difficult
-
సానుకూల దృక్పథం
అంతా మన మంచికే అనే మంత్రిగారి కథ అందరికీ తెలిసినదే. ‘‘అంతా మన మంచికే’’ అనే మంత్రిగారు రాజుగారి చిటికెనవేలు తెగితే కూడా అదే మాట అని చెరసాల ΄ాలు అయ్యారు. వేటకి వెళ్ళిన రాజుని ఆటవిక జాతివారు తమ దేవతకు బలి ఇవ్వబోయారు. చిటికెనవేలు లేక΄ోవటంతో అంగవైకల్యం ఉన్న వ్యక్తి బలికి పనికి రాడు అని వదిలి పెట్టారు. రాజు తిరిగి వచ్చి మంత్రిని విడుదల చేసి, ‘‘నాకు మీ రన్నట్టు మంచే జరిగింది, మీకు ఏం మంచి జరిగింది?’’ అని అడిగాడు. అందుకు మంత్రి ‘‘అది కూడా నా మంచికే జరిగింది. చెరసాలలో లేక΄ోతే తప్పకుండా మీతో వేటకి వచ్చే వాడిని. అంగవైకల్యం ఉన్న మిమ్మల్ని వదిలేసి అప్పుడు ఏ అవయవ లోపమూ లేని నన్ను బలి ఇచ్చేవారు’’ అని చె΄్పాడు. ఇది అతి మామూలు కథ. కానీ, దేనినైనా సానుకూల దృక్పథంతో ఎట్లా చూడాలి, దాని వల్ల ప్రయోజనం ఏమిటి? అన్న విషయాలు అర్థం అవుతాయి. కొన్ని ఆ క్షణాన ఇబ్బంది కలిగించేవిగా, అయిష్టంగా అనిపించ వచ్చు. కానీ, మనకి ఏది మంచో మనకన్నా ప్రకృతికే బాగా తెలుసు. ఆ ప్రకృతినే విశ్వం అని, దైవం అని, ఎనర్జీ అని రక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వేసవి కాలంలో ఎటువంటి పళ్ళు, కూరలు ఆరోగ్యానికి మంచివో వాటినే ఇస్తుంది ప్రకృతి. వర్షాకాలంలో మామిడిపళ్ళు తినాలి అనిపించినా దొరకవు. ఎందుకో తెలుసా? ఆ వాతావరణానికి మామిడిపండు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. దొరికితే మామిడిపండు తినకుండా ఉండలేం. మన మంచికోసం దొరక కుండా చేసింది ప్రకృతి. ఈ దృక్పథం అలవాటయిన వారికి జీవితం కష్టాలమయంగా కనిపించదు. దేనినైనా తేలికగా తీసుకొని ముందుకి సాగటం ఉంటుంది. అట్లా అయితే వారి జీవితాల్లో కష్టాలు ఉండవా? ఉంటాయి, కానీ కన్నీళ్ళు ఉండవు. కష్టపడకుండా ఏదీ లభించదు. అది భౌతికమైనది. దాన్ని ఏదోవిధంగా దాటవచ్చు. మనస్సుకి ఎక్కించుకుంటే వేదన మిగులుతుంది.ఆ కాస్త ఇబ్బందిని అయినా ఎందుకు భరించాలి? అనే సందేహం వస్తుంది. కానీ మనం ఆ పరిస్థితిని మార్చలేము కదా! అప్పుడు కూడా అంతా మన మంచికే అనుకుంటే అద్భుతం జరుగుతుంది. దీని వల్ల మంచే జరుగుతుంది అనే సానుకూల భావన వల్ల మన మనసు సానుకూల భావతరంగాలను ప్రసరింప చేస్తుంది. భావతరంగాలు పరిసరాలని, పరిస్థితులని, వ్యక్తులని కూడా ప్రభావితం చేస్తాయి. దానివల్ల ముందుగా వాతావరణం, తరువాత మనస్సు ప్రశాంత మవుతాయి. పరిస్థితులు చక్కబడతాయి. దానికి కారణం నెమ్మదించిన మనస్సు. ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, ఎఖార్ట్ వంటి ఆధునిక మనస్తత్వశాస్త్రవేత్తలు కూడా ఆలోచనని అనుసరించే పరిస్థితులు ఉంటాయి అని ప్రయోగాత్మకంగా నిరూపించారు. వేలికి దెబ్బ తగిలింది అని బాధపడటం కన్న చెయ్యి, కాలూ బాగున్నందుకు సంతోషించటం నేర్చుకోవాలి. సరైన చెప్పులు లేవని ఏడుస్తున్న కొడుకుకి కాళ్ళు లేని వాడిని చూపించాడుట తండ్రి. అప్పుడు లోటు ఉన్నా బాధ పడటం ఉండదు. సంతోషమే ఉంటుంది. సంతోషంగా ఉంటే ‘హాపీ హార్మోనులు’ విడుదల అవుతాయి. సంతోషం, ఆనందం బాహ్యమైన వస్తువులు, పరిస్థితుల పైన కాక దృక్పథం మీద ఆధార పడి ఉంటాయి. పురుటి నొప్పులు పడనిదే శిశువు లోకంలో అడుగు పెట్టటం కుదరదు. బిడ్డ చిరునవ్వు చూడగానే నొప్పుల సంగతి మరపుకి వస్తుంది. సాన పెట్టనిదే వజ్రం మెరవదు. నమలనిదే పదార్థం రుచి తెలియదు. గంధపుచెక్కని అరగదీయనిదే మంచిగంధం రాదు. చివరికి కుంకుడుకాయ రసం కావాలి అన్నా గట్టిగా పిసకాలి. ఇతర పళ్ల రసం గురించి చెప్ప నక్కర లేదు. గట్టిగా పిండనిదే రసం రాదు. ఈ కష్టం మెఱుగుదల కోసమే అని అర్థం చేసుకుంటే సమస్య లేదు. దానిని కూడా వ్యాయామం మొదలైనవి చేసినప్పుడు ΄÷ందే సుఖం లాగా ఆనందించవచ్చు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
ఇంటర్‌లోనే ఇలా ఎందుకు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఎందుకు తక్కువగా ఉంటుందనే విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. 2024లో జరిగబోయే పరీక్షల్లో దీనిని అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎక్కువగా ఏ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్నారు? వారికి రివిజన్ చేయడం ఎలా? అనే అంశాలపై జిల్లాల వారీగా నివేదికలు కోరారు. రెసిడెన్షియల్, గురుకులాల్లో మంచి ఫలితాలు వస్తున్నా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. కోవిడ్ తర్వాత 70 శాతం రిజల్ట్ కష్టంగా ఉందని గుర్తించారు. మెరుగైన ఫలితాలు సాధించే సిబ్బందిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. కారణాలేంటి? 2023లో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ 4,33,082 మంది విద్యార్థులు రాయగా, వీరిలో 2,72,280 మంది ఉత్తీర్ణులయ్యారు. 63 శాతం రిజల్ట్ వచ్చింది. ద్వితీయ సంవత్సరంలో 4,19,267 మంది పరీక్ష రాస్తే, 2,65,584 (63 శాతం) పాసయ్యారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్ సెకండియర్‌లో కనీసం 50 శాతం కూడా పాసవ్వలేదు. జగిత్యాల (23శాతం), సూర్యాపేట (30శాతం), సిద్ధిపేట (34శాతం), నిర్మల్ (49శాతం) జిల్లాలు ఈ కోవలో ఉన్నాయి. పెద్దపల్లి, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌బాద్, కరీంనగర్, వనపర్తి, జనగాం, జిల్లాల్లో 48 శాతం లోపే ఫలితాలొచ్చాయి. నారాయణపేట (100శాతం) మినహా మరే ఇతర జిల్లాలోనూ 75 శాతం ఫలితాలు కనిపించలేదు. 68 శాతం ఫలితాలు ప్రైవేటు కాలేజీల్లో ఉంటుంటే, ప్రభుత్వ కాలేజీల్లో 32 శాతం మించడం లేదు. ఈ పరిస్థితికి గల కారణాలపై ఇంటర్ అధికారులు దృష్టి పెట్టారు. సకాలంలో సిలబస్ పూర్తి కాకపోవడమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. రివిజన్ ఏమాత్రం జరగడం లేదని తెలుసుకున్నారు. జనవరి రెండోవారంలో సిలబస్ పూర్తి చేసి, మిగతా రోజుల్లో రివిజన్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. సీఈసీ...హెచ్‌ఈసీలోనే ఎక్కువ ► విద్యార్థులు ఎక్కువగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోనే చేరుతున్నారు. సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో తక్కువగా చేరినా, వారిలోనూ చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ► గత ఏడాది సీఈసీలో 98 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే అందులో 37 వేల మంది (37 శాతం) మాత్రమే 2023లో ఉత్తీర్ణులయ్యారు. ► బైపీసీ గ్రూపులో లక్ష మంది పరీక్ష రాస్తే, 64 వేల మంది (64.14) పాసయ్యారు. ► హెచ్ఈసీలో 11,294 మంది పరీక్ష రాస్తే, 3,408 మంది (30.18 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ రిజల్ట్స్ ఇలా ఉంటే.. సెకండియర్‌లో ఫలితాలు మరీ తగ్గుతున్నాయి. ► ఎంపీసీలో గరిష్టంగా 72 శాతం, బైపీసీలో 67 శాతం ఫలితాలు ఉంటే, హెచ్ఈసీలో 46 శాతం సీఈసీలో 47 శాతం ఉంటోంది. హెచ్ఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఫస్టియర్‌లో సరిగా బోధన జరగడం లేదని బోర్డు అధికారులు గుర్తించారు. ఈ రెండు గ్రూపులు ఎక్కువగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనే ఉంటున్నాయి. ఈసారి మెరుగైన ఫలితాల దిశగా క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
పని చేసేవారు కొందరైతే.. హడావుడి చేసేవారు మరికొందరు!
కంచర్ల యాదగిరిరెడ్డి: ప్రతి ఆఫీసులో రెండు రకాల ఉద్యోగులు ఉంటారు.. పనిలో ఆనందం పొందాలనుకునే వారు కొందరైతే.. పనిచేస్తున్నట్టుగా హడావుడి (షో) చేసేవాళ్లు ఇంకొందరు. ఎవరు ఏమిటన్నది తెలుసుకోవడం కొంచెం కష్టమైన పనే.. కానీ ఐటీ కంపెనీల్లో ఇలాంటి వారిని గుర్తించేందుకు ఈ–కమ్యూనికేషన్ టెక్ కంపెనీ ‘స్లాక్’ ఒక అధ్యయనం చేసింది. ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది.మన దేశంలో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో షో చేసేవాళ్లు 43 శాతందాకా ఉన్నారని వెల్లడైనట్టు తేల్చి చెప్పింది. అంటే ప్రతి వంద మందిలో 57 మంది చక్కగా పనిచేసుకుంటూంటే.. మిగతా వారు చేసేపనికన్నా ఎక్కువగా ‘షో’ చేస్తున్నారని అభిప్రాయపడింది. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని కంపెనీల్లో ఇలాంటి ఉద్యోగులు గణనీయంగానే ఉన్నారని పేర్కొంది. 18వేల మందిని ప్రశ్నించి.. ఆఫీసుల్లో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వినియోగించే అప్లికేషన్ ‘స్లాక్’. వాట్సాప్, మెసెంజర్, సిగ్నల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇది ఆఫీసు బృందాలకు మాత్రమే పరిమితం. అయితే ఉద్యోగుల్లో పనిచేసేవాళ్లు, చేస్తున్నట్టు నటించే/హడావుడి చేసేవారిని గుర్తించేందుకు స్లాక్ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక అధ్యయనం చేపట్టింది. వివిధ దేశాల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 18వేల మందిని రకరకాల ప్రశ్నలు వేసి.. వారు ఏ రకానికి చెందినవారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ అధ్యయనం నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా, జపాన్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో పనిచేస్తున్న వారిలో ‘షో’ చేసేవారే ఎక్కువని పేర్కొంది.ఇండియాలో 43 శాతం, జపాన్‌లో 37 శాతం, సింగపూర్‌లో 36 శాతం ఇలాంటి ఉద్యోగులు ఉన్నారని తెలిపింది. కానీ ఆసియాలో భాగమే అయినా దక్షిణ కొరియాలో మాత్రం దాదాపు 72 శాతం మంది ఒళ్లు వంచి బుద్ధిగా పనిచేస్తున్నారని పేర్కొంది. యూరప్, అమెరికాలలో హడావుడి చేసే ఉద్యోగులు కొంత తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ఉద్యోగులు ఏమంటున్నారు? స్లాక్ సర్వే ప్రకారం.. పలువురు ఐటీ ఉద్యోగులు తమ పనితీరును లెక్కగట్టే విధానంలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు. కేవలం ఆన్లైన్ స్టేటస్, ఈ–మెయిళ్లకు ఇచ్చిన సమాదానాలు వంటివాటిపై మాత్రమే కాకుండా.. పనికి సంబంధించి మేనేజర్లతో మాట్లాడిన సందర్భాలు, ఏదైనా పని పూర్తి చేసేందుకు పట్టిన గంటలు వంటివాటి ఆధారంగా పనితీరును మదింపు చేయాలని అంటున్నారు. కోవిడ్ సమయంలో మాదిరిగా రిమోట్ వర్కింగ్ లాంటి పద్ధతులే మేలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది పనివేళలు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని కోరుకుంటే.. ఇష్టమైన చోట పనిచేసే అవకాశం ఉండాలని 36శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆఫీసుల్లో ప్రోత్సాహకాలు భిన్నంగా ఉండాలని, కార్యాలయాల్లో వసతులు పెరగాలని 32శాతం మంది భావిస్తే.. వర్క్ ఫ్రం హోమ్ కాకుండా మళ్లీ ఆఫీసులకు వచ్చి పనిచేయడంపై నిర్ణయం తీసుకోవాలని మరికొందరు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఆఫీసులలో ఒకరిద్దరు కాకుండా బృందాలుగా పనిచేయాలని, బృందంగా మేధోమథనం చేయడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. సహోద్యోగులతో కలివిడిగా ఉండవచ్చునని, నాలుగు మాటలు మాట్లాడుకోవచ్చని తెలిస్తేనే మళ్లీ ఆఫీసులకు వెళతామని మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో 84శాతం మంది ఉద్యోగులు చెప్పడం గమనార్హం. పని చేయకున్నా ‘ఆన్లైన్’ కొందరు ఉద్యోగులు తాము పెద్దగా పనేమీ చేయకపోయినా యాక్టివ్‌గా ఉన్నామని చూపుకొనేందుకు ప్రయత్నిస్తుంటారని స్లాక్ అధ్యయనం వెల్లడించింది. ఇలాంటి 63 శాతం మంది ఉద్యోగులు యాప్స్‌లో తమ స్టేటస్ ‘ఆన్లైన్’ అని ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది. మీటింగ్‌లతోనే సరి! తమకు మీటింగ్‌లలో, ఈ–మెయిళ్లకు సమాధానాలు ఇవ్వడంతోనే రోజంతా గడచిపోతోందని.. దీనివల్ల తాము ఉత్పాదకత ఎక్కువగా ఉండే పనులు చేయలేకపోతున్నామని సింగపూర్ ఉద్యోగుల్లో 44 శాతం మంది పేర్కొన్నట్టు స్లాక్ అధ్యయనం వెల్లడించింది. స్లాక్ ఏమంటోంది? ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి పనితీరును, ఉత్పాదకతను అంచనా వేసేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రమాణాలు విజిబిలిటీ, యాక్టివిటీ అని రెండు రకాలు. ఉద్యోగి ఆన్లైన్లో ఎన్ని గంటలు ఉన్నాడు? ఎన్ని ఈ–మెయిళ్లు పంపాడు? వంటి వివరాల ఆధారంగా 27శాతం మేనేజర్లు ఉత్పాదకతను నిర్ణయిస్తుంటారని స్లాక్ సర్వే చెప్తోంది. ఉద్యోగులు అసలు పనిలో ఉత్పాదకత ఎంత పెంచారనేది మేనేజర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్లాక్ టెక్నాలజీ ఎవాంజలిస్ట్ డెరెన్ లానే పేర్కొన్నారు. ఫలితాలను బట్టి కాకుండా, కంటికి కనిపించే అంశాల ఆధారంగా ఉత్పాదకతను నిర్ణయిస్తే.. ఆ కంపెనీ ఉద్యోగులు పనిచేస్తున్నట్టు నటించేందుకే ఇష్టపడతారని చెప్పారు. ఈ తీరువల్ల ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందని.. పనితో సంబంధం లేకుండా ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడపడం, వచ్చిన ఈ–మెయిళ్లకు వెంటనే సమాధానాలు చెప్పడంలో బిజీగా మారిపోతున్నారని, లేదంటే అవసరమున్నా లేకపోయినా అన్ని మీటింగ్‌లకూ హాజరవుతున్నారని స్లాక్ అధ్యయనంలో తేలిందని వివరించారు. -
Zaouli: ప్రపంచంలోనే అత్యంత కష్టమైన డ్యాన్స్!
వైరల్: ఈ ప్రపంచంలో ఏదైనా పనిని.. అత్యంత కష్టమైందని ఎలా నిర్ణయిస్తారు?. ఆ పని కోసం పడే కష్టం, సాధన, ఫలితం కోసం ఎదురుచూపులు.. ఈ మొత్తం వ్యవహారానికి పట్టే సమయం.. ఇలా రకరకాల అంశాలను బట్టి ఉంటుంది అది. అలా ఈ భూమ్మీద అత్యంత కష్టతరమైన డ్యాన్స్ ఏదో తెలుసా?.. నాట్ సాల్సా.. నాట్ ఫ్లేమెన్కో మై బ్రదర్. ఇట్స్ ఔలీ. అవును.. ఈ నృత్యానికి ప్రపంచంలోనే అత్యంత కష్టమైన డ్యాన్స్‌గా పేరు ముద్రపడింది. ఔలీ నృత్యం.. మెరుపు కదలికల విన్యాసాలకు కేరాఫ్. అథ్లెటిక్ తరహా మూమెంట్స్ ఉంటాయి ఇందులో. ఆ నృత్యం బాగా రావాలంటే.. ప్రదర్శకులు తీవ్రమైన శిక్షణ పొందాలి. కఠోరమైన సాధన తీసుకోవాలి. డ్రమ్స్, ఇతర వాయిద్యాల భారీ శబ్ధాల నడుమ ఏమాత్రం శ్రుతి తప్పినా కిందపడిపోవడం ఖాయం!. అలాంటి ఔలీ నృత్యానికి సంబంధించిన వీడియో(పాత) ఒకటి వైరల్ అవుతోంది ఇప్పుడు. మీరూ చూసేయండి. This is "Zaouli" dance of Central Ivory Coast and is labelled as the most impossible dance in the world! pic.twitter.com/1F3SSzhF3O — Figen (@TheFigen_) January 12, 2023 ఔలీ నేపథ్యం.. పశ్చిమ ఆఫ్రికా దేశం ఐవరీ కోస్ట్‌లో.. బండమా నదీలోయ ప్రాంతంలో గురో తెగ ప్రజలు నివసిస్తున్నారు. గురో సంప్రదాయంలో ఔలీ ఒక భాగం. తరతరాల నుంచి పురుషులు ఈ సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నారు. బృందాలుగా ముసుగులు వేసుకుని, సంప్రదాయ రీతిలో దుస్తులు ధరించి చేయడం ఈ నృత్యం ప్రత్యేకత. గవ్వలు, గంటలు, ఇతర డెకరేషన్లు ఉంటాయి ఆ దుస్తులకు. ఆ దుస్తుల్ని చనిపోయిన పెద్దలకు, తమ ఆవాసాల చుట్టుపక్కల నివసించే జంతువులకు గౌరవార్థంగా భావిస్తారు వాళ్లు. ఉత్సవాల టైంలోనే పాటు ప్రత్యేక సందర్భాల్లోనూ ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు వీళ్లు. -
రష్యా బలగాలకు ఆకస్మిక ఆదేశాలు.. భయాందోళనలో ఉక్రెయిన్
రష్యాలో భాగంగా ప్రకటించిన ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాల్లో గట్టి భద్రత తోపాటు నిఘాను పెంచాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సడెన్‌గా దళాలకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉందని మరింత భద్రత ఏర్పాటు చేయాలని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌కు ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్‌పై నిరవధిక దాడి జరిపి సెప్టెంబర్ 30న ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజ్జియా, ఖేర్సన్ తదితర ప్రాంతాలను తమ భూభాగంలోని భాగంగా ఏకపక్షంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం పుతిన్ బెలారస్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే రష్యా ఈ శీతకాలంలో ఉక్రెయిన్‌లోని విద్యుత్ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసి ఎముకలు కొరికే చలితో అల్లాడిపోయేలా చేసింది. అదీగాక ప్రస్తుతం పుతిన్ బెలారస్ పర్యటన ఉక్రెయిన్‌ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. యుద్దాన్ని మరింత తీవ్రతరం చేసే ఎత్తుగడలో భాగంగానే పుతిన్ అకస్మాత్తుగా బెలారస్లో పర్యటిస్తున్నట్లు ఆరోపించింది. అంతేకాదు రష్యా తన మిత్రదేశమైన బెలారస్‌ని ఉక్రెయిన్‌పై దాడి చేయమని ఒత్తిడి చేసే అవకాశం ఉందంటూ ఉక్రెయిన్ తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేసింది. వాస్తవానికి ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యా సిద్దమయ్యేలా చేసింది కూడా బెలారస్నే కావడం గమనార్హం. ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడి నేపథ్యంలోనే విదేశాల నుంచి వచ్చే బెదిరింపులు, స్వదేశంలోని దేశద్రోహులు తదితరాల దృష్ట్యా పుతిన్ గట్టి నిఘా ఉంచాలని దళాలను ఆదేశించారు కూడా. పుతిన్ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో ఇరు దేశాలకు ఒకే రక్షణ స్థలం ఏర్పాటు గురించి చర్చించనున్నట్లు సమాచారం. కానీ పుతిన్ పొరుగు దేశాన్ని మింగేయడానికి ఇదోక ఎత్తుగడని పలు దేశాలు విమర్శలు గుప్పించాయి. ఐతే రష్యా మాత్రం ఎలాంటి విలీనానికి మాస్కోకి ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. అలాగే ఉక్రెయిన్‌లోకి తమ దేశ సైన్యాన్ని పంపే ఉద్దేశం కూడా తనకు లేదని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ కూడా పదేపదే చెబుతున్నాడు. కానీ పలువురు విశ్లేషకులు ఉక్రెయిన్‌పై దాడుల కోసం రష్యా బెలారసియన్ సైనికులు మద్దతును కోరుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం ఈ యుద్ధాన్ని మరింత వేగవంతంగా ముగించేలా పశ్చిమ దేశాలు తమకు ఆయుధ సంపత్తి తోపాటు కొత్త రక్షణ సామర్థ్యాలను అందిస్తాయని చెప్పారు. (చదవండి: ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం.. రష్యా మాస్టర్ ప్లాన్‌తో తీవ్ర ఇబ్బందులు) -
అత్యంత సంక్లిష్ట దశలో ప్రజాస్వామ్యం
న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యం అత్యంత సంక్లిష్ట దశలో ఉందని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ఆమె ఆదివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జుల సమావేశంలో మాట్లాడారు. ఎన్డీయే సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. వివిధ కీలక అంశాల్లో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. హరిత విప్లవం ఫలితాలను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇటీవల తీసుకొచ్చిన సాగు చట్టాలు కోట్లాది రైతులు, కౌలుదారులు, కూలీల పాలిట మరణ శాసనాలేనని అన్నారు. కేంద్ర సర్కారు కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే కరోనా విజృంభిస్తోందని ఆరోపించారు. 21 రోజుల్లో కరోనాను ఓడిస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులపై అరాచకాలు పెరిగిపోయాయని, బాధితుల గొంతులను నొక్కేయడమేనా కొత్త రాజధర్మం అని నిలదీశారు. -
ఇండియన్ ఈవీఎంల ట్యాంపరింగ్ కష్టం
వాషింగ్టన్: భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం చాలా కష్టమని ప్రముఖ అమెరికన్ నిపుణుడు గెల్బ్ పేర్కొన్నారు. ఈ ఈవీఎంలు ఆఫ్‌లైన్‌లో పనిచేయడం వల్ల స్వతంత్ర యూనిట్లుగా ఉంటాయని తెలిపారు. ‘భారత్‌లో వాడుతున్న ఈవీఎంలలో ఉపయోగించిన సాంకేతికత నమ్మదగినదని నేను చేసిన అధ్యయనంలో స్పష్టమైంది. ఏ టెక్నాలజీ నిర్దిష్టమైనది కాదు. కానీ భారత్‌లో వాడుతున్న ఈవీఎంలు ఆఫ్‌లైన్‌లో పనిచేస్తున్నాయి. అందుకే వాటిని నేరుగా మాత్రమే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. మరో విధంగా చేయలేం’అని పేర్కొన్నారు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలను మాస్ ట్యాంపరింగ్ చేయడం కష్టమని తాను చేసిన పరిశోధనల్లో తేలిందని గెల్బ్ పేర్కొన్నారు. ఇది కేవలం ఒక స్వతంత్ర ఎలక్ట్రానిక్ పరికరమని, ఇతర దేశాల్లో ఓటు వేసే విధానాలకు ఇది భిన్నంగా ఉంటుందని గెల్బ్ అన్నా రు. ఈవీఎంలను పరిశీలించకుండా, ఒక సమన్వయ ప్రాతిపదిక లేకుండా ట్యాంపరింగ్ చేయడం కష్టమన్నారు. అంతేకాకుండా వీవీప్యాట్ల వల్ల ఎన్నికల్లో విశ్వసనీయత, వాస్తవికత ఉంటుందన్నారు. -
దైవ సంకల్పంలోని ఆంతర్యమే వేరు
ఒక పిచ్చుక తల దాచుకోవడం కోసం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంది. ఎంతో శ్రమకోర్చి ఒక్కొక్క పుల్లనూ నోట కరచుకొచ్చి చక్కని గూడు నిర్మించుకుంది. హాయిగా అందులో నివసించ సాగింది. కొన్నాళ్ళు అలా సంతోషంగా గడిచిపోయింది. కాని ఒక రోజు అకస్మాత్తుగా గాలి దుమారం వచ్చి గూడు చెదిరిపోయింది. పిచ్చుక బజారుపాలయింది. అనేక రోజులపాటు, ఎంతగానో కష్టపడి, ఇష్టంగా, అందంగా కట్టుకున్న తన కలలసౌధం చూస్తూ చూస్తూనే క్షణాల్లో చెల్లా చెదురయ్యేసరికి పిచ్చుకకు దుఃఖం పొంగుకొచ్చింది.తన రెక్కల కష్టమంతా తుఫాను పాలవడంతోఎంతగానో దుఖిస్తూ..‘దేవా..!ఎంతో కష్టపడి ఒక్కొక్క పుల్లనూ సమీకరించి చిన్నఇల్లు కట్టుకుంటే, నువ్వు తుఫానును పంపించి నా ఇల్లు కూల్చేశావే.. నేను మళ్ళీ గూడు కట్టుకోవాలంటే ఎంత కష్టమో గదా.. నన్నెందుకు ఇలా చేశావు.. నీకిది న్యాయమా.?’అంటూ దైవంతో మొరపెట్టుకుంది. అప్పుడు దైవం ఇలా అన్నాడు.‘ఓసి పిచ్చిమొఖమా..! నీ ప్రాణాలు రక్షించడానికే అలా చేయవలసి వచ్చింది. నువ్వు గూడు కట్టుకొని హాయిగా పడుకున్నావు.. కాని ఒక పాము నిన్ను కాటేసి, నీ పిల్లల్ని తినెయ్యడానికి నీ గూటివైపు వస్తుండడంతో, నేను చిన్నపాటి గాలిని పంపించాను. దాంతో నీ గూడు చెదిరి నువ్వు ఎగిరిపొయ్యావు. నీ ప్రాణాలు రక్షించబడ్డాయి. లేకపోతే పాముకు ఫలహారమయ్యేదానివి.’ అన్నాడు దైవం.పిచ్చుకకు అసలు విషయం అర్థమై వినమ్రతతో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంది.అల్లాహ్ కరుణామయుడు. ఆయన కారుణ్యం భూమ్యాకాశాలను పరివేష్టించి ఉంది. ఒక్కొక్కసారి ఆయన మనకేదో నష్టం చేశాడు అనిపిస్తుంది. కాని అందులోనే మన మేలుందన్న విషయం మనకు తెలియదు. మనకు ఎందులో మేలుందో, ఎందులో కీడుందో మనల్ని సృష్టించిన వాడికే బాగా తెలుసు. కనుక లాభం కలిగినా, నష్టం కలిగినా దైవం తరఫునే అని, అందులోనే మన శ్రేయం దాగుందని గ్రహించాలి. ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
చెలిమనీరే దిక్కు..
సాక్షి, ఏటూరునాగారం: గిరిజనులకు చెలిమల నీరే తాగునీరు. వేసవి కాలం కావడంతో వాగుల్లో నీరు ఎండిపోయి కాల్వలను తలపిస్తున్నాయి. దీంతో గిరిపుత్రులు దప్పిక తీర్చుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుత వేసవిలో ములుగు జిల్లా ఏజెన్సీ పరిధి 7 మండలాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడంలేదు. ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, గోవిందరావుపేటతోపాటు వాజేడు, వెంకటాపురం మండలాల్లోని అటవీ ప్రాంతంలో సుమారు 50 గొత్తికోయగూడేలు ఉండగా.. వాటిలో 3 వేల మంది జనాభా నివాసం ఉంటోంది. వీరికి సరైన తాగునీటి వసతి లేక సమీపంలోని వాగులు, తోగుల నుంచి నీటిని తెచ్చుకుని తాగడానికి వినియోగిస్తున్నారు. ఎండలకు వాగుల్లో నీరు లేకపోవడంతో చెలిమలు తీసీ ఊటగా వచ్చిన నీటిని బిందెల్లో వడబోసి ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి నీటిని తాగడం వల్ల ఒంటిపై దద్దుర్లు, చర్మవ్యాధులు, ఇతర జబ్బులు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. పటికబెల్లంతో నీటి శుద్ధి.. వాగులు, చెలిమల నుంచి తెచ్చిన నీరు మురికిగా ఉంటుంది. ఆ నీటిలో పటికబెల్లం వేసి రెండు గంటల పాటు ఉంచితే శుద్ధి అయి తేటగా మారిన తర్వాత తాగడానికి ఉపయోగిస్తుంటా రు. దీనికితోడు చిల్లిగిజ్జలను సైతం బిందెలో వేస్తే నీటిలో ఉన్న మలినాలు అడుగుకుపోయి తేటగా మారతాయి. నీటిని శుద్ధి చేయడానికి గిరిజనులు ఈ పద్ధతులను అవలంభిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఇది పూర్తి స్థాయి రక్షిత విధానం కాకపోవడంతో రోగాలపాలవుతున్నారు. గిరిజనులకు తాగునీటి కోసం ఐటీడీఏ నుంచి ఎలాంటి స దుపాయం ఏర్పాటు చేయడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కొత్తగా ఆలోచించండి
ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టి ‘నేను ఫలానా షోరూమ్‌లో షాపింగ్ చేశాను, నేను ఫలానా చోటికి పిక్నిక్కి వెళ్లాను, లైక్‌లు కొట్టండి’ అని అడగరామె. ‘ఈ వ్యక్తికి ఈ అవసరం ఉంది. నేనింత వరకు చేయగలిగాను, తలా ఓ చెయ్యి వేస్తే వాళ్ల కష్టం తీరుతుంది. మానవత్వంతో స్పందించండి ప్లీజ్’ అనే పోస్ట్‌లు మాత్రమే చేస్తారు. ఆ పోస్ట్‌కి స్పందించిన వాళ్లు తమకు తోచిన సాయం చేస్తుంటారు. జగిత్యాలకు చెందిన ఆ ఆరేళ్ల కౌశిక్‌కి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయాల్సి ఉందని ఫేస్బుక్ ద్వారా తెలుసుకుని, వెంటనే గ్లోబల్ హాస్పిటల్‌కి వెళ్లారామె. ఆ తల్లిని, పిల్లాడిని పరామర్శించి కట్టుబట్టలతో వచ్చిన వాళ్లకు అవసరమైన దుస్తులు కొనిచ్చి ఆపరేషన్‌కి కొంత డబ్బిచ్చారు. పిల్లాడి తల్లిని ఓదారుస్తున్న ఫొటోతోపాటు ఫేస్బుక్లో ఆపరేషన్‌కు ఇరవై లక్షలవుతాయనే విషయాన్నీ తెలియచేశారు. తనవంతుగా ఒక ప్రయత్నమైతే మొదలైంది. కానీ ఆపరేషన్‌కు అవసరమైనంత డబ్బు సమకూరుతుందో లేదో ఊహకందడం లేదు. ‘ఎవరూ ముందుకు రాకపోతే ముఖ పరిచయం ఉన్న వాళ్లందరినీ బతిమలాడి అయినా డబ్బు సమకూరుస్తాం. ఆపరేషన్ మొదలు పెట్టండి’ అని డాక్టర్లను ఒప్పించారు. నిస్వార్థంగా ఒక మంచి మొదలు పెడితే అవసరమైనవన్నీ వాటంతట అవే సమకూరుతాయి. సరిగ్గా కృష్ణవేణి ప్రయత్నం కూడా అలాగే విజయవంతమైంది. ఒకరు ఏకంగా రెండు లక్షలు విరాళం ఇచ్చారు. అనేక మంది తమకు తోచినంత ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేకి తెలిసి కొంత సాయం చేశారు. పిల్లాడికి ఆపరేషన్ జరిగింది. రాత్రి ఒంటి గంట వరకు ఆ తల్లికి ధైర్యంగా పక్కనే ఉన్నారు కృష్ణవేణి. ‘ఇలాంటి పనిలో ఆత్మసంతృప్తి ఉంటుంది. నా సంతోషం కోసమే చేస్తున్నాను’ అన్నారామె. అంతరం ఇంకా ఉంది కృష్ణవేణి చేస్తున్న పనులకు పెద్దగా ప్రణాళికలు ఉండవు. తన కళ్లెదుట ఒక వార్త కనిపిస్తే ఆ వార్త రాసిన రిపోర్టర్ వివరాలు కనుక్కోవడం, అక్కడికి వెళ్లి బాధితులకు సహాయం చేయడానికి మార్గదర్శనం చేయడమే ఆమె సమాజానికి ఇస్తున్న సర్వీస్. ‘సిరిసిల్లలో నరసవ్వకు కళ్లు కనిపించవు, ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు’ అని స్థానిక వార్తాపత్రిక కథనం చూసి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లారు కృష్ణవేణి. తన వంతుగా నిత్యావసర వస్తువులు, దుస్తులు, కొంత డబ్బు ఇచ్చారు. హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు ఒక మహిళ వచ్చి సాయం చేస్తుంటే ఇక్కడుండీ చూస్తూ ఊరుకోవడమా.. అని స్థానికులు ఆమెకు ఒక గూడు కట్టిచ్చారు. అక్కడి ఇల్లంతకుంటలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బాధితులకు కూడా ఆమె చేసింది తాత్కాలిక అవసరాలు తీర్చడమే. అయితే ఆమె వేసిన తొలి అడుగును స్ఫూర్తిగా తీసుకుని మరో పదిమంది ఆమె బాటలో నడిచారు. ప్రభుత్వం ఎన్ని పథకాలు రూపొందించినా ఆ చట్రంలో ఇమడని ఎన్నో సమస్యలు పేదరికాన్ని పరిహసిస్తూనే ఉంటాయి. వాటిని అడ్రస్ చేయడమే కృష్ణవేణి సమాజానికి చేస్తున్న సేవ. అయితే ఆమె సేవ అనే మాటను అంగీకరించరు. పెద్ద కోడలు సిరిసిల్లలో పుట్టిన కృష్ణవేణి ఇంట్లో చిన్నమ్మాయి. అత్తగారింట్లో పెద్దకోడలు. ‘‘మా ఇల్లు ఎప్పుడూ బంధువులతో నిండిపోయేది. ఉదయం ఎవరూ లేకపోయినా మధ్యాహ్న భోజనం టైమ్‌కి నలుగురు అదనంగా ఉండేవాళ్లు. మా పక్క ఊళ్ల నుంచి పనుల మీద సిరిసిల్ల పట్టణానికి వచ్చిన వాళ్లకు, హాస్పిటల్లో వైద్యం, ప్రసవం కోసం వచ్చిన వాళ్లందరికీ భోజనం, విడిది మా ఇంట్లోనే. అత్తగారింటికి కరీంనగర్‌కి వెళ్తే అక్కడా దాదాపుగా అదే పరిస్థితి. వాళ్లు, వీళ్లు అనే తేడా ఉండేది కాదు ఇంట్లో. కులాలు, మతాలు, ఆర్థిక తారతమ్యాలు లేకుండా వచ్చిన అందరూ కలివిడిగా ఉండేవాళ్లు. మేము హైదరాబాద్‌కి వచ్చినా ఇప్పటికీ ఆ ఆనవాయితీ కొనసాగుతోంది. గత నెలలో కూడా బంధువులావిడ కంటి ఆపరేషన్ చేయించుకుని మా ఇంట్లోనే ఉండి గత వారమే ఊరికి వెళ్లింది. అలాంటి ఇంటి వాతావరణమే నాకు మనుషుల కష్టానికి స్పందించే మనసునిచ్చింది. కష్టంలో ఉన్న వారి కష్టాన్ని మనం తీసి పక్కన పెట్టలేక పోవచ్చు. కానీ నాలుగు మంచి మాటలు చెప్పి, జీవితం పట్ల ధైర్యాన్ని కలిగించడానికి, ఓదార్పునివ్వడానికి మన ఆస్థులు ఖర్చయిపోవు కదా!. నా పిల్లలు పెద్దయ్యారు. భర్త ప్రభుత్వ ఉద్యోగి. నాకు రోజులో ఐదారు గంటల ఫ్రీ టైమ్ ఉంటుంది. వైద్యం కోసం మా ఇంటికి వచ్చిన వాళ్లను హాస్పిటల్‌కి తీసుకెళ్తాను. అక్కడ నాకు ఎవరైనా అవసరంలో ఉన్నట్లు కనిపిస్తే చేయగలిగింది చేస్తాను. ఎదుటి వాళ్ల కష్టాన్ని మన మనసుతో చూస్తే పరిష్కారానికి ఒక మార్గం కనిపిస్తుంది’’ అన్నారు కృష్ణవేణి. ఔదార్యమే జీవితం ‘పేదరికాన్ని మించిన శాపం మరొకటి ఉండదు. ఆ శాపంతో బతుకు పోరాటం చేస్తున్న వాళ్లను ఈసడించుకుని పక్కకు తప్పుకుని పోవడం కాదు జీవితమంటే. అన్నీ అమరిన తన విస్తరిలో నుంచి ఆకలితో ఉన్న వాళ్లకు ఒక పిడికెడు మెతుకులు పెట్టగల ఔదార్యమే జీవితం’. కృష్ణవేణి నమ్ముతున్న ఫిలాసఫీ ఇది, ఆమె అనుసరిస్తున్న ఫార్ములా కూడా అదే. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ‘మలేసియా తెలుగు సంఘం’ కృష్ణవేణికి సేవా విభాగంలో పురస్కారం అందించింది. ఆ అవార్డు అందుకుని ఇండియాకి వచ్చిన కృష్ణవేణి.. మహిళా దినోత్సవం రోజు వికలాంగులైన మహిళలను, సురభి మహిళా కళాకారులను చీర, సారెలతో సత్కరించారు. పేదరికాన్ని పరిహసించకూడదని నమ్మే కృష్ణవేణి పదిహేనేళ్ల కిందట ఇళ్లలో పని చేసుకునే వాళ్లను తనింటికి ఆహ్వానించి భోజనం వండి పెట్టడంతో పేదవాళ్లను అక్కున చేర్చుకోవడం మొదలు పెట్టారు. ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి నిరంతరం సేవాదృక్పథం ఇంటర్‌తో చదువు మాన్పించి పెళ్లి చేశారు మా పెద్దవాళ్లు. పిల్లలు పుట్టిన తర్వాత కామర్స్‌లో డిగ్రీ, ఎల్ఎల్బి చేశాను. ఇంట్లో ఒక దశలో ముగ్గురం స్టూడెంట్స్‌మి. మా అబ్బాయి ఇంజనీరింగ్, పాప మెడిసిన్, నేను ఎల్‌ఎల్‌బిలో ఉన్నాను. మా వారు ‘ఇద్దరు పిల్లల్ని కాదు ముగ్గుర్ని చదివిస్తున్నాను’ అని నవ్వుతూ అనేవారు. ఆయన ఇంటికి వచ్చేటప్పటికి ఏదో ఒక ప్రోగ్రామ్ రెడీగా ఉంటుంది. ‘ఫలానా బ్లైండ్ స్కూల్లో పిల్లలు చలికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు స్వెట్టర్లు తీసుకెళ్దాం అని ఓ రోజు, అనాథ పిల్లల్ని సినిమాకు తీసుకెళ్దామని ఓ రోజు.. ఇలా ఏదో ఒకటి. ఓ వారం పది రోజుల పాటు కొత్త ప్రోగ్రామ్ ఏదీ చెప్పకపోతే ‘కొత్త కృష్ణవేణి కొత్తగా ఏమీ చేయడం లేదా’ అని అడుగుతారు. కొత్త కృష్ణవేణి -
ఇటు ఉద్యోగం.. అటు కుటుంబం.. కష్టమే!
ముంబై: ఇటు ఉద్యోగం.. అటు కుటుంబం .. రెండింటి మధ్య సమన్వయం, సమతౌల్యత సాధించడం కష్టంగానే ఉంటోందని దేశీయంగా అత్యధిక శాతం మంది వృత్తి నిపుణులు భావిస్తున్నారు. ఈ రెండింటి మధ్య సమతుల్యత స్థాయి ఒక మోస్తరుగానో లేదా దుర్భరంగానో ఉంటోందని 60 శాతం మంది పేర్కొన్నారు. జాబ్ కన్సల్టెన్సీ సంస్థ మాన్‌స్టర్‌డాట్‌కామ్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్థిక సేవలు, నిర్మాణ తదితర రంగాల్లో 18–55 ఏళ్ల వయస్సు గల 2,000 మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్‌పై ఈ సర్వే నిర్వహించారు. ఆఫీసు వెలుపల కూడా చాలా సందర్భాల్లో పని గురించే ఆలోచిస్తుండే వారి సంఖ్య 67 శాతంగా ఉంది. ఇక, పని సంబంధ ఒత్తిళ్ల కారణంగా వచ్చే మానసిక అనారోగ్యాల్లో నిద్ర లేమి (17 శాతం), డిప్రెషన్ (16 శాతం), చికాకు (9శాతం), హైపర్‌టెన్షన్ (4.5 శాతం) ఉండగా.. శారీరక అనారోగ్యాల్లో వెన్ను నొప్పి (15 శాతం), తరచూ తలనొప్పి.. అలసట (14 శాతం), స్థూలకాయం (5 శాతం) సమస్యలు ఉన్నాయి. -
లెక్కలు నేర్చుకుని.. రెక్కలు కట్టుకుని..!
ఊరు కాని ఊరు.. చివరిదాకా తోడుగా నిలుస్తానని బాస చేసి పెళ్లి చేసుకున్న భర్త నలుగురు పిల్లలు పుట్టాక వారి మానాన వారిని వదిలేసి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు.. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు. అయినప్పటికీ మొక్కవోని పట్టుదలతో కష్టాల కడలిని ధైర్యంగా ఈదుతూ ముందుకు సాగుతోందామె. ఎటూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమె రెక్కలు ముక్కలు చేసుకునేలా కష్టపడుతున్నప్పటికీ బ్యాంకర్లు రుణమిచ్చి చేయూతనిచ్చేందుకు నిరాకరించగా, మరోవైపు స్వయం సహాయక పొదుపు గ్రూపుల్లోనూ ఆమెను చేర్చుకోలేదు. అయినప్పటికీ అన్ని బాధలను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది ‘సవిడిబోయిన వెంకాయమ్మ’. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతానగరం గ్రామానికి చెందిన వెంకాయమ్మ ఎవరిపై ఆధారపడకుండా గత 16 ఏళ్లుగా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతిరోజూ సుమారు 30 కిలోమీటర్లు సైకిల్‌పై తిరుగుతూ వస్త్రాలు అమ్ముకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన వెంకాయమ్మ 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయిన 16 రోజులకే భర్త వెంకటేశ్వరరావుతో కలిసి సీతానగరం వచ్చింది. వెంకటేశ్వరరావు ఊరూరూ తిరిగి స్టీలుగిన్నెలు అమ్మే వ్యాపారం చేసేవాడు. ఇక్కడే వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు పుట్టారు. అయితే 16 సంవత్సరాల క్రితం భర్త వెంకటేశ్వరరావు వెంకాయమ్మను, నలుగురు పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా వెంకాయమ్మపై కోలుకోలేని భారం పడింది. నిరక్షరాస్యురాలైన వెంకాయమ్మకు తూకాలు, కొలతలు సరిగా తెలియక పోవడంతో భర్త చేసిన స్టీలు గిన్నెలు అమ్మే వ్యాపారం జోలికి పోకుండా వస్త్రాలు అమ్ముకునే పని మొదలుపెట్టింది. అలా మూడేళ్ల పాటు వస్త్రాల మూటలు నెత్తిన పెట్టుకుని చుట్టుపక్కల ఊర్లలో తిరిగి అమ్ముకునేది. దీంతో మాడు నొప్పి విపరీతంగా బాధించేది. ఇలా లాభం లేదని కష్టపడి సెకిల్ తొక్కడం నేర్చుకుంది. ఈ క్రమంలో అనేక దెబ్బలు తగిలినా పిల్లల కోసం అన్నింటినీ మౌనంగా భరించి సైకిల్‌పై తిరుగుతూ వస్త్రాలు అమ్మడం ప్రారంభించింది. రాత్రి బడికి వెళ్లి అక్షరాలు, అంకెలు నేర్చుకుంది వెంకాయమ్మ. 43 ఏళ్ల వయస్సులోనూ ఇప్పటికీ ఎండా, వాన, చలిని లెక్కచేయకుండా సైకిల్‌పై రోజూ 30 కిలోమీటర్లకు పైగా తిరుగుతూ జీవనపోరాటం చేస్తోంది. గ్రామాల్లో కూలీలు పనులకు వెళ్లకముందే వెళ్లి వస్త్రాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండడంతో తెల్లవారుజామునే సైకిల్ మీద బయటకు వెళ్లి చుట్టుపక్కల 10 నుంచి 15 ఊర్లు తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి తిరిగి వస్తుంది. మధ్యలో వరికోతలు, కలుపులు, ఇతర వ్యవసాయ కూలీ పనులకు సైతం వెళ్లేది. పైగా ఆడపిల్లలనే తేడా లేకుండా కుమార్తెలిద్దరి చదువులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది వెంకాయమ్మ. పిల్లలు ప్రయోజకులయ్యారు పెద్దకుమార్తె నాగలక్ష్మిని బీఎస్సీ నర్సింగ్ చదివించింది. నాగలక్ష్మి ఇప్పుడు హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఉద్యోగం చేస్తోంది. రెండో కుమార్తె శ్రీలతను ఈసీఈ విభాగంలో డిప్లొమా చదివించింది. శ్రీలత ప్రస్తుతం హైదరాబాద్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. మూడో సంతానమైన సందీప్ ఐటీఐ పూర్తి చేసి ప్రస్తుతం ఓపెన్ డిగ్రీ చదువుతున్నాడు. నాలుగో సంతానం చంద్రకిరణ్ 9వ తరగతి వరకు చదివి తల్లికి ఆసరాగా ఉంటున్నాడు. బ్యాంకర్ల చిన్నచూపు కష్టాన్నే నమ్ముకున్న వెంకాయమ్మకు రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముఖం చాటేశారు. రెండేళ్ల క్రితం వరకు రోడ్డు పక్కన ఆర్అండ్బీ స్థలంలో వేసుకున్న చిన్న గుడిసెలో వీరి కుటుంబం నివాసం ఉండేది. అయితే పక్కనే ఉన్న పొలం యజమాని ఖాళీ చేయించడంతో తల్లి ఏగమ్మ బంగారాన్ని తాకట్టు పెట్టి ఊరి చివరన కొద్దిపాటి స్థలం కొని, ఆ భూమిలో రేకులషెడ్డు వేసుకుంది. ప్రస్తుతం వెంకాయమ్మ అక్కడే ఉంటున్నారు. పిల్లలను చదివించడానికి, ఇంటి కోసం చేసిన అప్పులు తీరకపోగా ఇప్పటికీ వడ్డీలు కడుతున్నారు. రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగితే తిరిగి అప్పు ఎలా తీరుస్తావంటూ ఎద్దేవా చేసి తన దరఖాస్తును నిరాకరించినట్లు చెప్పింది. అదేవిధంగా మహిళలు డబ్బులు పొదుపు చేసుకునే స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా) గ్రూపుల్లోనూ తనను చేర్చుకోలేదని వాపోయింది. ఆడపిల్లలకు వివాహం చేయాల్సిన నేపథ్యంలో అన్ని కష్టాలనూ భారంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోన్న వెంకాయమ్మ చిన్న చిన్న సమస్యలు ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం నింపుతోంది. -
నిదురించే తోటలోకి...
ఇష్టంలేని పనిచేయడం చాలా కష్టం. నా మనసు ఏమాత్రం అంగీకరించట్లేదు. తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. చిన్నప్పటి నుంచి అంతే. అందుకే అమ్మ తరచు ‘అంత మొండితనం పనికిరాదు’ అని కోప్పడుతుండేది. ‘టికెట్ ఎక్కడికి సార్!’కండక్టర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను.‘వేములపల్లికి ఒకటివ్వండి’టికెట్ తీసుకుని కిటికీ పక్కకి జరిగాను. బస్సంతా కోలాహలంగా ఉంది. కూలీలు బస్సుపైకి మూటలు వేస్తున్నారు. బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. నా ఆలోచనలు స్థిమితంగా లేవు. ఆ ఊరెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. కానీ అమ్మ కోరికను కాదనలేకపోయాను. ఎందుకంటే అది ‘చివరిది’ కాబట్టి.అమ్మ జ్ఞాపకం వచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. చిన్నప్పుడు ఎంత అవమానం ఎదుర్కొన్నాం ఆ ఇంట్లో! చెయ్యని నేరం అమ్మపై మోపారు. ఊరు విడిచి వచ్చేసేలా చేశారు. నాన్న చనిపోయే నాటికి నాకు ఆరేళ్లుంటాయి. రాజారాం మావయ్య మమ్మల్ని చేరదీశాడు. ఆయన బాగా ఆస్తిపరుడు. వందల ఎకరాల ఆసామి. పాలేర్లు, పనివాళ్లు, వచ్చిపోయేవాళ్లతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఉండేవి. పాడి గేదెలకు, ఆవులకు కొట్టం ఉండేది. పొట్టేళ్లను, పందెంకోళ్లను ప్రత్యేకంగా పెంచేవారు. వెన్నునొప్పి సమస్యతో అత్తయ్య మంచానికే పరిమితమై ఉండేది. వాళ్ల నలుగురు పిల్లల బాగోగులు అమ్మే చూసుకునేది.మావయ్య మా పట్ల ఎంత అభిమానం చూపినా, పిల్లలు మాత్రం అమ్మతో అప్పుడప్పుడు దురుసుగా మాట్లాడేవాళ్లు. మావయ్య పెద్దకొడుకు కాశీ అందరి మీద పెత్తనం చేసేవాడు. కాశీ తర్వాత వసుంధర, శరత్, సుమన... నేనూ, సుమన వీధిగుమ్మం పక్కనే ఉండే ఏనుగు బొమ్మపై కూర్చుని ఆడుకునేవాళ్లం. ‘‘బస్సు పది నిమిషాలు ఆగుద్ది. టీ తాగేవాళ్లు తాగొచ్చు’’ప్రయాణికుల మొహం చూడకుండా బాగా అలవాటైన ఒక ప్రకటన చేసి డ్రైవర్, కండక్టర్ కిందకు దిగారు. నాకెందుకో దిగాలనిపించలేదు. ఇష్టంలేని ప్రయాణంలో ప్రతిదీ అసౌకర్యంగా అసహనంగా అనిపిస్తాయేమో!‘‘బాబూ! నువ్వు సీతమ్మ కొడుకువా?’’ వెనుక సీటు నుంచి తొంగిచూస్తూ అడిగాడు ఒక పెద్దాయన. అరవై ఏళ్లుంటాయి అటూ ఇటుగా...నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వేములపల్లిని వదిలి ఇరవయ్యేళ్లయింది. ఆ ఊరితో అనుబంధం దాదాపుగా తెగిపోయింది. ఆయన నన్నెలా గుర్తుపట్టాడో అర్థం కాలేదు.‘అవునండీ... మీరు..?’‘‘నీ పేరు ఆనందు కదూ! నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ ఇంటి పక్కనే ఉండే టైలర్ వెంకటేశ్వర్రావుని. నువ్వచ్చం మీ నాన్నలానే ఉన్నావు. వాడూ నేనూ కలిసి చదువుకున్నాంగా... ఎప్పుడూ నా కళ్లలోనే మెదుల్తాడు’’ అన్నాడాయన.‘‘సారీ అండీ... గుర్తుపట్టలేకపోయాను. రండి టీ తాగొద్దాం’’ అని సీటులోంచి లేచాను. ఆయన సంతోషంగా నన్ను అనుసరించాడు.టీ తాగేటప్పుడు అమ్మ ప్రస్తావన తెచ్చాడు. అమ్మ చనిపోయిందని చెబితే ఎంతో బాధపడ్డాడు. ఆయన కూడా రెండేళ్ల కిందట వేములపల్లి నుంచి వచ్చేసి నందిగామలో కూతురు దగ్గర ఉంటున్నానని చెప్పాడు.బస్సెక్కాం. నా పక్క సీటులోని వ్యక్తిని రిక్వెస్ట్ చేసి వెనక్కి పంపి, పెద్దాయన్ని నా పక్కన కూర్చోబెట్టుకున్నాను.‘‘మీ అమ్మ అట్టాంటి పని చేసిందంటే మేమెవరం నమ్మలేదయ్యా! నలుగురికి పెట్టే గుణమే తప్ప ఎవరి దగ్గరా ఏమీ ఆశించే మనిషి కాదు. నగలు దొంగతనం చేసే ఖర్మ సీతమ్మకి పట్టలేదని ఊరందరికీ తెలుసు.’’నేను మౌనంగా వింటున్నాను.‘మీరు ఊరొదిలి వెళ్లిపోయాక రాజారాంగారికీ కాశీకి పెద్ద గొడవ అయ్యిందటయ్యా! తండ్రీ కొడుకుల మధ్య ఈనాటికీ మాటలు లేవు. అంతకు మించి విషయాలేవీ బయటకు రాలేదు. ఏదైనా గుట్టుగల కుటుంబం’’ఆయన నిట్టూర్పు నాకు అర్థం అయ్యింది. మా అమ్మ పట్ల సానుభూతి, అభిమానం ఉండి కూడా మాకోసం ఏమీ చేయలేకపోయామనే అశక్తత ఉంది. ‘‘వచ్చే స్టేజీయే నందిగామ. రిటన్లో దిగిరాయ్యా! శ్రీనివాసరావుగారి బట్టల కొట్టంటే ఎవరైనా చెబ్తారు’’ అంటూ లేచారాయన.‘‘సరే బాబాయ్! జాగ్రత్తగా వెళ్లండి.ఆరోగ్యం జాగ్రత్త!’’ అన్నాను.వరుస కలిపి పిలిచినందుకు ఆయన మొహం సంతోషంతో వెలగడం నాకు కనిపించింది.ఆయన దిగాక మళ్లీ ఒంటరినయ్యాననిపించింది. ‘వేములపల్లి దిగండీ..’కండక్టర్ అదిలింపులాంటి ఆజ్ఞతో లేచాను. అప్పటికే సాయంత్రం అయింది.శివాలయం వీధిలో మూడో ఇల్లే మావయ్యది. నడుస్తున్నాను. ఊరు పెద్దగా మారలేదు. పెంకుటిళ్ల స్థానంలో డాబాలు వెలిశాయి. మట్టిరోడ్ల స్థానంలో సిమెంటు రోడ్లు వచ్చి చేరాయి. భద్రయ్యతాత కిళ్లీకొట్టు లేదు. అక్కడ సెల్‌ఫోన్ రీచార్జి చేసే షాపు ఉంది. నాకెందుకో ఉద్వేగంగా ఉంది. ఇల్లొచ్చింది. నాకో పెద్ద అనుమానం వచ్చింది. ఆ ఇల్లేనా అని. కళాకాంతులు లేని, పెచ్చులూడిన ప్రహరీగోడను చూడగానే మనసు చివుక్కుమంది. గేటు తీసుకుని లోపలికి వెళ్లాను.ఒక పదహారేళ్లుంటాయి కుర్రాడికి. కాశీబావ కొడుకై ఉంటాడు. నన్ను తేరిపార చూసి లోపలికి రండి అన్నాడు. కాళ్లు కడుక్కోమని పంపువైపు చూపించాడు. లోపలికి వెళ్లి ఒకావిడ్ని వెంటబెట్టుకొచ్చాడు.ఆవిడ చేతులు చెంగుకి తుడుచుకుంటూ హడావుడిగా నవ్వుతూ ఎదురొచ్చింది. ‘మావయ్యగారు బయటికెళ్లారు బాబూ! వచ్చేస్తారు’ అంటూ వరండాలోకి తీసుకెళ్లింది. ఒకప్పుడు నిత్యం పదిమంది మనుషులతో కళకళలాడిన ఆ లోగిలి బోసిపోయి ఉంది. గోడల రంగులు వెలిసిపోయాయి. బయట పశువుల పాకలో ఒక పాడిగేదె కట్టేసి ఉంది. ‘ఎప్పుడు బయలుదేరారు బాబూ! స్నానం చేసి రండి. మావయ్య వచ్చేస్తారు... నానీ! మావయ్యని రూమ్‌లోకి తీసుకెళ్లు’ అంటూ కొడుకుని పురమాయించి వంటగదిలోకి వెళ్లిందామె.వాళ్లిద్దరూ కనీసం మీరెవరు? అని అడగకపోవడానికి గల కారణం నాకు అర్థమైంది. ఎదురుగా గోడకు అత్తయ్య ఫొటో పక్కన అమ్మానాన్నల ఫొటో. అమ్మ తనవెంట తెచ్చుకోవడం మరిచిపోయిన ఫొటో. చిన్నప్పటి నుంచి నేను చూడలేకపోయిన నాన్న రూపం అచ్చు నాలానే ఉంది.రాత్రి ఎనిమిది గంటలకు మావయ్య వచ్చాడు. మనిషి వంగిపోయాడు. వస్తూనే నన్ను చూసి ‘బాగున్నావా..! మీ అమ్మ..’ అంటూ ఆగిపోయాడు.పక్కనున్న కుర్చీలో కూర్చుండిపోయాడు.నేను లేచి నిలబడి ‘బాగానే ఉన్నాను మావయ్యా! అమ్మ మిమ్మల్ని చూసి రమ్మని చివరికోరికగా చెప్పింది. అందుకే వచ్చాను. బయలుదేరతా’ అన్నాను నెమ్మదిగా.ఆయన నావైపు సూటిగా చూసి ‘‘రేపు పంపిస్తాను ఆనంద్ నిన్ను’’ అని కోడలివైపు తిరిగి ‘‘భోజనం ఏర్పాట్లు చూడమ్మా!’’ అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు. భోజనం చేస్తున్నాను మౌనంగా. ‘‘మా పెళ్లయిన మరుసటి ఏడాదే అత్తయ్యగారు పోయారు. ఈ ఇంటికి కాపురానికి వచ్చిన పదిహేడేళ్ల నుంచి ఎప్పుడూ తండ్రీ కొడుకులు ఎదురెదురు కూర్చుని మాట్లాడుకోవడం చూడలేదు నేను. తప్పనిసరైతే ఒకటి రెండు మాటలు. అంతే. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వ్యవసాయం తరిగిపోయింది. మా మరిది శరత్ బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వసుంధర వాళ్లు హైదరాబాద్‌లో ఉంటున్నారు.’’ చెప్పుకుపోతోంది ఆ ఇంటి కోడలు.‘‘సుమన ఎక్కడుంటుందక్కా!’’ అని అడిగాను మధ్యలో.‘‘ఈ ఊరే ఇచ్చాం. రైత్వారీ సంబంధం. పాపం! దాని దాకా వచ్చేసరికి ఆస్తులు కరిగిపోయాయి. రాజీపడక తప్పలేదు.కానీ! దాని కాపురమే బాగుందనిపిస్తుందయ్యా నాకు..’’ అందామె నిట్టూరుస్తూ.‘‘మీకేం తక్కువ?’’ అడిగాను కొంచెం చనువు తీసుకుని.కొద్దిపాటి నిశ్శబ్దం తర్వాత... ‘‘అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు.ఇంటిల్లిపాదీ కూర్చుని తిని ఎరుగం... ఏదైనా నీ చేతుల్లోనే ఉంది తమ్ముడూ’’ అందామె చివరి మాటను ఎంతో ఆశగా... ప్రేమగా...నేను తలెత్తి చూశాను. ఆమె కళ్లలో సన్నటి కన్నీటిపొర. నాకు మాట రాలేదు.రాత్రి పదయింది. నేను వరండాలో కూర్చుని టీవీ చూస్తున్నా. కాశీ వచ్చాడు. నేను గుర్తుపట్టలేకపోయాను.‘‘ఆనందా..!? ఏరా బాగున్నావా? ఎప్పుడొచ్చావ్?’’ అన్నాడు దగ్గరకొచ్చి. నన్ను చూసి చాలా ఆనందపడ్డాడు. కాశీబావ నన్ను అంత బాగా పలకరిస్తాడనుకోలేదు. ‘‘బాగున్నాను బావా! సాయంత్రం వచ్చా’’ అన్నాను.‘‘సరే! రెస్టు తీసుకో. మాట్లాడదాం’’ అంటూ గదిలోకి వెళ్లగా అతని భార్య అనుసరించింది. పడుకున్నా... నిద్రపట్టలేదు. ఇరవయ్యేళ్ల క్రితం ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి.అర్ధరాత్రి కొంతమంది అమ్మను నిలదీస్తున్నారు. అమ్మ, మావయ్య తప్ప అందరూ ఏవేవో మాట్లాడుతున్నారు. వసుంధర, అత్తయ్య దగ్గర కూర్చుని ఏడుస్తోంది. కాశీబావ నోట పోలీసులు అనే మాట వినబడి నాకు భయం వేసింది.తెల్లవారు జామున అమ్మ నన్ను వెంటబెట్టుకుని బయలుదేరింది. బస్సెక్కాక ‘‘మనం ఎక్కడికి వెళ్తున్నాం? మళ్లీ ఎప్పుడొస్తాం?’’ అని నేను అడగడం గుర్తొచ్చాయి.తర్వాత రాజమండ్రి మహిళా సేవాసదన్‌లో అమ్మ ఆయాగా పనిచేసింది. వాళ్ల స్కూల్లోనే నన్ను చదివించింది.అందరూ ఏ కష్టమొచ్చినా అమ్మతోనే చెప్పుకొనేవాళ్లు. ఓపికగా వినేది. సాయం చేసేది. మావయ్య వాళ్ల గురించి ప్రస్తావన తెస్తే చిరునవ్వు నవ్వి ఊరుకొనేది. తర్వాత నేను అడగడం మానేశాను.‘ఆనందూ!’ఉలిక్కిపడి లేచాను. అర్ధరాత్రి గుమ్మం దగ్గర మావయ్య.‘రండి మావయ్యా!’ అంటూ లేచాను.మావయ్య మంచం ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. బెడ్‌లైట్ వెలుగుతోంది. లైట్ వెయ్యబోతే మావయ్య వద్దని వారించాడు.‘‘నీతో చాలా విషయాలు మాట్లాడాలిరా!... మా మీద నీకు చాలా కోపం ఉందని నాకు తెలుసు’’నేను మౌనంగా వింటున్నాను. ‘‘చెయ్యని తప్పు మీదేసుకుని నా చెల్లెలు గొప్ప త్యాగం చేసింది. ఇప్పుడు శాశ్వతంగా దూరమై నాకు జీవితకాలానికి సరిపడా శిక్ష వేసింది.’’ మావయ్య గొంతు జీరబోయింది.‘‘అసలు విషయమేమిటో నాతో కూడా ఎప్పుడూ చెప్పలేదు మావయ్యా! గుచ్చి గుచ్చి అడిగి అమ్మను బాధపెట్టడం ఇష్టంలేక నేనూ ప్రస్తావన తెచ్చేవాణ్ణి కాదు’’‘‘మరి అమ్మ ఏ తప్పూ చేయలేదంటున్నారు. ఆ రోజు అంత జరుగుతుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు?’’ మర్యాదగానే సూటిగా అడిగాను. ‘‘దొంగతనం చేసింది మీ అమ్మ కాదురా! నా పెద్ద కూతురు.’’ మావయ్య గొంతులో ఉద్విగ్నత. ‘‘ఎవరినో ప్రేమించి అర్ధరాత్రి పారిపోతూ మీ అమ్మ కంటబడింది. సర్దుకున్న నగల బ్యాగ్ అక్కడే పడేసి భయంతో ఇంట్లోకి వచ్చేసింది. ఆ అలికిడికి ముందు నేనే లేచాను. నా కూతురు నాకు ఎదురుపడి భయంతో వణికింది. మీ అమ్మ ‘ఆడపిల్ల, దానిని ఏమీ అనొద్దు అన్నయ్యా! పెళ్లి కావాల్సిన పిల్ల. దాని జీవితం నాశనమైపోతుంది. ఏం జరిగినా ఏమీ మాట్లాడొద్దు’ అని నా చేత ఒట్టు వేయించుకుంది. ఈలోగా అందరూ పోగయ్యారు. తలో మాటా అన్నారు. నా చెల్లెలు... నా సీతమ్మ... నన్ను విడిచి ఊరు వదిలి వెళ్లిపోయింది.తర్వాత తప్పు చేసింది నా చెల్లెలు కాదు, తన చెల్లెలని కాశీకి తెలిసింది. మీ అమ్మను అన్ని మాటలన్నందుకు వాడు ఎంతో కుమిలిపోయాడు. నిజం దాచినందుకు ఆరోజు నుంచి నాతో మాట్లాడ్డం మానేశాడు.’’మావయ్య తలెత్తకుండా చెప్పుకుపోతున్నాడు.నాకు నోట మాట రాలేదు.ఇరవయ్యేళ్ల పాటు చెయ్యని తప్పుకు నింద మోసి దూరంగా బతికిన మా అమ్మ, కూతురు చేసిన తప్పుని చెల్లెలు మీదేసుకుని దూరమైపోతే నిస్సహాయంగా, నిస్సారంగా బతికేస్తున్న మావయ్య... తల్లిలా సాకిన మేనత్తను అకారణంగా నిందించి గెంటేశాననే అపరాధభావంతో కాశీ...మావయ్య లేచాడు. నేనూ లేచి నిలబడ్డాను.. ‘‘మీ అమ్మ నాకు ఉత్తరాలు రాసేది. మీ బాగోగుల గురించి తెలియజేసేది. సాయం చేస్తానంటే వద్దంది. అసలు రావద్దంది. తనను వచ్చేయమన్నాను. తను వస్తే దొంగలా బతకాలి, లేదంటే నా కూతురు చేసిన పనిని పదిమందికీ చెప్పాలి. అందుకే రానంది. తన అనారోగ్యం గురించి తెలుసుకుని విలవిలలాడాను. చివరి చూపు కూడా..’’నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘‘ఏదో ఒకరోజు నిన్ను పంపుతానని చివరిసారిగా రాసిన ఉత్తరంలో మాటిచ్చిందిరా!... మళ్లీ ఉత్తరం రాలేదు. నువ్వొచ్చావు. అన్నింటికీ నేనే బాధ్యుణ్ణిరా ఆనంద్’’మావయ్య గొంతు వణికింది. నేను మౌనంగా వింటున్నాను. ‘‘సరే! పడుకో. మనసులో బరువు దించుకోవడానికి ఈ ముసలోడికి ఒక అవకాశం ఇచ్చావు. సంతోషం. అడగడం మర్చిపోయాను. నీ భార్య, పిల్లలు...’’‘‘ఒక అబ్బాయి మావయ్యా! అందరూ బాగున్నారు.’’ అన్నాను.మావయ్య బయటికి నడిచాడు. వెనుక నాలుగు అడుగులు వేశాను. మెట్లెక్కుతున్న మావయ్యను చూస్తూ నిలుచున్నాను. వరండాలో ఒక మూల కాశీబావ.గుండె ఝల్లుమంది నాకు.ఈ తండ్రీ కొడుకులు మనసులో ఇంత భారం పెట్టుకొని ఇన్నేళ్లు ఎలా గడిపారో నాకు అర్థం కాలేదు. లక్ష్మక్క అన్నట్లు అంతా నా చేతుల్లోనే ఉందా? నెమ్మదిగా కాశీ దగ్గరకు వెళ్లాను.‘‘ఏంటి బావా! పడుకోలేదా?’’ అని అడిగాను.‘‘మాకు అన్నీ ఉన్నాయిరా... మనశ్శాంతి తప్ప. ఇలాంటి నిద్రలేని రాత్రులు చాలా గడిపాం’’ అన్నాడు గంభీరంగా.నేనేం మాట్లాడలేకపోయాను.‘క్షమించమని అడగడానికి అత్తయ్య లేదు’ అని నా చేతులు పట్టుకున్నాడు. ‘‘బావా! ఒక్క మాట చెప్పవా..?’’ అని అడిగాను.ఏంటన్నట్టు చూశాడు.‘‘మావయ్య చేసిన తప్పేముంది? చెల్లెలు దూరమై, భార్య చనిపోయి... కొడుకు మాట్లాడక ఆయన చిత్రవధ అనుభవిస్తున్నాడు. నువ్వు మారాలి బావా!’’ అన్నాను.‘‘నాలుగు రోజులుంటావా?’’ అడిగాడు ప్రేమగా.‘‘ఆఫీసులో పని ఉంది బావా! రేపు ఉదయం వెళ్లాలి’’ అన్నాను.ఉదయాన్నే బయలుదేరాను.మావయ్య, కాశీ నాకు చెరోవైపు నడుస్తున్నారు. ఇరవయ్యేళ్ల తర్వాత తండ్రీ కొడుకులు కలిసి వీధిలోకి రావడాన్ని అంతా ఆశ్చర్యంగా, ఆనందంగా చూశారు.ఎదురైన వారందరికీ ‘‘మా సీతమ్మ కొడుకు... నా మేనల్లుడు’’ అంటూ పరిచయం చేస్తున్నాడు మావయ్య.బస్సెక్కాను. ఆ ఊరికి రావడానికి తీవ్రంగా ప్రతిఘటించిన నా మనసు ఇప్పుడు తిరిగి వెళ్లడానికి బాధపడుతోంది. అమ్మ ఆఖరి కోరిక తీర్చాను. చాలా తృప్తిగా ఉంది. అమ్మ ఆత్మ కూడా తృప్తిపడి ఉంటుంది. గజ్జెల దుర్గారావు -
దృఢమైన మనసు
ఓ భగవంతుడా! కష్టాలకు భయపడి పారిపోకుండా వాటిని ఎదుర్కొనగలిగే ధైర్యాన్ని నాకు ప్రసాదించు. ఆపదలు వచ్చినప్పుడు నన్ను రక్షించమని నేను ప్రార్థించడం లేదు. కానీ వాటిని ఎదుర్కొనటానికి కావలసిన శక్తిని ప్రసాదించమని మాత్రం నిన్ను వేడుకుంటున్నాను. కష్టాలలో నేను కొట్టుకుపోతున్నప్పుడు నాకు సాంత్వన చేకూర్చమని నేను నిన్ను వేడుకోవడం లేదు. నా కష్టాలనే కుసుమాలుగా మార్చి, వాటిని నీ పాదాల చెంత ఉంచి, కష్టం వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని తగిన విజయం సాధించగలిగే శక్తిని నాకు ప్రసాదించు అని వేడుకొంటున్నాను. ఈ విధంగా ఎవరైనా ప్రార్థిస్తారా అసలు? అలాంటి వారు ఉంటారా? ఉంటే భగవంతుడు వారి కోరికను తీరుస్తాడా? ఇదంతా ఏదో వ్యక్తిత్వ వికాస పాఠంలా కనిపిస్తోంది కానీ, ప్రార్థనలా ఉందా? ఉన్నట్టే ఉంది. ఎందుకంటే, కొన్ని వేల ఏళ్ల కిందటే ‘‘నేను నిన్ను మరచిపోకుండా ఉండాలంటే, నాకు కావలసింది సుఖాలు, సంపదలు కాదు, కష్టాలు, కడగండ్లే. కాబట్టి ఓ కృష్ణా! నీవు నాకు అనుక్షణం గుర్తుకు వచ్చేలా నాకు ఎప్పుడూ ఏదో ఒక కష్టాన్ని ఇస్తూ ఉండు’’ అని కుంతీదేవి తన మేనల్లుడైన శ్రీ కృష్ణుని ప్రార్థించిందట. నిజంగా ఎంత గొప్ప ప్రార్థనో కదా! ప్రార్థన అనేకంటే, ఎంత దృఢమైన మనసో కదా! అనుకోవాలి. ఎందుకంటే, భగవంతుడి మీద మనకు ఉన్న విశ్వాసం ఆయన్ని ‘అవి కావాలి, ఇవి కావాలి’ అని కోరుకునే యాచనగా కాదు, శక్తిగా మారాలి. మనస్సు బలహీనతకు గురి కాకుండా ఉండేంత శక్తిమంతంగా ఉండాలి. – డి.వి.ఆర్. -
ఇండో-పాక్ సిరీస్ కష్టమే
షహర్యార్ నిరాశ కరాచీ: ఓ చిన్న సిరీస్ ద్వారా భారత్, పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ పునరుద్దరించాలన్న ఆశలు అడుగంటిపోతున్నాయని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ అన్నారు. ఇక సిరీస్ నిర్వహించేందుకు సమయం కూడా సరిపోదని స్పష్టం చేశారు. ‘ఓ సమావేశం కోసం ఇస్లామాబాద్ వచ్చిన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా సిరీస్ పునరుద్ధరణకు సాయం చేయలేకపోయారు. అలాగే లంకలో చిన్న సిరీస్ నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చదని సంకేతాలిచ్చారు. సుష్మా రాకతో పరిస్థితిలో కొంతైనా మార్పు వస్తుందని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. మేం భారత్‌తో ఆడాలనుకుంటున్నాం. కానీ వాళ్లు సానుకూలంగా స్పందించడం లేదు’ అని షహర్యార్ వ్యాఖ్యానించారు. సిరీస్ రద్దయితే న్యాయ సలహా కోరతామన్నారు. మరోవైపు సిరీస్ గురించి విదేశాంగ శాఖ సమాచారం కోసం వేచి చూస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో వెల్లడించారు. -
లెక్చరర్ పోస్టుల భర్తీ కష్టమే!
⇒ కాంట్రాక్టు వ్యవహారం తేలే వరకూ అంతే ⇒ పదుల సంఖ్యలోనే ⇒ డెరైక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ⇒ రేషనలైజేషన్ తరువాతే ⇒ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారం తేలేవరకు లెక్చరర్ పోస్టులు, హేతుబద్ధీకరణ పూర్తయ్యే వరకు ఉపాధ్యాయపోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావడం కష్టమే. వచ్చేనెల నుంచి నోటిఫికేషన్లు జారీచేసి, భర్తీ చేయాలనుకుంటున్న పోస్టుల్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్), పాలిటెక్నిక్ లెక్చరర్, విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టులు ఉండే అవకాశం లేదు. గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల విద్యాలయాల పరిధిలోని పాఠశాలల్లో మాత్రం దాదాపు 2 వేల వరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. హేతుబద్ధీకరణతో లంకె విద్యాశాఖ పరిధిలో 17 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గతంలోనే విదాశాఖ లెక్కలు వేసింది. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరు.. విద్యార్థులు ఉన్నచోట టీచర్లు లేరు. ఈ నేపథ్యంలో టీచర్ల హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంది. అది పూర్తయితేనే ఇంకా ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు అవసరం.. ఎన్నింటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలన్న స్పష్టత రానుంది. అప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ కష్టమేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖాళీలేవీ..? జూనియర్ కాలేజీల్లో 3,755 జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3,164 పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తుండగా, 591 ఖాళీలు ఉన్నాయి. 200 మంది పార్టటైం లెక్చరర్లు పనిచేస్తున్నారు. దీంతో 391 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నట్లు లెక్క. నిబంధనల ప్రకారం మొత్తం ఖాళీల్లో 10 శాతం పోస్టులను పదోన్నతులపైనే భర్తీ చేయాలి. అంటే మొత్తం ఖాళీల్లో 10 శాతం పోస్టులైన 375 ఖాళీలను డెరైక్టు రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి వీల్లేదు. మరోవైపు పోస్టులే మంజూరుకాని కాలేజీల్లో 748 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అంటే ఇందులో మిగిలేవి పెద్దగా ఉండవు. డిగ్రీ, పాలిటెక్నిక్ కాలే జీల్లో.. డిగ్రీ కాలేజీల్లో 450 వరకు డీఎల్ పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 900 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. అందులో సగం మంది పోస్టులు మంజూరై ఖాళీగా ఉన్న వాటిల్లో పనిచేస్తుండగా మరో సగం మంది పోస్టులు మంజూరు కాని కాలేజీల్లో పనిచేస్తున్నారు. ఇక పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీలు 350 పోస్టులు ఉంటే కాం ట్రాక్టు లెక్చరర్లు 450 మంది ఉన్నారు. అంటే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న లెక్చరర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో డీఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం అసాధ్యమన్న వాదన నెలకొంది.