Fire Services Department
-
ఢిల్లిలో చిరుత కలకలం.. ఐదుగురు ఆస్పత్రికి!
ఢిల్లిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఇటీవలి కాలంలో ఢిల్లీ వాసులను వణికిస్తున్న చిరుత పట్టపగలే మరోసారి దర్శన మిచ్చింది. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం ఉత్తర ఢిల్లిలో రూప్ నగర్లో చిరుతపులి ఓ ఇంట్లోకి చొరబడింది. ఈ క్రమంలో ముగ్గురిపై దాడిచేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెటింట చక్కర్లు కోడుతుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అగ్నిమాపక బృందం సాయంతో ఎట్టకేలకు దానిని బంధించారు. దీంతో అక్కడి జనం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ చిరుతను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక బృందం నానా కష్టాలు పడినట్టు సమాచారం. చిరుతని గదిలో బంధించామని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని ఢిల్లీ అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. STORY | Leopard barges into house in Delhi's Roop Nagar, 5 injured READ: https://t.co/EbH7OulTMV VIDEO: (Source: Third Party) pic.twitter.com/7bJRdu08YH — Press Trust of India (@PTI_News) April 1, 2024 -
అందుకే నాంపల్లి ప్రమాదం జరిగింది: అగ్నిమాపక శాఖ
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారిక ప్రకటన చేసింది. బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ లేదని పేర్కొన్న ఫైర్‌శాఖ.. కెమికల్ డ్రమ్ముల వల్లే అగ్నిప్రమాదం జరిగిందని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ‘‘అగ్నిప్రమాదం నవంబర్ 13 సోమవారం ఉదయం 9గం.30 నిమిషాలకు జరిగింది. ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. ప్రమాదం నుంచి 21 మందిని రక్షించగలిగాం. అక్రమంగా సెల్లార్లో కెమికల్ డ్రమ్ములు పెట్టారు. ఆ డ్రమ్ముల వల్లే అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ లేకపోవడం గుర్తించాం అని అగ్నిమాపక శాఖ ప్రకటించింది. #WATCH | Daring rescue of a child and woman amid massive fire in a storage godown located in an apartment complex in Bazarghat, Nampally of Hyderabad pic.twitter.com/Z2F1JAL8wa — ANI (@ANI) November 13, 2023 స్థానికుల మౌనం సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కెమికల్ నిల్వలను రమేష్ జైశ్వాల్ అనే వ్యక్తి నిల్వ ఉంచినట్లు తేలింది. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచి అపార్ట్మెంట్ సెల్లార్లో వ్యాపారం చేస్తున్నాడు రమేష్ జైశ్వాల్. అయితే ఇది చాలారోజులుగా నడుస్తున్న వ్యవహారమని అధికారులకు తెలిసింది. దీంతో స్థానికుల్ని ప్రశ్నించారు వాళ్లు. భారీగా కెమికల్ నిల్వలు ఉంచినప్పుడు తమకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అపార్ట్మెంట్ వాసులను అడిగారు అగ్నిమాపక శాఖ అధికారులు. అయితే స్థానికులు ఆ ప్రశ్నకు మౌనం వహించారు. మరోవైపు తనిఖీలు చేపట్టని విజిలెన్స్ అధికారులు, సేఫ్టీ పరిశీలనలో విఫలమైన జీహెచ్ఎంసీ తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దీపావళి వేళ.. ఢిల్లీలో 200కుపైగా అగ్నిప్రమాదాలు!
దీపావళి రోజున దేశరాజధాని ఢిల్లీలో 208 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు అగ్ని ప్రమాదాలకు సంబంధించి లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ అగ్నిప్రమాదాల్లో 22 ఘటనలు బాణసంచా కాల్చడం కారణంగానే సంభవించాయి. దీపావళి రోజున జరిగిన చిన్న, మధ్యతరహా, తీవ్రమైన అగ్నిప్రమాదాలకు సంబంధించి ఇప్పటివరకు 208 ఘటనలు చోటుచేసుకున్నాయని డిపార్ట్మెంట్ హెడ్ అతుల్ గార్గ్ తెలిపారు. ఢిల్లీలోని సదర్ బజార్, ఈస్ట్ ఆఫ్ కైలాష్, తిలక్ నగర్లో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారిక సమాచారం రాలేదు. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సెంట్రల్ ఢిల్లీలోని సదర్ బజార్‌లోని డిప్యూటీ గంజ్ మార్కెట్లోని గోదాములో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేసేందుకు 22 అగ్నిమాపక శకటాలు శ్రమించాయి. దాదాపు 2 గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. గోదాములో ఉంచిన వస్తువులన్నీ దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేరకు నష్టం జరిగిందన్న సమాచారం అందుబాటులో లేదు. పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్కెట్లోని కొన్ని దుకాణాలు అగ్నికి ఆహుతైనట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, పోలీసుల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. ఇది కూడా చదవండి: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో విషాదం -
నిప్పుకు ఇక చెక్
సాక్షి, అమరావతి: అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఆకాశం నుంచి ఎగురుకుంటూ డ్రోన్లు వచ్చేస్తాయ్. మంటలు చెలరేగిన భవనాల్లోకి చకచకా వెళ్లి మంటల్ని అదుపుచేసే రోబోలు సైతం రాబోతున్నాయ్. త్వరలో రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధునాతన సాధనా సంపత్తిని సంతరించుకోనుంది. అగ్ని ప్రమాదాలకు తక్షణం చెక్ పెట్టే లక్ష్యంతో రాష్ట్ర అగ్నిమాపక వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. అందుకోసం రాష్ట్ర విపత్తుల స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), అగ్నిమాపక వ్యవస్థలకు ఆధునిక పరికరాలను సమకూర్చేందుకు ప్రణాళికను ఆమోదించింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులు రూ.295 కోట్లతో కార్యాచరణ చేపట్టింది. ఇరుకైన ప్రదేశాలు.. ఎత్తైన భవనాల్లోకీ వెళ్లేలా.. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ నగరాలు, పట్టణాల జనాభా అధికంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా నగర, పట్టణ ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. పెద్దపెద్ద ఆకాశ హార్యా్మలు, పలు కంపెనీలు నిర్మాణం సర్వసాధారణంగా మారింది. అటువంటి ఎత్తైన భవనాలు, కంపెనీల కార్యాలయాలతోపాటు నగరాలు, పట్టణాల్లో ఇరుకైన ప్రదేశాల్లో పొరపాటున అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలను అదుపు చేయడం సవాల్‌గా మారింది. ఫైర్ ఇంజిన్లు, ఇతర అగ్నిమాపక వాహనాలు, పరికరాలను ప్రమాదం సంభవించిన ప్రదేశానికి తీసుకువెళ్లి మంటలను అదుపు చేయడం అంత సులభం కాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా కనిష్ట సమయంలో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక శాఖను ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి మొత్తం రూ.295 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందులో 50 శాతం నిధులతో ఆధునిక అగ్నిమాపక పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో అగ్నిమాపక డ్రోన్లు, రోబోలతోపాటు ఎత్తైన భవనాల్లో చెలరేగే మంటలను అదుపు చేసేందుకు ఉపయోగించే హైడ్రాలిక్ ప్లాట్ఫారాలతోపాటు 16 రకాల ఆధునిక పరికరాలు ఉండటం విశేషం. మరో 30 శాతం నిధులతో కొత్త అగ్నిమాపక కేంద్రాల నిర్మాణం, 20 శాతం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలుగా గుర్తించి వాటిని వినియోగించనుంది. కొనుగోలు చేయనున్న పరికరాలు ♦ అగ్ని మాపక డ్రోన్లు, అగ్నిమాపక రోబోలు ♦హైడ్రాలిక్ ప్లాట్‌ఫారాలు, టర్న్ టేబుల్ ల్యాడర్లు ♦ ఇరుకు ప్రదేశాల్లోకి వెళ్లగలిగే అగ్నిమాపక మోటారు సైకిళ్లతో కూడిన మిస్ట్ ఫైటింగ్ యూనిట్లు ♦ హజ్మత్ వ్యాన్లు, అత్యవసర వైద్య సహాయం అందించే మెడికల్ కంటైనర్లు ♦ లైట్ రెస్క్యూ టెండర్లు, మినీ వాటర్ టెండర్లు ♦ క్విక్ రెస్పాన్స్ మల్టీ పర్సస్ వాహనాలు, రెస్క్యూ బోట్లు ♦ వాటర్ బ్రౌజర్లు, హై ప్రెజర్ పంపులతో కూడిన రెస్క్యూ వాహనాలు ♦ ఫైర్ ఫైటింగ్ ఫిటింగ్స్, సిబ్బందికి రక్షణ కల్పించే పరికరాలు -
ఏడాదిలో రూ.212 కోట్ల ఆస్తులు బుగ్గిపాలు
సాక్షి, హైదరాబాద్: ప్రమాదాల కారణంగా 2022లో రాష్ట్రవ్యాప్తంగా రూ.212.36 కోట్ల విలువైన ఆస్తులు అగ్నికి ఆహుతైనట్టు అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. అదే ఏడాదిలో జరిగిన ప్రమాదాల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. 2021, 2022లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అగ్నిప్రమాదాలు, జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం.. ఫైర్ సిబ్బంది కాపాడిన క్షతగాత్రులు, ఆస్తుల వివరాలను బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14న ఫైర్ సర్వీసెస్ డేను పురస్కరించుకుని వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈనెల 14 నుంచి 20 వరకు జరిగే కార్యక్రమాల్లో అగ్నిప్రమాదాల నుంచి బయటపడటమెలా అనే విషయమై అవగాహన కల్పించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. -
త్వరలో ప్రత్యేక అగ్నిదళం
సాక్షి, హైదరాబాద్: అగ్ని ప్రమాదాలతోపాటు ఇతర అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో వెంటనే రంగంలోకి దిగేలా సుశిక్షితులైన 50 మంది అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) తరహాలో ఉండే ఈ బృందానికి అన్నిరకాల అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తామని వెల్లడించారు. ఈ బృందం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. అగ్నిమాపకశాఖ సిబ్బందికి ఇస్తున్న శిక్షణ, అందుబాటులో ఉన్న ఫైర్ ఫైటింగ్ పరికరాలు, అగ్నిప్రమాదాల నియంత్రణకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలను శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డీజీ నాగిరెడ్డి, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ లక్ష్మి ప్రసాద్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, ఫైర్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ ప్రసన్న కుమార్‌తో కలిసి వివరించారు. తొలుత అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు వినియోగించే పరికరాలు, బ్రాంటో స్కైలిఫ్ట్ పనితీరును మాదాపూర్ ఫైర్ స్టేషన్లో అధికారులు వివరించారు. అనంతరం బహుళ అంతస్తుల్లో నిర్మితమవుతున్న అరబిందో భవనం, గోపన్‌పల్లిలోని హానర్స్ హోమ్స్ భవనంలో ఫైర్ సేఫ్టీ కోసం ఏ వ్యవస్థ ఏర్పాటు చేశారన్నది ప్రయోగాత్మకంగా పరిశీలించి చూపారు. వట్టినాగులపల్లి అగ్నిమాపకశాఖ శిక్షణ కేంద్రంలో సిబ్బందికి ఇస్తున్న శిక్షణ, ఏర్పాటు చేసిన వ్యవస్థను సైతం డీజీ నాగిరెడ్డి వివరించారు. అగ్నిప్రమాదాల నియంత్రణకు సంసిద్ధం వేసవిలో ఎదురయ్యే అగ్నిప్రమాదాలను నియంత్రించేందుకు అగ్నిమాపకశాఖ సన్నద్ధంగా ఉందని నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 137 ఫైర్స్టేషన్లలో అన్ని రకాలు కలిపి 400కుపైగా ఫైర్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేయకపోవడంతోనే స్వప్నలోక్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి ప్రాణనష్టం జరిగిందని గుర్తు చేశారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఎక్కువ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఫైర్ ఫైటింగ్ కోసం రోబోలు, డ్రోన్లను వినియోగించేలా ప్రణాళికలు ఉన్నాయని, మరో ఏడాదిలో ఇవి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. అగ్నిప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి సైతం శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి సైతం ఆరోగ్య భద్రత సదుపాయం కల్పించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని నాగిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఫైర్‌సిబ్బంది నిర్వహించిన మాక్‌డ్రిల్‌లో పలురకాల అగ్నిప్రమాదాలను ఎలా నియంత్రిస్తారన్నది ప్రయోగాత్మకంగా చూపారు. -
‘అగ్గి’ని బుగ్గి చేద్దాం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అగ్నిమాపక శాఖను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. స్టాండింగ్ ఫైర్ అడ్వయిజరీ కౌన్సిల్(ఎస్‌ఎఫ్‌ఏసీ) ప్రమాణాలకు అనుగుణంగా అగ్నిమాపక వ్యవస్థను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఎస్‌ఎఫ్‌ఏసీ ప్రమాణాల ప్రకారం రెండు లక్షల జనాభాకొకటి చొప్పున రాష్ట్రంలో 250 అగ్నిమాపక కేంద్రాలుండాలి. కానీప్రస్తుతం 190 కేంద్రాలే ఉన్నాయి. నిర్దేశిత ప్రమాణాలు సాధించేందుకు కొత్తగా 60 అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటిని మూడు దశల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రెండుదశల కింద 47 కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికను ఖరారు చేసింది. దాంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా ఆమోదించింది. నియోజకవర్గానికొకటి చొప్పున.. ఇప్పటికే కొత్తగా ఆరు అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేంపల్లిలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక పి.గన్నవరం, కోరుకొండ, సదూం, వెదురుకుప్పం, ముద్దనూరు, వేంపల్లిలో అగ్నిమాపక కేంద్రాల నిర్మాణాల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. నెల్లిమర్ల, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, అరకు, రాజమహేంద్రవరం రూరల్, గోపాలపురం, ఆచంట, పోలవరం, ప్రత్తిపాడు, తాడికొండ, వేమూరు, పర్చూరు, సంతనూతలపాడు, నెల్లూరురూరల్, కొవ్వూరు, నందికొట్కూరు, పాణ్యం, మంత్రాలయం, సింగనమల, రాప్తాడు ఈ 20 నియోజకవర్గాల పరిధిలో ఒక్కో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇక పరిధి, వాణిజ్య కార్యకలాపాల విస్తృతి దృష్ట్యా రాష్ట్రంలో కొత్తగా మరో 27 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు విపత్తుల స్పందన శాఖ ప్రణాళికను రూపొందించింది. ఒక్కో అగ్నిమాపక కేంద్రాన్ని రూ.1.90 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఆ మేరకు 47 కేంద్రాలను రూ.89.3 కోట్లతో ఏర్పాటు చేస్తారు. ఇక ఒక్కో కేంద్రానికి ఏటా నిర్వహణ వ్యయం రూ.1.10 కోట్లు అవుతుందని అంచనా. ఆధునిక మౌలిక వసతులు అగ్ని ప్రమాదాల నివారణకు విపత్తుల స్పందన శాఖకు ఆధునిక మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.10 కోట్లు వెచ్చించి జపాన్ నుంచి రూ.55 మీటర్ల టర్న్ టేబుల్ ల్యాడర్‌ను కొనుగోలు చేసింది. రూ.20 కోట్లతో ఫిన్లాండ్ నుంచి 90 మీటర్ల హైడ్రాలిక్ ప్లాటఫాంను కొనుగోలు చేశారు. కొత్తగా అగ్నిమాపక వాహనాల కొనుగోలుకు రూ.6.96 కోట్లతో ప్రతిపాదనలను ఆమోదించింది. మరోవైపు రాష్ట్రంలో రెండు రీజియన్లుగా ఉన్న అగ్నిమాపక శాఖను నాలుగు రీజియన్లుగా ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. వాటితో పాటు విపత్తుల స్పందన శాఖలో ఫైర్‌మెన్, డ్రైవర్ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర విపత్తుల స్పందన దళాన్ని అగ్ని మాపక శాఖ పరిధిలోకి తెచ్చే అంశంపై కసరత్తు చేపట్టింది. -
Telangana: నిర్లక్ష్యం కాల్చేస్తోంది!
సాక్షి, హైదరాబాద్: రోజుకు 20.. వారానికి 140.. నెలకు 600..ఏడాదికి 7,327... రాష్ట్రంలో 2021లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదాలు ఇవి. వీటిలో అత్యధికం మానవ నిర్లక్ష్యం కారణంగానే జరిగినట్లు ఆ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అగ్ని ప్రమాదాలకు కారణాల్లో కాల్చిపారేసిన బీడీ, సిగరెట్లు మొదటి స్థానంలో ఉండగా, షార్ట్ సర్క్యూట్లు రెండో స్థానంలో ఉన్నాయి. దడపుట్టిస్తున్న వరుస ఉదంతాలు.. రాజధానిలో ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. సికింద్రాబాద్ ప్రాంతంలోని రాధా ఆర్కేడ్ భవనంలో ఉన్న డెక్కన్ కార్పొరేట్ కార్యాలయంలో మంటలు చెలరేగి రోజుల తరబడి తగులబడటం నగరం ఉలిక్కిపడేలా చేసింది. దీని కూల్చివేతలు కూడా కొలిక్కి రాకముందే వనస్థలిపురం, ఎల్బీనగర్‌ల్లోని గోదాములు అగ్నికి ఆహుతయ్యాయి. తాజాగా తుది మెరుగులు దిద్దుకుంటున్న కొత్త సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదాలన్నిటిలోనూ ప్రాణ నష్టం లేకపోయినా భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంది. డెక్కన్ కార్పొరేట్ ఉదంతంలో మాత్రం ముగ్గురు సజీవదహనం కాగా.. ఇద్దరి అవశేషాలు కూడా దొరకలేదు. నగరాలు, పట్టణాల్లో షార్ట్ సర్క్యూటే.. కేవలం గతేడాది మాత్రమే కాదు... ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు కాల్చిపారేసిన సిగరెట్, బీడీలే ఎక్కువగా కారణమవుతున్నాయి. ఈ తరహా ఘటనలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, జిల్లాల్లో జరుగుతున్నాయి. అక్కడ ఉండే గుడిసెలు తదితరాలకు వీటి వల్ల మంటలు అంటుకుని విస్తరించడంతో భారీ ఆస్తి, ప్రాణనష్టాలు చోటు చేసుకుంటున్నాయి. 2019లో మొత్తం 8,960 అగ్నిప్రమాదాలు జరగ్గా వీటిలో 4,668 కాల్చి పారేసిన సిగరెట్, బీడీల వల్లే జరిగాయి. ఇక 2020లో 7,899కి 4,187, 2021లో 7,327కి 3,927 ఈ కారణంగానే జరిగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల 1,866 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇక నగరాలు, పట్టణాల వద్దకు వచ్చేసరికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే ఫైర్ యాక్సిడెంట్లకు ప్రధాన కారణంగా ఉంటోంది. విద్యుత్ తదితర శాఖలు భవనాల తనిఖీ చేపట్టకపోవడం వల్లే ఇవి చోటు చేసుకుంటున్నాయనే విమర్శలున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా 2019–21 మధ్య వరసగా 2,726, 1,992, 1,866 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పటిష్ట చట్టం లేదు.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పట్టించుకోని భవనాల యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందుకు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆయు ధం ఏపీ ఫైర్ సర్వీసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టమే ఇప్పటికీ ఉండటం గమనార్హం. అయితే ఈ విభాగం కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మిన హా అరెస్టుకు ఆస్కారం లేదు. కేసు కూడా సివిల్ కోర్టుల్లో విచారణ జరుగుతుంది. దాదాపు 90% ఉల్లంఘనలకు జరిమానా , మిగిలిన వాటిలో గరిష్ట శిక్ష 3 నెలలు మాత్రమే. అగ్నిమాపక శాఖ అధికారులు 2014 నుంచి ఇప్పటివరకు నమోదు చేసిన కేసుల్లో ఒక్క దాంట్లోనూ శిక్ష పడకపోవడం గమనార్హం. సిబ్బంది లేమి తనిఖీలకు అడ్డంకిగా మారింది. – అగ్నిమాపక శాఖ మాజీ ఉన్నతాధికారి అవసరం మేరకు లేని ఫైర్ స్టేషన్లు ఏటా అగ్నిప్రమాదాలు వేల సంఖ్యలో, ఆస్తినష్టం రూ.వందల కోట్లలో, ప్రాణనష్టం పదుల సంఖ్యలో ఉంటోంది. అయితే రాష్ట్రంలో ఈ మేరకు అవసరమైన సంఖ్యలో అగ్నిమాపక కేంద్రాలు లేవు. సిబ్బంది, శకటాలు సహా ఇతర మౌలికవసతులూ లేవు. జనాభా విస్తీర్ణం ప్రాతిపదికన తీసుకున్నా ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 100కు పైగా అగ్నిమాపక కేంద్రాలు, ఒక్కో కేంద్రంలో కనీసం మూడు శకటాలు, కనిష్టంగా 15 మంది సిబ్బంది అవసరం. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్నిమాపక కేంద్రాల సంఖ్య 110 దాటట్లేదు. వీటికి తోడు మరో 20 వరకు ఔట్సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. వీటిలోనూ 95% కేంద్రాల్లో సాధారణ ఫైర్ ఇంజన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కారణంగానే బహుళ అంతస్తుల భవనాలు, భారీ సముదాయాలు, పరిశ్రమలు తదితరాల్లో జరిగే అగ్నిప్రమాదాలను అదుపు చేయడం కష్టసాధ్యం అవుతోంది. -
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించని భవ నాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రుల బృందం ఉన్నతాఅధికారులను ఆదేశించింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర అ న్ని ప్రధాన నగరాల్లోని బహుళ అంతస్తుల భవ నాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసు కునే చర్యలకు సంబంధించి ‘ఫైర్ సేఫ్టీ ఆడిట్’ నిర్వహించాలని నిర్దేశించింది. అగ్నిమాపక శాఖకు ఆధునిక సామగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రస్తుతం శాఖకు అవసరమైన అత్యవసర సా మగ్రికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయా లని సూచించింది. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని మాపక చర్యలపై సందేహాలు తలెత్తిన నేప థ్యంలో బుధవారం మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్‌కుమార్, సునీల్‌శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి విపత్తులు సంభవించకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. సికింద్రాబాద్‌లోని డెక్కన్ మాల్లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు బలైన నేపథ్యంలో ప్రభుత్వం ఈమేరకు చర్యలు చేపట్టింది. డెక్కన్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ముగ్గురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని నిర్ణయించింది. డ్రోన్ సాంకేతికతను వినియోగించండి మునిసిపల్ నిబంధనల ప్రకారం ఐదంతస్తులు, ఆపై నిర్మించే భవనాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జర పడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతు న్నాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాలలోని వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్ట్మెంట్లలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే ప్రస్తుతమున్న ఫైర్‌సేఫ్టీ చట్టాలను సవరించాలని చెప్పారు. హైదరాబాద్‌లో భారీగా నిర్మాణమవుతున్న బహుళ అంతస్తుల భవనాల ఫైర్ సేఫ్టీకి సంబంధించి డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు. ఈ మేరకు పాశ్చాత్య దేశాలతోపాటు దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న మెరుగైన పద్ధతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అగ్నిమాపక సిబ్బందికి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, వారిని నిష్ణాతులను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా భవనాల యజమానులను కూడా భాగస్వాములను చేసుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో ఇంకా జలమండలి ఎండీ దాన కిషోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర , రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ అమేయ్ కుమార్ పాల్గొన్నారు. -
ఆస్పత్రి బాత్రూమ్ డోర్‌లాక్.. చిన్నారిని రక్షించిన ఫైర్ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఓ చిన్నారి తల్లిదండ్రులను, ఆస్పత్రి సిబ్బందిని కాసేపు ఉరుకులు పరుగులు పెట్టించాడు. వాష్ రూమ్‌లోకి వెళ్లి అనుకోకుండా లాక్ వేసేసుకున్నాడు. దీంతో అక్కడే ఇరుక్కుపోయి ఏడ్వసాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు.. ఆస్పత్రి నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తాళాలు లేకపోవడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బందికి కాల్ చేశారు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించే యత్నం చేశారు. సుత్తి, స్క్రూడ్రైవర్‌తో తాళం పగులగొట్టి చిన్నారిని బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో.. 101కు డయల్ చేయాలని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ ట్విటర్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేసింది. -
కోరలు లేని ఫైర్ సర్వీసెస్ యాక్ట్.. హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్ యజమాని నిర్లక్ష్యం ఎనిమిది మంది ప్రాణాలు బలిగొంది. కేవలం ఈ ఒక్క భవనమే కాదు సరిగ్గా వెతికితే నగరంలోని ప్రతి వీధికి కనీసం మూడు ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి నిర్మాణాలు చేపట్టిన యజమానులపై చర్యలు తీసుకోవడానికి అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సర్వీసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టాన్నే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వాణిజ్య భవనాలు, సముదాయాల యజమానులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడటానికి ఇదీ ఓ కారణమే అన్నది నిపుణుల మాట. సమరీ ట్రయల్‌కు మాత్రమే అవకాశం... ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సర్వీసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగ్నిమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు. ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అదే ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై నమోదైన కేసుల మాదిరిగానే ఉంటుంది. గరిష్ట శిక్ష మూడు నెలలు మాత్రమే... ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లంఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు 2014 నుంచి ఇప్పటి వరకు 689 కేసులు నమోదు చేశారు. వీటిలో కనీసం ఒక్క కేసులోనూ ఉల్లంఘనులకు జైలు శిక్ష పడలేదు. 83 కేసులు జరిమానాలతో ముగిసిపోగా... మరో 60 ఆ విభాగమే ఉపసంహరించుకుంది. మిగిలిన వాటిలో 257 కేసులను న్యాయస్థానం రిటర్న్ చేసి మార్పు చేర్పులు సూచించింది. ఇంకో 270 కేసులు ఇప్పటికీ వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని 665 నిర్మాణాలకు నోటీసులు, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన మరో 636 మంది యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోనే అత్యధికంగా కేసులు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధిక హైదరాబాద్‌కు సంబంధించివనే. మొత్తం 689 కేసులకు నగరానికి సంబంధించినవి 325, రంగారెడ్డి 154, వరంగల్ 70, నల్లగొండ 56, ఖమ్మం 36 కేసులు ఉన్నాయి. గతంలో అగ్నిమాపక శాఖకు సొంతంగా ప్రాసిక్యూషన్ సర్వీస్ కూడా ఉండేది కాదు. పంజగుట్టలోని మీన జ్యువెలర్స్‌లో 2006లో జరిగిన అగ్నిప్రమాదం ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఆ కేసు నుంచి అగ్నిమాపక శాఖ ప్రాసిక్యూషన్ మొదలెట్టింది. అగ్నిమాపక శాఖలో పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘2000 సంవత్సరం తర్వాత అభివృద్ధి వేగం పుంజుకుంది. దీంతో అనేక భారీ నిర్మాణాలు, భవనాలు వచ్చాయి. వాణిజ్య కార్యకలాపాలూ పెరగడంతో ఉల్లంఘనలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఫైర్ సర్వీసెస్ యాక్ట్‌ను మార్చాలి. కఠినమైన నిబంధనలతో పాటు శిక్షలు అమలులోకి తీసుకువస్తేనే అగ్ని ప్రమాదాల్లో అమాయకులు బలికాకుండా ఉంటారు. మీన జ్యువెలర్స్ కేసులో ఆ భవన యాజమాన్యానికి పడిన జరిమానా కేవలం రూ.15 వేలే’ అని అన్నారు. (క్లిక్ చేయండి: హైదరాబాద్ మెట్రో రైలు.. తప్పని తిప్పలు) -
ఫైర్ ఫైటర్.. 55 మీటర్ల ఎత్తుకు వెళ్లి.. టీటీఎల్ ప్రత్యేకతలివే
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): అగ్నిమాపక శాఖ అమ్ముల పొదిలో అత్యాధునిక వాహనం చేరింది. టర్న్ టేబుల్ లేడర్ (టీటీఎల్)గా పిలిచే ఈ వాహనం బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వాహనంపై ఉండే ల్యాడర్ (నిచ్చెన) 55 మీటర్ల ఎత్తుకు వెళ్తుంది. 18వ అంతస్తు వరకు వెళ్లి అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు దోహదం చేస్తుంది. ఈ ఫైర్ ఫైటర్‌ను జపాన్ నుంచి కొనుగోలు చేశారు. రాష్ట్రంలోనే ఇది మొదటిది. విజయవాడ, తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే! జనాభా పెరగడం, నగరం ఎక్కువ విస్తరిస్తుండడంతో బహుళ అంతస్తుల నిర్మాణాలు అనివార్యంగా మారాయి. ఈ భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే నివారించడం కష్ట సాధ్యంగా ఉంటోంది. వీటి నివారణకు అగ్నిమాపక శాఖ వద్ద అధునాతన యంత్రాలు లేవు. కొద్దిపాటి అపార్టుమెంట్లు, మాల్స్ వంటి వాటిలో ప్రమాదాలు జరిగినప్పుడు ఫైరింజన్ల సహాయంతో మంటలు ఆర్పేవారు. 5 అంతస్తులు, అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల్లో ప్రమాదాలు జరిగితే కొంత ఇబ్బందిగా ఉండేది. బ్రాంటో స్కై లిఫ్ట్ అందుబాటులో ఉన్నప్పటికీ దాని పనితీరు పరిమితంగా ఉండేది. టీటీఎల్ ప్రత్యేకతలివీ.. టర్న్ టేబుల్ ల్యాడర్ 18 అంతస్తుల భవనాల్లో సైతం ప్రమాదాలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి, మంటలను ఆర్పడం దీని ప్రత్యేకత. ల్యాడర్ 360 డిగ్రీల వరకు తిరుగుతూ మంటల్ని ఆర్పుతుంది. 75 డిగ్రీల వాలుగా నిలవగలదు. సిబ్బంది ఓ వైపు మంటలు ఆర్పుతూనే మరో వైపు మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి ల్యాడర్‌కు అనుసంధానంగా ఉన్న లిఫ్ట్ ద్వారా కిందికి పంపుతారు. ల్యాడర్ చివర ఉన్న క్యాబిన్లో ఎల్ఈడీ స్క్రీన్ అమర్చి ఉంటుంది. ల్యాడర్ ఎంత ఎత్తులో ఉంది, గాలి వేగం ఎంత ఉంది, గాలి ఎటు వీస్తోంది వంటి విషయాలను స్క్రీన్ ఆధారంగా తెలుసుకుంటూ సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేస్తారు. టర్న్ టేబుల్ ల్యాడర్‌ను మూడుచోట్ల నుంచి ఆపరేట్ చేసే అవకాశం ఉంది. ల్యాడర్ చివర క్యాబిన్, లిఫ్టర్, వాహనం ఇలా 3 చోట్ల నుంచి దీన్ని ఆపరేట్ చేస్తూ మంటలు ఆర్పే అవకాశం ఉంది. ల్యాడర్‌లో పైకి వెళ్లిన సిబ్బంది అక్కడి పరిస్థితిని బట్టి ల్యాడర్‌ను తమకు అనుకూలంగా తిప్పుకునే అవకాశం ఉండటం ఈ వాహనం ప్రత్యేకత. రాష్ట్రంలోనే ఇది మొదటిది అగ్నిమాపక శాఖకు అధునాతన వాహనాలను సమకూర్చుకుంటున్నాం. ఇందులో భాగంగా టీటీఎల్ను జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నాం. రాష్ట్రంలోనే ఇది మొదటిది. ఇదొక ప్రత్యేకమైన ఫైర్ ఫైటర్. ఇప్పటివరకు బాధితులను రక్షించడం, మంటలను ఆర్పడం వేర్వేరుగా జరిగేవి. దీని సహాయంతో ఏకకాలంలో రెండు పనులు చేయొచ్చు. – జి.శ్రీనివాసులు, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి -
ఫైర్ సెఫ్టీ యాక్ట్‌లో మార్పులు చేయండి - నరెడ్కో విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: 21 మీటర్ల ఎత్తు భవనాలకు కూడా అగ్నిమాపక శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఈ మేరకు ఫైర్ సేఫ్టీ యాక్ట్‌లో సవరణలు చేయాలని నరెడ్కో వెస్ట్‌జోన్ బిల్డర్స్ అసోసియేషన్ జీహెచ్ఎంసీకి లేఖ రాసింది. ప్రస్తుతం 18 మీటర్ల ఎత్తు (సెల్లార్ + స్టిల్ట్ + 5 అంతస్తులు) భవనాలకు ఫైర్ ఎన్ఓసీ నుంచి మినహాయింపు ఉందని.. అదనంగా 3 మీటర్ల ఎత్తును అనుమతి ఇస్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)లకు డిమాండ్ పెరుగుతుందని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం.ప్రేమకుమార్ తెలిపారు. ప్రస్తుతం 900 గజాలు దాటిన భవనాలు సెల్లార్ + స్టిల్ట్ + 5 ఫ్లోర్లు వేసుకోవచ్చు. భవనం ఎత్తు పెంచడంతో టీడీఆర్ వినియోగించుకొని అదనంగా 6వ అంతస్తుతో పాటు సెల్లార్‌కు బదులుగా రెండు స్టిల్ట్‌లు వేసుకునే వెసులుబాటు కలుగుతుందని వివరించారు. సెల్లార్ తవ్వకంతో కాలుష్యం పెరగడంతో పాటూ చుట్టుపక్కల వారితో నిత్యం ఏదో ఒక గొడవలు, ఇబ్బందులు జరుగుతున్నాయని తెలిపారు. - నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) ప్రకారం భవనం ఎత్తు 15 మీటర్లకు పరిమితి చేసిన సమయంలో ఏపీ ఫైర్ సర్వీస్ చట్టం–1999 సెక్షన్ 13లోని భవనం ఎత్తు 18 మీటర్ల వరకు సవరించిన విషయాన్ని గుర్తు చేశారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 17.5 మీటర్ల ఎత్తు ఉన్న భవనాలు కూడా హైరైజ్ గానే భావిస్తుందని, దీన్ని పరిగణనలోకి తీసుకొని ఫైర్ సేఫ్టీ యాక్ట్‌లో బిల్డింగ్ హైట్‌ను 21 మీటర్లకు పెంచాలని సూచించారు. - రోడ్డు వెడల్పును బట్టి 18 అంతస్తుల వరకు ఎకరానికి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)ను 1.75 లక్షల చ.అ.లకు పరిమితం చేయాలని సూచించారు. అదనపు అంతస్తులు అవసరం ఉన్న వాళ్లు టీడీఆర్‌లు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చిన 6 నెలల తర్వాతి నుంచే ప్రాపర్టీ ట్యాక్స్‌ను వసూలు చేయాలని కోరారు. చదవండి: రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..! -
హై పవర్ ట్రాన్స్మిషన్ తీగపై వేలాడుతూ.. స్వీట్లు, మొబైల్ కావాలంటూ..
Mentally unstable man climbs electricity tower: మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు చేసే పనులు చాలా భయానకంగానూ, ఒక్కొసారి వికృతంగా కూడా ఉంటాయి. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి స్వీట్లు, మొబైల్ ఫోన్ కావలంటూ ఏకంగా విద్యుత్ టవర్ పైకి ఎక్కేశాడు. (చదవండి: ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్ వీడియో) అసలు విషయంలోకెళ్లితే.....బీహార్‌లో ముజఫర్‌పూర్ జిల్లాలోని బర్మత్పూర్ గ్రామంలో మానసిక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి హై ట్రాన్స్మిషన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కాడు. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. పైగా వ్యక్తి పైనుంచి మొబైల్ ఫోన్, స్వీట్లు కావాలని కోరడం ఆశ్చర్యంగా కల్గించింది. విద్యుత్ శాఖ, పోలీసులు, అగ్నిమాపక శాఖ ఎంతగా ప్రయత్నించినా అతను కిందకు వచ్చేందుకు నిరాకరించాడు. అంతేకాదు ఆ వ్యక్తి హై పవర్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రిసిటీ టవర్‌లో కూర్చొని అంత ఎత్తు నుంచి కింద పడిపోతానేమో అనే భయం లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా టవర్ ఎక్కాడు. ఆ వ్యక్తిని రక్షించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎప్)ని పిలిపించారు. అయితే స్థానికులు మాత్రం ఆ వ్యక్తి మానసిక వికలాంగుడని ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలానే చేశాడని చెబుతున్నారు. అయితే అతన్ని కిందకు రప్పించేందుకు ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. (చదవండి: ఫోన్ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!!) -
ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం
సాక్షి, గాంధీఆస్పత్రి (హైదరాబాద్): సీఎం కేసీఆర్ వ్యూహం ఫలించింది. ముందు జాగ్రత్తతో చేపట్టిన ఆలోచన విధానం సత్ఫలితాలను ఇచ్చింది. వందలాది మంది రోగులు, వైద్యులు, సిబ్బంది పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కోవిడ్ సెకండ్‌వేవ్ విజృంభిస్తున్న సమయంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు సంభవించి తీవ్రమైన ప్రాణ, ఆస్తినష్టాలు వాటిల్లాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో జరిగిన అగ్నిప్రమాదాలను గమనించిన సీఎం కేసీఆర్ ముందుజాగ్రత్త చర్యలో భాగంగా తెలంగాణలోని కోవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిమాపకలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేవలం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఏర్పాటు పనులను నిరంతరం సమీక్షించారు. ► గాంధీఆస్పత్రి ప్రాంగణంలో ఈ ఏడాది ఏప్రిల్ 24న అగ్నిమాపక కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ► నాటి ఆదేశాలే నేడు ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు దోహదపడ్డాయని పలువురు భావిస్తున్నారు. ► సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో ఫైర్ సిబ్బంది పనితీరుపై ప్రశంసలజల్లు కురుస్తున్నాయి. ► సమాచారం అందిన మూడు నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక సిబ్బంది ఘటనస్ధలానికి చేరుకుని కొన్ని నిమిషాల వ్యవధిలో మంటలను అదుపు చేశారు. ► ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం నుంచి బయట పడ్డామని పలువురు వైద్యులు, సిబ్బంది, రోగులు తెలిపారు. ► ఆస్పత్రి ప్రాంగణంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయకపోతే, ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేందుకు కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేదని, ఈ వ్యవధిలో మంటలు మరింత విజృంభించి ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని, సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలే తమ ప్రాణాలు కాపాడాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ► నగరంలోని పలు ఆస్పత్రుల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రాలు తెలంగాణ సెక్రటేరియట్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. కార్బన్ స్మోక్ ప్రమాదకరం గాంధీ ఆస్పత్రిలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సకాలంలో స్పందించాం, విద్యుత్ కేబుళ్లు వైర్లను కార్బన్‌తోపాటు పలు రకాల కెమికల్స్‌తో తయారు చేస్తారు. ఇవి కాలుతున్న సమయంలో విపరీతమైన పొగను వెలువరిస్తాచి. ఈ పొగ ఎక్కువగా పీల్చితే ప్రాణాపాయం కలుగుతుంది. మేము మూడు నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలానికి చేరుకున్నాం. అప్పటికే పలు వార్డులు పొగతో నిండి ఉంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలతోపాటు రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న రోగులపై కార్బన్ పొగ తీవ్రమైన ప్రభాపం చూపించే ప్రమాదం ఉంది. ఆస్పత్రుల ప్రాంగణాల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పెను ప్రమాదం తప్పింది. – కేవీ నాగేందర్, ఫైర్ ఆఫీసర్ -
50 అడుగుల లోతు బావిలో పడిన మహిళ..వీడియో చూస్తే షాక్
తిరువనంతపురం: ఇంకా భూమి మీద నూకలు రాసిపెట్టి ఉంటే ఎంత ప్రమాదం నుంచి అయినా బయట పడతాం అనే సామెతకు నిలువెత్తు ఉదాహరణననే ఈ సంఘటన. 50 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయిన ఓ మహిళ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. వివరాలు.. కేరళలోని వయనాడ్ కు చెందిన ఓ మహిళ ప్రమాదవశాత్తు 50 అడుగుల లోతులో పడిపోయింది. అయితే దాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖవారికి సమాచారం అందించారు. హుటహుటిన వారు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలకు తెగించి ఆమెను రక్షించారు. ప్రస్తుతం దీనికి సంభందించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో బావిలో పడిపోయిన మహిళను పైకి లాగడానికి అగ్నిమాపక సిబ్బంది,స్ధానికులు ఓ నిచ్చెన లాంటి తాడును బావిలోకి దింపి, ఆమెను కాపాడిన దృశ్యాలును చూడవచ్చు. చివరకు ఎలాగోలా ఆమెను బయటకు తీశారు. కానీ ఆమెకు గాయాలేమైనా అయ్యాయా అనే వివరాలు తెలియలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అయితే మహిళను కాపాడిన అగ్నిమాపక సిబ్బందిపై నెటిజన్లు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. #WATCH | Kerala: Fire Department officials and locals rescued a woman after she fell into a 50-feet deep well in Wayanad (10.08) pic.twitter.com/5tG6Jq0vx3 — ANI (@ANI) August 10, 2021 -
మానవతా దృక్పథంతో వ్యవహరించారు
సాక్షి, హైదరాబాద్ : ఎవరు ఎలా పోతే మాకేంటని పట్టించుకోని కాలమిది. సాటి మనుషులకు ప్రమాదం జరిగినా చూసీచూడనట్టు వెళ్లిపోయే సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. మనుషులకే దిక్కులేని ఈ సమాజంలో ఇక పసుపక్షాదుల సంగతి చెప్పనక్కరలేదు. అందులోనూ కాకి లాంటి పక్షులకు దిక్కుండదు. కానీ, కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఒక కాకిని కాపాడటానికి కొందరు యువకులు చేసిన ప్రయత్నాలు అభినందనీయం. హైదరాబాద్‌లోని సైనిక్‌పురి ప్రాంతంలో ఒక కాకి విద్యుత్ తీగలపై పెనవేసుకుపోయిన పతంగి మాంజాలో చిక్కుకుపోయింది. కాకి కాళ్లకు పెనవేసుకున్న మాంజా నుంచి తప్పించుకోలేక గిలగిలా కొట్టుకుంది. ఒకటికాదు రెండు కాదు. మూడు రోజులుగా అలా కొట్టుకుని నీరసించి ఇంక చేతకాక విద్యుత్ వైర్ల నుంచి కిందకు వేలాడింది. అప్పుడప్పుడు బలం తెచ్చుకుని అరవడం మాత్రం ఆపలేదు. మూడురోజులుగా ఈ తతంగం గమనిస్తున్న స్థానికుల్లో ఒకరు విషయాన్ని నగరంలోని వన్యప్రాణులను సంరక్షించే ఎనిమిల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీకి చేరవేశారు. అంతే, ఆ వారియర్స్ వెంటనే వాలిపోయారక్కడ. ఆ సొసైటీకి చెందిన యువకులు వచ్చి స్థానికంగా అగ్నిమాపక కేంద్రానికి వెళ్లి సహాయాన్ని అర్థించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సానుకూలంగా స్పందించి ఫైరింజన్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకొని కాకిని పరిశీలించి చూడగా అది ప్రాణాలతోనే ఉంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అగ్నిమాపక సిబ్బంది కాకికి చిక్కుకున్న మంజాను తొలగించి కాకిని పట్టుకుని ఎనిమల్ వారియర్స్ సంస్థకు అందించారు. వారు దానిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని ఒక వస్త్రాన్ని చుట్టి దానిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాకి ప్రాణాలను కాపడానికి అక్కడ జరుగుతున్న తతంగమంతా చూస్తున్న స్థానికి ఎనిమల్ వారియర్స్ ప్రతినిధులను అభినందించారు. ‘పక్కవారికి కష్టం వచ్చినా పట్టించుకోని ఈ కాలంలో ఒక కాకి ప్రాణాల కోసం ఎనిమల్ వారియర్స్ ప్రతినిధులు పడిన తాపత్రయం అభినందనీయం’ అంటూ స్థానిక సీనియర్ న్యాయవాది కే. రాజగోపాల్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ సంస్థ పెంపుడు జంతువులు, ఇంకా ఇతరత్రా జంతువులు ఆపదలో ఉన్నప్పుడు సాయం అందించడానికి ముందుంటుంది. -
విపత్తు సమయంలోనూ సంక్షేమం: సుచరిత
సాక్షి, కాకినాడ: విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 29 అగ్నిమాపక కేంద్ర భవనాల అభివృద్ధికి రూ.28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. అగ్నిమాపక శాఖ భవనాలకు శాశ్వత నిర్మాణాలు చేపడతామని చెప్పారు. (చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్) కష్టకాలంలో కూడా నవరత్న పథకాలు అమలు.. నవరత్న పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని కరోనా కష్టకాలంలో కూడా నెరవేరుస్తున్నారని సుచరిత తెలిపారు. ఈ విపత్తు సమయంలో సున్నా వడ్డీ కింద మహిళా సంఘాలకు రూ.1400 కోట్లు ఇచ్చారన్నారు. ప్రతి ఏడాది మే నెలలోనే రైతు భరోసా సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు అధికంగా జరుగుతున్నాయని మంత్రి సుచరిత వివరించారు. (దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ..) -
అగ్నిమాపకశాఖను పటిష్టం చేస్తాం..
-
అగ్నిమాపకశాఖను పటిష్టం చేస్తాం..
సాక్షి, విశాఖపట్నం: కచ్చలూరు బోట్ ప్రమాద ఘటనలో ఫైర్ సిబ్బంది అందించిన సేవలు గొప్పవని హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సుర్యాబాగ్‌లోని మోడల్ ఫైర్ స్టేషన్‌ను హోంమంత్రి సుచరిత ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అగ్నిమాపకశాఖను మరింత పటిష్టం చేసి సిబ్బంది కొరత లేకుండా చూస్తామని సుచరిత పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉంటే జనవరిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రమాదాలు సంభవింనప్పుడు ఆపన్నహస్తం అందిస్తున్న ఫైర్ సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. ఫైర్ సిబ్బందికి సమస్యలుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 1942లో స్థాపించబడిన ఫైర్స్టేషన్ను రూ. కోటి 24 లక్షలతో వీఎంఆర్డీఏ సహకారంతో కొత్త భవనం సమకూరిందని హోంమంత్రి సుచరిత తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు 54 మీటర్లు ఎత్తువరకు మంటలను నియంత్రించే ఆధునిక పరికరాలు ఉన్నాయని మంత్రి సుచరిత తెలిపారు. 480 మంది ఫైర్ సిబ్బందిని నియమించామని సుచరిత పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందలనేది సీఎం వైఎస్ జగన్ ఆలోచన అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రాంతీయ వాదాలు రాకూడదనే అన్ని ప్రాంతాలు అభువృద్ధి కోసం సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. నిపుణుల కమిటీ నివేదికపై సీఎం జగన్‌తో చర్చిస్తామని సుచరిత పేర్కొన్నారున. రైతుల వద్ద తీసుకున్న భూములు ఉన్న ప్రాంతాలో కూడా అభివృద్ధి జరుగుతుందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖ వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీమని ప్రశంసించారు. అగ్నిమాపక, పోలిసు ఉద్యోగులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందిస్తామని ఆయన అన్నారు. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజలు ప్రాణాలు కాపాడటంలో ముందుండే ఫైర్ సిబ్బంది సేవలు అభినందనీయమని కొనియాడారు. హూద్‌హూద్‌లో ఫైర్ సిబ్బంది అందించిన సేవలు మర్చిపోలేమని ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. -
రైతును కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
విశాఖపట్నం, రావికమతం (చోడవరం): గుమ్మాళ్లపాడు గ్రామంలో ఒక బావిలో కూరుకుపోయిన రైతును రావికమతం అగ్నిమాపక సిబ్బంది సురక్షతంగా తాళ్లతో బయటకు తీసి రక్షించారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గుమ్మాళ్లపాడు గ్రామానికి చెందిన బంటు వెంకట రమణ(50) తన పొలానికి బావిలోని నీటిని ఇంజన్‌తో తోడుకున్నాడు. అనంతరం ఇంజన్ పైపు బావిలో ఉండటంతో దానిని తీసేందుకు దిగి ఊబిలో చికుక్కున్నాడు. అంతకంతకూ దిగిపోతుండటంతో గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలకు సమీప రైతులు వచ్చి తాళ్లు అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు సిబ్బంది లావేటి నాగేశ్వరరావు, రమేష్, వరహాలు రైతును సురక్షితంగా బయటకు తీశారు. -
కలకు రెక్కలు
ఏనాటికైనా ఫైర్ ఫైటర్ అయి తీరాలన్న ఆమెలోని రగిలే జ్వాల ఆమె చేత ప్రొఫెసర్ ఉద్యోగాన్ని మాన్పించి ఆమెను ఫైర్ ఫైటర్ చేసింది. ఈ మాట మనదేశంలో ఇప్పటికే ఇద్దరు మహిళలు అనేశారు. ఇప్పుడు మరో మహిళ ప్రశ్నిస్తున్నారు. ఫైర్ ఫైటర్ ఉద్యోగంలో చేరిన తొలి మహిళ హర్షిణి కన్హేకర్ను ఆ ఉద్యోగంలో నియమించడానికి ఫైర్ డిపార్ట్మెంట్ చట్టాల్లోంచి వెసులుబాటు తెచ్చుకుంది. కన్హేకర్ వేసిన ఆ బాటలో మహిళల నడక మొదలైంది. కన్హేకర్, తానియా సన్యాల్ తర్వాత, ఏడాదిలోనే ఇప్పుడు మూడో మహిళ ఈ సాహసోపేతమైన ఉద్యోగంలోకి వచ్చారు. కేరళకు చెందిన రేమ్యా శ్రీకాంతన్ ఈ నెల ఒకటో తేదీన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫైర్ సర్వీస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఈ ఉద్యోగంలో చేరిన తొలి మహిళ రేమ్యా. దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఇది తొలి రికార్టే. హర్షిణి కన్హేకర్కి యూనిఫామ్ సర్వీస్‌లో చేరాలనేది కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఆమె ఫైర్ ఫైటర్ అయ్యారు. ఇప్పుడు ఈ కేరళ అమ్మాయి రేమ్యా శ్రీకాంతన్కి సవాళ్లతో నిండిన ఉద్యోగంలో రాణించాలని కోరిక. తిరువనంతపురానికి చెందిన రేమ్యా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ‘ఎల్బిఎస్ (లాల్ బహదూర్ శాస్త్రి) ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఫైర్ ఫైటర్‌గా వచ్చారు. రెండేళ్ల పాపాయికి తల్లి అయిన రేమ్యా ఫైర్ ఫైటర్ అవాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి కఠోరమైన శ్రమను ఎదుర్కొన్నారు. దేహదారుఢ్యం కోసం కఠినమైన ఎక్సర్సైజ్లు చేసి తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ‘‘అమ్మాయిలు అన్ని ఉద్యోగాలనూ చేయగలుగుతారని చెప్పడానికి నేనొక ఉదాహరణ అయినందుకు సంతోషంగా ఉంది. ఈ బాటలో తప్పకుండా మరికొంత మంది అమ్మాయిలు నడుస్తారు’’ అంటున్నారు రేమ్యా. పాపాయిని పెంచుకుంటూ శిక్షణ తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపించిన మాట వాస్తవమేనంటూ... ‘‘కొంతకాలం పాపాయిని చూసుకుంటూనే ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఢిల్లీ వాతావరణాన్ని తట్టుకోవడం కష్టమని పాపాయిని తీసుకెళ్లలేదు. ఢిల్లీలో ట్రైనింగ్ పీరియడ్ నాలుగు నెలలు మాత్రం పాపాయిని పూర్తిగా నా భర్త శ్రీకాంతనే చూసుకున్నారు’’ అన్నారామె భర్త పట్ల కృతజ్ఞతగా. -
నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం
-
నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, నెల్లూరు : జిల్లా కేంద్రంలోని ఓ భవనంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నబజారు ప్రాంతంలోని శ్రీ కనకదుర్గా మెటల్ ఎంటర్ ప్రైజెస్ గోదాంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువ గల ప్లాస్టిక్ సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది భవనంలోని వారిని ఖాళీ చేయిస్తూ..రాత్రి నుంచి మంటలను అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, కలెక్టర్ శేషగిరి బాబు, ఇతర అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఆ గంట..ఉత్కంఠ!
సాక్షి, అనకాపల్లి టౌన్: ఓ చిన్నారి చేసిన ఘనకార్యం అటు అధికారుల్ని.. ఇటు స్థానికుల్ని పరుగులు పెట్టించింది. తల్లిదండ్రులకి ముచ్చెమటలు పట్టించింది. చివరికి అగ్నిమాపక దళం ప్రవేశంతో ఉత్కంఠకు తెరపడింది. అనకాపల్లి పట్టణంలోని చవితినవీధి ఆర్కే అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ 203లో శుక్రవారం అసలు ఏం జరి గింది. ఆ ప్లాట్‌లో తోకల ప్రవీణ్‌రాజా, వసుధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 14 నెలల మహదేవ్ అనే బాలుడు సంతానం. శుక్రవారం ప్రవీణ్‌రాజా ఇంట్లోని హాల్ పనిలో నిమగ్నపోయారు. ఆయన భార్య వసుధ వంటపనిలో బిజీగా ఉన్నారు. అక్కడే ఆడుకుంటున్న మహదేవ్ వంటింటి తలుపును వేశాడు. దానికి ఆటోమేటిక్ లాక్ అమర్చిన కారణంగా గడియపడింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులిద్దరూ గమనించలేదు. పనిమీద తండ్రి మెయిన్ డోర్ దగ్గరకు బయటకు వెళ్లాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారి పక్కగదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. దానికి కూడా ఆటోమేటిక్ లాక్ అమర్చి ఉండడంతో అది కూడా మూసుకుపోయింది. లోపలి నుంచి చిన్నారి తలుపుతీద్దామని ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఏడుపు మొదలుపెట్టాడు. వంట గదిలో ఉన్న తల్లికి ఏడుపు వినిపించింది. బయటకొచ్చేందుకు యత్నించింది. తలుపు ఆటోమేటిక్‌గా లాక్ అయిన పరిస్థితిని తెలుసుకుంది. భయంతో కేకలు... చిన్నారి ఏడుపు ఓ వైపు.. ఏం జరుగుతుందోనన్న ఆందోళన మరోవైపు.. భయంతో కేకలు వేయడం మొదలుపెట్టింది. అవి విన్న స్థానికులు పెద్దసంఖ్యలో అపార్టుమెంట్ కిందకు చేరుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక ఒకటే ఉత్కంఠ. ఇంతలో బయటకెళ్లిన తండ్రి ఇంటికి చేరుకున్నారు. మెయిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్లారు. ఆయనకు పరిస్థితి అర్థమైంది. రెండు గదుల తలుపులూ తీసేందుకు యత్నించారు. వీలుకాకపోవంతో పక్కిం టి వారి సాయంతో ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. గంట పాటు రెస్క్యూ... అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి మార్టిన్ లూథర్‌కింగ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపరేషన్ మొదలుపెట్టారు. అపార్ట్‌మెంట్‌పై నుంచి తాడు సాయంతో హోంగార్డు గోపీ నెమ్మదిగా బాలుడు ఉన్న గదిలోకి ప్రవేశించాడు. లోపలి నుంచి లాక్ అయిన తలుపును తెరిచాడు. అలాగే వంటగది తలుపును కూడా ఓపెన్ చేశాడు. బాలుడ్ని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఆపరేషన్‌కు గంట సమయం పట్టింది. అగ్నిమాపక సిబ్బంది చొరవను స్థానికులు అభినందిచారు. ఈ ఆపరేషన్‌లో అగ్నిమాపక శాఖాధికారి ఆర్.వెంకటరమణ, సిబ్బంది కృష్ణప్రసాద్, మదీన, గణేష్, నాయుడుబాబు పాల్గొన్నారు.