అగ్గిపడితే హాహాకారాలే | no fire safety in ruya hospital | Sakshi
Sakshi News home page

అగ్గిపడితే హాహాకారాలే

Oct 18 2017 9:14 AM | Updated on Sep 13 2018 5:11 PM

no fire safety in ruya hospital - Sakshi

చిత్తూరు ఆస్పత్రిలో పైపులైన్లు

అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగినా నష్టం అధికంగా ఉంటుంది. అదే ఆస్పత్రిలో జరిగితే అపారం. గత ఏడాది భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడ్డారు. ఆ ఘటన మరువక ముందే సోమవారం వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రి ఘటన కలిచివేస్తుంది. ఆలాంటి ఆస్పత్రులు జిల్లాలోనూ ఉన్నాయి. దురదుృష్టవశాత్తు ప్రమాదం జరిగితే ఏ మేరకు నివారించగలం.. రోగులను ఎంత సురక్షితంగా బయటకు తరలించగలమన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని ప్రధాన ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాద నివారణ వ్యవస్థ ఎలా ఉందన్న విషయంపై సాక్షి ఫోకస్‌.

రుయాలో భద్రత డొల్ల
తిరుపతి(అలిపిరి): శ్రీవేంకటేశ్వర రామ్‌ నారాయణ్‌ రుయా ప్రభుత్వాస్పత్రి అగ్నిప్రమాద నివారణ వ్యవస్థకు ఆమడ దూరంలో ఉంది.  రుయాకు వై ద్యం నిమిత్తం నిత్యం 1,200 నుంచి 2 వేల మంది రోగులు వస్తుంటారు. వార్డుల్లో 850 మంది ఇన్‌పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. చిన్న పిల్లల ఆస్పత్రిలో 250 మంది చిన్నారులు వైద్య సేవలు పొందుతున్నారు. ఇంతటి పెద్దాస్పత్రికి కనీ సం క్యాజువాలిటీ మొదలుకుని వార్డుల వరకు అగ్నిప్రమాద నివారణ వ్యవస్థ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. 1962లో రుయా ఆస్పత్రి ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు అగ్నిమాపక వ్యవస్థ లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

పట్టించుకోని వైద్యఆరోగ్యశాఖ
రాయలసీమ ప్రాంత పేద ప్రజల కోసం ఏర్పాటైన ఆస్పత్రిలో కనీసం అగ్నిప్రమాద నివారణ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆపరేష్‌ థియేటర్లలో చిన్నపాటి విద్యుదాఘాతం చోటు చేసుకున్న పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. వరంగల్‌ హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన దృష్టిలో పెట్టుకుని రుయాలో అగ్నిప్రమాద నివారణ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

అగ్నిప్రమాద నివారణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తాం
రుయా ఆస్పత్రిలో అగ్నిప్రమాద నివారణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నాం. ఇప్పటికే అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌కు దరఖాస్తు పంపాం. త్వరలో పూర్తి స్థాయి ఫైర్‌సెప్టీ వ్యవస్థ రుయాకు అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్‌ సిద్ధానాయక్, సూపరింటెండెంట్, రుయా ఆస్పత్రి  

చిత్తూరు అర్బన్‌: వరంగల్‌లోని ప్రభుత్వాస్పత్రిలో ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో మంటలు వ్యాపించి, ముగ్గురు మృత్యువాత పడ్డారు. మంటలు ఆర్పడానికి సరైన అగ్నిమాప యంత్రాలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ధ్రువీ కరించారు. ఈ ఘటన నగరంలోని ఆçస్పత్రులను మేలుకొల్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జరగరానిది జరగక ముందే అ ప్రమత్తంగా కాకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

చిత్తూరు పర్లేదు..
చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు కాస్త ఊరటనిచ్చేలా కనిపిస్తున్నాయి. ఆస్పత్రిని అపోలో సంస్థకు లీజుకు ఇచ్చిన తరువాత ఇక్కడ అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకున్న చర్యలు బాగానే ఉన్నాయి. ఆస్పత్రిలోని మొత్తం వార్డులను అనుసంధానం చేస్తూ నీటి పైపులైన్లు ఏర్పాటు చేశారు. ఇక ఆపరేషన్‌ థియేటర్లలో సెంట్రల్‌ ఫైర్‌ ఎక్విప్‌మెంట్స్‌ను ఉంచడంతో ప్రమాదం సంభవిస్తే నీటితో ఆర్పడానికి అవకాశాలున్నాయి. కానీ అదే సమయంలో ఆస్పత్రిలో అగ్నిమాపక సిలిండర్లలో చాలా వరకు కాలం చెల్లినవే ఉన్నాయి. ఇక్కడ అందుబాటులో ఉంచిన పౌడర్, గ్యాస్, ఏబీసీ సిలెండర్లలో కొన్ని ఎప్పుడో పాడైపోయాయి. గ్యాస్‌ ఉన్న పరికరాలకు మూడేళ్లు, పౌడర్‌ ఉన్న పరికరాలు ఏడాది మాత్రమే పనిచేస్తాయి. ఆస్పత్రిలోని నాలుగు అగ్నిమాపక పరికరాలకు కాలం చెల్లినా వీటిని రీఫిల్‌ చేయడంలో సిబ్బంది శ్రద్ధ చూపడం లేదని స్పష్టమవుతోంది.  

ఆదమరిస్తే అంతే..!
 ఆస్పత్రి ఆవరణంలో ఇబ్బడిమబ్బడిగా విద్యుత్‌వైర్లు
మదనపల్లె క్రైం: ఆదమరిస్తే అంతే సంగతులు అనేందుకు ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్‌ వైర్లు ఇబ్బడిమబ్బడిగా ఉన్న దృశ్యాలే నిదర్శనం. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాద నివారణ వ్యవస్థ ఊసే లేదు. దీంతో   ప్రభుత్వాస్పత్రి లో అగ్ని ప్రమాదం సంభవిస్తే భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. ఆపరేషన్‌ థియేటర్‌లో విద్యుత్‌వైర్లు వేలాడుతూ ఉండడం, థియేటర్‌ గది, వరండాలు వర్షానికి ఉరుస్తుండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తోందనని ఆందోళన చెందుతున్నారు. చేతులుకాలాక ఆకులు పట్టుకోవడం కంటే అధికారులు మేల్కొని ఆస్పత్రి ఆవరణలో ఇబ్బడిముబ్బడిగా వేలాడుతున్న విద్యుత్‌వైర్లను బాగు చేసి, అగ్నిప్రమాద నివారణ వ్యవస్థను ఏర్పాటు చేసి, రోగులు, వైద్యులు, సిబ్బందికి రక్షణ కల్పిం చాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement