కంచర్ల యాదగిరిరెడ్డి: ప్రతి ఆఫీసులో రెండు రకాల ఉద్యోగులు ఉంటారు.. పనిలో ఆనందం పొందాలనుకునే వారు కొందరైతే.. పనిచేస్తున్నట్టుగా హడావుడి (షో) చేసేవాళ్లు ఇంకొందరు.
ఎవరు ఏమిటన్నది తెలుసుకోవడం కొంచెం కష్టమైన పనే.. కానీ ఐటీ కంపెనీల్లో ఇలాంటి వారిని గుర్తించేందుకు ఈ–కమ్యూనికేషన్ టెక్ కంపెనీ ‘స్లాక్’ ఒక అధ్యయనం చేసింది. ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది.మన దేశంలో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో షో చేసేవాళ్లు 43 శాతందాకా ఉన్నారని వెల్లడైనట్టు తేల్చి చెప్పింది. అంటే ప్రతి వంద మందిలో 57 మంది చక్కగా పనిచేసుకుంటూంటే.. మిగతా వారు చేసేపనికన్నా ఎక్కువగా ‘షో’ చేస్తున్నారని అభిప్రాయపడింది. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని కంపెనీల్లో ఇలాంటి ఉద్యోగులు గణనీయంగానే ఉన్నారని పేర్కొంది.
18వేల మందిని ప్రశ్నించి..
ఆఫీసుల్లో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వినియోగించే అప్లికేషన్ ‘స్లాక్’. వాట్సాప్, మెసెంజర్, సిగ్నల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇది ఆఫీసు బృందాలకు మాత్రమే పరిమితం. అయితే ఉద్యోగుల్లో పనిచేసేవాళ్లు, చేస్తున్నట్టు నటించే/హడావుడి చేసేవారిని గుర్తించేందుకు స్లాక్ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక అధ్యయనం చేపట్టింది. వివిధ దేశాల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 18వేల మందిని రకరకాల ప్రశ్నలు వేసి.. వారు ఏ రకానికి చెందినవారో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
తాజాగా ఆ అధ్యయనం నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా, జపాన్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో పనిచేస్తున్న వారిలో ‘షో’ చేసేవారే ఎక్కువని పేర్కొంది.ఇండియాలో 43 శాతం, జపాన్‌లో 37 శాతం, సింగపూర్‌లో 36 శాతం ఇలాంటి ఉద్యోగులు ఉన్నారని తెలిపింది. కానీ ఆసియాలో భాగమే అయినా దక్షిణ కొరియాలో మాత్రం దాదాపు 72 శాతం మంది ఒళ్లు వంచి బుద్ధిగా పనిచేస్తున్నారని పేర్కొంది. యూరప్, అమెరికాలలో హడావుడి చేసే ఉద్యోగులు కొంత తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది.
ఉద్యోగులు ఏమంటున్నారు?
స్లాక్ సర్వే ప్రకారం.. పలువురు ఐటీ ఉద్యోగులు తమ పనితీరును లెక్కగట్టే విధానంలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు. కేవలం ఆన్‌లైన్ స్టేటస్, ఈ–మెయిళ్లకు ఇచ్చిన సమాదానాలు వంటివాటిపై మాత్రమే కాకుండా.. పనికి సంబంధించి మేనేజర్లతో మాట్లాడిన సందర్భాలు, ఏదైనా పని పూర్తి చేసేందుకు పట్టిన గంటలు వంటివాటి ఆధారంగా పనితీరును మదింపు చేయాలని అంటున్నారు. కోవిడ్ సమయంలో మాదిరిగా రిమోట్ వర్కింగ్ లాంటి పద్ధతులే మేలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
- సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది పనివేళలు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని కోరుకుంటే.. ఇష్టమైన చోట పనిచేసే అవకాశం ఉండాలని 36శాతం మంది అభిప్రాయపడ్డారు.
- ఆఫీసుల్లో ప్రోత్సాహకాలు భిన్నంగా ఉండాలని, కార్యాలయాల్లో వసతులు పెరగాలని 32శాతం మంది భావిస్తే.. వర్క్ ఫ్రం హోమ్ కాకుండా మళ్లీ ఆఫీసులకు వచ్చి పనిచేయడంపై నిర్ణయం తీసుకోవాలని మరికొందరు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.
- ఆఫీసులలో ఒకరిద్దరు కాకుండా బృందాలుగా పనిచేయాలని, బృందంగా మేధోమథనం చేయడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు.
- సహోద్యోగులతో కలివిడిగా ఉండవచ్చునని, నాలుగు మాటలు మాట్లాడుకోవచ్చని తెలిస్తేనే మళ్లీ ఆఫీసులకు వెళతామని మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో 84శాతం మంది ఉద్యోగులు చెప్పడం గమనార్హం.
పని చేయకున్నా ‘ఆన్‌లైన్’
కొందరు ఉద్యోగులు తాము పెద్దగా పనేమీ చేయకపోయినా యాక్టివ్‌గా ఉన్నామని చూపుకొనేందుకు ప్రయత్నిస్తుంటారని స్లాక్ అధ్యయనం వెల్లడించింది. ఇలాంటి 63 శాతం మంది ఉద్యోగులు యాప్స్‌లో తమ స్టేటస్ ‘ఆన్‌లైన్’ అని ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది.
మీటింగ్‌లతోనే సరి!
తమకు మీటింగ్‌లలో, ఈ–మెయిళ్లకు సమాధానాలు ఇవ్వడంతోనే రోజంతా గడచిపోతోందని.. దీనివల్ల తాము ఉత్పాదకత ఎక్కువగా ఉండే పనులు చేయలేకపోతున్నామని సింగపూర్ ఉద్యోగుల్లో 44 శాతం మంది పేర్కొన్నట్టు స్లాక్ అధ్యయనం వెల్లడించింది.
స్లాక్ ఏమంటోంది?
ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి పనితీరును, ఉత్పాదకతను అంచనా వేసేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రమాణాలు విజిబిలిటీ, యాక్టివిటీ అని రెండు రకాలు. ఉద్యోగి ఆన్‌లైన్‌లో ఎన్ని గంటలు ఉన్నాడు? ఎన్ని ఈ–మెయిళ్లు పంపాడు? వంటి వివరాల ఆధారంగా 27శాతం మేనేజర్లు ఉత్పాదకతను నిర్ణయిస్తుంటారని స్లాక్ సర్వే చెప్తోంది. ఉద్యోగులు అసలు పనిలో ఉత్పాదకత ఎంత పెంచారనేది మేనేజర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్లాక్ టెక్నాలజీ ఎవాంజలిస్ట్ డెరెన్ లానే పేర్కొన్నారు.
ఫలితాలను బట్టి కాకుండా, కంటికి కనిపించే అంశాల ఆధారంగా ఉత్పాదకతను నిర్ణయిస్తే.. ఆ కంపెనీ ఉద్యోగులు పనిచేస్తున్నట్టు నటించేందుకే ఇష్టపడతారని చెప్పారు. ఈ తీరువల్ల ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందని.. పనితో సంబంధం లేకుండా ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడపడం, వచ్చిన ఈ–మెయిళ్లకు వెంటనే సమాధానాలు చెప్పడంలో బిజీగా మారిపోతున్నారని, లేదంటే అవసరమున్నా లేకపోయినా అన్ని మీటింగ్‌లకూ హాజరవుతున్నారని స్లాక్ అధ్యయనంలో తేలిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment