vacancies of posts
-
సమాచార కమిషన్లలో ఖాళీలు భర్తీచేయండి
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్(ఎస్ఐసీ)లలో పోస్టులను భర్తీచేయకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. తెలంగాణ, త్రిపుర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో సేవలు అందించడానికి ఎలాంటి సమాచార కమిషనర్లు అందుబాటులో లేరంటూ సమాచారహక్కు(ఆర్టీఐ)చట్టం కార్యకర్త అంజలీ భరద్వాజ్ వేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ‘ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయండి. లేదంటే ఆర్టీఐ చట్టం నిరీ్వర్యమైపోతుంది’ అంటూ కేంద్రప్రభుత్వం, రాష్ట్రాలను ఆదేశించింది. ‘ రాష్ట్ర సమాచార కమిషన్లలో అనుమతించిన పోస్టులు ఎన్ని? ఖాళీలెన్ని? పెండింగ్‌లో ఉన్న కేసులెన్ని? అనే వివరాలను నివేదించండి’ అని సిబ్బంది, శిక్షణ శాఖను ఆదేశించింది. -
రైల్వేలో ఖాళీల సంఖ్య 2.74 లక్షలు
న్యూఢిల్లీ: రైల్వేలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ఇందులో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఖాళీలే 1.75 లక్షల వరకు ఉన్నాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నలకు రైల్వే శాఖ వివరంగా సమాధానమిచి్చంది. రైల్వే శాఖలో మొత్తంగా 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది. ఇందులో భద్రత కేటగిరీకి సంబంధించిన ఖాళీలు 1,77,924గా ఉన్నాయి. జూన్ 1 తేదీ నాటికి నాన్ గెజిటెడ్ గ్రూప్ సిలో 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రైల్వే శాఖ చెప్పింది. ఇక రైల్వేల భద్రతకు సంబంధించి 9.82 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే 8.04 లక్షల భర్తీ చేసినట్టు వివరించింది. భద్రత కేటగిరీలో లోకో పైలెట్లు, ట్రాక్ తనిఖీలు చేసే వ్యక్తులు, పాయింట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, సిగ్నల్ అసిస్టెంట్లు, ఇంజనీర్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, టికెట్ కలెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఒడిశాలో బాలాసోర్ వద్ద ఘోరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఐ కింద పోస్టుల ఖాళీలపై ఆర్టీఐ కింద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
216 జడ్జీల పోస్టుల భర్తీకి సిఫారసులు రాలేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో మొత్తం 334 జడ్జీల పోస్టులు ఖాళీలుండగా 118 పోస్టుల భర్తీ కోసం హైకోర్టు కొలీజియంల నుంచి అందిన సిఫారసులు వివిధ దశల్లో పరీశీలనలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మరో 216 జడ్జీల పోస్టులకు హైకోర్టుల కొలీజియంల నుంచి సిఫారసులు అందాల్సి ఉందని వివరించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మార్చి 10వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో ఖాళీలు లేవన్నారు. 25 హైకోర్టుల్లో మంజూరైన 1,114 జడ్జీ పోస్టులకు గాను 334 ఖాళీలున్నాయన్నారు. జడ్జీ పోస్టుల ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ అని వివరించారు. -
‘అగ్గి’ని బుగ్గి చేద్దాం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అగ్నిమాపక శాఖను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. స్టాండింగ్ ఫైర్ అడ్వయిజరీ కౌన్సిల్(ఎస్‌ఎఫ్‌ఏసీ) ప్రమాణాలకు అనుగుణంగా అగ్నిమాపక వ్యవస్థను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఎస్‌ఎఫ్‌ఏసీ ప్రమాణాల ప్రకారం రెండు లక్షల జనాభాకొకటి చొప్పున రాష్ట్రంలో 250 అగ్నిమాపక కేంద్రాలుండాలి. కానీప్రస్తుతం 190 కేంద్రాలే ఉన్నాయి. నిర్దేశిత ప్రమాణాలు సాధించేందుకు కొత్తగా 60 అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటిని మూడు దశల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రెండుదశల కింద 47 కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికను ఖరారు చేసింది. దాంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా ఆమోదించింది. నియోజకవర్గానికొకటి చొప్పున.. ఇప్పటికే కొత్తగా ఆరు అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేంపల్లిలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక పి.గన్నవరం, కోరుకొండ, సదూం, వెదురుకుప్పం, ముద్దనూరు, వేంపల్లిలో అగ్నిమాపక కేంద్రాల నిర్మాణాల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. నెల్లిమర్ల, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, అరకు, రాజమహేంద్రవరం రూరల్, గోపాలపురం, ఆచంట, పోలవరం, ప్రత్తిపాడు, తాడికొండ, వేమూరు, పర్చూరు, సంతనూతలపాడు, నెల్లూరురూరల్, కొవ్వూరు, నందికొట్కూరు, పాణ్యం, మంత్రాలయం, సింగనమల, రాప్తాడు ఈ 20 నియోజకవర్గాల పరిధిలో ఒక్కో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇక పరిధి, వాణిజ్య కార్యకలాపాల విస్తృతి దృష్ట్యా రాష్ట్రంలో కొత్తగా మరో 27 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు విపత్తుల స్పందన శాఖ ప్రణాళికను రూపొందించింది. ఒక్కో అగ్నిమాపక కేంద్రాన్ని రూ.1.90 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఆ మేరకు 47 కేంద్రాలను రూ.89.3 కోట్లతో ఏర్పాటు చేస్తారు. ఇక ఒక్కో కేంద్రానికి ఏటా నిర్వహణ వ్యయం రూ.1.10 కోట్లు అవుతుందని అంచనా. ఆధునిక మౌలిక వసతులు అగ్ని ప్రమాదాల నివారణకు విపత్తుల స్పందన శాఖకు ఆధునిక మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.10 కోట్లు వెచ్చించి జపాన్ నుంచి రూ.55 మీటర్ల టర్న్ టేబుల్ ల్యాడర్‌ను కొనుగోలు చేసింది. రూ.20 కోట్లతో ఫిన్లాండ్ నుంచి 90 మీటర్ల హైడ్రాలిక్ ప్లాటఫాంను కొనుగోలు చేశారు. కొత్తగా అగ్నిమాపక వాహనాల కొనుగోలుకు రూ.6.96 కోట్లతో ప్రతిపాదనలను ఆమోదించింది. మరోవైపు రాష్ట్రంలో రెండు రీజియన్లుగా ఉన్న అగ్నిమాపక శాఖను నాలుగు రీజియన్లుగా ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. వాటితో పాటు విపత్తుల స్పందన శాఖలో ఫైర్‌మెన్, డ్రైవర్ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర విపత్తుల స్పందన దళాన్ని అగ్ని మాపక శాఖ పరిధిలోకి తెచ్చే అంశంపై కసరత్తు చేపట్టింది. -
1,472 ఐఏఎస్, 864 ఐపీఎస్ ఖాళీలు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 1,472 ఐఏఎస్, 864 ఐపీఎస్, 1,057 ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు(ఐఎఫ్ఎస్) పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. 2022 జనవరి 1వ తేదీ నాటికి దేశంలో శాంక్షన్డ్ ఐఏఎస్ పోస్టులు 6,789, ఐపీఎస్ పోస్టులు 4,984, ఐఎఫ్ఎస్ పోస్టులు 3,191 ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్రసింగ్ బుధవారం సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. ప్రస్తుతం 5,317 ఐఏఎస్ అధికారులు, 4,120 ఐపీఎస్ అధికారులు, 2,134 ఐఎఫ్ఎస్ అధికారులు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ విభాగాల్లో 9.79 లక్షల ఖాళీలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి ఏకంగా 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జితేంద్ర సింగ్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. వీటి భర్తీకి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. చదవండి: (భార్య వేధింపులు తట్టుకోలేక.. నవ వరుడు ఆత్మహత్య!) -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 10 లక్షల ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: నిరుద్యోగితపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో పోస్టుల భర్తీపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఖాళీ పోస్టుల వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ) సూచించింది. వాటిని సత్వరం భర్తీ చేసేందుకు మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించింది. ఎంట్రీ స్థాయితో పాటు సీనియర్ లెవెల్ ఖాళీల వివరాలను కూడా కేంద్రం అడిగినట్లు ఒక పీఎస్‌యూ సీనియర్ అధికారి తెలిపారు. డిసెంబర్ వరకు గుర్తించిన ఎంట్రీ–లెవెల్ ఖాళీలను వచ్చే ఏడాది ఆగస్టు–సెప్టెంబర్ కల్లా భర్తీ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు వివరించారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! సాధారణంగా నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శక విధానంలో నియామకాలు చేపట్టాల్సి ఉండటం, దేశవ్యాప్తంగా అభ్యర్థులు పాల్గొనడం వంటి అంశాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో హైరింగ్ ప్రక్రియకు కాస్త ఎక్కువ సమయమే పడుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 255 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ) ఉన్నాయి. వీటిలో 177 సంస్థలు లాభాల్లో ఉన్నాయి. ఇవి 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.89 లక్షల కోట్ల లాభాలు నమోదు చేశాయి. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో యుద్ధప్రాతిపదికన 10 లక్షల మంది ఉద్యోగుల రిక్రూట్మెంట్ చేపట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ వివిధ శాఖలు, విభాగాలకు జూన్‌లో ఆదేశించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) ఖాళీల భర్తీ కోసం కేంద్ర ఆర్థిక శాఖ గత నెలలోనే ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లతో సమావేశమైంది. దీంతో బ్యాంకులు రిక్రూట్మెంట్ కోసం ప్రకటనలు జారీ చేయడం కూడా మొదలుపెట్టాయి. 2012–13లో పీఎస్బీల్లో 8.86 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2020–21 నాటికి ఇది 7.80 లక్షలకు తగ్గింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
న్యాయవ్యవస్థలో ఖాళీల సత్వర భర్తీ!
సాక్షి, న్యూఢిల్లీ: జ్యుడీషియల్లో ఖాళీలు భారీగా పెరిగిపోవడం దేశీయ న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ సవాలును ఎదుర్కొనే క్రమంలో కొలిజయం సిఫార్సులను కేంద్రం వేగంగా ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జాతీయ జ్యుడీషియల్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని, దీనిపై త్వరలో కేంద్రానికి నివేదికనిస్తామని చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సత్కార సభలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టుకు ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను వేగంగా ఆమోదించినందుకు ప్రధానికి, న్యాయమంత్రికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీని సత్వరమే పూర్తిచేయాలని తాను భావించానని, ఈ భావన నెరవేరడం ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇటీవలే కొలీజియం పలు హైకోర్టులకు పలువురు జడ్జిల పేర్లను సిఫార్సు చేసిందని, ప్రభుత్వం వీలయినంత త్వరగా వీటికి ఆమోదముద్ర వేస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. అన్ని హైకోర్టుల్లో కలిపి దాదాపు 41 శాతం పదవులు ఖాళీగా ఉన్నాయని, వచ్చే నెలలోపు వీటిలో 90 శాతం నియామకాలు జరగవచ్చని అంచనా వేశారు. ఖాళీల భర్తీలో సహకరించిన కొలీజియం సభ్యులను అభినందించారు. మౌలిక వసతుల కల్పన దేశ న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరతను తీర్చేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని జస్టిస్ రమణ చెప్పారు. చాలా కాలంగా మౌలిక సదుపాయాల పెంపుపై తాను దృష్టి పెట్టానని, ఈ సమస్యను ఒక కాలపరిమితితో పరిష్కరించేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ విషయంపై దేశవ్యాప్త నివేదిక సేకరణ పూర్తయిందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదన కేంద్ర న్యాయశాఖ మంత్రికి చేరుతుందని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధిక వ్యయప్రయాసల వల్ల లక్షలాది మంది ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోతున్నారన్నారు. మహిళలను స్వాగతించాలి పలువురు మహిళలు న్యాయవాదులుగా కొనసాగుతున్నా, వీరిలో చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నతస్థానాలకు చేరుకుంటున్నారని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచి్చన 75 ఏళ్ల తర్వాత, అన్ని స్థాయిలలో మహిళలకు కనీసం 50% ప్రాతినిథ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరు ఆశించారని, కానీ ఎంతో కష్టం తరువాత సుప్రీంకోర్టులో మహిళా జడ్జీల సంఖ్య 11 శాతానికి పెరిగిందన్నారు. న్యాయవాద వృత్తిలోకి మహిళలను మరింత ఎక్కువగా స్వాగతించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా సహోద్యోగులను గౌరవించడంతో పాటు వారి పట్ల హుందాగా వ్యవహరించాలని సూచించారు. పేదలు, మహిళలు, రైతులు, కారి్మకులు, వెనుకబడినవారు తమ చట్టపరమైన హక్కులను వినియోగించుకొనేందుకు సహాయం చేయాలని, సాధ్యమైనప్పుడల్లా ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని చెప్పారు. న్యాయవాద వృత్తిలోకి ఆహా్వనం సామాజిక పరిస్థితుల్లో మార్పు కారణంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయవాదులు, న్యాయమూర్తులు అయ్యేందుకు అవకాశాలు వస్తున్నాయని సీజేఐ చెప్పారు. కానీ ఇప్పటికీ గ్రామీణ, బలహీన వర్గాల నుంచి ఎక్కువ మంది ఔత్సాహికులు న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టట్లేదని భావిస్తున్నానన్నారు. న్యాయవాద వృత్తి ఇంకా పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని, మరింత మంది ఈ వృత్తిలోకి రావాలని ఆయన స్వాగతించారు. సభలో సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, వైస్ చైర్మన్ రామజోగేశ్వరరావు, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ జీఎల్ నాగేశ్వరరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహా రెడ్డి, వైస్‌చైర్మన్ కె.సునీల్ గౌడ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా హైకోర్టు జడ్జీల ఖాళీలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నాయని, కొత్తగా హైకోర్టు న్యాయమూర్తులను నియమించాలని కొన్ని నెలల క్రితం హైకోర్టులు చేసిన సిఫారసులపై సుప్రీంకోర్టు కొలీజియం ఇంకా తుది తీర్పునివ్వలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలోని 25 హైకోర్టులలో మొత్తం 1,079 మంది న్యాయమూర్తులుండాల్సి ఉంటుంది. జనవరి 1వ తేదీ నాటికి 411 ఖాళీలున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో సుప్రీంకోర్టు కోలీజియం నుంచి న్యాయమంత్రిత్వ శాఖకు ఇంకా సిఫర్సులు అందలేదన్నారు. 2019 నవంబర్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ అనంతరం సుప్రీంకోర్టులో మొదటి ఖాళీ ఏర్పడిదని, ఆ తరువాత వరుసగా జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఆరుణ్ మిశ్రాల పదవీ విరమణలతో స్థానాలు ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. మొత్తం 34 మందిని నియమించగా, ప్రస్తుతం 30 మందితో కోర్టు నడుస్తోంది. సుప్రీంకోర్టు లోని ఈ ఖాళీలను భర్తీ చేయడానికి కొలీజియం నుంచి ఇంత వరకు ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు రాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. న్యాయమూర్తుల పదవీ విరమణ, రాజీనామా లేదా, పదోన్నతుల కారణంగా ఇటువంటి ఖాళీలు ఏర్పడతాయి. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం అనేది, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య నిరంతర ప్రక్రియ. దీనికి వివిధ రాజ్యాంగ అధికారుల నుంచి ఆమోదం అవసరమౌతుంది. 25 హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి, సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనలు చేస్తుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి, అవసరమైతే అంగీకరిస్తుంది. లేదా పునః పరిశీలిస్తుంది. హైకోర్టు కొలీజియం మొదట తమ సిఫార్సులను న్యాయమంత్రిత్వ శాఖకు పంపుతుంది. ఐబి నివేదికను వాటికి జతచేస్తుంది. దీన్ని సుప్రీంకోర్టు కొలీజియంకి పంపిస్తారు. ఈ కొలీజియం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ న్యాయవాదులను ప్రతిపాదిస్తుంది. అయితే 23 మంది అభ్యర్థులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని పలుహైకోర్టు కొలీజియంలు చేసిన సిఫార్సులపై సుప్రీంకోర్టు కొలీజియం ఇంకా నిర్ణయం తీసులకోలేదని భావిస్తున్నారు. హైకోర్టుల ప్రతిపాదనలు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆరోపించారు. ఒక అభ్యర్థి ప్రతిపాదన దాదాపు మూడేళ్ళుగా ఉన్నత న్యాయస్థానం కొలీజియంలో పెండింగ్‌లో ఉంది. మరికొన్ని ప్రతిపాదనలు దాదాపు రెండేళ్ళుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. మరో 47 రికమండేషన్స్ సుప్రీంకోర్టు కొలీజియంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దేశంలోని 25 హైకోర్టులలో మొత్తం 1,079 మంది న్యాయమూర్తులుండాల్సి ఉంటుంది. జనవరి 1వ తేదీనాటికి 411 ఖాళీలున్నాయి. ఇందులో అత్యధికంగా 64 మంది అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తుల నియమాకాలే పెండింగ్‌లో ఉన్నాయి. కొలీజియం సిఫార్సులను బట్టి ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి పేర్లను ఖరారు చేయడంలో కేంద్రం వైపు నుంచి జరిగిన ఆలస్యంపై బుధవారం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడింది. కొన్ని కేసుల్లో కేంద్రం కొలీజియం సూచనలపై ప్రతిస్పందించేందుకు కేంద్రం ఏడాదికి పైగా సమయం తీసుకుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. -
1,900 పోస్టులకు ఈనెల 30న నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: జాతీయ ఆరోగ్యమిషన్ పరిధిలో పనిచేసేందుకు గానూ వివిధ కేటగిరీల్లో నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. డాక్టర్లు, పారామెడికల్, నర్సులు తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 1,900 పోస్టులున్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. వీటికి ఈనెల 30న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దరఖాస్తుకు చివరి తేదీని అక్టోబర్ 10గా నిర్ణయించారు. తుది జాబితాను వచ్చే నెల 17న విడుదల చేసి.. 19వ తేదీన నియామక పత్రాలు అందించనున్నారు. ఈ పోస్టులను ఆయా జిల్లాల్లో కలెక్టర్లే భర్తీ చేసుకునేలా వీలు కల్పించారు. (తీపి కబురు: త్వరలో డీఎస్సీ) -
న్యాయ నియామకాల్లో జాప్యం
న్యాయవ్యవస్థ కంఠశోషే తప్ప దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టులు భర్తీ కాకుండానే ఉండిపోతున్నాయని మరోసారి వెల్లడైంది. మొత్తంగా 1,079 హైకోర్టు న్యాయమూర్తుల పదవులుండగా అందులో కేవలం 669మంది న్యాయమూర్తులు...అంటే 62 శాతంమంది మాత్రమే ఉన్నారని, 410 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం వల్ల కేసుల పరిష్కా రంలో ఎంత జాప్యం చోటుచేసుకుంటున్నదో, న్యాయం కోసం ఎదురుచూస్తున్న సాధారణ పౌరులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కేంద్రానికి తెలియనిది కాదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా న్యాయమూర్తుల నియామకం విషయంలో నిర్లక్ష్యమే కనబడుతోంది. సుప్రీంకోర్టు కొలీజి యానికీ, కేంద్రానికీ మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలు ఇటీవలికాలంలో చాలానే ఉన్నాయి. అయినా గత అయిదేళ్లలో చేసిన నియామకాలు గమనిస్తే అంతక్రితం కన్నా ఎంతో కొంత మెరుగనే చెప్పాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరిపోదు. అలహాబాద్ హైకోర్టు 60 ఖాళీలతో అగ్రభాగాన ఉండగా, కలకత్తా హైకోర్టులో 32, ఢిల్లీ హైకోర్టులో 23, బొంబాయి హైకోర్టులో 29 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలున్నాయి. అన్నిటికన్నా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిస్థితి మరీ అన్యాయం. అక్కడ 37మంది న్యాయమూర్తులకూ 15మంది మాత్రమే ఉన్నారు. గత జూన్‌లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ కొత్తగా న్యాయమూర్తుల్ని నియమించడంతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే అవసరమైతే రాజ్యాంగంలోని 128, 224ఏ అధికరణల కింద సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తుల్ని నిర్దిష్ట కాలానికి న్యాయమూర్తులుగా నియమిస్తే పెండింగ్ కేసుల బెడద తీరుతుందని సూచించారు. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయమేమిటో తెలియదు. సుప్రీంకోర్టులో మొన్న జూన్ నాటికి 58,669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజూ కొత్తగా దాఖలయ్యే కేసుల సంఖ్య కూడా కలుపుకుంటే ప్రస్తుతం అవి మరింతగా పెరిగివుండొచ్చు. తగినంతమంది న్యాయమూర్తులు అందుబాటులో లేని కారణంగా అనేక ముఖ్య మైన కేసుల పరిష్కారం కూడా ఆలస్యమవుతోంది. కేసుల్లో చిక్కుకోవడం వల్లనో, న్యాయం కోసం న్యాయస్థానాల్ని ఆశ్రయించడం వల్లనో వాటి చుట్టూ తిరగకతప్పనివారికి ఈ జాప్యం వల్ల కలిగే ఖేదమేమిటన్నది బాగా తెలుసు. తమ కేసు చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉందని, త్వరగా పరిష్కరించాలని కోరే కక్షిదారులకు న్యాయస్థానాలనుంచి ఆశాజనకమైన జవాబు రావడం లేదు. అవి నిస్సహాయ స్థితిలో ఉండటమే అందుకు కారణం. మన దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఏభై ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 1,000 వరకూ ఉంటే...25 ఏళ్లనుంచి పెండింగ్‌లో ఉన్న కేసులు రెండు లక్షలపైనే. సివిల్ తగాదాలకు సంబంధించి మొత్తంగా 90 లక్షల కేసులు ఎటూ తెమలకుండా ఉన్నాయి. వీటిల్లో 20 లక్షలకుపైగా కేసుల్లో...అంటే 23 శాతం కేసుల్లో కనీసం సమన్లు కూడా జారీ చేయలేదని గత ఆగస్టులో జస్టిస్ గొగోయ్ చెప్పారంటే న్యాయమూర్తుల నియామకం సమస్య ఎలాంటి పరిస్థితులకు దారితీస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. క్రిమినల్ కేసుల పరిస్థితి ఇంతకన్నా ఘోరం. 2 కోట్ల 10 లక్షల క్రిమినల్ కేసుల్లో కోటి వరకూ కేసులు ఇంకా సమన్లు జారీ చేసే దశలోనే ఉన్నాయి. ఈ క్రిమినల్ కేసుల్లో 45 లక్షల వరకూ చిన్న తగాదాలకు సంబంధించినవి. ఇది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మాత్రమే కాదు... కింది కోర్టుల్లో కూడా న్యాయాధికారుల కొరత తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా 5,000 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఇలా ఎక్కడికక్కడ అన్ని స్థాయిల్లోనూ ఖాళీలుంటే న్యాయం దక్కడం సాధ్యమేనా? ఉన్నత స్థాయి న్యాయస్థానాల్లో పదవుల భర్తీ విషయంలో జరుగుతున్న జాప్యం గురించి కనీసం కొలీజియాన్ని సాకుగా చూపడానికి ఉంది. కానీ జిల్లా కోర్టుల్లోనూ, సబా ర్డినేట్ కోర్టుల్లోనూ పూర్తికావాల్సిన నియామకాల మాటేమిటి? దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో నియామక విధానం తెస్తామని రవిశంకర్ ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. ఆ విషయంలో కేంద్రం నుంచి ప్రతిపాదనలు వస్తే సానుకూలంగా స్పందిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఈమధ్యే అన్నారు గనుక ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందనుకోవాలి. న్యాయ మూర్తుల నియామకంలో చోటు చేసుకుంటున్న జాప్యం కేంద్రం, న్యాయవ్యవస్థల మధ్య నెలకొన్న ఆధిపత్య సమస్య లేదా అహంభావ సమస్య పర్యవసానంగా ఏర్పడిందని కొందరు న్యాయవేత్తలు చెబుతున్నారు. కానీ వీటి పర్యవసానాలు మాత్రం ప్రజలు అనుభవించవలసి వస్తున్నది. ఇది ఎడ తెగకుండా సాగడం సరైంది కాదు. న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యం వల్ల ప్రజలకు సకాలంలో న్యాయం దక్కని దుస్థితి ఏర్పడింది. క్రిమినల్ కేసుల విచారణ ఏళ్లతరబడి పెండింగ్‌లో పడిపోవడం వల్ల ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న నిరుపేదలు జైళ్లలో గడపవలసి వస్తోంది. కొందరైతే తమ నేరానికి అనుభవిం చాల్సిన శిక్షా కాలానికి మించి జైళ్లలో మగ్గుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు బెయిల్ తెచ్చుకుం టున్నారు. అవసరమైన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికాలో పది లక్షలమంది జనాభాకు సగటున 107మంది న్యాయమూర్తులుంటే మన దేశంలో ఆ సంఖ్య పది మాత్రమే. అలాగే అక్కడి న్యాయమూర్తులు సగటున ఏడాదికి 81 కేసులు పరిష్కరిస్తుంటే మన న్యాయమూర్తులు 2,600 కేసులు పరిష్కరిస్తున్నారు. న్యాయమూర్తులపై ఈ స్థాయిలో భారం మోపడం ఎంత మాత్రం న్యాయం కాదు. కనుక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం కదలాలి. న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాలి. -
..ఇదీ మెడి‘సీన్’
సాక్షి, హైదరాబాద్ : మెడికల్ కాలేజీల్లో కొత్త విద్యాసంవత్సరం మొదలుకాబోతోంది. ఆగస్టు 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. కాలేజీలకు వచ్చేందుకు విద్యార్థులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఎంబీబీఎస్ తరగతులు కచ్చితంగా ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభించాల్సిందే. ఇదంతా బాగానే ఉంది. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో కొత్తగా కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు చదువు చెప్పేదెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేటల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. అయితే ఆ కాలేజీలకు సంబంధించి పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందే కానీ వాటిని భర్తీ చేయలేదు. మిగిలిన కాలేజీల్లో ఉన్న ఖాళీలను పూరించలేదు. కొత్త కాలేజీల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగకుండా తరగతులు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. ఆ రెండు చోట్లే 1,036 పోస్టులు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2019–20 వైద్య విద్యా సంవత్సరానికి మొత్తంగా 4,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇవిగాక 10 ప్రైవేటు, ఒక ఆర్మీ, మరో ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 1,106 డెంటల్ సీట్లున్నాయి. గతేడాది కంటే ఈసారి ఏకంగా వెయ్యి ఎంబీబీఎస్ సీట్లు పెరగడం గమనార్హం. ప్రభుత్వంలోని అన్ని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. మూడో విడతలో కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లతోపాటు అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కేటాయించిన 190 సీట్లను భర్తీ చేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియపై నీలినీడలు అలుముకున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, నల్లగొండల్లో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం ఇటీవల 1,036 పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా, 904 పారామెడికల్, నాన్–మెడికల్ గెజిటెడ్ పోస్టులున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో వైద్య విద్య సంచాలకులు వీటిని భర్తీ చేయాల్సిఉంది. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ మొదలే కాలేదు. దీంతో ఆయా కాలేజీల్లో తరగతులను ఎలా నిర్వహిస్తారన్న దానిపై ఆందోళన నెలకొంది. ఎంహెచ్ఆర్బీ ఉనికిలోకే.. 2017లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా సుమారు 500 డాక్టర్ పోస్టులు, 3,300 స్టాఫ్ నర్సు పోస్టులు, మరో 1,000 పారా మెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా ఆ భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. దీంతో లాభం లేదనుకొని తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ నియామకాలను వేగంగా పూర్తి చేసేందుకు ‘మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఆర్బీ)’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై గతేడాది సెప్టెంబర్‌లోనే జీవో జారీచేశారు. 10నెలలు కావస్తున్నా.. ఇప్పటిదాకా ఇది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఖాళీలు పెరిగిపోతున్నాయి. సరిపడా డాక్టర్లు, ఇతర సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పెరుగుతోంది. వేగంగా పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే ఎంహెచ్ఆర్బీని ఏర్పాటు చేసినా.. ఆలస్యం తప్పడంలేదు. బోర్డు చైర్మన్‌గా వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మెంబర్ సెక్రటరీగా, జాయింట్ డైరెక్టర్ హోదా ఉన్న అధికారి సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోర్డులో డిప్యూటీ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, లీగల్ ఆఫీసర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకూ అందరినీ డిప్యుటేషన్‌పై ఇతర శాఖల నుంచి తీసుకోవాలని జీవో సూచించింది. అయినా ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మరో నాలుగు నెలల వరకు భర్తీ ప్రక్రియ జరిపే అవకాశాలు కనిపించడంలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయంటే అధికార యంత్రాంగ నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇదే జరిగితే మెడికల్ కాలేజీలు అధ్యాపకులు లేక వైద్య విద్యా వ్యవస్థ కుంటుపడే ప్రమాదముంది. దీనిపై వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేష్‌రెడ్డి వివరణ కోరగా, బోర్డు ద్వారానే భర్తీల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. -
నిరుద్యోగులకు బొనాంజా; 84 వేల కొలువులు
సాక్షి, న్యూఢిల్లీ : పారామిలటరీ బలగాల్లో దాదాపు 84,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) 9,99,795 పోస్టులు మంజూరు కాగా ఏటా వివిధ గ్రేడుల్లో పది శాతం ఖాళీలు ఏర్పడుతున్నాయని, దీంతో ప్రస్తుతం 84,037 పోస్టులు భర్తీ చేసేందుకు ఖాళీగా ఉన్నాయని హోం శాఖ మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది. కాగా, సీఆర్పీఎఫ్లో 22,980 ఖాళీలు, బీఎస్ఎఫ్లో 21,465, సీఐఎస్ఎఫ్లో 10,415, ఎస్ఎస్బీలో 18,102, ఐటీబీపీలో 6643, అస్సాం రైఫిల్స్‌లో 4432 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. నూతనంగా ఏర్పడిన పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్రం సత్వర చర్యలు చేపడుతుందని పేర్కొంది. రిక్రూట్మెంట్ నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను నియామకాలు, పదోన్నతులు, డిప్యుటేషన్ల ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. -
సమాచార కమిషన్లలో 30శాతం ఖాళీలు
న్యూఢిల్లీ: చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పోస్టుల్లో దేశవ్యాప్తంగా 30 శాతానికిపైగా ఖాళీగా ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ బుధవారం విడుదల చేసిన ఓ నివేదికలో ఈ వివరాలున్నాయి. సమాచార హక్కు చట్టం–2005 కింద సమాచారం ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 2.5 కోట్ల ఆర్టీఐ దరఖాస్తులు వచ్చాయని నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 156 చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పోస్టుల్లో 48 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్లో 30.8% పోస్టులు ఇంకా భర్తీకాలేదు. ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. 2005–16లో బాధ్యతారాహిత్యానికి సంబంధించి వేర్వేరు ప్రభుత్వ సం స్థలు, అధికారులపై సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రూ.1.93 కోట్ల జరిమానా విధించింది. -
భర్తీ చేసింది.. 32 వేలే!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గణాంకాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో 32,681 ఉద్యోగాలను భర్తీ చేసింది. పోలీసు శాఖలో అత్యధికంగా 12,152 పోస్టులను భర్తీ చేసింది. టీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక వెల్లడించింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ మేరకు మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువైన 2014, జూన్ 2 నుంచి 2018, ఆగస్టు 31 వరకు పోస్టుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. అన్ని శాఖల్లో కలిపి 1,28,274 పోస్టుల ఖాళీలను గుర్తించారు. వీటిలో 1,02,217 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఆధారంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీసు నియామక మండలి, గురుకుల విద్యాలయాల నియామక మండలి, ఆయా శాఖల ఎంపిక కమిటీలు.. 87,346 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఇలా నోటిఫికేషన్ జారీ చేసిన వాటిలో 24,476 పోస్టులు భర్తీ అయ్యాయి. 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా తెలంగాణలో 128 పోస్టులను భర్తీ చేశారు. సింగరేణిలో 8,205 పోస్టులు భర్తీ అయ్యాయి. వివిధ శాఖలో రెగ్యులర్‌గా మార్చినవి.. 811 పోస్టులు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. -
కేంద్ర ప్రభుత్వంలో 5 లక్షల ఉద్యోగాలు ఖాళీ
వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని 2016–17 ఆర్థిక సర్వేలో తేలింది.వీటిలో గుమాస్తా, ఆఫీసు అసిస్టెంట్ తరహా ఉద్యోగాలే ఎక్కువ ఉన్నాయి. సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాల అమలు సంతృప్తికరంగా సాగడం లేదని ఏడవ కేంద్ర వేతన సంఘం తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు లక్షల ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉంటే మరోవైపు ఉన్న సిబ్బంది వేతనాల కోసం ప్రభుత్వం భారీగా సొమ్ము వెచ్చిస్తోంది. 2006–07 నుంచి 2016–17 వరకు అంటే పదేళ్లలో కేంద్ర సిబ్బంది వేతన ఖర్చు మూడు రెట్లు పెరిగిందని ఆర్థిక సర్వే పేర్కొంది.2006–07 సంవత్సరంలో వేతనాల కోసం కేంద్రం దాదాపు 40వేల కోట్లు వెచ్చించగా,2016–17 సంవత్సరానికది రెండు లక్షల కోట్లకు పెరిగింది.ఈ పదేళ్లలో కేంద్ర సిబ్బంది వేతనాలు మూడు సార్లు పెరిగాయి. గ్రూప్సి ఉద్యోగాలే ఎక్కువ అమెరికాలో ప్రతి లక్ష మంది ప్రజలకు 668 మంది ఉద్యోగులు ఉండగా, మన దేశంలో లక్ష మందికి 139 మంది ఉద్యోగులే ఉన్నారు. కేంద్ర సంస్థల్లో 2006లో 35 లక్షల ఉద్యోగాలు మంజూరు కాగా, 31 లక్షలు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. 4లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోయాయి. అదే 2016 వచ్చే సరికి 36 లక్షల ఉద్యోగాలకు గాను 32 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి.ఖాళీ పోస్టుల్లో ఎక్కువ గ్రూప్సి ఉద్యోగాలే(గుమాస్తా,ఆఫీసు అసిస్టెంట్) ఉన్నాయి. 2016–17లో 32 లక్షల గ్రూప్ సి ఉద్యోగాలు మంజూరు కాగా28 లక్షల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. మిగతా విభాగాలతో పోలిస్తే శాస్త్ర, సాంకేతిక విభాగంలో సిబ్బంది కొరత 50 శాతానికిపైగా ఉంది. 2014లో ఈ విభాగంలో 37శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉండగా2016 నాటికది 55శాతానికి చేరింది. పౌర విమానయాన శాఖలో 49శాతం,కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 44శాతం ఉద్యోగాలు భర్తీ కావలసి ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖలో కూడా 31శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖల్లో సగటున 25 నుంచి 35 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక సర్వే గణాంకాలు తెలియజేస్తున్నాయి. వేతనాలు పెరిగాయి ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ప్రజలను ఆకర్షించడం కోసం వారికి ప్రైవేటు సంస్థలతో దీటుగా వేతనాలు ఇవ్వాలని ఏడవ వేతన సంఘం సిఫారసు చేసింది.వేతన సంఘం నివేదికకు అనుగుణంగా సిబ్బంది కనీస వేతనం ఏడు వేల రూపాయల నుంచి 18వేలకు పెరిగింది. ఆ మేరకు మిగతా ఉద్యోగులకు కూడా 157 శాతం వరకు జీతాలు పెరిగాయి.2015–16 వరకు ఉద్యోగి వేతనంలో మూల వేతనం 36 శాతం ఉంటేl, కరువు భత్యం 42శాతం వరకు ఉండేది.ఏడో వేతన సంఘం సూచన మేరకు 2016–17 నుంచి మూల వేతనం 66శాతం, కరువు భత్యం 16శాతం అయింది. -
అక్కడ సగం ఉద్యోగాలు ఖాళీ
సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. పలు ప్రభుత్వ శాఖల్లో సగటున 50 ఉద్యోగాలు ఖాళీగా పడిఉన్నాయి. శాఖలవారీగా చూస్తే సిబ్బంది కొరత న్యాయ శాఖలో 87 శాతం ఉండగా, విద్యుత్ శాఖలో 20 శాతం వరకూ సిబ్బంది కొరత వేధిస్తోంది. కీలక శాఖల్లో ఉద్యోగులు కొరవడటంతో పాలన కుంటుపడుతోందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కీలక ప్రాజెక్టుల అమలులోనూ ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి. ఢిల్లీ కాలుష్య కోరల్లో కూరుకుపోయిన క్రమంలో కీలకమైన రవాణా శాఖలో సిబ్బంది కొరత అత్యధికంగా 63 శాతం నెలకొంది. రెవెన్యూ, ఎక్సైజ్, సంక్షేమ, విద్యా, గణాంక, ప్రణాళికా శాఖల్లో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. మౌలిక ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణలో కీలకమైన ప్రజా పనుల శాఖలో 40 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా సేవల ఇన్‌ఛార్జ్‌గా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరిస్తుండటంతో తమ పరిధిలో ఉద్యోగాల భర్తీకి చేసేదేమీ లేదని కేజ్రీవాల్ సర్కార్ చేతులెత్తేస్తోంది. -
అంగన్వాడీ అస్తవ్యస్తం
నిర్మల్అర్బన్ : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల కు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం విస్మరిస్తోంది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఆయా పోస్టులను భర్తీ చేయడంలో జాప్యం చేస్తోంది. దీంతో పలు అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. నోటిఫికేషన్ వెలువడి మూడు నెలలైనా ఇ ప్పటివరకు భర్తీకి నోచుకోలేదు. దీంతో ఖాళీగా ఉన్న కేంద్రాల్లో చిన్నారుల ఆలనాపాలన కరువవుతోంది. ఓ వైపు సిబ్బంది కొరత, మరోవైపు సౌకర్యాల లేమి.. వెర సి రేపటి పౌరుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలోని కొన్ని కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అ ద్దె భవనాల్లో కొన్ని, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. దీంతో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణమే లేకుండా పోతోంది. సరైన గదులు లేక ఇరుకైన, చీకటి గదుల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అంగన్వాడీ సమాచారం అంగన్వాడీ కేంద్రాలు : 816 మినీ అంగన్వాడీలు : 110 నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలు: 242 (టీచర్–55, ఆయా–151, మినీ అంగన్వాడీ టీచర్–36) అద్దె భవనాలు.. అరకొర వసతులు.. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించింది. సొంత భవనాల నిర్మాణం, వసతుల కల్పనను విస్మరించింది. చాలా కేంద్రాలు అద్దె భవనాలు, అరకొర వసతుల మధ్య కొనసాగుతుండగా.. నిత్యం కేంద్రాలకు వచ్చే కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నారులు గాలి, వెలుతురు లేని ఇరుకైన గదుల్లోనే చదువు కొనసాగించాల్సి వస్తోంది. చిన్నారుల ఆట, పాటలకు సరైన వసతులు లేవు. కొన్ని అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం చెల్లించే అద్దె కూడా సక్రమంగా రాకపోవడంతో నిర్వహణ కష్టతరంగా మారుతోంది. దీంతో అంగన్వాడీ టీచర్లు ఇంటి యజమానుల కు అద్దె చెల్లించేందుకు పాట్లు పడుతున్నారు. వివాదంతో నిలిచిన పోస్టుల భర్తీ.. జిల్లా వ్యాప్తంగా 926 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 816 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 110 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో ఆరేళ్లలోపు చిన్నారులు సుమారు 64,335 మంది ఉన్నారు. 7,170 మంది వరకు గర్భిణులు, 6,081 మంది వరకు బాలింతలున్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రతీరోజు గుడ్డు, పౌష్టికాహారాన్ని అందించాలి. పిల్లలకు బాలామృతం, గుడ్లు, పౌష్టికాహారం అందించాలి. వీటితో పాటు చిన్నారులకు కథలు చెప్పాలి. అక్షరాలు నేర్పించాలి. అయితే.. జిల్లాలో 242 అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్తులు ఖాళీగా ఉండడంతో సేవల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటి భర్తీ కోసం అక్టోబర్ 2017లో ప్రభుత్వం నోటిí œకేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ పూ ర్తయి, తుది జాబితా వెలువడింది. అయితే ఇందులో స్థానికేతరులు, అనర్హులకు పోస్టులు కేటాయించారని కొందరు కలెక్టర్ ప్రశాంతికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ విచారణ చేపట్టి మెరిట్ ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మే రకు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. పోస్టు ల నియామకం కలెక్టర్ ఆదేశాల మేరకు తర్వలోనే చేపడతామని జిల్లా మహిళా శిశు సంక్షే మ శాఖ అధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు. -
వర్సిటీల్లో పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 11 విశ్వ విద్యాలయాల్లో త్వరలో చేపట్టనున్న 1,061 అధ్యాపక నియామకాల్లో 100 మార్కుల వెయిటేజీతో స్క్రీనింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెట్/స్లెట్/సెట్ ఉన్న సబ్జెక్టులకు రాత పరీక్ష లేకుండానే వెయిటేజీ ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా ఈ విధానాన్ని సూచించింది. ఈ మేరకు ఈనెల 19న విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య నియామకాల మార్గదర్శకాలను పేర్కొంటూ జీవో 2ను జారీ చేశారు. ఇందులో గరిష్టంగా 50 మార్కులు అకడమిక్ రికార్డులకు, 30 మార్కులు సబ్జెక్టు నాలెడ్జి, టీచింగ్ స్కిల్స్‌కు, 20 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించాలని స్పష్టం చేశారు. నెట్/స్లెట్/సెట్ లేని సబ్జెక్టులకు రాత పరీక్ష నెట్/స్లెట్/సెట్ లేని టెక్నికల్/ఇంజనీరింగ్/ఇతర ప్రత్యేక సబ్జెక్టులకు సంబంధించి మాత్రం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్ష నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. ప్రతి తప్పుడు జవాబుకు పావు మార్కు కట్ చేస్తారు. పరీక్ష సిలబస్, పరీక్ష విధానం గేట్ తరహాలో ఉంటుంది. అయితే ఆ 100 మార్కులకు వాటిని 14 మార్కులకు నార్మలైజ్ చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయా సబ్జెక్టులకు సంబంధించి అభ్యర్థికి పీహెచ్డీ ఉంటే పీహెచ్‌డీకి 7 మార్కులను కేటాయించాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కులను మాత్రం మరో 7 మార్కులకు నార్మలైజ్ చేయాలి. మార్గదర్శకాల్లోని మరిన్ని అంశాలు.. పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశాక, అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రతి యూనివర్సిటీ.. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి సబ్జెక్టు వారీగా స్క్రూటినీ కమిటీలను ఏర్పాటు చేయాలి. అందులో సంబంధిత సబ్జెక్టు డీన్, వైస్ చాన్స్‌లర్ నామినీ, ఇతర యూనివర్సిటీల నుంచి సబ్జెక్టు నిçపుణుడు, ఉన్నత విద్యా మండలి నామినేట్ చేసే సబ్జెక్టు నిపుణుడు, డిపార్ట్మెంట్ హెడ్, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఉండాలి. -
పేరుకే పెద్దది
ఇల్లెందుఅర్బన్(ఖమ్మం), న్యూస్‌లైన్ : పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న చందంగా మారింది సింగరేణి ఇల్లెందు ఏరియా ఆస్పత్రి పరిస్థితి. సంస్థ అభివృద్ధికి అనునిత్యం పాటుపడుతున్న కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు, పాలకులు ఆచరణలో విఫలమవుతున్నారు. ఫలితంగా కార్మికు లు అరకొర సౌకర్యాలు, సదుపాయాలతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళి తే... సింగరేణి పరిధిలోని ఇల్లెందు ఏరియాలో యాజమాన్యం కొన్నేళ్ల క్రితం ఆస్పత్రిని ప్రారంభించింది. అయితే ఆస్పత్రిలో తగినంత మంది డాక్టర్లు, స్పెషలిస్టులు లేకపోవడంతో కార్మిక కుటుంబాలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 7 డాక్టర్లు, 8 మంది నర్సులు, 16 మంది ఫార్మసిస్టులు, ముగ్గురు వార్డుబాయ్‌లు, ఆయాలు ఉన్నారు. అయితే 7గురు వైద్యుల్లో మహిళా డాక్టర్ ఒక్కరే ఉండడంతో కార్మికుల భార్యలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడంతో తమ వద్దకు వచ్చిన గర్భిణులు, ఇతర మహిళలను డాక్టర్లు కొత్తగూడెం ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళా డాక్టర్ మణి సెలవుపెట్టిన రోజుల్లో గైనిక్ సమస్యల తో బాధపడుతున్న మహిళలు ఆస్పత్రికి రా వడం లేదని తెలుస్తోంది. కేవలం జ్వరం, బీపీ, షుగర్‌తోపాటు ఇతర చిన్నచిన్న వ్యాధులకు మినహా ఇక్కడ వేరే జబ్బులకు వైద్యం అందడంలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భం దాల్చిన మహిళలు ప్రసవం కో సం 40 కి.మీల దూరంలోని కొత్తగూడెం ఏరి యా వైద్యశాలకు వెళ్లాల్సి వస్తుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, అనేస్థేషి యా, పిల్లల స్పెషలిస్టు, జనరల్ ఫిజిషియన్, అర్ధోపెడిక్ పోస్టులు ఐదేళ్ల నుంచి ఖాళీగా ఉన్నప్పటికీ వాటి నియామకాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కాగా, గైనకాలజిస్ట్ పోస్టును భర్తీ చేసి, మహిళల అనారోగ్య సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ఎవరూ పట్టించుకోవడంలేదని కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నెలలో రెండు రోజులు మాత్రమే కొత్తగూడెం ఆస్పత్రి నుంచి వివిధ జబ్బులకు సంబంధించిన స్పెషలిస్టులను పిలిపించి కార్మికులకు మొక్కుబడిగా వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం తక్షణమే స్పందించి ఇల్లెందు ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను భర్తీ చేయాలని కార్మికులు కోరుతున్నారు. రక్తం ఉండడం లేదు.. స్థానిక వైద్యశాలలో బ్లడ్ బ్యాంక్ అందుబాటులో ఉన్నా రక్తం ఉండడం లేదని తెలుస్తోంది. గనిలో ఏదైనా ప్రమాదం జరిగితే రక్తం కోసం కొత్తగూడెం ఆస్పత్రికి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉంటుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రోగులు ఉన్న వార్డుల వెనుక భాగంలో చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకునే వారు లేకపోవడం గమనార్హం.