
ఎలక్ట్రానిక్స్‌పై కూడా: ట్రంప్
మినహాయింపు లేదని వెల్లడి
వాషింగ్టన్: ప్రతీకార సుంకాలు విధించినా, నేరుగా బెదిరించినా చైనా దారికి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. ఆ దేశంపై మరింతగా కత్తులు నూరుతున్నారు. చైనా స్మార్ట్ ఫోన్లతో పాటు ఆ దేశ ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు విధించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. అవి ఎంత శాతమన్నది సోమవారం వెల్లడిస్తానని తెలిపారు.
‘‘ఎలక్ట్రానిక్ వస్తువులకు నేను ప్రకటించిన సుంకాల మినహాయింపు చైనాకు వర్తించబోదు. వాటిపై కేవలం సుంకాల శాతం మార్పుచేర్పులు చేయబోతున్నామంతే’’ అని ఆదివారం ట్రంప్ వెల్లడించారు. ‘‘చైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు సెమీ కండక్టర్ టారిఫ్‌లు వర్తించవచ్చని వాణిజ్య మంత్రి హొవార్డ్ లెట్నిక్ చెప్పుకొచ్చారు. అమెరికాకు అవసరమైన ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఔషధాలు.. ఇలా అన్ని వస్తువులూ దేశీయంగానే తయారు కావాలన్నది అధ్యక్షుని ఆలోచన అన్నారు.
స్మార్ట్‌ఫోన్లతో పాటు చైనా నుంచి దిగుమతయ్యే అన్నిరకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులనూ ఆ దేశంపై విధించిన 145 శాతం టారిఫ్ నుంచి మినహాయిస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ విభాగం శనివారం నోటీసులో వెల్లడించడం తెలిసిందే. ఈ అంశంపై రెండు రోజుల్లోనే ట్రంప్ పిల్లమొగ్గ వేశారు. ఆ నోటీసు వాస్తవం కాదంటూ సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు. అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువుల సరఫరాపై త్వరలో నేషనల్ సెక్యూరిటీ టారిఫ్స్ ఇన్వెస్టిగేషన్స్ భేటీలో కూలంకషంగా చర్చిస్తామని చెప్పుకొచ్చారు.