
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారులకు సర్ది చెబుతున్న ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు
ఒంగోలు: స్థానిక రిమ్స్ వద్ద ఉన్న డీమార్ట్ షోరూంలో సోమవారం మధ్యాహ్నం డేంజర్ అలారం మోగింది. దీనికి తోడు స్టోర్ గదిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని, వినియోగదారులు ఇన్‌గేటు, ఎగ్జిట్ గేటు ద్వారా సురక్షితంగా బయటకు చేరుకోవాలని అక్కడి సిబ్బంది మైక్‌లో ప్రచారం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్టు వినియోగించొద్దంటూ సిబ్బంది సూచనలు చేశారు. కొనుగోలుదారుల్లో తీవ్ర అలజడి రేగింది. ప్రమాదం ముంచుకొస్తుందనే భయంతో వారంతా మెట్ల మార్గం వైపు పరుగులు తీశారు. అంతా ఒకేసారి మెట్ల వైపునకు రావడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. మరో వైపు బయట ఉన్న జనానికి ఏం జరుగుతుందో అర్థంగాక మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మాల్ నుంచి బయటకు చేరుకున్న జనం మాల్ మేనేజర్‌ను నిలదీశారు. ఏమిటిదంతా అని ప్రశ్నించడంతో ప్రతి మూడు నెలలకోసారి తమ షోరూంలో ఫైర్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే మాక్ డ్రిల్‌గా చెప్పుకొచ్చారు.
ప్రమాదం ఏమీ లేదని, ఒక వేళ ఫైర్ ఘటన వంటివి ఏవైనా జరిగితే వాటి నుంచి వినియోగదారులను సురక్షితంగా బయటకు పంపడం ఎలా అనే అంశంపై అవగాహన కార్యక్రమమని చెప్పకొచ్చారు. మీ ఇష్టం వచ్చినట్లు మీరు మాక్ డ్రిల్ అంటూ చెప్పుకుంటే సరిపోదని, ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరంటూ వినియోగదారులు నిలదీశారు. అక్కడకు చేరుకున్న ఒంగోలు ఫైర్ ఆఫీసర్ ప్రజలకు సర్ది చెప్పారు. అనంతరం ఫైర్ ఆఫీసర్ వై.వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పెద్ద పెద్ద సంస్థల్లో ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్ తప్పనిసరన్నారు. అందులో భాగంగా సోమవారం మాక్‌డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించామని, అందులో భాగంగా డీమార్ట్ షోరూం ఫైర్ ఆఫీసర్.. జిల్లా ఫైర్ ఆఫీసర్‌కు సమాచారం అందించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment