ఓయూ భూములు ఎవడబ్బ సొత్తు కాదు
అగ్నిమాపకశాఖ వెబ్‌సైట్ ఆవిష్కరణలో హోంమంత్రి నాయిని
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములు ఎవడబ్బ సొత్తు కాదని, ఆ భూములను ఎవరూ తీసుకోబోరని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. తామంటే గిట్టనివారు చేస్తున్న ఆరోపణల్లో విద్యార్థులు చిక్కుకోవద్దని ఆయన సూచించారు. ఓయూ పక్కనే ఆ యూనివర్సిటీకి చెందిన భూముల్లో కొందరు పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లు కట్టి వ్యాపారాలు చేస్తుంటే వాటిపై విద్యార్థులు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.
శనివారం అగ్నిమాపకశాఖకు సంబంధించిన http://fire.telangana.gov.in వెబ్‌సైట్‌ను నాయిని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ వెబ్‌సైట్ ప్రజలకు బాగా ఉపయోగపడుతుందన్నారు. ఈ వెబ్‌సైట్‌లో ఫైర్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అధికారుల ఫోన్ నంబర్లతో సహా అన్ని వివరాలు ఉన్నాయన్నారు. అనంతరం సచివాలయంలో అగ్నిమాపక సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ ఆకట్టుకుంది.