సాక్షి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా నర్సీపురంలోని కోవై కలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన మాక్ డ్రిల్‌లో 19 ఏళ్ల బీబీఏ స్టూడెంట్ లోగేశ్వరి ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసింది. ఈ ఘటనకు బాధ్యుడైన అర్ముగం ప్రస్తుతం పోలీసులు రిమాండ్‌లో ఉన్నాడు. అయితే పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అర్ముగం ఎన్‌డీఎమ్‌ఏ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటి) ఉద్యోగే కాదని తెలిసింది. కళాశాల యాజమాన్యం పూర్తి వివరాలు విచారించకుండానే అతన్ని మాక్ డ్రిల్ కోసం పిలిపించారని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
విచారణలో భాగంగా పోలీసులు అర్ముగం వివరాలను సేకరించారు. అయితే ఇవన్ని నకిలీవని తెలింది. అంతేకాక అతని ఇచ్చిన అడ్రస్ ప్రూఫ్ కూడా నకిలేదేనని నిర్ధారించారు. అతని దగ్గర దొరికిన ఎన్‌డీఎమ్‌ఏ గుర్తింపు పత్రాలు కూడా ఫోర్జరివేనని గుర్తించారు. అంతేకాక అర్ముగం తన ఫేస్‌బుక్ ప్రోఫైల్‌లో తనను తాను ఎన్‌డీఎమ్‌ఏ ఉద్యోగిగా ప్రకటించుకున్నట్లు తెలిసింది. కాలేజీ యాజమాన్యం కేవలం అర్ముగం ఫేస్‌బుక్ ప్రొఫైల్ చూసి అతన్ని ఎన్‌డీఎమ్‌ఏ సభ్యునిగా భావించారని, అతని పూర్తి వివరాలను తెలుసుకోలేదని తెలిపారు. విచారణ కోనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. అయితే మృతురాలి తల్లితండ్రులు తమ కుమార్తె మరణానికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అతను ఎన్‌డీఎమ్‌ఏ సభ్యుడు కాదు: ఎన్‌డీఎమ్‌ఏ
అర్ముగం తనను తాను ఎన్‌ఎమ్‌డీఏ ఉద్యోగిగా చెప్పుకుని కాలేజీలో మాక్ డ్రిల్ నిర్వహించి ఒకరి మరణానికి కారణమవడంతో స్వయంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎమ్‌ఏ) రంగంలోకి దిగింది. మాక్ డ్రిల్ నిర్వహించిన సభ్యుడు ఎన్‌డీఎమ్‌ఏకు చెందిన వ్యక్తి కాదని ప్రకటన విడుదల చేసింది. వివరాల ప్రకారం.. ‘ఇటువంటి మాక్ డ్రిల్స్‌కు ఎన్‌డీఎమ్‌ఏ అనుమతివ్వదు. కాలేజీలో నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఎన్‌డీఎమ్‌ఏ భాగస్వామ్యం లేదు. సదరు ట్రైనీ అసలు ఎన్‌డీఎమ్‌ఏకు చెందిన వ్యక్తే కాద’ని ప్రకటించింది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇటువంటి డ్రిల్స్ నిర్వహించకూడదని హెచ్చరించింది. ఏది ఏమైనా పొరపాటు జరిగిందని, ఒక నిండు ప్రాణం బలైందని సంతాపం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment