిని విక్రయిస్తుంటారు.
ఇక్కడి గనుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీలు మహిళా సాధికారతను కాంక్షిస్తూ, వారికే ఉపాధి కల్పిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇక్కడి మహిళలు తమ పిల్లల చేత ఉన్నత చదువులు చదివిస్తున్నారు. నిరుద్యోగ భర్తలకు అండగా నిలుస్తున్నారు. మగవారి కంటే తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు ఇక్కడి మహిళలు.
ఇది కూడా చదవండి: కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు.. వణుకుతున్న కూలీలు!
Comments
Please login to add a commentAdd a comment