ప్రతి శ్రమకూ ఒక విలువ ఉంటుంది.
పురుషుడు విలువ కలిగిన శ్రమే చేస్తాడు.
అతడిది ఉద్యోగం.
స్త్రీ విలువ కట్టని ఇంటి పని చేస్తుంది.
ఆమెది చాకిరి.
భారతదేశంలో స్త్రీ, పురుషుల్లో స్త్రీలు
అత్యధిక గంటలు ఏ ఖరీదూ లేని
ఇంటి పనుల్లో మునిగి ఉంటున్నారని
సర్వేలు చెబుతున్నాయి.
దేశ యంత్రాంగాలు అంతరాయం
లేకుండా ముందుకు సాగడంలో
ఈ శ్రమ నిశ్శబ్ద ΄ాత్ర వహిస్తోంది.
స్త్రీల శ్రమకు విలువ కట్టలేక΄ోతే
కనీసం గౌరవం ఇవ్వడమైనా నేర్వాలి.
ఇంతకు ముందు వివరించి చెప్పడం కొంత కష్టమయ్యేది. ఇప్పుడు అర్బన్ క్లాప్ వంటి సంస్థలు వచ్చాయి కనుక సులువు. అర్బన్ క్లాప్ వారికి బాత్‌రూమ్‌ల క్లీనింగ్ కోసం కాల్ చేస్తే వాళ్లు ఒక్కో బాత్‌రూమ్‌కు ఇంతని చార్జ్ చేస్తారు. ఇంట్లో రెండుంటే రెంటికీ చార్జ్ పడుతుంది. అదీ ఒకసారికి. అమ్మ వారంలో రెండు సార్లు, నెలలో ఏడెనిమిది సార్లు రెండు బాత్‌రూమ్‌లు కడుగుతుంది. ఆమెకు ఆ చార్జ్ మొత్తం ఇవ్వాలి లెక్క ప్రకారం. అలాగే కిచెన్ క్లీన్ చేయాలంటే కూడా ఒక చార్జ్ ఉంటుంది. అమ్మ రోజూ వంటిల్లు సర్దిసర్ది, ΄్లాట్‌ఫామ్ కడిగి, స్టవ్ రుద్ది క్లీన్ చేస్తుంది. ఆ చార్జ్ కూడా ఆమెకు ఇవ్వాలి. అమ్మ శ్రమకు కనీసం విలువ కట్టాలని కొన్ని సందర్భాలలో కోర్టులు కూడా అంటున్నాయి. కొన్ని సంస్థలు అమ్మ శ్రమను ఎలా విలువ కట్టవచ్చో కూడా చెబుతున్నాయి.
1. ఆపర్చునిటీ కాస్ట్ మెథడ్:
అంటే అమ్మ బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తే నలభై వేలు వస్తాయనుకుంటే, ఆమె ఆ ఉద్యోగం మానుకుని ఇంట్లో ఉండి΄ోతే ఆమె శ్రమ విలువను నెలకు నలభై వేలుగా గుర్తించాలి. (అమ్మ ఉద్యోగం చేసి కూడా అంత శ్రమా చేస్తుంటే నలభైకి మరో నలభై కలిపి ఇంటికి ఇస్తున్నట్టు).
2. రీప్లేస్‌మెంట్ కాస్ట్ మెథడ్:
ఇల్లు చిమ్మడం, బట్టలుతకడం, ఆరిన బట్టల్ని మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, కూరగాయలు, సరుకులు తెచ్చుకోవడం, బిల్లులు కట్టడం, వంట చేయడం, ఇంటిని కనిపెట్టుకుని ఉండటం... వీటన్నింటినీ బయట వ్యక్తులతో సర్వీసుగా తీసుకుంటే (అర్బన్ క్లాప్ మాదిరిగా) ఎంత అవుతుందో లెక్కగట్టి అది అమ్మ చేసే పని శ్రమగా గుర్తించడం.
3. ఇన్‌పుట్/అవుట్‌పుట్ కాస్ట్ మెథడ్: అలా కాకుండా ఈ పనులన్నింటికీ ఒక యోగ్యమైన ఉద్యోగిని పెట్టుకుంటే మార్కెట్ అంచనాను బట్టి ఎంత జీతం ఇవ్వాల్సి వస్తుందో అంత జీతం ఇవ్వడం.
అవన్నీ సరే. కంటికి కనిపించే పనులకు కట్టే విలువ. కాని పిల్లవాడు స్కూల్లో పడి దెబ్బ తగిలించుకుని ఇంటికి వస్తే అమ్మ దగ్గరకు తీసుకుని, మందు రాసి, ధైర్యం చెప్పి, వాడి పక్కన కూచుని కబుర్లు చెపుతుందే... ఆ ప్రేమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా? మే డే రోజున ప్రపంచ కార్మికురాలా ఏకం కండి అనే నినాదాలు వినిపిస్తుంటాయి. కాని ఇంటి పని చేస్తూ, అది ఎక్కువైనా చేస్తూ, కుటుంబమంతా ఆ పనిలో భాగం కావాలన్న సంగతిని చెప్పడానికి కూడా తటపటాయిస్తూ, అది వద్దనుకుంటే ఆ ఆప్షన్ లేక, తప్పించుకోవడానికి వీల్లేని ఆ పనిని చేస్తూ కూడా విలువ లేని పని చేస్తున్నామన్న న్యూనతను అనుభవిస్తూ తమ హక్కులు ఏమిటో తమకే తెలియని తల్లి, భార్య, కుమార్తె, చెల్లెళ్లను కార్మికులుగా గుర్తించాలని ఎవరూ అనుకోరు.
స్త్రీల ఇంటి శ్రమ దేశంలోని యంత్రాంగం సజావుగా పనిచేయడంలో కీలకమైనది. వారు...
దేశం కోసం పని చేసి రిటైరైన వృద్ధుల సేవలో ఉంటారు.
దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే యువత సేవలో ఉంటారు.
దేశానికి భవిష్యత్తులో అంది రావాల్సిన పిల్లల సేవలో ఉంటారు.
‘కుటుంబం’ అనే బంధంలోకి వచ్చి కూతురిగా, కోడలిగా, భార్యగా వీరు ‘ప్రేమ’తో, ‘బాధ్యత’తో, ‘బంధం’తో ఈ సేవ చేస్తారు. అంత మాత్రం చేత ఈ సేవను నిరాకరించడానికి వీల్లేదు. శ్రమగా చూడక్కర్లేదని భావించకూడదు. ఇంత చేస్తున్నా ‘ఇంట్లో కూచుని ఏం చేస్తుంటావ్?’ అనే మాటను వాళ్లు పడాలా?
ఉద్యోగం చేసినా చేయక΄ోయినా ఒక గృహిణి రోజుకు సగటున మూడున్నర గంటలు ఇంటి పని చేస్తుంటే పురుషుడు కేవలం గంటన్నర ఇంటి పని చేస్తున్నాడు.
స్త్రీలు తమ ఇంటి పనిని ఒక్కరోజు మానేసి సహాయనిరాకరణ చేస్తే దేశం స్తంభిస్తుంది. అందుకే స్త్రీల శ్రమను గౌరవించే మే డే రోజున వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. విలువైన శ్రమ చేస్తున్నందుకు సమాజం వారికి హర్షధ్వానాలు తెలియచేయాలి.
Comments
Please login to add a commentAdd a comment