సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అగ్నిమాపక శాఖను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. స్టాండింగ్ ఫైర్ అడ్వయిజరీ కౌన్సిల్(ఎస్‌ఎఫ్‌ఏసీ) ప్రమాణాలకు అనుగుణంగా అగ్నిమాపక వ్యవస్థను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఎస్‌ఎఫ్‌ఏసీ ప్రమాణాల ప్రకారం రెండు లక్షల జనాభాకొకటి చొప్పున రాష్ట్రంలో 250 అగ్నిమాపక కేంద్రాలుండాలి. కానీప్రస్తుతం 190 కేంద్రాలే ఉన్నాయి.
నిర్దేశిత ప్రమాణాలు సాధించేందుకు కొత్తగా 60 అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటిని మూడు దశల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రెండుదశల కింద 47 కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికను ఖరారు చేసింది. దాంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా ఆమోదించింది.
నియోజకవర్గానికొకటి చొప్పున..
ఇప్పటికే కొత్తగా ఆరు అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేంపల్లిలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక పి.గన్నవరం, కోరుకొండ, సదూం, వెదురుకుప్పం, ముద్దనూరు, వేంపల్లిలో అగ్నిమాపక కేంద్రాల నిర్మాణాల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. నెల్లిమర్ల, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, అరకు, రాజమహేంద్రవరం రూరల్, గోపాలపురం, ఆచంట, పోలవరం, ప్రత్తిపాడు, తాడికొండ, వేమూరు, పర్చూరు, సంతనూతలపాడు, నెల్లూరురూరల్, కొవ్వూరు, నందికొట్కూరు, పాణ్యం, మంత్రాలయం, సింగనమల, రాప్తాడు ఈ 20 నియోజకవర్గాల పరిధిలో ఒక్కో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
ఇక పరిధి, వాణిజ్య కార్యకలాపాల విస్తృతి దృష్ట్యా రాష్ట్రంలో కొత్తగా మరో 27 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు విపత్తుల స్పందన శాఖ ప్రణాళికను రూపొందించింది. ఒక్కో అగ్నిమాపక కేంద్రాన్ని రూ.1.90 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఆ మేరకు 47 కేంద్రాలను రూ.89.3 కోట్లతో ఏర్పాటు చేస్తారు. ఇక ఒక్కో కేంద్రానికి ఏటా నిర్వహణ వ్యయం రూ.1.10 కోట్లు అవుతుందని అంచనా.
ఆధునిక మౌలిక వసతులు
అగ్ని ప్రమాదాల నివారణకు విపత్తుల స్పందన శాఖకు ఆధునిక మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.10 కోట్లు వెచ్చించి జపాన్ నుంచి రూ.55 మీటర్ల టర్న్ టేబుల్ ల్యాడర్‌ను కొనుగోలు చేసింది. రూ.20 కోట్లతో ఫిన్‌లాండ్ నుంచి 90 మీటర్ల హైడ్రాలిక్ ప్లాటఫాంను కొనుగోలు చేశారు. కొత్తగా అగ్నిమాపక వాహనాల కొనుగోలుకు రూ.6.96 కోట్లతో ప్రతిపాదనలను ఆమోదించింది.
మరోవైపు రాష్ట్రంలో రెండు రీజియన్లుగా ఉన్న అగ్నిమాపక శాఖను నాలుగు రీజియన్లుగా ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. వాటితో పాటు విపత్తుల స్పందన శాఖలో ఫైర్‌మెన్, డ్రైవర్ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర విపత్తుల స్పందన దళాన్ని అగ్ని మాపక శాఖ పరిధిలోకి తెచ్చే అంశంపై కసరత్తు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment