కాఫీ మీ జీవితాన్ని కాపాడుతుంది..!
కాఫీ తాగడం అలవాటుపై అనేక అనుమానాలు, అపోహలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అయితే తాజా పరిశోధకులు మాత్రం... కాఫీ తాగడం జీవితాన్నే కాపాడుతుందంటున్నారు. రోజుకు నాలుగైదు కప్పుల కాఫీ తాగడం జీవన పరిమాణాలనే పెంచుతాయంటున్నారు. అసలు కాఫీనే తాగే అలవాటు లేని వారికన్నా కాఫీ తాగేవారు ఎక్కువ కాలం బతుకుతున్నారని, మధుమేహం, గుండె జబ్బులనుంచి వచ్చే ప్రమాదాలను కూడా అరికట్టేందుకు కాఫీ సహకరిస్తుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.
దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం, అకాల మరణాలు, న్యుమోనియా, ఇన్ఫ్లుయంజా వంటి వ్యాధుల వల్ల వచ్చే ప్రమాదాలకు దూరంగా ఉండడంతోపాటు ఆత్మహత్యలకు పాల్పడాలన్న ఆలోచనల నుంచి కూడా కాఫీ దూరం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. పది సంవత్సరాలపాటు (1998 నుంచి 2009) సుమారు లక్షమంది నడివయస్కులపై చేసిన పరిశోధనల్లో కాఫీ తాగనివారికంటే తాగేవారు ఎక్కువకాలం బతికినట్లుగా తెలుసుకున్నారు.
కాఫీలోని ఫినోలిక్ యాసిడ్లు, పొటాషియం, కెఫిన్ సహా మనుషుల జీవనంపై క్రియాశీలకంగా పనిచేస్తామయని నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అధ్యయన రచయిత డాక్టర్ ఎరిక్కా లాఫ్టిఫైడ్ తెలిపారు. అలాగే ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు కప్పుల కాఫీ తాగే వారికి వ్యాధుల ప్రమాదం అత్యల్పంగా ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే కాఫీ తాగేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. కొన్ని క్యాన్సర్ల తో బాధపడే వారికి కాఫీ అలవాటువల్ల కొంత జీవన కాలం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు.
మరోవైపు గర్భిణిలు కాఫీ తాగొచ్చా కూడదా అన్న విషయంపై కూడ అనుమానాలను తాజా పరిశోధనలు తీరుస్తున్నాయి. రోజుకు సుమారు రెండు వందల మిల్లీగ్రాముల కెఫెన్ కలిగిన కాఫీని గర్భిణిలు కూడా తాగొచ్చని అమెరికన్ అబ్ స్టెట్రీషియన్స్, గైనకాలజిస్ట్ ల కళాశాల అధ్యయనకారులు చెప్తున్నారు. రోజువారీ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారిలాగే ప్రతిరోజూ అలవాటుగా కాఫీ తాగేవారు కూడ ఆరోగ్యంగానే ఉంటారని తెలుస్తోంది. అయితే అప్పటికే అనారోగ్యంతో బాధపడేవారు మాత్రం కాఫీ తాగకుండా ఉండటమే మంచిదంటున్నారు. ఏది ఏమైనా కాఫీ రోజువారీ జీవితంలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే పానీయంగా అధ్యయనకారులు చెప్తున్నారు.