
అమెరికాకు చైనా మరో షాక్ ∙వైమానిక కొనుగోళ్లన్నీ బంద్
బీజింగ్/బ్యాంకాక్: ప్రతీకార సుంకాల బాట పట్టిన ట్రంప్‌కు చైనా చుక్కలు చూపిస్తోంది. ఆయనకు దిమ్మతిరిగేలా రోజుకో నిర్ణయం తీసుకుంటోంది. ఆ క్రమంలో అమెరికా వైమానిక దిగ్గజం బోయింగ్‌ను చైనా అనధికారికంగా బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసింది. ఆ సంస్థ నుంచి విమానాల డెలివరీలు తీసుకోవద్దని, కొత్తగా ఎలాంటి ఆర్డర్లూ ఇవ్వొద్దని దేశీయ విమానయాన సంస్థలకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక అమెరికా కంపెనీల నుంచి ఎలాంటి వైమానిక పరికరాలు, విడిభాగాలనూ కొనుగోలు చేయొద్దని కూడా పేర్కొంది.
ఈ నిర్ణయంతో బోయింగ్ విమానాల నిర్వహణ భారంగా మారకుండా దేశీయ ఆపరేటర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. బ్లూంబర్గ్ కథనం ఈ మేరకు వెల్లడించింది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన బోయింగ్ పరిస్థితి చైనా నిర్ణయంతో పెనం నుంచి పొయ్యిలో పడింది. ఆ సంస్థకు అతి పెద్ద మార్కెట్ చైనాయే. అయితే అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్నేళ్లుగా బోయింగ్‌కు చైనా కొత్త ఆర్డర్లేవీ ఇవ్వడం లేదు. బోయింగ్ నుంచి చివరిసారిగా 2018లో విమానాలు కొనుగోలు చేసింది.