నిరుద్యోగ ర్యాలీ పేరుతో కుట్ర: నాయిని
సాక్షి, హైదరాబాద్: జేఏసీ పేరుతో కోదండరాం చేస్తున్న కుట్ర వెనుక కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్నారని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ వాడు అయి ఉండీ తెలంగాణ ప్రభుత్వంపైనే కుట్రలు పన్నడమేమిటని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన సందర్భం వేరు. ఇప్పుడు కోదండరాం చేస్తున్న సందర్భం వేరు. దానికి దీనికి లింకు పెట్టడం సిగ్గుచేటు. మా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారు..’’అని నాయిని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఎన్ని వేల ఉద్యోగాలిచ్చాయో చెప్పాలన్నారు.
లక్షా 7వేల ఉద్యోగాలిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఇప్పటికే 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ర్యాలీకి అనుమతిపై హైకోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకున్నారని.. కోర్టులను కూడా కోదండరాం గౌరవించడం లేదని పేర్కొన్నారు. నాగోల్‌లో ఆదివారం సభ పెట్టుకుంటే సెలవు దినం కాబట్టి భారీగా జనం వచ్చే వారంటూ ఎద్దేవా చేశారు.
శాంతికి విఘాతం కలిగించే యత్నం: పల్లా
కోదండరాం హైదరాబాద్‌లో శాంతిభద్రత లకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిం చారని శాసనమండలి ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కోదండరాం ప్రకటనల ఆధారంగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారన్నారు. కోదండరాం ప్రొఫెసర్‌లా కాకుండా అజ్ఞానిలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.