save
-
రైలు కింద పడిన మహిళ.. కాపాడేందుకు ట్రైన్ రివర్స్
ముంబై: ఓ మహిళ రైలు కింద పడి ప్రాణాలతో బయడపటింది. రైలు కింద మహిళా చిక్కుకున్న విషయాన్ని గ్రహించిన పైలట్ ట్రైన్‌ను వెనక్కి వెళ్లనివ్వడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది, అయితే ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లను కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై లోకల్ స్టేషన్లో సోమవారం చోటుచేసుకుంది.ముంబైలోని బేలాపూర్ స్టేషన్ నుంచి థానేకు వెళ్లేందుకు ఓ మహిళ లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ రైలు రద్దీగా ఉండటంతో ఆమె ఎక్కే క్రమంలో కాలు జారింది. దీంతో.. రైలు కింద పడిపోయింది. అప్పటికే రైలు కదలడంతో.. ఒక కంపార్ట్మెంట్ ఆమె పై నుంచి వెళ్లింది. అప్పుడు ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులతో పాటు భద్రతా సిబ్బంది అలారం మోగించడంతో.. రైలు వెనక్కు వెళ్లింది.పోలీసు అధికారులు ట్రాక్‌లపై దిగి.. ఆమెను పైకి తీసుకొచ్చారు. వెంటనే మహిళను సమీపంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నిల తెలిపారు. ఈ ఘటనలో మహిళ తన రెండు కాళ్లను కోల్పోయింది.కాగా.. ముంబైలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో నగరంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను రద్దు కావడంతో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరింది. ఫుట్‌బోర్డు వద్ద కూడా నిలబడి మరీ ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలోనే బేలాపూర్ స్టేషన్లో చాలాసేపు తర్వాత థానేకి వెళ్లే రైలు రావడంతో.. జనాలందరూ ఎగబడ్డారు. దీంతో బాధిత మహిళ కాలుజారి కిందపడినట్లు అధికారులు పేర్కొన్నారు. -
మనుమరాలిని విషనాగు నుంచి కాపాడి.. కన్నుమూసిన బామ్మ!
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లోని అందరినీ కంటతడి పెట్టించే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి షాహ్గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్గుపూర్ కాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న బామ్మ, మనవరాలి మంచంపైకి ఒక భారీ నాగుపాము చేరింది. ఆ పాము మనుమరాలి వైపు కదులుతున్న విషయాన్ని గమనించిన బామ్మ దానిని చేత్తో పట్టుకుంది. వెంటనే ఆ విషనాగు బామ్మను కాటేసింది. ఈ సమయంలో బామ్మ ఆర్తనాదాలను విన్న కుటుంబ సభ్యులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే బామ్మను సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. అయితే ఆ బామ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా పామును చేత్తో పట్టుకుని, మనుమరాలిని కాపాడున్న బామ్మ సాహసానికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వీక్షకులు బామ్మ సీతాదేవి(72) తెగువకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె మనుమరాలు(24)కు ఎటువంటి హాని జరగలేదు. కాగా పాము కాటుకు బామ్మ మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయకుండా ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. -
మీకు తెలుసా? కుక్కలు కూడా రక్తదానం చేయగలవు!
రక్తదానం చేసి ఇతర కుక్కల ప్రాణాలను కాపాడిన ఇలాంటి కుక్కలు హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో ఉన్నాయని మీకు తెలుసా?. హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరిగిన జంతు ప్రదర్శన పెటెక్స్, హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ ముగిసింది. డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళ్లినందుకు బోబీ చౌహాన్ పెట్టింగ్ మ్యాటర్స్, డాగ్ స్పెషలిస్ట్ కంపెనీ ఈ సందర్భంగా గుర్తించబడింది. అలాగే ఈ డ్రైవ్‌లో రక్తదానం చేసినందుకు అనేక కుక్కలు వాటి యజమానులను కూడా సత్కరించారు. మనుషులు మాదిరిగానే కుక్కలు కూడా..! బాబ్బీ చౌహాన్ ప్రకారం, కుక్కలు, పిల్లులు మనుషుల మాదిరిగానే రక్తదానం చేయవచ్చు. నగరంలో గత ఐదేళ్లలో దాదాపు 200 రక్తదానాలు నిర్వహించారు. కానీ దురదృష్టవశాత్తు, పెంపుడు కుక్కలను పెంచుకుంటున్న వారిలో దీనిపై పెద్దగా అవగాహన లేదు. కుక్కలు ప్రతి మూడు నెలలకొకసారి మనుషుల మాదిరిగా రక్తదానం చేయవచ్చు. వీటికి 12 బ్లడ్ గ్రూపులు, 11 క్రాస్ మ్యాచింగ్ గ్రూపులు ఉన్నాయి. నగరంలో కుక్క లేదా కుక్కల బ్లడ్ బ్యాంక్ లేదని ఆయన అన్నారు. పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలు రక్తదానం చేయడానికి, ఇతర కుక్కలను రక్షించడానికి సిద్ధంగా ఉంటే డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన ఆలోచనతో రోస్టియన్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అంతేగాదు వారు నిహిత్ మెషిన్ ఆవిష్కరించారు. ఇది కుక్కలా ఆహరం విక్రయించే వెండింగ్ మెషీన్. ఇది ఉపయోగించిన లేదా వేస్ట్ నీటి బాటిళ్లను తీసుకుంటుంది. ముఖ్యంగా ఇది వీధి కుక్కల ప్రయోజనం కోసం పెంపుడు జంతువుల ఆహారాన్ని అందించడమే గాక రెండు సమస్యలను పరిష్కరిస్తుంది. ఒకటి ప్లాస్టిక్ పెట్ బాటిళ్లను బాధ్యతాయుతంగా పారవేయడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే అదే సమయంలో ప్లాస్టిక్ సమస్యకు చెక్‌పెడుతుంది. ఈ యంత్రాన్ని ఎక్స్‌పోలో ప్రదర్శించారు. Pawstive మార్పు తీసుకొద్దాం. అలాగే వెండింగ్ మిషన్‌తో భూమిని కలుషితం కాకుండా చూద్దాం అని వ్యవస్థాపకుడు నొక్కి చెప్పారు. (చదవండి: అరుదుగా కనిపించే భారీ నిమ్మకాయలు.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!) -
గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు? స్పెయిన్‌లో ఏం జరుగుతోంది?
స్పెయిన్‌లోని పర్యావరణ కార్యకర్తలు కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఐరోపా దేశాలు తీవ్రమైన కరువుతో తల్లడిల్లుతున్న నేపధ్యంలో స్పెయిన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్తలు నీటిని పొదుపు చేయడానికి నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మాడ్రిడ్, వాలెన్సియా, ఇబిజా, నవర్రాతో సహా ఆరు రాష్ట్రాలలో గోల్ఫ్ కోర్సుల రంధ్రాలను మూసివేశారు. గోల్ఫ్ కోర్స్ చుట్టూ ఉన్న పచ్చటి ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రతిరోజూ 22,000 గ్యాలన్లకు పైగా నీరు అవసరమని వారు చెబుతున్నారు. కరువు కారణంగా స్పెయిన్ రైతులు తమ పంటలకు తగినంత నీరు అందకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దేశంలో గోల్ఫ్ కోర్సుల కంటే పంట పొలాలకు నీటి అవసరం అధికమని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. సీఎన్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం పర్యావరణ కార్యకర్తలు ప్రస్తుతం 10 గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేశారు. మైదానంలో కొన్ని గుంతలలో మొక్కలు నాటడమే కాకుండా కొన్నింటిని సిమెంటుతో మూసివేశారు. ఎక్స్‌టింక్షన్ రెబెల్లియన్ (ఎక్స్ఆర్) సంస్థ సభ్యులు పర్యావరణ కార్యకర్తలతో కలిసి ఈ పనులు చేపట్టారు. కరువు సంక్షోభం మధ్య నీటి వృథాను అరికట్టేందుకు గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేయడం తప్పనిసరి అని ఎక్స్‌టింక్షన్ రెబెల్లియన్ గ్రూప్ పేర్కొంది. దేశమంతా కరువుతో తల్లడిల్లిపోతున్నప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఉన్నతవర్గం వారు గోల్ఫ్ కోర్సుల పేరుతో నీటిని వృథా చేయడం తగదన్నారు. సంపన్నుల అనవసర కార్యకలాపాల వల్ల వనరులు వృథా అవుతున్నాయని వారు ఆరోపించారు. కొన్ని నెలలుగా స్పెయిన్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నదులు, చెరువులు, ఇతర నీటి వనరులలోని నీటిశాతం నిరంతరం తగ్గతూవస్తోంది. ఈ నేపధ్యంలోనే శాన్ రోమన్ డి కా సౌ రిజర్వాయర్ నీటి మట్టం 1990 నుండి కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో రిజర్వాయర్‌లో మునిగిపోయిన పాత చర్చి పూర్తిగా కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం స్పెయిన్‌లో కరువు పరిస్థితులు మరింతగా పెరగనున్నాయి. ఇది కూడా చదవండి: యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? -
దయచేసి.. మా కుమారుడిని కాపాడండి!
ఖమ్మం: మెదడులో నీరు చేరడంతో అనారోగ్యం పాలైన ఓ విద్యార్థి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. బ్రెయిన్‌కు సర్జరీ చేస్తేనే బతుకుతాడని వైద్యులు సూచించడంతో కన్నీరుమున్నీరవుతున్న ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేచిచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని గాదెపాడు గ్రామానికి చెందిన భూక్యా సంతు, ప్రమీల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడైన భూక్యా హర్షిత్ కారేపల్లిలోని మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. కాగా మూడేళ్ల కిందట హర్షిత్‌కు జ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చూపించగా.. చిన్నారి బ్రెయిన్లో నీరు చేరిందని అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో హర్షిత్‌కు రెండుసార్లు బ్రెయిన్ సర్జరీ జరిగి కోలుకుంటున్న క్రమంలో ఇటీవల తిరిగి అనారోగ్యానికి గురికావడంతో రెయిన్‌బోకు తీసుకొచ్చారు. చికిత్స అనంతరం మరోసారి బ్రెయిన్ సర్జరీ చేయాలని, సుమారు రూ.7 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యు లు తెలపడంతో ఇప్పటికే ఇల్లు, వాకిలి అమ్ముకోవడంతో పాటు స్నేహితుల సహకారంతో రూ.12 లక్షల వరకు ఖర్చుచేశామని వాపోయారు. ఇదిలా ఉండగా హర్షిత్ తండ్రి సంతుకు 2021వ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై బ్రెయిన్ సర్జరీ కావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. తమ కుమారుడి ప్రాణాలైనా కాపాడుకుందామని, దాతలు సహకరించాలని హర్షిత్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చదవండి: బ్యాంకుల వద్ద మఫ్టీలో ఉండి మరీ అరాచకం..! ఒక్కసారిగా ఇలా.. -
హిట్లర్ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు?
ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంతగా అడాల్ఫ్ హిట్లర్ పేరుగాంచాడు. హిట్లర్ అనేక దేశాలలో విధ్వంసం సృష్టించాడు. లక్షలాది మందిని పొట్టనపెట్టుకున్నాడు. హిట్లర్ నియంతృత్వం ఎంతగా పెరిగిందంటే అతని కారణంగా ఒక దేశంతో మరో దేశం పోరాడేందుకు సిద్ధం అయ్యింది. అలాంటి హిట్లర్ చొరవతోనే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు మనం హిట్లర్ జీవితంలోని ఒక రహస్యం గురించి తెలుసుకుందాం. ప్రపంచమంతా హిట్లర్ నియంతృత్వానికి ఆందోళన చెందింది. ఈ నేపధ్యంలోనే అతన్ని చంపడానికి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. ఎవరికీ ఇది అంత సులభం కాలేదు. హిట్లర్‌ను వెన్నంటి ఉండే నాజీ సైన్యం అతనిని అనుక్షణం కంటికిరెప్పలా కాపాడేది. ఆహారంలో విషం కలిపి, తనను ఎవరైనా చంపేస్తారేమోనని హిట్లర్ నిత్యం భయపడేవాడు. దీనిని తప్పించుకునేందుకు ఒక మార్గాన్ని కూడా అనుసరించాడు. హిట్లర్‌కు సన్నిహితులైన 15 మంది మహిళలు ఆయనకు వడ్డించే ఆహారాన్ని మొదట రుచి చూసేవారు. ఎప్పుడైనా ఆహారంలో విషం కలిపితే, దానిని రుచి చూసే మహిళ చనిపోతుంది. అప్పుడు హిట్లర్ ప్రాణాలకు రక్షణ ఏర్పడుతుంది. హిట్లర్ ఆహారం తీసుకునే ప్రతిసారీ ఈ మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు. హిట్లర్ తినే ఆహార పదార్థాలు అధికంగా ఉండటం వలన వాటిని పలువురు మహిళలు రుచి చూసేవారు. హిట్లర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పలు పద్ధతులను ఉపయోగించేవాడు. ఎటువంటి దాడికి గురికాని సైనిక బంకర్లలో తల దాచుకునేవాడు. భారీ స్థాయిలో ఉన్న నాజీ సైన్యం అతనిని నిరంతరం కాపాడుతుండేది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంతలా తాపత్రయపడిన హిట్లర్ చివరికి విషాహారం కారణంగానే మృతి చెందాడు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
మార్కెట్ యార్డుల్లో విద్యుత్ ఆదాకు చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు మార్కెట్ యార్డుల్లో ఇంధన సామర్థ్య చర్యల ద్వారా విద్యుత్‌ను, డబ్బును ఆదా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. గుంటూరు యార్డును ఆసియాలోనే అతిపెద్ద విద్యుత్ ఆదా మిర్చి వ్యాపార కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖతో భాగస్వామి అయ్యేందుకు అంగీకరించింది. రాష్ట్రంలోని మరికొన్ని కీలక మార్కెట్ యార్డుల్లో కూడా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయనుంది. వ్యవసాయ వాణిజ్యానికి మార్కెట్ యార్డులు కీలక కేంద్రాలు. ఇక్కడ లైటింగ్, శీతలీకరణ, ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ కోసం విద్యుత్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వీటిని విద్యుత్ పొదుపు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవితో ఈఈఎస్ఎల్ కమ్యూనికేషన్స్, మార్కెటింగ్ సీజీఎం అనిమేష్ మిశ్రా ఆదివారం భేటీ అయ్యారు. విద్యుత్ ఆదా చర్యలకు సంబంధించిన నివేదికను చిరంజీవికి అందజేశారు. అనంతరం ఈఈఎస్ఎల్ అధికారులు, మార్కెటింగ్, సహకార శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చిరంజీవి మాట్లాడారు. తొలుత గుంటూరు మిర్చి యార్డులో ఇంధన సామర్థ్య చర్యలు అమలు చేస్తా మన్నారు. ఈఈఎస్ఎల్ ప్రతినిధులు నితిన్ భట్, సావిత్రి సింగ్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
రక్షాబంధన్ సాక్షిగా.. తమ్ముడి కోసం అక్క కిడ్నీ దానం..
రాయ్‌పూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తుంది రాఖీ పౌర్ణమి. సంతోషంగా జీవతాంతం కలిసి ఉండాలని కోరుకుంటూ అన్నదమ్ముల్లకు ఆడపిల్లలు రాఖీ కడుతారు. వారి రక్షణ ఎప్పుడూ తనకు ఉండాలని కోరుకుంటారు. పండగపూట సోదరి కళ్లలో ఆనందం చూడటానికి ఓ మంచి గిఫ్ట్‌తో అన్నాదమ్ముళ్లు సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే.. చత్తీస్‌గఢ్‌లో మాత్రం ఓ సోదరి తమ్ముడి మీద ప్రేమతో ఓ కిడ్నీనే దానంగా ఇస్తోంది. ఓం ప్రకాశ్(48), ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌వాసి. గత ఏడాది మే నెల నుంచే అతను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఓ కిడ్నీ 80 శాతం, మరో కిడ్నీ 90 శాతం వ్యాధి బారినపడ్డాయి. డయాలసిస్‌తో కాలం వెల్లదీస్తున్నాడు. అనేక ఆస్పత్రులకు తిరిగిన అనంతరం కిడ్నీ మార్పిడికి కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. దీంతో కిడ్నీదాత కావాలని డాక్టర్లు చెప్పారు. దీంతో తమ్ముడి కోసం ఓం ప్రకాశ్ పెద్ద అక్క శీలాభాయ్ పాల్ ముందుకు వచ్చింది. రాయ్‌పూర్‌లోని టిక్రపారలో ఉంటున్న ఆమె తమ్ముడి సమస్య తెలిసి వెంటనే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. పరీక్షల అనంతరం ఆమె కిడ్నీ ఓం ప్రకాశ్‌కు సెట్ అవుతుందని డాక్టర్లు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆపరేషన్ జరనుంది. తమ్ముడంటే ప్రేమ అని తెలిపిన శీలాభాయ్.. అతనితో కలిసి జీవితాంతం బతకాలని కోరుకుంటున్నానని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు ఇంకా మూడు రోజులు ఉండగా.. నేడు శీలాభాయ్ తన తమ్ముడు ఓం ప్రకాశ్‌కి రాఖీ కట్టింది. తన తమ్ముడు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించింది. ఇదీ చదవండి: Raksha Bandhan 2023 Special: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా! -
మరణించినా.. మరోసారి జీవించే అరుదైన అవకాశం..!
మనిషికి ఒకటే జన్మ.. అదే మనిషి అవయవాలకు మాత్రం రెండు జన్మలు. అవయవదానం చేస్తే మరణించినా మరోసారి జీవించే అవకాశం ఉంది. ఒక్క మనిషి చనిపోతే గుండె, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చేతులు, ముఖం, కణజాలం, ఎముకమజ్జ, మూలకణాలు దానం చేసి మరో 8 మంది ప్రాణాలు కాపాడొచ్చు. దేశంలో మరణాల సంఖ్య అధికంగా ఉన్నా.. అవయవదాతలు ఆ స్థాయిలో ఉండడం లేదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువుల ఆలోచనలు, ఆచారాలు, కట్టుబాట్లు, అవగాహన రాహిత్యంతో చాలామంది ముందుకు రావడం లేదు. 18ఏళ్లు దాటినవారు ఆర్గాన్స్ డొనేట్ చేయొచ్చు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ప్రాణం పోసిన.. దాతల సహకారంతో బతుకుతున్న వారిపై.. అన్నకు తమ్ముడి కిడ్నీ సిరిసిల్ల: తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్‌రెడ్డి(53) రైతు. షటిల్ ఆడేవాడు. ఉన్నట్టుండి వాంతులయ్యా యి. ఆస్పత్రికి వెళ్లగా కిడ్నీలు ఫెయిలయ్యాయని వైద్యులు నిర్ధారించారు. డయాలసిస్‌కు నెలకు రూ.40వేల నుంచి రూ.60వేల వరకు ఖర్చయ్యాయి. మూడు నెలలు గడిచాయి. విజయేందర్‌రెడ్డిని ఆస్పత్రిలో ఆ స్థితిలో చూసిన అతని తమ్ముడు జితేందర్‌రెడ్డి(50) తన రెండు కిడ్నీల్లో ఒకటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. హైదరాబాద్ ఆస్పత్రిలో ఆపరేషన్ అయింది. మృత్యువు ముంగిట అసహాయంగా నిల్చున్న అన్నకు ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది. విజయేందర్‌రెడ్డి ప్రస్తుతం జిల్లెల్లలో వ్యవసాయం, తమ్ముడు జితేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తొలి డోనర్ లక్ష్మి సిరిసిల్లకల్చరల్: సిరి సిల్లలోని గాంధీనగర్‌కు చెందిన ఇప్పనపల్లి నారాయణ, లక్ష్మి దంపతులు. మిర్చి బండి పెట్టుకుని జీవించేవారు. 12 ఏళ్లక్రితం పనులు ముగించుకుని ఇంటికెళ్లారు. అర్ధరాత్రి దాటాక విపరీతమైన తలనొప్పితో లక్ష్మి కింద పడిపోయింది. ఆమెను హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చేర్పించారు. ఆమె బ్రెయిన్‌డెడ్ కావడంతో అవయవదానంపై అవగాహన కల్పించారు. ఆమె కుమారులు సంతోష్, రమేశ్ అంగీకారం మేరకు లక్ష్మి ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, మూత్రపిండాలు సేకరించి నలుగురు వ్యక్తులకు అమర్చారు. జిల్లాలోనే తొలి అవయవ దాతగా లక్ష్మి గుర్తింపుపొందారు. తండ్రి.. భార్య ఇద్దరూ దాతలే కోరుట్ల: తండ్రి.. భార్య ఇద్దరూ కిడ్నీ దాతలుగా నిలిచారు. కోరుట్లకు చెందిన గీత కార్మికుడు పోతుగంటి శ్రీనివాస్ 2017లో వెన్నునొప్పితో అవస్థ పడడంతో తండ్రి రఘుగౌడ్ వైద్యులతో పరీక్షలు చేయించాడు. శ్రీనివాస్‌కు కిడ్నీ సమస్య ఉందని తేలడంతో కలవరపడ్డాడు. వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకతప్పదని చెప్పడంతో రఘుగౌడ్ తన కిడ్నీదానం చేశాడు. శ్రీనివాస్ ఆరోగ్యం కుదుటపడింది. ఐదేళ్ల తరువాత 2022లో మళ్లీ వెన్నునొప్పి మొదలైంది. మరోసారి పరీక్షించిన వైద్యులు మళ్లీ కిడ్నీ మార్పిడి చే యాల్సిందేనని చెప్పడంతో అతడి భార్య లావణ్య కిడ్నీ ఇచ్చింది. శ్రీని వాస్ తేరుకుని ప్రస్తుతం ఏ సమస్య లేకుండా తన పనులు తాను చేసుకుంటున్నాడు. అవయవదాతల‘అబ్బిడిపల్లె’ ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లె వాసులు మూకుమ్మడిగా అవయవదానానికి అంగీకరిస్తూ తీర్మానం చేశారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అప్పటి కలెక్టర్ సంగీతకు లేఖ అప్పగించారు. అబ్బిడిపల్లెలో 600 జనాభా ఉంటుంది. సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు భీష్మాచారి ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన కల్పించగా.. సర్పంచ్ ఒజ్జ కోమలత ఆధ్వర్యంలో తీర్మానం చేసి శభాష్ అనిపించుకున్నారు. మెడికల్ కాలేజీకి మృతదేహం కోల్‌సిటీ: గోదావరిఖని శివాజీనగర్‌కు చెందిన దేవకి పార్థసారథి (85) తన మరణానంతరం అవయవాలు దానం చేస్తానని సదాశయ ఫౌండేషన్‌కు అంగీకార పత్రం రాసిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న అనారోగ్యంతో మృతి చెందగా.. కుటుంబసభ్యులు ఆమె నేత్రాలను ఐ బ్యాంక్‌కు, పార్థివదేహాన్ని రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగించారు. బతికుండగానే.. సారంగాపూర్: బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన పానగంటి స్వప్న(45) అంగన్వాడీ టీచర్. తాను చనిపోయాక తన అవయవాలు దానం చేయాలని భర్త నర్సయ్యతో చెబుతుండేది. తీవ్ర జ్వరంబారిన పడి చనిపోయిన ఆమె కోరిక మేరకు ఆమె రెండు కిడ్నీలు, గుండెను దానం చేశారు కుటుంబసభ్యులు. నలుగురికి ప్రాణం కోల్‌సిటీ: గోదావరిఖనిలోని ఎల్బీనగర్కు చెందిన మింగాని సంపత్(41) ఎమ్మెస్సీ, బీఈడీ చదివారు. ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ డైరెక్టర్. 2019 జనవరి 14న రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లి మరణించారు. నలుగురికి లివర్, రెండు కిడ్నీలు, గుండె అమర్చారు. ఏడుగురికి పునర్జన్మ కోల్‌సిటీ: తాను మరణించి మరో ఏడుగురికి పునర్జన్మిచ్చారు గోదారిఖనిలోని విద్యానగర్‌కు చెందిన సిరిసిల్ల ఇమానుయేల్(33). హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసే ఆయన 2019 జనవరి 3న బైక్‌పై ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వారంపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఆయన కుటుంబసభ్యులు ఆయన అవయవాలను దానం చేయగా.. ఏడుగురికి పునర్జన్మ లభించింది. దేహదానానికి నిర్ణయం కోల్‌సిటీ: గోదావరిఖని చంద్రబాబుకాలనీలో నివాసం ఉంటున్న మేరుగు లింగమూర్తి ఓసీపీ–3లోని బేస్ వ ర్క్‌షాప్‌లో ఆపరేటర్. ఎనిదేళ్ల క్రితం రెండు కిడ్నీలు చెడిపోయా యి. డయాలసిస్‌పై ఉన్న భర్త లింగమూర్తిని బతికించుకోవడానికి అతని భార్య విజయ తన కిడ్నీని దానంచేసింది. ఇప్పుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో తమ మరణానంతరం తమ దేహాలను మెడికల్ కాలేజీ కొడుకు కళ్లు సజీవం.. కోల్‌సిటీ: నా కొడుకు విజయ్‌పాల్‌రెడ్డి 2018 సెప్టెంబర్ 27న చనిపోయాడు. నేను, భార్య సుశీలతోపాటు నా కుటుంబ సభ్యులు దుఃఖంలో కూడా విజయపాల్‌రెడ్డి నేత్రాలను ఐ బ్యాంక్‌కు దానం చేశాం. నా భార్య, నేను కూడా మా మరణానంతరం నేత్రదానం చేస్తామని అంగీకారం తెలిపాం. చనిపోయిన వారి అవ యవాలు మరికొందరికి ఉపయోగకరంగా ఉంటాయి. వారిలో మనవారిని చూసుకోవచ్చు. – మారెల్లి రాజిరెడ్డి, యైంటింక్లయిన్‌కాలనీ, గోదావరిఖని తమ్ముడు తోడుండాలని.. కోరుట్లరూరల్: మాది మండలంలోని సంగెం. నాకు ఒక అన్న. ఇద్దరు తమ్ముళ్లు. చిన్న తమ్ముడు చీటి రాంచందర్‌రావుకు 18ఏళ్ల క్రితం అనారోగ్యంతో రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. డయాలసిస్ చేసినా ప్రయోజనం లేదని డాక్టర్లు చెప్పారు. తమ్ముడిని కాపాడుకునేందుకు ఒక కిడ్నీ ఇచ్చా. కొంతకాలానికి తమ్ముడు అనారోగ్యంతో చనిపోయాడు. కిడ్నీ ఇచ్చిన నేను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. అన్ని పనులు చేసుకుంటున్నా. తమ్ముడే దక్కలేదు. – చీటి మురళీధర్ రావు, సంగెం, కోరుట్ల రాష్ట్రం మొదటిస్థానం కోల్‌సిటీ: అవయవదానంపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. మన రాష్ట్రం దేశంలో అవయవదానంలో మొదటిస్థానంలో నిలిచింది. గోదావరిఖని ప్రాంతంలో ఎక్కువ మంది ముందకు వస్తున్నారు. 2008లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పురుడుపోసుకున్న సదాశయ ఫౌండేషన్.. రాష్ట్రవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అవయవదాతల కుటుంబాలకు, స్వచ్ఛంద సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. – టి.శ్రవణ్‌కుమార్, సదాశయ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మా ఆయన్ను దక్కించుకోవాలని.. విద్యానగర్(కరీంనగర్): మా వారు వారాల ఆనంద్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రíహీత. 2013లో ఆయనకు రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. వారానికి మూడుసార్లు డయాలసిస్ ఏడాదిపాటు చేయించుకోవాల్సి వచ్చింది. ఆయన్ను దక్కించుకునేందుకు నేను ఒక కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యా. నా కిడ్నీని ఆనంద్‌కు 15 జూలై 2014లో ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. నా జీవితంలో ఆయన లేని లోటును ఊహించలేను. నాలో భాగమైన ఒక కిడ్నీ ఇచ్చి బతికించుకున్నాను. ఇప్పుడు నేను, మావారు పిల్లలతో ఆనందంగా ఉన్నాం. – వారాల ఇందిరారాణి, గృహిణి, కరీంనగర్ కొడుకు ప్రాణం పోశాడు వేములవాడ: మాది వేములవాడ. కొన్నేళ్లక్రితం లివర్‌వ్యాధి ఉండేది. ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయింది. నా కొడుకు మారుతి లివర్ నాకు సరిపోయింది. 17 నవంబర్ 2017న మారుతి లివర్‌లోని కొంతభాగాన్ని నా లివర్‌కు జతచేశారు. ఇప్పుడు ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం. నా కొడుకు లివర్ ఇచ్చి నాకు ప్రాణం పోశాడు. – కుమ్మరి శంకర్, వేములవాడ -
విద్యుత్ షాక్ నుంచి అమ్మాయిని కాపాడిన ఆర్టిఫిషియల్ గోళ్లు
సాధారణంగా విద్యుత్ షాక్ తగిలినవారు తీవ్రంగా గాయాలపాలు కావడమో లేదా మృతి చెందడమో జరుగుతుండటాన్ని మనం చూసేవుంటాం. అయితే ఇటీవల ఒక కాలేజీ యువతికి విద్యుత్ షాక్ తగిలి 4 అడుగుల దూరం ఎగిరిపడంది. అయితే ఇంత జరిగినా ఆమెకు చిన్నపాటి గాయం కూడా కాకపోవడం విశేషం. ఈ విచిత్ర ఉదంతం ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. తనకు ఎదురైన అనుభవం గురించి బాధితురాలు మాట్లాడుతూ తాను నకిలీ గోళ్లు పెట్టుకున్నకారణంగా విద్యుత్ షాక్ నుంచి బయటపడ్డానని తెలిపింది. 21 ఏళ్ల నికోల్ ఫోర్‌మ్యాన్ అనే యువతి ఇంటిలోని బాయిలర్ సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యింది. బాయిలర్‌ను బంద్ చేయకుండానే నీటిని వేడి చేసి, స్నానం చేసేందుకు ఆ నీటిలో కాలు మోపింది. వెంటనే ఆమె షాక్‌నకు గురయ్యింది. ఎడిన్బర్గ్ క్వీన్ మార్గరిట్ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఆ యువతి..‘షాక్ తగిలిన వెంటనే నాలుగు అడుగుల దూరం ఎగిరిపడ్డాను. తరువాత స్పృహ కోల్పోయానని’ తెలిపింది. ఇంటిలోని వారు ఆమెను గమనించి వెంటనే బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, ఆమె పెట్టుకున్న నకిలీ గోళ్ల కారణంగానే ఎంతో ప్రమాదకరమైన విద్యుత్ షాక్ నుంచి బయటపడిందని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన నికోల్..‘మా అమ్మ నా ఆర్టిఫిషిల్ గోళ్లను చూసి నన్ను తెగ మందలించేది. అయితే ఇప్పుడు ఆ గోళ్లే తనను కాపాడాయని తెలుసుకుని సంతోషపడుతోందని’ తెలిపింది. ఇది కూడా చదవండి: భూమిపై ఎలియన్స్?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన! -
నడక చైర్‌లోని పసివాడు.. పైకప్పు కూలిపోయేంతలో.. వైరల్ వీడియో!
ఇంటర్నెట్లో ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియో కంబోడియాకు చెందినది. ఒక మహిళ తమ ఇంటి పైకప్పు కూలిపోతున్న సమయంలో తన పిల్లవాడిని ఎలా కాపాడిందనేది ఈ వీడియోలో ఉంది. కొన్ని సెకెన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను కన్నుతిప్పుకోనీయకుండా చేస్తోంది. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన రాజధాని నోమ్ పెన్హ్‌లో చోటుచేసుకుంది. వీడియో ఉన్న కంటెంట్ ప్రకారం పిప్‌సర్ అనే మహిళ ఒక పిల్లవాడిని ఎత్తుకుని కనిపిస్తుంది. గదిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారు. ఆ తల్లికి ఏదో శబ్ధం వినిపించగానే ఇద్దరు పిల్లలతో సహా బయటకు పరిగెడుతుంది. అయితే ఇంకో పిల్లాడు అక్కడే నడక చైర్లో ఉంటాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఆమె ఆ నడకచైర్‌లో ఉన్న పిల్లవాడిని కూడా లాక్కుని బయటకు వచ్చేస్తుంది. ఇంతలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోతుంది. ఆ తల్లి నడకచైర్‌లో ఉన్న పిల్లవాడిని కాపాడటంలో ఒక్క క్షణం జాప్యం చేసినా, ఆ పసిపిల్లవాడు ప్రమాదం బారిన పడేవాడని వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ ప్రమాదంలో పిల్లవాడిన కాపాడిన ఆ తల్లి ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ఇంటిపై కప్పు మా మీద పడితే మేం చనిపోయేవాళ్లం. అందుకే మేము పరుగుపరుగున వచ్చేశాం అని తెలిపారు. ఇంటి యజమాని మీడియాతో మాట్లాడుతూ ఇంటి నిర్మాణం జరిగినప్పుడు వాటర్ ప్రూఫింగ్ సరిగా జరగలేదని, ఇప్పుడు కుర్తుస్తున్న భారీ వర్షాలకు ఇంటిపైకప్పు కుంగిపోయి, పడిపోయిందని తెలిపారు. నిర్మాణం సరిగా లేకపోవడం వలనే ఇలా జరిగిందన్నారు. అందుకే ఎవరైనా ఇంటిని కొనుగోలు చేసేముందు అన్ని అంశాలు సమగ్రంగా పరిశీలించుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి: భారత్, పాక్‌లను కలిపిన కేంబ్రిడ్జ్ స్నేహం.. గత 31 ఏళ్లుగా.. The #ceiling of a residence in Phnom Penh, #Cambodia, #collapsed in the living room. Luckily, the #mother inside the house acted quickly, picking up one child with one hand and holding a school bicycle having another child with the other. All her children were saved in the end. pic.twitter.com/aK9wXVsTvW — Warm Talking (@Warm_Talking) July 18, 2023 -
బాలాసోర్ రైలు ప్రమాదం: ‘కూతురి మొండితనమే ప్రాణాలు నిలబెట్టింది’
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదాన్ని ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. ప్రమాదంలో కొందరు ఇంటిలోనివారిని కోల్పోగా, మరికొందరు క్షతగాత్రులుగా మిగిలారు. దీనికి భిన్నంగా కొందరు విచిత్ర పరిస్థితుల్లో ప్రాణాలతో బతికి బయటపడ్డారు. అటువంటి కథనం ఒకటి వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే తన 8 ఏళ్ల కుమార్తెతో పాటు ఒక తండ్రి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కటక్ వెళ్లేందుకు బయలుదేరారు. వారు కరగ్‌పూర్‌లో రైలు ఎక్కారు. వారికి థర్డ్ ఏసీలో సీటు రిజర్వ్ అయ్యింది. అయితే వారికి కిటికీ దగ్గరి సీటు లభ్యం కాలేదు. అయితే కుమార్తె తనకు కిటికీ దగ్గరి సీటు కావాలని మొండిపట్టు పట్టింది. తండ్రి ఎంత నచ్చజెప్పినా ఆ చిన్నారి మాట వినలేదు. దీంతో ఆ తండ్రి టీసీని సంప్రదించి, కిటికీ దగ్గరి సీటు కావాలని రిక్వస్ట్ చేశారు. దీనికి టీసీ సమాధానమిస్తూ మీరు మరో ప్రయాణికుని అడిగి వారి సీటు అడ్జెస్ట్ చేసుకోండని సలహా ఇచ్చారు. దీంతో ఆ తండ్రి మరో కోచ్‌లోని ఇద్దరు ప్రయాణికులను రిక్వస్ట్ చేయడంతో వారు అందుకు అంగీకరించారు. దీంతో ఆ తండ్రీకుమారులు ఆ రెండు సీట్లలో కూర్చున్నారు. కొద్దిసేపటికి వారు ప్రయాణిస్తున్న రైలు బాలాసోర్ చేరుకున్నంతలోనే ప్రమాదానికి గురయ్యింది. ఆ తండ్రీకూతుర్లు కూర్చున్న కోచ్‌కు ఈ ప్రమాదంలో ఏమీకాలేదు. అయితే అంతకుమందు వారికి కేటాయించిన సీట్లు కలిగిన బోగీ తునాతునకలైపోయింది. ఆ బోగీలోని చాలామంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం బారి నుంచి బయటపడిన ఆ తండ్రి పేరు ఎంకే దేవ్. అయిన మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె మొండితనం వలనే ఈరోజు తాము ప్రాణాలతో బయటపడగలిగామన్నారు. కాగా అతని కుమార్తె చేతికి స్వల్పగాయమయ్యింది. ఆ చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: ‘ ట్రైన్ టాయిలెట్లో ఉన్నాను... ఒక్క కుదుపుతో..’ -
ఒడిశా రైలు ప్రమాదం: బోగీలో నుంచి పిల్లలను బయటకు విసిరేసి...
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 270కిపైగా ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మూడు రైళ్లు ఢీకొన్న నేపధ్యంలో కొన్ని సెకెన్ల వ్యవధిలోనే ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంటనే తేరుకున్న కొందరు ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బయటపడ్డారు. ఇదేరీతిలో ఒక మహిళ ఎంతో ధైర్యంతో తన ముగ్గురు పిల్లలను కాపాడుకుంది. రైళ్లు ఢీకొన్న సమయంలో చాలా బోగీలు చెల్లాచెదురైపోయాయి. ఇదేవిధంగా పక్కకు ఒరిగిపోతున్న బోగీలో ఉన్న ఒక మాతృమూర్తి ఎంతో ధైర్యం, సమయస్ఫూర్తితో తన పిల్లల ప్రాణాలను రక్షించింది. రైళ్లు ఢీకొన్న సమయంలో ప్రయాణికుల అరుపులు, కేకలు విన్న సీతాదాస్ అనే 45 ఏళ్ల మహిళ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఇద్దరు కుమార్తెలను ఒక కుమారుడిని బోగీలోని కిటికీలో నుంచి బయటకు విసిరివేసింది. ఆ రైలు పట్టాలకు ఒకవైపు పంట పొలాలు ఉన్నాయి. ఆ చిన్నారులను ఆమె ఆ పంటపొలాలలోకి విసిరివేసింది. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రమాదం జరిగిన సమయంలో ఇక తన ప్రాణాలు పోవడం ఖాయమని అనిపించిందని, అందుకే పిల్లలను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నానన్నారు. వెంటనే పిల్లలను కిటికీలో నుంచి బయటకు తోసివేశానని’ తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో సీతతో పాటు ఆమె భర్తకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. విపత్కర సమయంలో అంత్యంత తెలివితేటలతో పిల్లలను కాపాడుకున్న ఆమెను అందరూ అభినందిస్తున్నారు. చదవండి: ‘ ఒక పెద్ద కుదుపు.. అంతా అయిపోయింది’ -
రియల్ హీరో వీడియో వైరల్.. ఊహించని ట్విస్ట్
పరోపకారిగా బతికే మనుషులు.. ఈరోజుల్లో కనిపించడం అరుదైపోయింది. కొందరు తాము చేసింది చిన్నసాయంగానే ఫీలైనప్పటికీ.. అవతలి వాళ్లు మాత్రం దానిని విలువైందిగా భావించొచ్చు. అలా ఓ పసిప్రాణాన్ని కాపాడిన వ్యక్తి అదేమంత పెద్దసాయం కాదని అంటుంటే.. ఊహించని ప్రతిఫలం, అదీ ఎంతోకాలంగా అతను ఎదురుచూస్తుందే దక్కింది ఇప్పుడు.. కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి ఓ పసికందును కాపాడిన వీడియో గత కొన్నిరోజులుగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ఒక పెద్దావిడ ఓ చిన్నారిని స్ట్రోలర్‌లో పెట్టుకుని తీసుకెళ్లే యత్నం చేస్తుంది. ఆ టైంలో ఆమె కారులో ఏదో సర్దుతుంటే.. గాలి బలంగా వీయడంతో ఆ స్ట్రోలర్ దానంతట అదే వాహనాలు తిరుగుతున్న రోడ్డు వైపుగా వెళ్తుంటుంది. ఆమె అప్రమత్తమయ్యేలోపు కిందపడిపోగా.. ఓ వ్యక్తి ఆపద్బాంధవుడిలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్నారిని రోడ్డు మీదకు వెళ్లకుండా రక్షించాడు. కట్ చేస్తే.. ఆ వ్యక్తి చేసిన సాహసానికి ఇప్పుడు నజరానా లభించింది. అదేంటో కాదు.. అతనికి ఉద్యోగం!. ఆ ఘటనకు ముందు ఆపిల్‌బీ అనే రెస్టారెంట్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యాడతను. అది అయిపోయి బయటకు రాగానే.. ఈ ఘటన జరిగింది. అయితే.. ఆ వ్యక్తి సాహసం వైరల్ కావడంతో.. ఆ కంపెనీ వాళ్లు అతన్ని పిలిచి మరీ తమ ఫ్రాంచైజీల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇచ్చారట. దీంతో అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఆ వ్యక్తి పేరు రోన్ నెస్మ్యాన్. సొంతిల్లు లేదు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గత ఎనిమిది నెలల నుంచి దగ్గరి బంధువు ఇంట్లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే రెస్టారెంట్ ఇంటర్వ్యూకు వెళ్లిన అతనికి.. ఆపదలో ఉన్న చిన్నారి కంటపడింది. క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను రక్షించి.. రియల్ హీరోగా అందరితో ప్రశంసలు అందుకున్నాడు. ఆ క్షణం ఆ పెద్దావిడ భయంతో వణికిపోతుంటే.. ఆమెను కౌగిలించుకుని ధైర్యం చెప్పి ఓదర్చాడట ఈ రియల్ హీరో. Another HERO😊 surveillance video captures a homeless man saving a baby in a stroller rolling toward heavy traffic. The baby’s aunt was unloading items on the backseat of her SUV parked outside of the A1 Hand Car Wash, when the stroller started to roll away towards the street.… pic.twitter.com/wihD0EmNFQ — DeL2000 (@DeL2000) May 4, 2023 -
పాల దిగుబడిపై వడ‘దెబ్బ’
నరసాపురం రూరల్: వేసవిలో పాడిపశువుల సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. వేసవిలో పశువులకు వడదెబ్బ తగిలితే పాల దిగుబడి తగ్గడమే కాక పశువులు ఎదకు వచ్చే పరిస్థితులు కనిపించవని, అంతేకాక పశువు చూడుకట్టే అవకాశం ఉండదని పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వై.సుధాకర్ చెబుతున్నారు. వేసవిలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల్లో సోకే వ్యాధులను ఆయన వివరించారు. వేసవిలో గేదెలు, ఆవులపై సరైన శ్రద్ధ తీసుకోనట్లయితే వడదెబ్బకు గురై ఒక్కొక్కసారి పశువు ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు ఇవే వేసవిలో పశువులు తాగే నీరు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచాలి. వేసవిలో సహజంగానే నీటి వనరులు తగ్గి నిల్వ ఉండే నీరు మురికిగా, ఆకుపచ్చగా మారతాయి. పశువులు ఈ కలుషితమైన నీరు తాగితే వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరి పారుడు వ్యాధులు కలుగుతాయి. కాబట్టి పశువులు తాగేందుకు స్వచ్ఛమైన నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. లేదంటే రోజులో కనీసం మూడుసార్లు నీటిని అందించడం అవసరం, ఆరుబయట తొట్టెల్లో పగలు నిల్వ ఉన్న నీరు వెచ్చగా మారతాయి. నీడ ప్రాంతంలో నిల్వ ఉంచిన చల్లటి నీటినే పశువులకు తాగించాలి. ఆవులతో పోలిస్తే గేదెలు ఎక్కువ నీటిని తాగుతాయి. వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, పశువు వయస్సు తదితరాలనుబట్టి రోజుకు సుమారుగా 28 లీటర్ల నీరు అవసరమవుతాయి. పాలిచ్చే పశువులు అదనంగా ప్రతి లీటరు పాల దిగుబడికి నాలుగు లీటర్ల చొప్పున నీటిని తాగుతాయి. ఇది కాకుండా పశువులను శుభ్రపరిచేందుకు, షెడ్లలో నేలను శుభ్రపరిచేందుకు ప్రతి పశువుకు 110 లీటర్ల నీరు అవసరం పడుతుంది. వడదెబ్బ తగలకుండా.. పశువులకు వడదెబ్బ తగలకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల పాక చుట్టూ పాత గోనెలు కట్టి వాటిని అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. పైకప్పును కొబ్బరి ఆకులతో గానీ, ఎండి వరిగడ్డితో గాని కప్పాలి. మంచినీరు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేట్లు చూడాలి. పశువులను ఉదయం, సాయంత్రం మాత్రమే అంటే చల్లని వాతావరణంలోనే మేత మేసేందుకు విప్పాలి. పశువులు ఎక్కువగా ఎండలో తిరగకుండా చూడాలి. వీలైనంత పచ్చని మేతను ఇవ్వాలి. సంకర జాతి ఆవులైతే పంకాలు ఏర్పాటు చేయాలి. వడదెబ్బకు గురైతే లక్షణాలు ఇలా.. వడదెబ్బకు గురైన పశువు లక్షణాలను పరిశీలిస్తే శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల నుంచి 108 డిగ్రీల వరకు పెరుగుతుంది. పశువులు నడిచేటప్పుడు తూలుతాయి. శ్వాసక్రియ ఎక్కువగా ఉంటుంది. పశువు చాలా నీరసంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి కింద పడి కొట్టుకుని స్పృహకోల్పోతాయి. పశువు నీటి కొరకు చూస్తుంటుంది. పశువు చర్మం ఎండిపోయినట్లు ఉంటుంది. పశువులో పాల ఉత్పత్తి కొల్పోతుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ తగిలిందని రైతు గ్రహించాలి. చేయాల్సిన చికిత్స ఇదే వడదెబ్బ తగిలిన పశువును రైతులు గుర్తించిన వెంటనే చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. గుడ్డతో ఐస్ చుట్టి పశువు నుదుటిపై నొత్తాలి. కొద్ది ఊరట కలిగిన తరువాత దగ్గరలోని పశు వైద్యుడిని సంప్రదించి సైలెన్లు పెట్టాలి. ఒక్క సారి వడదెబ్బ తగిలిన పశువుకు బతికినంత కా లం పాలదిగుబడి గతంలో మాదిరిగా ఉండదు. జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ వై సుధాకర్, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు -
షాకింగ్ ఘటన.. స్నేహితుడి భార్యను కాపాడబోయి..
నిడదవోలు రూరల్(తూర్పుగోదావరి జిల్లా): క్షణికావేశంలో కాలువలోకి దూకిన స్నేహితుడి భార్యను కాపాడబోయి ప్రమాదవశాత్తూ యువకుడు మృతిచెందినట్లు పట్టణ ఎస్సై పి.నాగరాజు గురువారం తెలిపారు. నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కాపకాయల నరేంద్రకుమార్ (31) గతంలో ఒక ప్రైవేట్ సెల్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి ప్రస్తుతం వ్యవసాయ పనులు చేస్తున్నాడు. నరేంద్రకుమార్ స్నేహితుడు కొవ్వూరుకు చెందిన జావిద్ బాషా(చోటు)కు అతని భార్య దేవికి మనస్పర్థలు వచ్చాయి. దీంతో నరేంద్రకుమార్ భార్యాభర్తలను ఈ నెల 14వ తేదీన శెట్టిపేట తీసుకువచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా గొడవలు పెరగడంతో భార్య దేవి.. శెట్టిపేట పవర్‌ప్లాంట్ వద్ద బుధవారం తెల్లవారుజామున వంతెనపై నుంచి కాలువలోకి దూకేసింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో కాలువలోకి దిగిన నరేంద్రకుమార్ ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా నరేంద్రకుమార్ మృతదేహం లభ్యమైంది. మృతుడి తల్లి నాగతులసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: వివాహితతో సహజీవనం.. అసలు విషయం తెలిసి షాకయిన మహిళ -
నా కుమారుడిని రక్షించుకోలేకపోయా!: కేంద్ర మంత్రి భావోద్వేగం
మద్యం సేవించే అధికారికంటే రిక్షా తొక్కేవాడిని, కూలీలను పెళ్లిచేసుకోవడం సముచితమని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు తమ కుమార్తెలు, సోదరీమణులకు మద్యపానం చేసేవారితో అస్సలు వివాహం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఉత్తరప్రదేశ్‌లోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యపానం డి అడిక్షన్‌పై జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ...తాను ఎంపీగా తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా తమ కుమారుడి ప్రాణాలను కాపాడలేకపోయినప్పుడూ..సామాన్య ప్రజలను ఎలా కాపాడగలనంటూ భావోద్వేగానికి గురయ్యారు. "తన కొడుకు ఆకాష్ తన స్నేహితులతో మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. మానిపించేందుకు డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించాం. ఆ అలవాటు మానుకుంటాడని పెళ్లి కూడా చేశాను కానీ అతను పెళ్లైన తర్వాత కూడా తాగడం ప్రారంభించాడు. క్రమంగా అది అతని మరణానికి దారితీసింది. దీంతో అతడి భార్య వితంతువుగా మారింది. పైగా వారికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు." అని ఆవేదనగా చెప్పుకొచ్చారు. అందువల్ల దయచేసి మీరు మీ కుమార్తెలను, సోదరీమణులను ఇలాంటి వ్యసనపరులకు కట్టబెట్టకుండా రక్షించండి. ఈ తాగుడు వ్యసనం కారణంగా ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎంపీ కూడా 80 శాతం క్యాన్సర్ మరణాలకు కేవలం పొగాకు, సిగరెట్లు, బీడీల వ్యసనమే కారణమని అన్నారు. ఈ డీ అడిక్షన్ కార్యక్రమంలో ప్రజలు, ఇతర సంస్థలు భాగస్వాములు కావాలని కుటుంబాలను రక్షించుకోవాలని ఆయన కోరారు. అలాగే జిల్లాను వ్యసన రహితంగా మార్చేందుకు డీ అడిక్షన్ క్యాంపెయిన్‌ను అన్ని పాఠశాలలకు తీసుకువెళ్లాలని, పైగా ఉదయం ప్రార్థన సమయంలో పిల్లలకు దీని గురించి చెప్పాలని కేంద్ర మంత్రి కౌశల్ అధికారులను ఆదేశించారు. (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
ఏపీలో పొగాకు రైతులను ఆదుకోండి : ఎంపీ మాగుంట
-
మాజీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏనుగు... పరుగులు తీసిన మంత్రి
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కాన్వాయ్‌ని ఒక ఏనుగు అడ్డుకుంది. ఆయన కారులో వస్తుండగా అకస్మాత్తుగా అడవి నుంచి ఒక ఏనుగు రోడ్డుపైకి వచ్చి మాజీ సీఎం వాహనాన్ని అడ్డుకుంది. ఈ హఠాత్పరిణామానికి మంత్రి కారు దిగి ప్రాణాల కోసం పరుగెత్తవలసి వచ్చింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని కోట్ద్వార్-దుగడ్డ హైవే మీదుగా కోత్ద్వార్కి వస్తుండగా చోటుచేసుకుంది. తొలుత మాజీ సీఎం ఏనుగు వెళ్లిపోతుందనుకుని కారులోనే కూర్చుని ఉన్నారు. కానీ ఆ ఏనుగు అనుహ్యంగా మంత్రి కారువైపు వస్తుండటంతో మంత్రితో సహా ఆయన తోపాటు ఉన్న జనాలు కూడా భయంతో కారుదిగి పక్కనే ఉన్న కొండల వద్దకు పరుగులు తీశారు. పాపం సీఎం చివరకు కొండ ఎక్కి ప్రాణాలను ఎలాగోలా రక్షంచుకున్నారు. దాదాపు అరగంటపాటు మాజీ సీఎం కాన్వాయ్ అక్కడే ఉండాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది గాలిలో కాల్పులు జరిపి ఏనుగును ఎలాగోలా తరిమికొట్టారు. శివాలిక్ ఎలిఫెంట్ కారిడార్ ప్రాంతం కొట్ద్వార్-దుగడ్డ మధ్య ఉండడంతో హైవేపై ఏనుగులు తరచూ వస్తుంటాయని దుగడ్డ రేంజ్ ఆఫీసర్ ప్రదీప్ డోబ్రియాల్ తెలిపారు. ఇలాంటి ఘటనలు అక్కడ సర్వసాధరణమేనని చెప్పారు. (చదవండి: బిహార్‌లో మద్యం నిషేధం విఫలం: ప్రశాంత్) -
ఎమర్జెన్సీకి ఫోన్ చేసి తల్లిని కాపాడిన 4ఏళ్ల బుడతడు
నాలుగేళ్ల చిన్నారి ఎమర్జెన్సీ నెంబర్‌కి కాల్చేసి మరీ తన తల్లిని కాపాడుకున్నాడు. అసలేం జరిగిందంటే...తస్మానియాకి చెందిన నాలుగేళ్ల బాలుడు రెండు రోజుల క్రితమే అంబులెన్స్‌కి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్ని ఎలా డయల్ చేయాలో నేర్చుకున్నాడు. అనుకోకుండా ఆ తర్వాత రోజు ఆమె తల్లి మూర్చతో కింద పడిపోయింది. దీంతో సదరు బాలుడు ఆ ఎమర్జెన్సీ నెంబర్ '000కి' కాల్ చేసి అమ్మ కింద పడిపోయిందని చెప్పాడు. వెంటనే పారామెడికల్స్ వచ్చి ఆ బాలుడి తల్లికి సకాలంలో వైద్యం అందించి ఆమెను రక్షించారు. అంతేకాదు సదరు అంబులెన్స్ పారామెడికల్ అధికారులు ఆ బాలుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఒక సర్టిఫికేట్‌ని కూడా ప్రధానం చేశారు. ఆ బాలుడి తల్లి ఒక నర్సు ఆమె ఫోన్ అన్‌లాక్‌లో ఉంటే ఎలా ఓపెన్ చేయాలో, ఎమర్జెన్సీ నెంబర్‌కి ఎలా కాల్ చేయాలో నేర్పించినట్లు తెలిపారు. అదే ఈ రోజు తన జీవితాన్ని కాపాడుతుందని ఊహించలేదని చెప్పారు. ప్రస్తుతం తన కొడుకు ఒక చిన్న హిరో అయిపోయాడంటూ మురిసిపోయారు. ఈ ఘటనతో ఆ బాలుడు వార్తల్లో నిలిచాడు. అంతేకాదు ఈ విషయం సోషల్ మాధ్యమాలో కూడా తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆ పిల్లవాడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ...చిన్న ఛాంపియన్ అని ప్రశంసిస్తున్నారు. (చదవండి: వైట్ హౌస్‌లో సందడి చేసిన బరాక్ ఒబామా దంపతులు) -
తల్లి ప్రేమ అంటే ఇదే కదా.. ప్రాణాలు తెగించి.. పులితో పోరాడి..
భోపాల్: పులితో ప్రాణాలకు తెగించి పోరాడి కన్నకొడుకుని కాపాడుకుంది ఓ మహిళ. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ సమీపంలోని జబల్పూర్లో చోటు చేసుకుంది. ఒక పులి రోహనియా గ్రామంలో టైగర్‌రిజర్వ్ వెలుపల తిరుగుతుందని సమాచారం. కానీ ఆ విషయం సదరు మహిళకు తెలియదు. ఆమె తన ఏడాది వయసున్న కొడుకుని తీసుకుని పొలానికి వెళ్లింది. పొలంలోని పొదలమాటున దాగి ఉంది పులి. సదరు మహిళ పొలం పనులు చేస్తుండగా..ఒక్కసారిగా మాటేసిన పులి సదరు బాలుడిపై హఠాత్తుగా దాడి చేసింది. దీంతో ఆమె తన చేతిలో ఏ ఆయుధం లేకపోయినా.. ఆ పులితో ప్రాణాలకు తెగించి పోరాడింది. పులిచేసే ప్రతి దాడిని ఎదుర్కొంటూ...మరోవైపు అరుస్తూ చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేసింది. దీంతో గ్రామస్తులంతా వచ్చి ఆ పులిని తరిమికొట్టారు. ఈ ఘటనలో ఆ బాలుడికి తలకు తీవ్రగాయలవ్వగా, తల్లి శరీరమంతా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ తల్లికొడుకు లిద్దరు జబల్పూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారిద్దరు క్షేమంగానే ఉన్నారని టైగర్ రిజర్వ్ మేనేజర్ భారతి తెలిపారు. -
భయానక వీడియో: కాలనాగు నుంచి బిడ్డను కాపాడుకుంది
వైరల్: కర్ణాటక మాండ్య నుంచి భయానక వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతోంది. ఓ తల్లి సమయస్ఫూర్తితో భారీ విష సర్పం కాటు నుంచి బిడ్డను రక్షించుకుంది. రెప్పపాటులో ఆ బిడ్డకు ఘోర ప్రమాదమే తప్పింది. ఆ తల్లీబిడ్డలు ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వస్తున్న టైంలో ఈ ఘటన జరిగి ఉంటుందని స్పష్టం అవుతోంది. ఇంటి బయట మెట్ల కింద నుంచి పాము వెళ్తోంది. ఆ సమయంలో పామును గమనించకుండా ఆ చిన్నారి కిందకు కాలు వేయబోయాడు. అంతలో.. ఆ తల్లి చూపించిన తెగువ, సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు. ఎంతైనా అమ్మ కదా! View this post on Instagram A post shared by India Today (@indiatoday) -
స్నేహితుడిని కాపాడబోయి మృత్యువాత
మోతుగూడెం: చింతూరు మండలం పొల్లూరు జలపాతంలో గురువారం పలవెల హసన్ ప్రీతమ్(21) మునిగిపోయి మృతి చెందాడు. అప్పటి వరకు స్నేహితులతో ఆనందంగా గడిపిన హసన్‌కు పొల్లూరు జలపాతం యమపాశమైంది. మృతుడు హసన్ ప్రీతమ్ కాకినాడ కార్పొరేషన్లో పబ్లిక్ హెల్త్ డిపార్టెమెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి గురువారం ఉదయం 4 గంటలకు రెండు మోటార్‌బైక్‌లపై బయలుదేరి 11 గంటలకు పొల్లూరు జలపాతం వద్దకు చేరుకున్నారు. స్నానం చేసేందుకు హసన్‌ప్రీతమ్, మరో స్నేహితుడు ద్విగిజయ్ అబురుక్‌లు జలపాతంలోకి దిగారు. స్నానం చేస్తుండగా ద్విగిజయ్ నీటిలో మునిగిపోవడంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో హసన్ ప్రీతమ్ నీటిలో మునిగిపోయి చనిపోయాడు. సంఘటన జరిగిన వెంటనే ఎస్ఐ వి.సత్తిబాబు తమ సిబ్బందితో అక్కడకు చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. గత ఏడాదే ఉద్యోగం వచ్చింది పలవెల హసన్ ప్రీతమ్ తల్లిదండ్రులు చనిపోయారు. సొంత గ్రామం మండపేట. తల్లి పద్మ మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తూ 2020 సంవత్సరంలో చనిపోయారు. దీంతో కుమారుడు హసన్‌కు 2021 సంవత్సరంలో కాకినాడ కార్పొరేషన్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. మృతుడికి ఒక సోదరి ఉంది. ఆమె ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నంలో డిగ్రీ చదువుతున్నారు. బంధువులు పొల్లూరు బయలు దేరారు. ఒంటరైన సోదరి కాకినాడ : కన్నతల్లి అనారోగ్యంతో మృత్యువాతపడింది. కొద్ది నెలలకే తండ్రి అనారోగ్యంతో చనిపోయారు. తనే అమ్మా నాన్నలా తోడుగా నిలిచిన అన్నయ్యను కూడా మరణం వెంటాడింది. ఇలా మూడేళ్ళ వ్యవధిలో ఒకరి వెంట ఒకరుగా కుటుంబ సభ్యులంతా చనిపోవడంతో ఇప్పుడామె ఒంటరి అయ్యింది. ఆమె దయనీయ స్థితిని చూసిన సన్నిహితులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చింతూరు మండలం పొల్లూరు జలపాతంలో పడి పలివెల హసన్‌ప్రీతమ్ మరణించాడన్న సమాచారంతో ఇక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే...కాకినాడ నగర పాలకసంస్థ అసిస్టెంట్ ఇంజినీ ర్గా పనిచేస్తున్న పద్మశ్రీ రెండున్నరేళ్ళ క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆమె మరణించిన మరికొద్ది నెలలకే ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న తండ్రి వెంకటేశ్వరరావును కూడా మృత్యువు వెంటాడి తీసుకుపోయింది. తల్లి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వీరి కుమారుడు హసన్‌ప్రీతమ్‌కు కారుణ్య నియామకం ద్వారా కాకినాడ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ ధైర్యాన్ని కూడగట్టుకుని చెల్లెలు హర్షితను చదివిస్తూ తనే అమ్మా, నాన్నగా, అన్నగా తోడుండి బాసటగా నిలిచాడు. అన్న ప్రోత్సాహంతో కొద్ది రోజుల క్రితమే హర్షిత విశాఖ ఆంధ్రాయూనివర్సిటీలో బీటెక్‌లో చేరింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబాన్ని మరోసారి విధి వెంటాడింది. అవివాహితుడైన అన్న హసన్ ప్రతీమ్ గురువారం రంపచోడవరం ఏజన్సీ పొల్లూరు జలపాతంలో గల్లంతై మృత్యువాత పడ్డాడన్న సమాచారం బయటపడింది. దీంతో హర్షిత పరిస్థితిని తలుచుకుని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..!) -
ప్రాణం నిలిపిన డెలివరీ బాయ్.. సర్వత్రా హర్షం
డెలివరీ బాయ్‌ల జీవితాల గురించి తెలియంది కాదు. కరోనాలాంటి కష్టకాలంలోనూ పొట్టకూటి కోసం రిస్క్ చేస్తున్న వాళ్లు కోకోల్లలు. అయితే డెలివరీ బాయ్‌ల విషయంలో కొంత మందికి చిన్నచూపు ఉంటుంది. అలాంటి వాళ్ల కళ్లు తెరిపించే ఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముంబై(మహారాష్ట్ర)లో రిటైర్డ్ కల్నల్ మోహన్ మాలిక్ కుటుంబం నివసిస్తోంది. కిందటి నెల (డిసెంబర్ 25న) హఠాత్తుగా ఆ పెద్దాయన తీవ్ర అస్వస్థలకు లోనయ్యారు. వెంటనే ఆయన కొడుకు ఆస్పత్రికి తీసుకుని బయలుదేరాడు. దారిలో భారీ ట్రాఫిక్. ఇంచు కూడా కదల్లేని స్థితి. దీంతో టూవీలర్ మీద త్వరగా వెళ్లొచ్చన్న ఉద్దేశంతో కారు దిగి సాయం కోసం మాలిక్ కొడుకు అందరినీ బతిమాలాడు. కానీ, ఎవరూ సాయానికి ముందుకు రాలేదు. ఆ టైంలో డెలివరీలతో అటుగా వెళ్తున్నాడు ఒక స్విగ్గీ డెలివరీ బాయ్. మాలిక్ కొడుకు పడుతున్న కష్టం చూసి చలించి.. వెంటనే ఆ పెద్దాయన తన బైక్ మీద కూర్చోబెట్టుకుని ముగ్గురూ ఆస్పత్రికి బయలుదేరాడు. అడ్డుగా వాహనాలను గట్టిగా అరుస్తూ పక్కకు తప్పుకునేలా చేసి మరీ వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరుకున్నాడు ఆ డెలివరీ బాయ్. అలా సకాలంలో ఆస్పత్రికి చేరడంతో మోహన్ మాలిక్ ప్రాణం నిలిచింది. అయితే ఆస్పత్రికి చేరిన వెంటనే.. ఆ డెలివరీ బాయ్ అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇన్నాళ్లూ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసి కోలుకున్న ఆ పెద్దాయన.. ఈ మధ్యే డిశ్చార్జి అయ్యారు. స్విగ్గీ ప్రతినిధులను సంప్రదించి.. ఎలాగోలా ఆ డెలివరీ బాయ్ జాడ కనుక్కోగలిగాడు. ఆ డెలివరీ బాయ్ పేరు మృణాల్ కిర్దత్. తన ప్రాణం కాపాడిన ఆ యువకుడిని.. రియల్ సేవియర్‌గా కొనియాడుతున్నాడు ఆ పెద్దాయన. సకాలంలో స్పందించిన ఆ డెలివరీ బాయ్ పనికి సోషల్ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అతనికి ఏదైనా సాయం అందించాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. హ్యాట్సాఫ్ టు దిస్ రియల్ హీరో. View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) -
తాతా నీళ్లు తాగు.. గంగిరెద్దు ఇదిగో అరటిపండు! సల్లగుండు బిడ్డా
సోషల్‌మీడియాలో ఈమధ్య ఎందుకు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేకపోతున్నాం. కానీ, కొన్ని వీడియోలు మాత్రం మనసును హత్తుకునేలా ఉంటున్నాయి. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు వాట్సాప్ స్టేటస్‌లుగా, ఫేస్‌బుక్‌లోనూ వైరల్‌గా మారింది. గంగిరెద్దును ఆడించే ఓ పెద్దాయన స్పృహ కోల్పోతే.. ఓ చిన్నారి అతనికి చేసిన ఉడతా సాయం పలువురి చేత ప్రశంసలు కురిపిస్తోంది. ఓ తాత గంగిరెద్దును ఆడిస్తూ భిక్షాటన చేస్తూ ఓ గేట్ ముందుకు చేరగా.. ఆ ఇంటి మహిళ ఆయన్ని ఈసడించుకుంది. ఆ పక్కనే మరో ఇంటి ముందుకు వెళ్లగా.. హఠాత్తుగా స్పృహ కోల్పోయి కిందపడ్డాడు ఆ పెద్దాయన. దీంతో గంగిరెద్దు ఆ బసవన్నను లేపే ప్రయత్నం చేసింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అదేం పట్టన్నట్లు ముందుకు సాగిపోగా.. ఆ పక్కనే వెళ్తున్న ఇద్దరు చిన్నారులు మాత్రం అది గమనించారు. అందులో బ్యాగ్ వేసుకున్న ఓ చిన్నారి ఆ గంగిరెద్దు తాతకు దగ్గరగా వెళ్లింది. బసవన్నకు భయపడుతూనే ఆ తాతను లేపే ప్రయత్నం చేసింది. ఆపై తన బ్యాగ్‌లో ఉన్న వాటర్ బాటిల్‌ను తాతకు అందించి.. ఆపై ఎద్దుకు అరటి పండు అందించింది. చివరికి పైకి లేచిన తాత ఆ చిన్నారిని ఆశీర్వదిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు చెప్తున్న వీడియోను చూసి పలువురు ఆ చిన్నారిని ‘చిన్నవయసు-పెద్దమనసు’ అంటూ పొగుడుతున్నారు. ఇది ఎప్పటి వీడియో?.. ఏదైనా షార్ట్‌ఫిల్మ్‌లో భాగమా? అనే విషయంపై స్పష్టత లేదు. కానీ, కంటికి ఇంపుగా ఉండడంతో వైరల్ అవుతోంది.