
చైనా మినహా మిగిలిన దేశాలకు 90 రోజుల విరామం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకస్మిక నిర్ణయం
డ్రాగన్‌కు మాత్రం సుంకాలు 125 శాతానికి పెంపు, తక్షణం అమల్లోకి..
యూఎస్‌పై 84 శాతం సుంకాలు: చైనా
నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటన
ప్రపంచవ్యాప్త ఆర్థిక ప్రకంపనల నేపథ్యంలో ట్రంప్ వెనక్కు తగ్గారు. భారత్‌తో పాటు 75 పై చిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే అటకెక్కాయి. కానీ చైనాతో మాత్రం అమెరికా టారిఫ్‌ల పోరు బుధవారం మరింత తీవ్రరూపు దాల్చింది. ఈ దిశగా రోజంతా శరవేగంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమెరికాపైనా చైనా అంతే మొత్తం బాదింది.
అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా కన్నెర్రజేశారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 104 శాతానికి చేరిన సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచేశారు. అవి తక్షణం అమల్లోకి వస్తాయని కుండబద్దలు కొట్టారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాపై మళ్లీ సుంకాల కత్తి ఝుళిపించింది. 23 బిలియన్ల విలువైన యూఎస్ ఉత్పత్తులపై దశలవారీగా అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా కూడా అమెరికా ఆటో ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొంది.
బీజింగ్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి వెనక్కు తగ్గారు. తన ఎడాపెడా టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలవడమే గాక ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తడంతో పునరాలోచనలో పడ్డారు. చైనా మినహా 75 పై చిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. ‘‘ఆ దేశాలు చైనా మాదిరిగా మాపై తిరిగి ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. పైగా టారిఫ్‌లపై మాతో చర్చలకు ముందుకొస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
దాంతో భారత్ సహా ఆయా దేశాలకు తాత్కాలికంగా ఊరట లభించింది. భారత్‌పై ట్రంప్ 26 శాతం అదనపు సుంకాలు విధించడం తెలిసిందే. లెసొతో (50 శాతం), మడగాస్కర్ (47), వియత్నాం (46), తైవాన్ (32), దక్షిణ కొరియా (25), జపాన్, ఈయూ (20) తదితర దేశాలపైనా భారీగా వడ్డించారు. బుధవారం అమల్లోకి వచ్చిన ఈ సుంకాలు 24 గంటలు కూడా గడవకముందే వాయిదా పడ్డాయి. అయితే ఆ దేశాలన్నింటిపైనా 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ మాత్రం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. చైనాపై మాత్రం ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘మాపట్ల, ప్రపంచ మార్కెట్ల పట్ల చైనా ఏమాత్రమూ గౌరవం చూపలేదు.
పట్టు వీడి దిగి రావాల్సింది పోయి అర్థం లేని దూకుడుకు పోయింది’’ అంటూ తీవ్రంగా ఆక్షేపించారు. చైనాపై ఇప్పటికే విధించిన 104 శాతం సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. అవి తక్షణం అమల్లోకి వచ్చాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఒక దేశంపై అమెరికా విధించిన అత్యధిక సుంకాలు ఇవే కావడం విశేషం! ట్రంప్ దూకుడుపై తామేమీ చేతులు ముడుచుకు కూచోబోమన్న డ్రాగన్ దేశం అన్నంత పనీ చేసింది. అమెరికాపై మరో 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. ‘‘ఇప్పటికే ప్రకటించిన 34 శాతంతో కలిపి గురువారం నుంచి అమెరికా ఉత్పత్తులన్నింటి మీదా 84 శాతం సుంకాలు వసూలు చేస్తాం.
అవి గురువారం నుంచే అమల్లోకి వస్తాయి’’ అని పేర్కొంది. దాంతో పెద్దన్నల పోట్లాట కాస్తా ముదురు పాకాన పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం మేరకు వాటా ఉండే అమెరికా, చైనా టారిఫ్‌ల యుద్ధం తారస్థాయికి చేరింది. మరోవైపు అమెరికా దిగుమతి చేసుకునే అన్నిరకాల ఆటో ఉత్పత్తులపైనా గత గురువారం నుంచే 25 శాతం టారిఫ్ అమల్లోకి వచి్చంది. ఇది ప్రస్తుతానికి కార్లపై మాత్రమే వసూలవుతున్నా మే 3 నుంచి ఆటో విడిభాగాలకూ వర్తించనుంది. దీనికి ప్రతీకారంగా అమెరికా ఆటో ఉత్పత్తులపై బుధవారం నుంచే 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు కెనడా కూడా ప్రకటించింది.

తగ్గే ప్రసక్తే లేదు: చైనా
అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొంటామని, ఈ విషయంలో తగ్గే ప్రసక్తే లేదని చైనా కుండబద్దలు కొట్టింది. ఆ దేశంపై సుంకాలను 84 శాతానికి పెంచుతున్నట్టు చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్‌ను ఉటంకిస్తూ అధికార వార్తా సంస్థ జిన్‌హువా వెల్లడించింది. అంతేకాదు, ‘‘ఇప్పటికే ప్రకటించినట్టు మరో 12 యూఎస్ కంపెనీలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేరుస్తున్నాం.
వీటితో పాటు మా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ తైవాన్‌కు ఆయుధాల విక్రయం వంటి చర్యలకు దిగిన ఆరు అమెరికా సంస్థలను అనుమానాస్పద జాబితాలో చేరుస్తున్నాం’’ అని కమిషన్ ప్రకటించింది. అమెరికాది ఫక్తు ఏకపక్ష పోకడ అని దుయ్యబడుతూ చైనా శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇరుదేశాల కీలక ప్రయోజనాలను పరస్పరం గౌరవించుకుంటూ సాగాల్సింది పోయి మతిలేని నిర్ణయాలు తీసుకుంటోందంటూ తూర్పారబట్టింది. అమెరికా టారిఫ్‌లను తీవ్ర తప్పిదంగా అభివరి్ణంచింది. అవి చైనా హక్కులను, ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయంటూ దుయ్యబట్టింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థలో బుధవారం అదనపు దావా కూడా వేసింది.
హాలీవుడ్ సినిమాలపై నిషేధం
అమెరికాపై మరిన్ని ప్రతీకార చర్యలకు చైనా సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా హాలీవుడ్ సినిమాలపై కూడా నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే వందలాది కోట్ల డాలర్ల విలువైన చైనా మార్కెట్ హాలీవుడ్‌కు దూరమవుతుంది. ఆ పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బే’’ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలో రెండో అతి పెద్ద సినీ మార్కెట్ చైనాయే. దీనితోపాటు అమెరికాపై చైనా పరిశీలనలో ఉన్న ఇతర ప్రతీకార చర్యలు...
→ చైనాతో వ్యాపారం చేస్తున్న అమెరికా సేవా రంగ సంస్థలపై ఆంక్షలు, నిషేధాలు
→ సోయాబీన్ తదితర అమెరికా వ్యవసాయోత్పత్తులపై భారీ సుంకాలు
→ చైనాలో ఉన్న అమెరికా కంపెనీలపై అనుచిత మేధో సంపత్తి లబ్ధి అభియోగాలపై విచారణ
ఈయూ అదనపు టారిఫ్‌లు
బ్రసెల్స్: అమెరికాకు యూరోపియన్ యూనియన్ కూడా మరో సుంకాల షాకిచ్చింది. ఈయూ స్టీల్, అల్యుమినియం దిగుమతులపై ట్రంప్ విధించిన 25 సుంకాలకు ప్రతీకార చర్యలు ప్రకటించింది. ఏకంగా 2,300 కోట్ల డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తున్నట్టు బుధవారం పేర్కొంది. ఇవి దశలవారీగా అమల్లోకి వస్తాయి. ఉత్పత్తుల పేర్లు చెప్పకపోయినా, కొన్నింటిపై ఏప్రిల్ 15 నుంచి, మరికొన్నింటిపై మే 15, ఇంకొన్నింటిపై డిసెంబర్ 1న సుంకాల వసూలు మొదలవుతుందని వివరించింది.
‘‘ఈయూపై అమెరికా సుంకాలు అన్యాయం ఇరుపక్షాలకే గాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే హానికరం కూడా’’ అంటూ ఈయూ ఎగ్జిక్యూటివ్ కమిషన్ దుయ్యబట్టింది. అమెరికా, ఈయూ వార్షిక వర్తక విలువ ఏకంగా 1.8 లక్షల కోట్ల డాలర్లు కావడం విశేషం! ఈ నేపథ్యంలో ట్రంప్‌కు హెచ్చరికగా మాత్రమే తాజా సుంకాలను ప్రకటించినట్టు భావిస్తున్నారు. ఈయూ ఉత్పత్తులన్నింటిపైనా ట్రంప్ 20 శాతం సుంకాలు విధించడం తెలిసిందే.
దేశాలన్నీ కాళ్ల బేరానికి: ట్రంప్
తన టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయని ట్రంప్ చెప్పుకున్నారు. ‘‘టారిఫ్‌లను తప్పించుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధమంటున్నాయి. దయచేసి ఒప్పందం చేసుకుందామంటూ కాళ్లబేరానికి వస్తున్నాయి’’ అంటూ గొప్పలు పోయారు. ఆ క్రమంలో ఓ బూతు పదాన్నీ అధ్యక్షుడు ఉపయోగించారు!