బాలుడిని అప్పగిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
సాక్షి, అనకాపల్లి టౌన్: ఓ చిన్నారి చేసిన ఘనకార్యం అటు అధికారుల్ని.. ఇటు స్థానికుల్ని పరుగులు పెట్టించింది. తల్లిదండ్రులకి ముచ్చెమటలు పట్టించింది. చివరికి అగ్నిమాపక దళం ప్రవేశంతో ఉత్కంఠకు తెరపడింది. అనకాపల్లి పట్టణంలోని చవితినవీధి ఆర్కే అపార్ట్‌మెంట్ ప్లాట్ నంబర్ 203లో శుక్రవారం అసలు ఏం జరి గింది. ఆ ప్లాట్‌లో తోకల ప్రవీణ్‌రాజా, వసుధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 14 నెలల మహదేవ్ అనే బాలుడు సంతానం. శుక్రవారం ప్రవీణ్‌రాజా ఇంట్లోని హాల్ పనిలో నిమగ్నపోయారు. ఆయన భార్య వసుధ వంటపనిలో బిజీగా ఉన్నారు. అక్కడే ఆడుకుంటున్న మహదేవ్ వంటింటి తలుపును వేశాడు. దానికి ఆటోమేటిక్ లాక్ అమర్చిన కారణంగా గడియపడింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులిద్దరూ గమనించలేదు. పనిమీద తండ్రి మెయిన్ డోర్ దగ్గరకు బయటకు వెళ్లాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారి పక్కగదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. దానికి కూడా ఆటోమేటిక్ లాక్ అమర్చి ఉండడంతో అది కూడా మూసుకుపోయింది. లోపలి నుంచి చిన్నారి తలుపుతీద్దామని ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఏడుపు మొదలుపెట్టాడు. వంట గదిలో ఉన్న తల్లికి ఏడుపు వినిపించింది. బయటకొచ్చేందుకు యత్నించింది. తలుపు ఆటోమేటిక్‌గా లాక్ అయిన పరిస్థితిని తెలుసుకుంది.
భయంతో కేకలు...
చిన్నారి ఏడుపు ఓ వైపు.. ఏం జరుగుతుందోనన్న ఆందోళన మరోవైపు.. భయంతో కేకలు వేయడం మొదలుపెట్టింది. అవి విన్న స్థానికులు పెద్దసంఖ్యలో అపార్టుమెంట్ కిందకు చేరుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక ఒకటే ఉత్కంఠ. ఇంతలో బయటకెళ్లిన తండ్రి ఇంటికి చేరుకున్నారు. మెయిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్లారు. ఆయనకు పరిస్థితి అర్థమైంది. రెండు గదుల తలుపులూ తీసేందుకు యత్నించారు. వీలుకాకపోవంతో పక్కిం టి వారి సాయంతో ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు.
గంట పాటు రెస్క్యూ...
అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి మార్టిన్ లూథర్‌కింగ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపరేషన్ మొదలుపెట్టారు. అపార్ట్‌మెంట్‌పై నుంచి తాడు సాయంతో హోంగార్డు గోపీ నెమ్మదిగా బాలుడు ఉన్న గదిలోకి ప్రవేశించాడు. లోపలి నుంచి లాక్ అయిన తలుపును తెరిచాడు. అలాగే వంటగది తలుపును కూడా ఓపెన్ చేశాడు. బాలుడ్ని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఆపరేషన్‌కు గంట సమయం పట్టింది. అగ్నిమాపక సిబ్బంది చొరవను స్థానికులు అభినందిచారు. ఈ ఆపరేషన్‌లో అగ్నిమాపక శాఖాధికారి ఆర్.వెంకటరమణ, సిబ్బంది కృష్ణప్రసాద్, మదీన, గణేష్, నాయుడుబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment