బాస్ నాయకత్వ లక్షణాలతో ఆఫీస్ వాతావరణంలో పాజిటివిటీ
కర్కశంగా వ్యవహరిస్తే సమస్యలు తలెత్తే ప్రమాదం
తెలివితేటలపై అపనమ్మకం తగ్గనున్న సృజనాత్మకత
ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం బాగుంటేనే ప్రతిరోజూ ఆనందం ఉంటుంది. అసలే దూరాభారం ప్రయాణాలు, ట్రాఫిక్ చిక్కులు, టార్గెట్లు వంటి కారణాలతో అలిసిపోవడం సహజం.. అయితే మన రోజువారీ ఆరోగ్య పరిస్థితిని ఇలాంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అన్నింటి కన్నా మనపై ఉన్న బాస్ ప్రవర్తనను బట్టే మన మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలింది.
మనం పనిచేసే ప్రాంతం బాగుంటే మానసిక ప్రశాంతత ఉంటుందని మానసిక నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే రోజుకు కనీసం 9 గంటల పాటు ఆఫీస్‌లోనే గడపాల్సి వస్తుంది కాబట్టి.. అక్కడి వాతావరణం బాగుంటేనే మిగతా రోజంతా సులువుగా గడిచిపోతుందని పేర్కొంటున్నారు. పై అధికారి శాడిస్టు అయితే మానసిక ఆరోగ్యంతో పాటు మన పనితనం, భవిష్యత్తు, ఇతరులతో సంబంధాలు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు నిపుణులు.
దీర్ఘకాలిక ప్రభావం..
ఆఫీస్‌లో బాస్ ప్రవర్తన సరిగ్గా లేకపోతే.. అది ఉద్యోగిపై స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ నెగెటివిటీతో బాస్ మాట్లాడుతుంటే ఉద్యోగుల సొంత తెలివితేటలపైనే అనుమానం వస్తుంటుంది. వారిని వారే తక్కువ అంచనా వేసుకోవడంతో పనితీరు కూడా మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చివరకు ఉద్యోగంపై విరక్తి కలిగి రాజీనామా చేసేంత వరకూ వెళ్తుందని పేర్కొంటున్నారు.
మోటివేషన్ ఉండాల్సిందే..
పని చేసే ప్రదేశంతో నెగెటివ్ వాతావరణం కన్నా మోటివేషన్ ఉంటే ఉద్యోగులు క్రియాశీలకంగా పనిచేస్తుంటారని, చేసిన పనికి మెచ్చుకోలు లేకపోయినా కనీసం కించపరిచేలా మాట్లాడటం, అందరి ముందు మందలించడం వంటి పనులు చేస్తే మానసిక వేదనకు గురై.. పని తీరు మందగిస్తుందని పేర్కొంటున్నారు. పనిచేసే ప్రదేశంలో ఆరోగ్యకరమైన పోటీతత్వం, స్వతంత్రత, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు ఉంటే ఉద్యోగులకు మోటివేషన్ వస్తుందని పేర్కొంటున్నారు. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.
ఎలా బయటపడాలి..?
కర్కశమైన బాస్ కింద పనిచేసిన వారి మానసిక స్థితిని మళ్లీ తిరిగి పొందొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం కన్నా అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే ఉద్యోగం వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక, పాత ఆఫీస్ జ్ఞాపకాలను మర్చిపోయి.. ఆత్మన్యూనత భావం నుంచి బయటపడటం కాస్త కష్టమైనా కూడా సాధించొచ్చని చెబుతున్నారు. మన శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకుని, మనం గతంలో సాధించిన విజయాలను నెమరువేసుకుంటూ ఉండాలని పేర్కొంటున్నారు. మన మంచి కోరే సహోద్యోగులతో మనం చేసిన పనిపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఉండాలని, చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని పూర్తి చేస్తుంటే మళ్లీ మనలో కాని్ఫడెన్స్ పెరుగుతుందంటున్నారు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఆత్మ స్థైర్యం సాధించాలని పేర్కొంటున్నారు. ఆఫీస్‌లో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం..
‘ఎక్కువ కాలం ఇలాంటి వాతావరణంలో పనిచేయడంతో నేర్చుకునే తత్వం తగ్గిపోతుందని, కొత్త విషయాలు రూపకల్పన చేయడం, సృజనాత్మకత పెంచేందుకు దోహదపడే డోపమైన్ తగ్గుముఖం పట్టి.. కారి్టసాల్ స్థాయి పెరిగుతుందని ఢిల్లీకి చెందిన సైకోథెరపిస్టు డాక్టర్ చాందినీ చెబుతున్నారు. అద్భుతంగా ఎలా పని చేయాలా..? అని ఆలోచించడం మానేసి.. తన మీదికి రాకుండా ఏం చేయాలనే దానిపైనే దృష్టి సారిస్తారని ఆమె వివరించారు. ఆఫీస్ వాతావరణం చాలాకాలం పాటు సరిగ్గా లేకుంటే ఉద్యోగులకు వేరే వారితో సంబంధాలు దెబ్బతింటాయని, అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు చేసుకుంటారని, అలాగే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.
లీడర్‌షిప్ ముఖ్యం..
ఆఫీస్ వాతావరణం చెడిపోడానికి కారణాల్లో ప్రధానమైనది లీడర్‌షిప్ లేకపోవడం. బాస్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు. బాస్‌కు నాయకత్వ లక్షణాలు లేకపోతే తాను చెప్పాలనుకున్న విషయాలు ఉద్యోగులకు వ్యక్తీకరించలేరు. దీంతో ఉద్యోగులకు ఉన్న సమస్యలు నేరుగా చెప్పుకోలేరు. పక్షపాత వైఖరి, అసాధ్యమైన టార్గెట్లు పెట్టడం కూడా వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఒత్తిడితో పాటు ఆందోళన పెరుగుతుందని పేర్కొంటున్నారు. తద్వారా ఆఫీస్ వాతావరణం పూర్తిగా చెడిపోతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది.
అనేక ఆరోగ్య సమస్యలు..
పనిచేసే ప్రదేశంలో బాస్ సపోర్టు ఉంటే ఉద్యోగులు వ్యక్తిగతంగా ఎదుగుదలకు ఉపయోగపడటమే కాకుండా సంస్థ పనితీరు కూడా బాగుంటుంది. ఏం చేసినా తప్పులు వెతకడం, విమర్శలు చేస్తుండటం వల్ల ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ ఉద్యోగాన్ని వదిలి వెళ్లలేక, అక్కడే భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఈ పరిస్థితులను ఎవరికీ చెప్పుకోలేక నిద్రలేమి, హృద్రోగ సమస్యలు తలెత్తుతాయి. బాస్ ప్రవర్తనతో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో కుదిరితే నేరుగా చెప్పి సమస్యలను పరిష్కరించుకోవాలి. నచ్చిన వారితో కాసేపు ప్రశాతంగా గడిపినా, ఫోన్‌లో మాట్లాడినా మనసులోని బరువు తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
– డాక్టర్ పి.హరీశ్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
Comments
Please login to add a commentAdd a comment