మంచిమాట
అంతా మన మంచికే అనే మంత్రిగారి కథ అందరికీ తెలిసినదే. ‘‘అంతా మన మంచికే’’ అనే మంత్రిగారు రాజుగారి చిటికెనవేలు తెగితే కూడా అదే మాట అని చెరసాల ΄ాలు అయ్యారు. వేటకి వెళ్ళిన రాజుని ఆటవిక జాతివారు తమ దేవతకు బలి ఇవ్వబోయారు. చిటికెనవేలు లేక΄ోవటంతో అంగవైకల్యం ఉన్న వ్యక్తి బలికి పనికి రాడు అని వదిలి పెట్టారు.
రాజు తిరిగి వచ్చి మంత్రిని విడుదల చేసి, ‘‘నాకు మీ రన్నట్టు మంచే జరిగింది, మీకు ఏం మంచి జరిగింది?’’ అని అడిగాడు. అందుకు మంత్రి ‘‘అది కూడా నా మంచికే జరిగింది. చెరసాలలో లేక΄ోతే తప్పకుండా మీతో వేటకి వచ్చే వాడిని. అంగవైకల్యం ఉన్న మిమ్మల్ని వదిలేసి అప్పుడు ఏ అవయవ లోపమూ లేని నన్ను బలి ఇచ్చేవారు’’ అని చె΄్పాడు.
ఇది అతి మామూలు కథ. కానీ, దేనినైనా సానుకూల దృక్పథంతో ఎట్లా చూడాలి, దాని వల్ల ప్రయోజనం ఏమిటి? అన్న విషయాలు అర్థం అవుతాయి.
కొన్ని ఆ క్షణాన ఇబ్బంది కలిగించేవిగా, అయిష్టంగా అనిపించ వచ్చు. కానీ, మనకి ఏది మంచో మనకన్నా ప్రకృతికే బాగా తెలుసు. ఆ ప్రకృతినే విశ్వం అని, దైవం అని, ఎనర్జీ అని రక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వేసవి కాలంలో ఎటువంటి పళ్ళు, కూరలు ఆరోగ్యానికి మంచివో వాటినే ఇస్తుంది ప్రకృతి. వర్షాకాలంలో మామిడిపళ్ళు తినాలి అనిపించినా దొరకవు. ఎందుకో తెలుసా? ఆ వాతావరణానికి మామిడిపండు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. దొరికితే మామిడిపండు తినకుండా ఉండలేం. మన మంచికోసం దొరక కుండా చేసింది ప్రకృతి.
ఈ దృక్పథం అలవాటయిన వారికి జీవితం కష్టాలమయంగా కనిపించదు. దేనినైనా తేలికగా తీసుకొని ముందుకి సాగటం ఉంటుంది. అట్లా అయితే వారి జీవితాల్లో కష్టాలు ఉండవా? ఉంటాయి, కానీ కన్నీళ్ళు ఉండవు. కష్టపడకుండా ఏదీ లభించదు. అది భౌతికమైనది. దాన్ని ఏదోవిధంగా దాటవచ్చు. మనస్సుకి ఎక్కించుకుంటే వేదన మిగులుతుంది.
ఆ కాస్త ఇబ్బందిని అయినా ఎందుకు భరించాలి? అనే సందేహం వస్తుంది. కానీ మనం ఆ పరిస్థితిని మార్చలేము కదా! అప్పుడు కూడా అంతా మన మంచికే అనుకుంటే అద్భుతం జరుగుతుంది. దీని వల్ల మంచే జరుగుతుంది అనే సానుకూల భావన వల్ల మన మనసు సానుకూల భావతరంగాలను ప్రసరింప చేస్తుంది. భావతరంగాలు పరిసరాలని, పరిస్థితులని, వ్యక్తులని కూడా ప్రభావితం చేస్తాయి. దానివల్ల ముందుగా వాతావరణం, తరువాత మనస్సు ప్రశాంత మవుతాయి. పరిస్థితులు చక్కబడతాయి. దానికి కారణం నెమ్మదించిన మనస్సు.
ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, ఎఖార్ట్ వంటి ఆధునిక మనస్తత్వశాస్త్రవేత్తలు కూడా ఆలోచనని అనుసరించే పరిస్థితులు ఉంటాయి అని ప్రయోగాత్మకంగా నిరూపించారు. వేలికి దెబ్బ తగిలింది అని బాధపడటం కన్న చెయ్యి, కాలూ బాగున్నందుకు సంతోషించటం నేర్చుకోవాలి. సరైన చెప్పులు లేవని ఏడుస్తున్న కొడుకుకి కాళ్ళు లేని వాడిని చూపించాడుట తండ్రి. అప్పుడు లోటు ఉన్నా బాధ పడటం ఉండదు. సంతోషమే ఉంటుంది. సంతోషంగా ఉంటే ‘హాపీ హార్మోనులు’ విడుదల అవుతాయి.
సంతోషం, ఆనందం బాహ్యమైన వస్తువులు, పరిస్థితుల పైన కాక దృక్పథం మీద ఆధార పడి ఉంటాయి. పురుటి నొప్పులు పడనిదే శిశువు లోకంలో అడుగు పెట్టటం కుదరదు. బిడ్డ చిరునవ్వు చూడగానే నొప్పుల సంగతి మరపుకి వస్తుంది. సాన పెట్టనిదే వజ్రం మెరవదు. నమలనిదే పదార్థం రుచి తెలియదు. గంధపుచెక్కని అరగదీయనిదే మంచిగంధం రాదు. చివరికి కుంకుడుకాయ రసం కావాలి అన్నా గట్టిగా పిసకాలి. ఇతర పళ్ల రసం గురించి చెప్ప నక్కర లేదు. గట్టిగా పిండనిదే రసం రాదు. ఈ కష్టం మెఱుగుదల కోసమే అని అర్థం చేసుకుంటే సమస్య లేదు. దానిని కూడా వ్యాయామం మొదలైనవి చేసినప్పుడు ΄÷ందే సుఖం లాగా ఆనందించవచ్చు.
– డా. ఎన్. అనంత లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment