న్యాయ నియామకాల్లో జాప్యం | Sakshi Editorial On Judges Posts In High Courts | Sakshi
Sakshi News home page

న్యాయ నియామకాల్లో జాప్యం

Published Fri, Dec 13 2019 12:02 AM | Last Updated on Fri, Dec 13 2019 12:02 AM

Sakshi Editorial On Judges Posts In High Courts - Sakshi

న్యాయవ్యవస్థ కంఠశోషే తప్ప దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టులు భర్తీ కాకుండానే ఉండిపోతున్నాయని మరోసారి వెల్లడైంది. మొత్తంగా 1,079 హైకోర్టు న్యాయమూర్తుల పదవులుండగా అందులో కేవలం 669మంది న్యాయమూర్తులు...అంటే 62 శాతంమంది మాత్రమే ఉన్నారని, 410 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం వల్ల కేసుల పరిష్కా రంలో ఎంత జాప్యం చోటుచేసుకుంటున్నదో, న్యాయం కోసం ఎదురుచూస్తున్న సాధారణ పౌరులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కేంద్రానికి తెలియనిది కాదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా న్యాయమూర్తుల నియామకం విషయంలో నిర్లక్ష్యమే కనబడుతోంది. సుప్రీంకోర్టు కొలీజి యానికీ, కేంద్రానికీ మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలు ఇటీవలికాలంలో చాలానే ఉన్నాయి. అయినా గత అయిదేళ్లలో చేసిన నియామకాలు గమనిస్తే అంతక్రితం కన్నా ఎంతో కొంత మెరుగనే చెప్పాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరిపోదు. అలహాబాద్‌ హైకోర్టు 60 ఖాళీలతో అగ్రభాగాన ఉండగా, కలకత్తా హైకోర్టులో 32, ఢిల్లీ హైకోర్టులో 23, బొంబాయి హైకోర్టులో 29 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలున్నాయి.

అన్నిటికన్నా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పరిస్థితి మరీ అన్యాయం. అక్కడ 37మంది న్యాయమూర్తులకూ 15మంది మాత్రమే ఉన్నారు. గత జూన్‌లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ కొత్తగా న్యాయమూర్తుల్ని నియమించడంతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్‌ వయసును 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే అవసరమైతే రాజ్యాంగంలోని 128, 224ఏ అధికరణల కింద సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తుల్ని నిర్దిష్ట కాలానికి న్యాయమూర్తులుగా నియమిస్తే పెండింగ్‌ కేసుల బెడద తీరుతుందని సూచించారు. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయమేమిటో తెలియదు. సుప్రీంకోర్టులో మొన్న జూన్‌ నాటికి 58,669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజూ కొత్తగా దాఖలయ్యే కేసుల సంఖ్య కూడా కలుపుకుంటే ప్రస్తుతం అవి మరింతగా పెరిగివుండొచ్చు. తగినంతమంది న్యాయమూర్తులు అందుబాటులో లేని కారణంగా అనేక ముఖ్య మైన కేసుల పరిష్కారం కూడా ఆలస్యమవుతోంది. 

కేసుల్లో చిక్కుకోవడం వల్లనో, న్యాయం కోసం న్యాయస్థానాల్ని ఆశ్రయించడం వల్లనో వాటి చుట్టూ తిరగకతప్పనివారికి ఈ జాప్యం వల్ల కలిగే ఖేదమేమిటన్నది బాగా తెలుసు. తమ కేసు చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉందని, త్వరగా పరిష్కరించాలని కోరే కక్షిదారులకు న్యాయస్థానాలనుంచి ఆశాజనకమైన జవాబు రావడం లేదు. అవి నిస్సహాయ స్థితిలో ఉండటమే అందుకు కారణం. మన దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఏభై ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 1,000 వరకూ ఉంటే...25 ఏళ్లనుంచి పెండింగ్‌లో ఉన్న కేసులు రెండు లక్షలపైనే. సివిల్‌ తగాదాలకు సంబంధించి మొత్తంగా 90 లక్షల కేసులు ఎటూ తెమలకుండా ఉన్నాయి. వీటిల్లో 20 లక్షలకుపైగా కేసుల్లో...అంటే 23 శాతం కేసుల్లో కనీసం సమన్లు కూడా జారీ చేయలేదని గత ఆగస్టులో జస్టిస్‌ గొగోయ్‌ చెప్పారంటే న్యాయమూర్తుల నియామకం సమస్య ఎలాంటి పరిస్థితులకు దారితీస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. క్రిమినల్‌ కేసుల పరిస్థితి ఇంతకన్నా ఘోరం. 2 కోట్ల 10 లక్షల క్రిమినల్‌ కేసుల్లో కోటి వరకూ కేసులు ఇంకా సమన్లు జారీ చేసే దశలోనే ఉన్నాయి. ఈ క్రిమినల్‌ కేసుల్లో 45 లక్షల వరకూ చిన్న తగాదాలకు సంబంధించినవి. ఇది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది.

సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మాత్రమే కాదు... కింది కోర్టుల్లో కూడా న్యాయాధికారుల కొరత తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా 5,000 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఇలా ఎక్కడికక్కడ అన్ని స్థాయిల్లోనూ ఖాళీలుంటే న్యాయం దక్కడం సాధ్యమేనా? ఉన్నత స్థాయి న్యాయస్థానాల్లో పదవుల భర్తీ విషయంలో జరుగుతున్న జాప్యం గురించి కనీసం కొలీజియాన్ని సాకుగా చూపడానికి ఉంది. కానీ జిల్లా కోర్టుల్లోనూ, సబా ర్డినేట్‌ కోర్టుల్లోనూ పూర్తికావాల్సిన నియామకాల మాటేమిటి? దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో నియామక విధానం తెస్తామని రవిశంకర్‌ ప్రసాద్‌ ఇప్పటికే చెప్పారు. ఆ విషయంలో కేంద్రం నుంచి ప్రతిపాదనలు వస్తే సానుకూలంగా స్పందిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ఈమధ్యే అన్నారు గనుక ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందనుకోవాలి. న్యాయ మూర్తుల నియామకంలో చోటు చేసుకుంటున్న జాప్యం కేంద్రం, న్యాయవ్యవస్థల మధ్య నెలకొన్న ఆధిపత్య సమస్య లేదా అహంభావ సమస్య పర్యవసానంగా ఏర్పడిందని కొందరు న్యాయవేత్తలు చెబుతున్నారు. కానీ వీటి పర్యవసానాలు మాత్రం ప్రజలు అనుభవించవలసి వస్తున్నది. ఇది ఎడ తెగకుండా సాగడం సరైంది కాదు. 

న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యం వల్ల ప్రజలకు సకాలంలో న్యాయం దక్కని దుస్థితి ఏర్పడింది. క్రిమినల్‌ కేసుల విచారణ ఏళ్లతరబడి పెండింగ్‌లో పడిపోవడం వల్ల ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న నిరుపేదలు జైళ్లలో గడపవలసి వస్తోంది. కొందరైతే తమ నేరానికి అనుభవిం చాల్సిన శిక్షా కాలానికి మించి జైళ్లలో మగ్గుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు బెయిల్‌ తెచ్చుకుం టున్నారు. అవసరమైన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికాలో పది లక్షలమంది జనాభాకు సగటున 107మంది న్యాయమూర్తులుంటే మన దేశంలో ఆ సంఖ్య పది మాత్రమే. అలాగే అక్కడి న్యాయమూర్తులు సగటున ఏడాదికి 81 కేసులు పరిష్కరిస్తుంటే మన న్యాయమూర్తులు 2,600 కేసులు పరిష్కరిస్తున్నారు. న్యాయమూర్తులపై ఈ స్థాయిలో భారం మోపడం ఎంత మాత్రం న్యాయం కాదు. కనుక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం కదలాలి. న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement