Law system
-
భారతదేశ న్యాయవ్యవస్థలో లింగ సమానత్వానికి నాంది!
భారతీయ సమాజంలోని వివిధ రంగాలలో సమాన హక్కులు అంతుచిక్కని లక్ష్యం. న్యాయవ్యవస్థలో కూడా ఇదే ధోరణి. భారతీయ న్యాయ వ్యవస్థలోని మహిళల ప్రాతినిధ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే, మగవారి ఆడవారి మధ్యలో ఉన్న అసమానత్వం స్పష్టమైన చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. పైగా ఇందులో మార్పు అత్యంత అవసరం అనే విషయాన్ని నొక్కి చెబుతుంది. అత్యున్నత న్యాయస్థానంలో 36 మంది న్యాయమూర్తులలో కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు. ఈ అసమానత అత్యున్నత న్యాయస్థానానికి మాత్రమే పరిమితం కాదు. ఇది హైకోర్టుల వరకు వ్యాపించింది, ఇక్కడ వెయ్యి మంది న్యాయమూర్తులలో కేవలం 96 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. జిల్లా న్యాయవ్యవస్థలో కూడా పరిస్థితి మెరుగుపడలేదు. 3.3 లక్షల మంది న్యాయమూర్తులకు న్యాయ అధికారులలో కేవలం 6% మంది మహిళలు ఉన్నారు. భారతదేశంలోని విస్తృత చట్టపరమైన ల్యాండ్‌స్కేప్‌లో 15% కంటే తక్కువ మంది మహిళలు న్యాయవాదులు ఉన్నారు. ఈ నిరుత్సాహపరిచే అసమానతకు దోహదపడే కారకాలు చాల ఉన్నాయి. అవి చాలా లోతుగా పాతుకుపోయాయి. ఇప్పటికి సామాజిక పక్షపాతాలు, నిబంధనలు న్యాయవాద వృత్తిని కొనసాగించకుండా మహిళలను నిరుత్సాహపరుస్తున్నాయి. దానితో పాటు చట్టపరమైన విద్య కూడా చాల తక్కువ అవకాశాలు ఉంటున్నాయి. న్యాయవాద వృత్తిలో ఆదాయం చాలా మారవచ్చు. ఇది న్యాయమూర్తులు కావాలనుకునే మహిళా న్యాయవాదులకు కష్టతరం చేస్తుంది. న్యాయనిర్ణేతగా మారడం వారికి కష్టంగా ఉంటుంది. ఇలా చాల సవాళ్లు ఉన్నాయి. కానీ దాంతో పాటు ఆశ కూడా మిగిలి ఉంది. మాజీ, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తులు కోర్టులలో చాల సార్లు మహిళలకు పదోన్నతులు కల్పించారు. ఇలాంటి పరిస్థితిలో చట్టపరమైన రంగంలో లింగ సమానత్వం కోసం ప్రయత్నాలు మరింత ముఖ్యమైనవిగా ఉండాలి. మెరుగైన మహిళా ప్రాతినిధ్యానికి స్థిరమైన లక్ష్యం, విధానం అవసరం. ఈ మొదటి అడుగు ప్రశంసనీయమే కానీ నిజమైన సమానత్వం కోసం ప్రతి ఒక్కరి కృషి అవసరం. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, పౌర సమాజం అందరు కలిసి పనిచేయాలి. ఇటీవలే, అస్సాం, జమ్మూ కాశ్మీర్లో మహిళా కమిటీని ఏర్పాటు చేయడం వంటి చర్యలు చూసి, కోర్టులు మహిళా న్యాయానికి కట్టుబడి ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇలాంటి చర్యలు సమాన హక్కులు గూర్చి లోతైన కారణాలపై పోరాడటానికి న్యాయస్థానాలు తమ బాధ్యతను అంగీకరిస్తాయని చూపిస్తుంది. కొంతకాలం క్రితం, భారతదేశ సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆగస్ట్ 7న మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితి గురించి ప్రకటన చేసారు. ఈ సమస్యను పరిశీలించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బృందానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వం వహించారు. ఇది ఒక కొలిక్కి రావాలంటే ఈ తరహా సహాయం ఆయన చేయాలనీ సుప్రీంకోర్టు గ్రహించింది. కాబట్టి, వారు సహాయం చేయడానికి మొత్తం మహిళల కమిటీని రూపొందించడానికి తమ ప్రణాళికను పంచుకున్నారు. ఈ ఏర్పడిన కమిటీలో ఉన్నత న్యాయస్థానాల నుంచి ముగ్గురు ప్రముఖ మాజీ న్యాయమూర్తులు ఉంటారు. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గీతా మిట్టల్ కమిటీకి నాయకత్వం వహిస్తారు. ఇతర కమిటీ సభ్యులు జస్టిస్ షాలినీ ఫన్సల్కర్ జోషి (బాంబే హైకోర్టు నుంచి పదవీ విరమణ చేసారు), జస్టిస్ ఆశా మీనన్ (గతంలో ఢిల్లీ హైకోర్టు నుండి పనిచేశారు). సహాయక చర్యలను పర్యవేక్షించడం, ప్రార్థనా స్థలాలు, గృహాలను పునరుద్ధరించడం, సహాయక చర్యలను మెరుగుపరచడం తోపాటు మరిన్ని బాధ్యతలు కమిటీకి ఉంటాయి. మే నుంచి జులై వరకు జరిగిన హింసాత్మక సంఘటనల గురించి పరిశోధన చేయడానికి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దత్తాత్రయ్ పద్సాల్గికర్ను నాయకత్వం వహించడానికి ఎంపిక చేసారు. పద్సల్గికర్ ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, నాగాలాండ్‌లో పనిచేశాడు. ఈ కేసుల కోసం మణిపూర్‌లో 6500 పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కానీ, న్యాయవ్యవస్థలో లింగ సమానత్వాన్ని సాధించడానికి సమయం పడుతుంది. మహిళలకు మాత్రమే న్యాయస్థానాలను సృష్టించడం, మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడడం తదితరాలు సానుకూల అభివృద్ధి. కానీ, నిజమైన పురోగతికి మరిన్ని మార్పులు అవసరం. న్యాయవాద వృత్తిలో మహిళలకు మరింత అధికారం ఇవ్వడం ముఖ్యం. చట్టంలో మహిళలపై అన్యాయమైన నమ్మకాలను తొలగించడం చాలా కీలకం. మహిళలు ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నిర్ధారించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ మార్పుల కోసం నిరంతర శ్రద్ధ, కృషి అవసరం. ఇలాంటి కార్యక్రమాలతో మనం స్థిరంగా కొనసాగితే, న్యాయవ్యవస్థలో మహిళలు తమ స్థానాలను సక్రమంగా చేపట్టేందుకు చాల గొప్ప అవకాశం ఉంటుంది. దీని వల్ల న్యాయ వ్యవస్థలో మహిళలకు పెద్ద పాత్ర ఉంటుంది. వైవిధ్యమైన న్యాయ వ్యవస్థ బలంగా, న్యాయంగా ఉండవచ్చు. భారతదేశ న్యాయ వ్యవస్థలో స్త్రీలను, పురుషులను సమానంగా చూడటం ముఖ్యం. మనమందరం మహిళల అభిప్రాయాన్ని ఎక్కువగా వినడానికి, చూడటానికి సహాయం చేస్తే, పరిస్థితులు మారవచ్చు. పురుషులు, మహిళలు ఒకే విధంగా పరిగణించే భవిష్యత్తును సృష్టించడానికి ప్రయాస పడాలి. -డాక్టర్ శ్రీదేవి రెడ్డి గాధే, సీనియర్ హైకోర్టు అడ్వకేట్(అభిజ్ఞా భారత్ ఆర్గనైజేషన్ ఫౌండర్) -
న్యాయం’పై నెతన్యాహూ కక్ష
అంతా అనుకున్నట్టే అయింది. గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిసెంబర్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ న్యాయవ్యవస్థపై కత్తిగట్టారు. ఆ వ్యవస్థలో సంస్కరణల పేరిట దాని అధికారాలు తెగ్గోసేందుకు సిద్ధపడ్డారు. కొన్ని నెలలక్రితం నెతన్యాహూ నాయకత్వంలోని లికుడ్ పార్టీకి ఎగబడి ఓట్లేసిన జనమే ఇప్పుడు న్యాయవ్యవస్థ రక్షణ కోసం వీధుల్లోకొచ్చారు. పార్లమెంటు వెలుపల అయి దారు రోజులుగా ఎడతెగకుండా నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. వీటన్నిటినీ బేఖాతరు చేస్తూ చట్టసభలో న్యాయసంస్కరణల బిల్లు ప్రాథమిక స్థాయిలో విజయం సాధించింది. సోమవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 63 ఓట్లు, వ్యతిరేకంగా 47 వచ్చాయి. నెతన్యాహూ నేతృత్వంలోని అతి మితవాద, మత, ఛాందసవాద కూటమి ప్రభుత్వం పార్లమెంటులోని 120 స్థానాల్లో 64 గెల్చుకుంది. రాగల నెలల్లో న్యాయ సంస్కరణల బిల్లు మరో రెండు దశలు దాటాలి గనుక ఇప్పటికిప్పుడే అంతా అయిపోయినట్టు కాదు. అయితే అధికార కూటమి వరస చూస్తుంటే ఏదేమైనా చట్టం చేసితీరాలన్న పట్టుదల కనిపిస్తోంది. ప్రచార సమయంలోనే నెతన్యాహూ తాము అధికారంలోకొస్తే న్యాయవ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తామని ఒకటికి పదిసార్లు ప్రకటించారు. దేశ శ్రేయస్సు కోసం చట్టాలు చేస్తుంటే సుప్రీంకోర్టు కొట్టివేస్తున్నదని, ఇందువల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతోందని ఆయన భావన. అంతే కాదు... న్యాయవ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వా నిది పైచేయిగా ఉండాలన్నది ఆయన కోరిక. నెతన్యాహూ సుభాషితాల వెనకున్న అంతరార్థం వేరు. ఆ వ్యవస్థ తమకు సాగిలపడివుండాలన్నదే ఆయన మాటల్లోని సారాంశం. తాజా బిల్లు చట్టమైతే సుప్రీంకోర్టు కొట్టేసిన నిర్ణయాన్ని పార్లమెంటు తిరగదోడొచ్చు. కనీస మెజారిటీతో...అంటే పార్లమెంటులోని 120 మంది సభ్యుల్లో 61 మంది కాదంటే సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేయొచ్చు. దేశ రాజ్యాంగంగా ఉండే మౌలిక చట్టంలోని అంశాలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టునుంచి తొలగించటం మరో ప్రతిపాదన. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయ వర్గానిదే పైచేయి కావడం మూడో ప్రతిపాదన. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు సభ్యులుగా ఉండే నియామకాల కమి షన్ పనిచేస్తోంది. ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించటం ఆనవాయితీగా వస్తున్నా న్యాయవ్యవస్థ ప్రతినిధుల ఆధిక్యత ఉన్నందువల్ల చాలాసార్లు ఆ వ్యవస్థ నిర్ణయమే అంతిమంగా అమలవుతోంది. ఇప్పుడు చేసిన ప్రతిపాదన దాన్ని తారుమారు చేస్తుంది. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న అతి ఛాందసవాద యూదు పార్టీలు తమ మతంలోని యువకులను నిర్బంధ సైనిక శిక్షణనుంచి తప్పించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఆ చట్టం తీసుకొస్తే సమాన న్యాయం పేరిట సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్న భయాందోళనలు ఆ పార్టీలకున్నాయి. అందుకే ఆ పార్టీలు గట్టిగా మద్దతునిస్తున్నాయి. మరో కీలకమైనది పాలస్తీనా సమస్య. పాలస్తీనా పౌరులను ఎంతగా ఇబ్బంది పెడితే అంతగా యూదుల్లో తమకు మద్దతు పెరుగుతుందని దాదాపు అన్ని పార్టీలూ భావిస్తాయి. యూదుల్లో జాతీయ భావాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం వాటికి అలవాటుగా మారింది. ఒకపక్క ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలన్న డిమాండ్ ప్రపంచ దేశాలన్నిటి నుంచీ వస్తుంటే ఆ ఆక్రమణలను మరింత పెంచుకోవటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పాలక పక్షాలు పని చేస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం ఈ ఆక్రమణలు చట్టవిరుద్ధమైనవి. అయినా అవి ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం వెస్ట్‌బ్యాంకు, తూర్పు జెరూసలెంలలో ఆక్రమిత భూభాగాల్లో దాదాపు ఏడున్నర లక్షలమంది ఇజ్రాయెల్ పౌరుల ఆవాసాలున్నాయి. వీటిని మరింత పెంచుకోవాలంటే సుప్రీంకోర్టు అడ్డంకిని తొలగించుకోవాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు. న్యాయసంస్కరణల బిల్లుకు జనంలో పెద్దయెత్తున వ్యతిరేకత రావటం చూసి దేశాధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ఈ బిల్లుపై విపక్షాలతో చర్చించాకే తదుపరి చర్యలుండాలని హితవు పలికారు. అయితే నెతన్యాహూకు ఇది రుచించలేదు. విపక్షాలతో చర్చలకు సిద్ధమే అయినా చట్టం తీసుకురావటం ఖాయమని న్యాయశాఖ మంత్రి చెప్పారంటేనే ప్రభుత్వ సంకల్పం ఏమిటో అర్ధమవుతోంది. ఇప్ప టికే మూడు అవినీతి ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహూ శిక్షపడే ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి ఈ బిల్లును తెచ్చారన్నది విపక్షాల ప్రధాన ఆరోపణఇజ్రాయెల్కు నిర్దిష్టమైన రాజ్యాంగం లేదు. ఫెడరల్ వ్యవస్థ లేదు. దేశానికంతకూ ప్రాతినిధ్యంవహించే పార్లమెంటు నిర్ణయమే అంతిమం. ఇందువల్ల పార్లమెంటులో బలాబలాలే అన్నిటినీ నిర్ణయిస్తాయి. ఈ స్థితిలో కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయాలను సమీక్షించి సమతుల్యత సాధించే మరో వ్యవస్థ ఎంతో అవసరం. ఆ పాత్రను సుప్రీంకోర్టు సమర్థవంతంగా పోషిస్తోంది. దేశ జనాభా 90 లక్షలమందిలో అయిదోవంతుమంది అరబ్బులు. మరో 30 లక్షలమంది పాలస్తీనా పౌరులు వెస్ట్‌బ్యాంక్‌లో నివసిస్తున్నారు. వీరందరి ప్రయోజనాలనూ, శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని నిర్ణ యాలు చేయాల్సిన నేపథ్యంలో మెజారిటీవాదమే చెల్లుబాటు కావాలనుకోవటం ఆత్మహత్యాసదృశమవుతుంది. స్వప్రయోజనాల కోసం దేశాన్నే పణంగా పెట్టిన నేతగా చరిత్రలో నిలుస్తారో, జనాభి ప్రాయానికి తలొగ్గుతారో నెతన్యాహూ తేల్చుకోక తప్పదు. -
పారదర్శకతే న్యాయవ్యవస్థకు ప్రాణం
శ్రీరాజ్యవ్యవస్థకు ఉండే సంపన్న వర్గ స్వభావం న్యాయవ్యవస్థకు కూడా ఉంటుందని ఒకప్పటి కేరళ సీఎం, మార్క్సిస్టు నాయకుడు నంబూద్రిపాద్ వ్యాఖ్యానించారు. ఒక్క సంపన్న వర్గ స్వభావం మాత్రమే కాదు... కుల వ్యవస్థ లోతుగా పాతుకుపోయిన మన దేశంలో రాజ్య వ్యవస్థలో భాగంగా ఉన్న న్యాయ వ్యవస్థకు ఆధి పత్య కుల స్వభావం కూడా ఉంటుందనేది కూడా మౌలిక సత్యం. ఆ వ్యవస్థ నిర్భయంగా, పక్షపాతరహితంగా, పారదర్శకంగా, స్వతం త్రంగా వ్యవహరించాలని నూటికి 80 మందిగా ఉన్న బహుజనులు కోరుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కొన్ని పత్రికల్లో పతాక శీర్షికలు అయ్యాయి. ‘న్యాయవ్యవస్థపై ఎవరికైనా విశ్వాసం లేకపోతే పార్లమెంటుకు వెళ్లి హైకోర్టును మూసేయాలని కోరవచ్చున’న్నది వాటి సారాంశం. ప్రజాస్వామ్యం మూడు స్తంభాలపై ఆధారపడి వుందని, న్యాయం అనే స్తంభం బలహీనమైతే అది అంతర్యుద్ధానికి దారితీస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించిందని కూడా పత్రికలు రాశాయి. ఈ వ్యాఖ్యలు అసాధారణమైనవి. హైకోర్టుపై ప్రచార మాధ్యమాల్లో వెలువడుతున్న బహిరంగ వ్యాఖ్యలు, విమర్శలపై ధర్మాసనం ఇలా స్పందించిందని ఆ వార్తల సారాంశం. వాస్తవంలో న్యాయవ్యవస్థ బలహీనమైపోలేదు. నిస్సహాయ స్థితిలో పడనూలేదు. ‘రాష్ట్రంలో చట్టబద్ధ పాలన(రూల్ ఆఫ్ లా) సరిగ్గా అమలు జరగడం లేదు. అది జరగకపోతే మేమే ఇతర నిబంధనల ప్రకారం అధికారాన్ని వినియోగిస్తామ’ని ధర్మాసనం అనడమే అందుకు నిదర్శనం. రాజ్యవ్యవస్థలో భాగమైన మూడు వ్యవస్థలు– శాసన, కార్య నిర్వాహక, న్యాయవ్యవస్థల్లో న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం ప్రకారం విశేషమైన స్థానం వుంది. అధికారాలు కూడా వున్నాయి. శాసనవ్యవస్థ చేసిన చట్టం రాజ్యాంగవిరుద్ధమని భావిస్తే, ఆ చట్టాన్ని కొట్టివేసే సమీక్షా ధికారం న్యాయవ్యవస్థకు వుంది. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టును మూసివేయడం అనే ప్రశ్నే తలెత్తకూడదు. ఆ తరహా వ్యాఖ్య ధర్మాసనం నుంచి రాకూడదు. న్యాయవ్యవస్థ అనేది ప్రజల అవసరం. ప్రధానంగా బలహీన వర్గాలకు దాని అవసరం ఎంతో వుంది. దేశంలో మిగిలిన రెండు వ్యవస్థలూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో తమకు జరిగే అన్యాయాన్ని సరిదిద్దడానికి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చును అనే భావం అందరిలో ఏర్పడింది. రాజ్యాంగాన్ని, చట్టాన్ని, ప్రజల హక్కులనూ పరి రక్షిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులూ, తీర్పులూ జారీ చేసినప్పుడల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు. అందుకు భిన్నమైన తీర్పులు వెలువడినప్పుడు ఆమోదించ లేకపోతున్నారు. భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే అవి ఉద్దే శాలు ఆపాదించేలా వుండకూడదు. అలా చేస్తే చర్య తీసుకోవడానికి కోర్టు ధిక్కార చట్టం వుండనే వుంది. విమర్శల విషయంలో న్యాయమూర్తులు సంయమనంతో, ఉదాత్తంగా వ్యవహరించాలనే భావన కూడా సుప్రీంకోర్టు పలు సంద ర్భాల్లో వ్యక్తం చేసింది. ప్రజాభిప్రాయమే సుప్రీం ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే న్యాయ మూర్తులు ఇచ్చే తీర్పులు నూటికి నూరుపాళ్లూ న్యాయబద్ధంగా వుంటున్నాయని చెప్పలేం. అవి తప్పనిసరిగా సామాజిక ప్రయో జనం కలిగి వున్నవేనని కూడా ఆమోదించలేం. కనుకనే దిగువ కోర్టులు ఇచ్చే ప్రతి తీర్పునీ పై కోర్టులు ఖాయం చేయటం లేదు. అందుకు ఉదాహరణలు కోకొ ల్లలు. సుప్రీంకోర్టు తీర్పును అంతిమ తీర్పుగా భావించడానికి కారణం అంతకుమించిన పై కోర్టు దేశంలో లేకపోవడమే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్త ర్వులూ, తీర్పులపైన ప్రస్తుతం ప్రజల్లో విస్తృతమైన చర్చే జరుగు తోంది. చర్చను తప్పుపట్టవల సిన అవసరం లేదు. అది ప్రజల జ్ఞానానికి, చైతన్యానికి నిదర్శనం కావొచ్చును. ఆంధ్రప్రదేశ్‌లో అధి కార పార్టీ, ప్రతిపక్షాల మధ్య పరి స్థితి అగ్గిమీద గుగ్గిలంలా వుంది. మరోవైపు ప్రతిపక్ష స్థానం కోసం టీడీపీ, బీజేపీల మధ్య వున్న పోటాపోటీ అగ్నికి ఆజ్యం పోస్తోంది. మరి ఈ ఉత్తర్వుల మాటేమిటి? అయితే కొన్ని ఉత్తర్వులు చట్టపరంగా లేవని సద్విమర్శలు చేయడం కూడా తప్పనిసరి అవుతోంది. ఉదాహ రణకు రాజధాని ప్రాంతంలో భూముల బదిలీకి సంబంధించిన తుళ్లూరు మాజీ తహసీల్దార్ కేసులో అసలు దర్యాప్తే జరప రాదని హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు ఆమోదించలేదు. వారంరోజులు గడువు ఇచ్చి తేల్చ వలసిందిగా హైకోర్టును సుప్రీం కోర్టు కోరింది. అలాగే గత అడ్వొ కేటు జనరల్‌తో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెలు నిందితులుగా వున్న ఏసీబీ ఎఫ్ఐఆర్ కేసులో కూడా అసలు దర్యాప్తే జరపవద్దని ఉత్త ర్వులు జారీ చేయడం అసాధా రణం. అదే ఉత్తర్వులో మాజీ అడ్వొకేట్ జనరల్‌తోపాటు అసలు కోర్టు ముందుకు రాని నిందితులపై కూడా ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదని చెప్పడం మరింత అసాధారణం. ఇందుకు దారితీసిన అసాధారణ పరిస్థితులు ఏమిటో ఆ ఉత్త ర్వులో హైకోర్టు చెప్పలేదు. అలాంటి ఉత్తర్వులపై సహజంగానే ప్రజల్లో చర్చ జరగుతుంది. అందునా రాజధాని వ్యవహారంతో ముడిపడి వున్న కేసులు గనుక ఆ చర్చ ఉద్రేకపూరితంగా కూడా వుంటుంది . ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నదనే ప్రచారం నడుస్తున్న మాట వాస్తవం. హైకోర్టు రాజ్యాంగ ప్రకారం తీర్పులు ఇవ్వడం తప్ప అవి ప్రభుత్వానికి వ్యతిరేకమా, అనుకూలమా... వాటిని ప్రతిపక్షాలు ఎలా వినియోగించుకుంటాయి అనేది న్యాయస్థానానికి ఉండకపోవచ్చు. అయితే రాజకీయ పార్టీలు తీర్పులను, న్యాయమూర్తుల వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే వుంటాయి. కనుకనే ఇటీవల హైకోర్టు ధర్మాసనం చేస్తున్న వ్యాఖ్యలు పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయి. అలా చేయడంలో ఆ పత్రికలకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవని భావించగలమా? వాటి వెనక రాజకీయ నాయ కుల ప్రయోజనం ఉండదని అనుకోగలమా? ఈ నేపథ్యంలోనే ఈమధ్య ఒక నిర్మాణాత్మకమైన వచ్చింది. న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు తీర్పులో భాగం చేయాలన్నదే దాని సారాంశం. మన దేశంలో న్యాయవ్యవస్థను, ఆ మాటకొస్తే అన్ని వ్యవస్థలనూ స్వప్రయోజనాలకోసం ఉప యోగించుకునే ఆధిపత్య కులాలు, సంపన్న వర్గాలు, పార్టీలు లేకపోలేదు. అధికారంలో వున్నప్పుడూ, లేనప్పుడూ కూడా రాజ్యాంగ వ్యవస్థల్లో తమ ఏజెంట్లను ఎలా చొప్పించి ఉంచాలో ఈ వర్గాలకి బాగా తెలుసు. కనుకనే చుండూరు, అంతకుముందు కారంచేడు కేసుల్లో తీర్పులు అలా వచ్చాయి. కారంచేడు కేసులో కింది కోర్టు విధించిన శిక్షలను సుప్రీంకోర్టు ఖరారు చేసింది. ఇక రిజర్వేషన్లపై సీలింగ్ వ్యవహారం కూడా అంతే. ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు సీలింగ్ విధించింది. కానీ ఆర్థికంగా బలహీనవర్గాల పేరిట 10 శాతం రిజర్వేషన్లు 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అదనంగా కల్పించి, ఆ రిజర్వేషన్లను 60 శాతానికి పెంచినప్పుడు మాత్రం అది స్టే ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇక ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకంలో సామాజిక న్యాయం మచ్చుకైనా కనిపించదు. రాజ్యాంగ పీఠికలోనే మూడు లక్ష్యాలు– సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను మన రాజ్యాంగ నిర్మాతలు ప్రస్తావించారు. మొదటగా చెప్పిన సామాజిక న్యాయం ఎందుకు అమలు కావడం లేదు? రాజ్యాంగ వ్యవస్థలో న్యాయవ్యవస్థ అంతర్భాగం కనుక రాజ్యవ్యవస్థకు వుండే సంపన్న వర్గ స్వభావం న్యాయవ్యవస్థకు కూడా ఉంటుందని ఒకప్పటి కేరళ ముఖ్యమంత్రి, మార్క్సిస్టు నాయకుడు నంబూద్రిపాద్ వ్యాఖ్యానించారు. ఒక్క సంపన్నవర్గ స్వభావం మాత్రమే కాదు... కుల వ్యవస్థ లోతుగా పాతుకుపోయిన మన దేశంలో రాజ్య వ్యవస్థలో భాగంగా వున్న న్యాయవ్యవస్థకు ఆధిపత్య కుల స్వభావం కూడా ఉంటుందనేది కూడా మౌలిక సత్యం. ఆ వ్యవస్థ నిర్భయంగా, పక్షపాతరహితంగా, పారదర్శకంగా, స్వతంత్రంగా వ్యవహరించాలని నూటికి ఎనభైమందిగా వున్న బహుజనులు కోరుకుంటున్నారు. వ్యాసకర్త హైకోర్టు న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ ‘ మొబైల్ : 98498 5656 శ్రీ తాను పవిత్రమైన పునాదులపై నిలిచి ఉన్నట్లుగా తనకు తానుగా భావిస్తున్న భ్రమలనుంచి భారత న్యాయవ్యవస్థ బయటకు రావలసిన సమయం ఆసన్నమైంది. ఈ నిజాన్ని చెప్పడంవల్ల మన ప్రజాస్వామ్యం అంతమైపోదు. పైగా, అది ప్రజాస్వామ్య పునాదులను బలంగా నిలపగలుగుతుంది. రాజ్యాంగంలోని విభాగాల్లో ప్రజలకు అత్యంత తక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవ్యవస్థ తనలోని లోటుపాట్లపై ఇకనైనా తనిఖీకి, దర్యాప్తుకు అవకాశం ఇవ్వడం ద్వారానే మన ప్రజాస్వామ్యం గుబాళిస్తుంది. డిస్నీ మూవీ జంగల్ బుక్ (1967)లో ఒక ఆసక్తికరమైన దృశ్యం ఉంది. కా అనే పేరున్న ఒక కొండచిలువ అందులో ప్రధాన పాత్ర అయిన మౌగ్లీని బొంగురు గొంతుతో వశీకరణకు గురి చేస్తుంది. ‘నేను క్లిష్ట సమయాల్లో సాయం చేయని నీ స్నేహితుల్లాంటి దాన్ని కాను నీవు నన్ను నమ్మవచ్చు నన్ను నమ్ము, నన్ను మాత్రమే నమ్ము కళ్లు మూసుకో, నాపై నమ్మకం ఉంచు నీ చుట్టు నేను ఉన్నాననే ఎరుకతో.. ప్రశాంతంగా, గాఢంగా నిద్రపో’ మౌగ్లీ ప్రత్యర్థి పక్షంలో ఉండే కా ది ఒక సంక్లిష్ట పాత్ర. ఒక అరేళ్ల బాలిక కళ్లు విప్పార్చి ఈ ప్రామాణిక కార్టూన్ మూవీని చూస్తున్నప్పుడు పై పాటలో చెప్పినదానికి భిన్నంగా ఆ కొండచిలువను నమ్మకూడదని స్పష్టంగా అనిపిస్తుంది. అందునా ప్రశ్నించడానికి వీలులేని విశ్వాసాన్ని కలిగి ఉండాలని చెప్పే జీవిని అసలు నమ్మకూడదనే సహజానుభూతి ఆ సినిమా చూస్తున్నంతవరకు మీకు కలుగుతూ ఉంటుంది. మన ప్రజాస్వామిక వ్యవస్థలోని అత్యంత శక్తివంతమైన విభాగం అదే రీతిలో మనల్ని కోరుతోంది. పైగా చట్టంగా దానికి పవిత్రతను కల్పించి, కోర్టు వ్యవహారాల నేర ధిక్కరణగా పేర్కొంటూ ఆయుధంగా మలిచింది. దాన్ని ఇష్టానుసారం వినియోగిస్తున్న చరిత్ర వున్నా కోర్టు ధిక్కరణ భావన నిలకడగా కొనసాగుతూనే వుంది. ఇది న్యాయస్థానాన్ని పరిరక్షించుకునేందుకుగానీ, న్యాయమూర్తుల ప్రతిష్టను దెబ్బతీసే, దూషించే వ్యాఖ్యలనుంచి రక్షించుకునేందుకుగానీ ఉద్దేశించిన చట్టం కాదని సుప్రీంకోర్టు పదే పదే చెబుతూ వస్తోంది. అది కేవలం న్యాయవ్యవస్థ నిజాయితీగా, నిష్పక్షపాతంగా వుంటుందని... దానిద్వారా తమకు న్యాయం లభిస్తుందని పరంపరగా ప్రజల్లో వుండే విశ్వాసానికి విఘాతం కలగకుండా చూసేందుకు మాత్రమేనని నొక్కి చెబుతూ వచ్చింది. అయితే ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ని కోర్టు ధిక్కార చర్యకింద దోషిగా ప్రకటించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల ఆగ్రహం, ఖండనలు సహజంగానే వెలువడ్డాయి. కోర్టు ధిక్కారం ఎంత వక్రీకరణలకు గురవుతోందో వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణకు సంబంధించి మనకున్న ప్రాథమికహక్కుకు అది ఎంత భంగకరంగా మారిందో చెప్పడానికి దీనికి మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. సుప్రీంకోర్టు పెంచిపోషించిన కోర్టు ధిక్కారం అనే భావన మొత్తం న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్నే దెబ్బతీస్తోంది. కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజా విశ్వాసం దెబ్బతినేలా చేయడం సమంజసమేనా? స్వయంగా సుప్రీంకోర్టు 1995లో ఒక తీర్పు సందర్భంగా ఇదే విషయమై హెచ్చరించిందని మర్చిపోరాదు. ఈ 21వ శతాబ్ది ప్రజాస్వామ్యంలో ఏ న్యాయవ్యవస్థ అయినా సరే తనపై పౌరుల నమ్మకమే అంతరించిపోయేలా ఇలాంటి అస్పష్టమైన, నిరంకుశ దృక్పథాలను కలిగి ఉండటమే పెద్ద అసంగతమైన విషయం. తన మౌలిక పునాదుల్లో ప్రజా విశ్వాసానికి అగ్రస్థానం ఇస్తున్నట్లు న్యాయవ్యవస్థ చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్నది జవాబుదారీతనం లేని, పారదర్శకతలేని, ప్రజాప్రాతినిధ్యం ఏమాత్రం లేని తరహాలో న్యాయవ్యవస్ద పనితీరు కొనసాగటమే. న్యాయవ్యవస్థను పీడిస్తున్న రెండు ప్రధాన సంస్థాగత అంశాలను చర్చించడం ద్వారా దానిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పరిరక్షించాలని ప్రకటిస్తున్న కోర్టుధిక్కార చట్టానికి సంబంధించిన తాత్విక పునాదే ఇప్పుడు సమస్యాత్మకంగా ఎలా మారిపోయిందన్న విషయాన్ని ఇక్కడ ఎత్తిచూపడానికి ఈ కథనం ప్రయత్నిస్తోంది. మొదటిది. సమగ్ర డాక్యుమెంటేషన్, న్యాయవిచారణ క్రమాలను నిక్షిప్తం చేయడం అనే ప్రాథమిక ప్రక్రియలోనే న్యాయవ్యవస్థ ఎలా విఫలమవుతోందన్ని అంశాన్ని ఈ కథనం శోధిస్తుంది. ఇలాంటి రికార్డులు ఉనికిలో లేకపోవడం వల్ల న్యాయవ్యవస్థ తప్పులకు జవాబుదారీతనం లేకపోవడం, వెనుకబడిన ప్రజానీకానికి న్యాయం జరగకుండా అడ్డుకోవడం సులభంగా జరిగిపోతోంది. రెండు. జవాబుదారీతనం నుంచి న్యాయ కార్యాలయాలు వేరుపడిపోతున్నాయనే అంశాన్ని ఈ కథనం పరిశీలిస్తుంది. కోర్టు రికార్డులు ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కార విచారణ ద్వారా వెలుగులోకి వచ్చిన న్యాయవ్యవస్థకు సంబంధించిన బాధాకరమైన వాస్తవాల్లో ఒకటి ఏదంటే, కోర్టు విచారణలకు సంబంధించిన సమగ్రమైన రాతప్రతులు, రికార్డులు లేకపోవడం. భారత రాజ్యాంగం ప్రకారం కోర్టు రికార్డులు అనే ప్రాతిపదికనే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టులు కానీ కోర్టు ధిక్కారచర్యలకు గాని శిక్షించే అధికారాన్ని కలిగి ఉన్నాయి. కోర్టు రికార్డులు అంటే సాక్ష్యాలను డాక్యుమెంట్ రూపంలో భద్రపర్చే న్యాయచర్యలు, ప్రక్రియలు. ఈ రికార్డులే న్యాయస్థానాల ముందు విచారణ ప్రక్రియలకు సాధికారిక పత్రాలవుతాయి. కోర్టు రికార్డులు అని చెబుతున్నవి వాటి నిజమైన అర్థంలో కోర్టులకు అందుబాటులో ఉండటం లేదని ప్రశాంత్ భూషణ్ కేసులో సాగిన న్యాయప్రక్రియ సాక్ష్యాధారమై నిలిచింది. భూషణ్ కౌన్సిల్ సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దావే మౌఖికంగా చెప్పిన అనేక అంశాలకు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల్లో కానీ ఆదేశాల్లో కానీ చోటు లేకుండా పోయింది. ఇది న్యాయస్థానాన్ని బాగా ఇబ్బందిపెట్టింది. కోర్టు విచారణలను (ఆడియో రికార్డింగు, లైవ్ ట్రాన్స్క్రిప్షన్) సమగ్రంగా డాక్యుమెంట్ చేయగలిగిన సాంకేతిక సాధనాలు దశాబ్దాలుగా అందుబాటులో ఉంటున్నప్పటికీ ఈ విషయంలో న్యాయవ్యవస్థ వైఫల్యం కనబడుతోంది. ఇతర దేశాల న్యాయవ్యవస్థలతో పోలిస్తే భారత న్యాయవ్యవస్థ డాక్యుమెంటేషన్‌కి సంబంధించి సమర్థ వ్యవస్థలను చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీనికి సంబంధించి మీడియా పాత్రను ప్రశంసించడానికి బదులుగా న్యాయస్థానాల్లో మీడియా ఉనికినే కోర్టు వ్యతిరేకిస్తోందన్నది వాస్తవం. లాక్ డౌన్ కాలంలో మీడియాకు ఆన్ లైన్ విచారణలను అందించే ఏర్పాట్లు కల్పించడంలో సుప్రీంకోర్టు విఫలమైంది. సుప్రీంకోర్టు ఆవరణలోని మీడియా రూమ్లనుంచి న్యాయ విచారణను పరిశీలించడానికే జర్నలిస్టులను పరిమితం చేశారు. మీడియా పదేపదే అభ్యర్థించినప్పటికీ న్యాయవిచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తగిన లింకులను కోర్టు అందించలేదు. పైగా జర్నలిస్టులకు కోర్టు నుంచి అనుకోని విమర్శలు ఎదురయ్యాయి. 2020 ఆగస్టు 25న జరిగిన ఒక విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా లీగల్ న్యూస్ పోర్టల్స్‌లో ఏకపక్ష రిపోర్టింగు గురించి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ అలాంటి రిపోర్టింగు గురించి నిర్దిష్ట ఉదంతాలను ఆయన పేర్కొనలేదు. ప్రశాంత్ భూషణ ఉదంతం కానీ, లాక్ డౌన్ కాలంలో జర్నలిస్టులకు న్యాయవిచారణ ప్రక్రియను వినే అవకాశంపై ఆంక్షలు విధించడం అనేవి మన న్యాయవ్యవస్థలో అసాధారణంగా జరుగుతున్న ఘటనలు కావు. మీడియా పదేపదే అభ్యర్థిస్తు వస్తున్నప్పటికీ తన కార్యాలయ ఆవరణలోకి సూర్యకాంతి చొరబడటానికి కూడా అనుమతించని రీతిలో భారతీయ న్యాయవ్యవస్థ స్పష్టంగా వ్యతిరేకతను ప్రదర్సిస్తూ వచ్చింది. సమగ్ర కోర్టు రికార్డులు లేకపోవటం తీవ్ర పర్యవసానాలకు దారితీస్తోంది. తక్షణ ప్రాతిపదికన చూస్తే కోర్టు తీర్పులను ఉద్దేశపూర్వకంగా, అవాంఛనీయంగా తొలగిస్తున్నారు, మౌఖికంగా చెప్పినవాటిని అనిర్దిష్టంగా రికార్డు చేస్తున్నారు. కోర్టు గదిలో చేసిన ప్రకటనలను యధాతథంగా సంగ్రహించడంలో తీర్పులు విఫలమౌతున్నాయి. ఆడియో రికార్డింగుకు తావు లేకపోవడం వల్ల న్యాయమూర్తులు చేస్తున్న అసందర్భ వ్యాఖ్యలు వారిని శిక్షకు దూరం చేస్తున్నాయి. న్యాయ విచారణ ప్రక్రియను సరైనవిధంగా రికార్డు చేసి పదిలపర్చనందునే ధర్మాసనాలు పాక్షికత, వివక్షను ప్రదర్శించడానికి కారణం అవుతున్నాయి. న్యాయస్థానమే సుప్రీమ్ ఉన్నత న్యాయమూర్తుల నియమాకాన్ని 1993 నుంచి సుప్రీంకోర్టు నెలకొల్పిన కొలీజియం ద్వారా నిర్వహిస్తున్నారు. న్యాయమూర్తుల నియామకం విషయంలో ప్రభుత్వ నియంత్రణను తప్పించడానికి ఇలా ఏర్పాటు చేసుకున్నారు. అయితే జడ్జీల నియామక ప్రక్రియ విషయంలో కూడా తనిఖీ జరగటం లేదని గుర్తించాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించిన వివరాలను చారిత్రకంగానే ప్రజలకు తెలీకుండా చేస్తున్నారు. జడ్జీల నియామకం, బదిలీలపై న్యాయ సమీక్షకు కూడా తావు లేకుండాపోయింది. హైకోర్టులకు న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తులను నియమించడంలో బంధుప్రీతికి సంబంధించిన అనుమానాలు కొన్ని సందర్భాల్లో బహిర్గతమైనప్పటికీ వాటిపై కనీస విచారణ జరిపించే సిస్టమ్ కూడా మన న్యాయవ్యవస్థలో లేదు. 45 సంవత్సరాలకు పైబడిన వారినే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలన్న నిబంధనను అతిక్రమించి ఇటీవలే కొన్ని నియమకాలు జరగడం తెలిసిందే. వయోపరిమితిని ఎందుకు సడలించాల్సి వచ్చిందో కోలీజియం తీర్మానించినా ఈ అతిక్రమణ ప్రాతిపదికను ప్రజలకు బహిర్గతం చేయలేదు. అన్నిటికంటే మించి హైకోర్టులలో, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల దుష్ప్రవర్తనకు సంబంధించిన చట్టాలు కూడా ఉన్నత న్యాయవ్యవస్థను న్యాయప్రక్రియనుంచే వేరు చేస్తున్నాయి. జడ్జీల దుష్ప్రవర్తన ఉదంతాలపై స్వతంత్ర దర్యాప్తు అథారిటీ లేదు. హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఫిర్యాదులను ఇన్ హౌస్‌లోనే పరిశీలిస్తామంటూ 1997లోనే ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. స్వతంత్ర ఏజెన్సీ ద్వారా కాకుండా న్యాయమూర్తులే ఈ ఫిర్యాదులపై విచారణ చేస్తే న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడినట్లవుతుందని సుప్రీంకోర్టు ఆనాడే వ్యాఖ్యానించింది. ఒకవేళ న్యాయమూర్తి తప్పు చేశారని తేలినా పార్లమెంటులో అభిశంసన ద్వారా మాత్రమే తనను తొలగించే అవకాశం ఉంది. రాజ్యాంగ న్యాయస్థానంలోని జడ్జిని తొలగించే ప్రక్రియను ఈ అభిశంసన యంత్రాగం ఒక్కసారి కూడా ఇంతవరకు వినియోగించలేదు. అనేక కారణాలవల్ల న్యాయవ్యవస్థపై అవిశ్వాసం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే న్యాయమూర్తులకు అపరిమితాధికారాలను కట్టబెట్టుతున్న ప్రక్రియనుంచి న్యాయస్థానాలను తరలించాల్సి ఉంది. న్యాయమూర్తులపై నిరంతర తనిఖీ, దర్యాప్తు చేసే వ్యవస్థ ఉనికిలోకి రావాలి. తమ చర్యలను ప్రశ్నించేవారిపై కోర్టుధిక్కారం మోపి శిక్షిస్తున్న న్యాయవ్యవస్థను దాని భూస్వామ్య అవశేషాలనుంచి బయటకు లాగాలి. ప్రజాప్రాతినిధ్యానికి అతి తక్కువ అవకాశం ఉంటున్న న్యాయవ్యవస్థకు ఉన్న తిరుగులేని అధికారమే దానిపై అనుమానాలకు దారితీస్తోంది. తనపై దర్యాప్తుకు, తనిఖీకి అనుమతించే ప్రగతిశీల చర్యలను చేపట్టడం ద్వారా మాత్రమే న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషించగలదు. తాను సేవిస్తున్న ప్రజలకు జవాబుదారీగా ఉండటం ద్వారానే అది తన ఔన్నత్యాన్ని నిలుపుకోగలదు. తాను పవిత్రమైన పునాదులపై ఉన్నట్లుగా తనకుతానుగా భావిస్తున్న భ్రమలనుంచి భారత న్యాయవ్యవస్థ బయటకు రావలసిన సమయం ఆసన్నమైంది. ఈ నిజాన్ని చెప్పడం వల్ల మన ప్రజాస్వామ్యం అంతమైపోదు కాకపోగా అది ప్రజాస్వామ్య పునాదులను బలంగా నిలపగలుగుతుంది. జేఎమ్ బ్యారీ చెప్పినట్లుగా ప్రపంచమంతా విశ్వాసం, నమ్మకంపైనే ఆధారపడి ఉంది. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజల పరిరక్షణ కోసం ఇప్పుడున్న స్థానం నుంచి బలమైన పునాదులమీద నిలబడటాన్ని మన న్యాయవ్యవస్థ ఇప్పటికైనా గుర్తిస్తుందని ఆశిద్దాం. వ్యాసకర్త బాంబే హైకోర్టు న్యాయవాది (ది వైర్ సౌజన్యంతో) -
ఒడిదుడుకుల మధ్య న్యాయవ్యవస్థ
అసాధారణ పరిస్థితుల్లో తప్ప దర్యాప్తుపై స్టే అర్డర్లు ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సుప్రీంకోర్టు హితవు చెప్పిన నేపథ్యంలో న్యాయవ్యవస్థల తీర్పుల్లో వాటి స్వభావాల్లో రకరకాల వ్యత్యాసాలు, వ్యాఘాతాలపై విస్తృత చర్చ జరుగుతోంది. భారత రాజ్యాంగం మూడు విభాగాలకు పరిధులు గీసి మరీ నిర్ణయించిన గీతలు దాటి ఒక విభాగంలోకి మరొకటి చొరబడి ‘కప్పల తక్కెడ’గా మారడంతో ఎవరు ఎందులో తలదూర్చుతున్నారో, మరెవరు వేలుపెట్టి ఒకరి నిర్ణయాలను మరొకరు తారుమారు చేస్తున్నారో అర్థం కాని స్థితే దీనికి కారణం. న్యాయస్థానాల తీర్పుల్లో, తీరుతెన్నుల్లో ఈ ఒడిదుడుకులకు అసలు మూలం ఇదే మరి. అమరావతి భూములపై దర్యాప్తు ప్రారంభం కాకముందే స్టే ఆర్డర్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేయడాన్ని మేం ఆమోదించం. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దర్యాప్తుల పైన స్టేలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటిస్తూ వచ్చినందుననే ఇప్పుడు మేం అమరావతి భూముల కేసులో హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకుంటున్నాం. ఒకసారి ఫిర్యాదు ఎఫ్ఐఆర్లో నమోదైన తర్వాత దర్యాప్తు ప్రారంభించకుండానే కేసులో ఏముంది అంటూ హైకోర్టు స్టే ఇవ్వడం ఏమిటి? చట్టం తన పని తాను చేసుకుపోవా ల్సిందే. పదే పదే చెబుతున్నాం–అసాధారణ పరిస్థితుల్లో తప్ప స్టే ఇవ్వ కూడదు. ఇది ఆమోదం కాదు. ఇలాంటి ఉత్తర్వులు నిలబడవు. – ఏపీ హైకోర్టు స్టే ఉత్తర్వును సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వు ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవ్యవస్థల తీరుతెన్నుల్ని తీర్పుల స్వభావాలను పరిశీలిస్తున్నప్పుడు తరచుగా మనకు రకరకాల వ్యత్యా సాలు, వ్యాఘాతాలు ఎదురవుతూ ఉండటం కద్దు. అయితే కుండ బద్దలు కొట్టినట్లు అరమరికలు లేకుండా ప్రలోభాలకు లోనుకాకుండా తీర్పులు చెప్పేవారి సంఖ్య అరుదైనా, అసలంటూ లేకపోలేదు. న్యాయమూర్తుల్లో కనిపించే ఈ వ్యత్యాసానికి అమెరికాలో నల్లజాతి విమోచన ప్రధాత ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఒక హాస్య సంభాషణ ద్వారా చెప్పిన ఉదాహరణను నేనీ వ్యాసం చివరలో నివేదిస్తాను. ఈ లోగా అసలు ఎఫ్ఐఆర్ గురించి గానీ, సంబంధిత దర్యాప్తు గురించీ, అందులోని విషయాల గురించి గానీ ఏ ప్రసార మాధ్యమాల్లో (మీడియా)నూ ప్రచురించడాన్ని నిషేధిస్తూ ఒక అసాధారణ ఆదేశాన్ని ఏపీ హైకోర్టు జారీ చేసింది. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నిరసిస్తూ నాయకులు, న్యాయవాదులు, మీడియా సంస్థలుS, సంపాదకులు, ప్రొఫెషనల్ సంస్థలు సహా ఈ ‘గాగ్’ (నోరు నొక్కేసే) ఆర్డర్‌ను విమర్శించి ఖండించాల్సి వచ్చింది. ఈ గందరగోళానికి కారణం ఏమిటి? ఇందుకు మన వ్యవస్థలో ఉన్న లోపమెక్కడ? 74 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు వ్యవస్థను సమూ లంగా సంస్కరించడంలో విఫలమవుతున్నాం? కావాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కోరి మరీ తెచ్చుకుని రూపొందించుకున్న స్వతంత్ర భారత సెక్యులర్ రాజ్యాంగానికి మన రాజకీయనాయకులు, వారి పార్టీలు చివరికిలా ఎందుకు భ్రష్టు పట్టిస్తూ వచ్చారు? చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు రూపొందించుకున్న అత్యు న్నత ప్రజానుకూల తీర్పులను కూడా పాలకులు, కొన్ని రాష్ట్రాల న్యాయస్థానాలు, సుప్రీంకు చెందిన కొన్ని ధర్మాసనాలు సహితం ఎందుకు ఉల్లంఘిస్తూ వచ్చాయి? లోతుగా వెళ్లవలసి వస్తే జైన్ హవాలా కేసులో అడ్వాణీకి ప్రమేయం ఉన్నదని సమాచారం పొక్కిన ప్పటినుంచీ స్వతంత్ర దర్యాప్తు సంస్థలుగా మెలగవలసిన సీబీఐ, సీవీసీ లాంటి అత్యున్నత శాఖలు కూడా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల మోచేతినీళ్లకు మోసులెత్తుతూ వచ్చినప్పుడు ఆ ‘ఎసరు’ న్యాయవ్యవస్థలకు మాత్రం తగలకుండా ఉంటుందా? నిజానికి ఒక దశ వరకూ, బహుశా ‘జైన్ హవాలా కేసు’ నడుస్తున్న సమయం దాకా పతంజలి శాస్త్రి, వీఆర్ కృష్ణయ్యర్ లాంటి మచ్చలేని న్యాయమూర్తులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అలంకరిస్తున్న దాకా మనకూ గర్విం చదగిన న్యాయస్థానాలున్నాయని దిలాసాగా గడుపుతూ వచ్చాం. ఇక ఆ తర్వాత క్రమంగా భారత రాజ్యాంగం మూడు విభాగాలకు (ప్రభుత్వం, శాసనవేదిక, న్యాయస్థానం) పరిధులు బరిగీసి మరీ నిర్ణ యించిన గీతలు దాటి ఒక విభాగంలోకి మరొకటి చొరబడి ‘కప్పల తక్కెడ’గా మారడంతో ఎవరు ఎందులో తలదూర్చుతున్నారో, మరె వరు వేలుపెట్టి ఒకరి నిర్ణయాలను మరొకరు తారుమారు చేస్తున్నారో, ఏ ప్రలోభంతో ఈ మార్పులు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి భారత సామాన్య ప్రజాబాహుళ్యానికి దాపురిస్తూ వచ్చింది. మరీ దూరం పోకండి, జైన్ హవాలా కేసు విచారణ సందర్భం గానే బహుశా తొలిసారిగా (కొన్నేళ్లనాడు) సుప్రీం ధర్మాసనం సీబీఐ, చీఫ్ విజిలెన్స్ కమిషన్ పాత్రలను ప్రశ్నించవలసి వచ్చింది. నాడు ప్రధానమంత్రి కార్యాలయం కనుసన్నల్లోనే ఈ రెండు సంస్థలు రాజ కీయపరమైన ఒత్తిళ్లకు లోనుకావలసి వచ్చినప్పుడు ఈ సంస్థలు కేవలం ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల మాటే వినడా నికి అలవాటుపడి తాము స్వతంత్ర సంస్థలన్న ‘స్పృహ’నే కోల్పో తున్నాయని నాటి సుప్రీంకోర్టు ‘చురక’వేస్తూ ఇకనుంచి ఈ సంస్థలు తన కనుసన్నల్లో కూడా ఉండి బాధ్యతతో మెలగాలని చురక అంటిం చవలసి వచ్చింది. ఆనాడు స్వతంత్ర భారతంలో సుప్రీం చరిత్రలో ఇది తొలి చురక అని నా భావన! దీనర్థం–ఇప్పటికీ ఆదర్శనీయమైన ధర్మాసనాలు ‘సుప్రీం’లోనూ రాష్ట్రాలలోనూ మనకు అసలు లేవని కాదు, కాకపోతే అనేక సందర్భాలలో కొన్నింటికి బూజుపట్టింది, మరి కొన్ని చైతన్యంలోనే ఉన్నాయి. ఇంతకూ వచ్చిన అసలు రోగమంతా ప్రధానంగా రాజకీయాలలోనూ, రాజకీయ పాలనా వ్యవస్థల్లోనే గూడు కట్టుకుపోయింది. ఎంత దట్టంగా ఈ ‘రోగం’ వ్యాపించి ఉందంటే– రాజకీయం ఎక్కడ మొదలయి, ఎక్కడికి పాకుతోంది, న్యాయ పాలన ఎక్కడ, ఎందుకు కుంటుపడి నడక సాగిస్తోంది అన్న మీమాంస ఇంతకు ముందెన్నడూ లేనంత స్థాయిలో సాగుతోంది నేడు. ఇందుకు ఉదాహరణలు వెతుక్కోవడానికి ఎంతో దూరం ప్రయా ణించక్కరలేదు–ఇటీవల సంవత్సర కాలంలోనే పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ మీద ఊరూనాడూ గుప్పుమన్న ‘సెక్స్ స్కాండల్’ ఫలితంగా పదవిని విడిచిపోయే తరుణంలో బాబ్రీమసీదు స్థానంలో అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించిన ఫైల్ ఎంతో వేగంగా క్లియర్ కావటం, ఆ వెంటనే కొద్దిరోజుల్లోనే గొగో య్కు రాజ్యసభ సీటు ‘వడ్డించిన విస్తరి’గా అమరిపోవడం. అలాగే సీబీఐ స్పెషల్ జడ్జి జస్టిస్ విజ్గోపాల్ హరికిషన్ లోయా హత్యకేసులో ఒక అధికార పార్టీ అగ్ర నాయకుడే ఇరుక్కు పోయినప్పుడు ఆ కేసును కొట్టేసిన మరో జస్టిస్‌కు ప్రయోజనం చేకూరడం తెలిసిన విషయమే! ఈ తంతు మన అవినీతి రాజకీయ చట్రంలో ప్రధానంగా గత నలభై ఏళ్లుగానూ, మరీ ముఖ్యంగా గత రెండు దశాబ్దాలకు పైగానూ దేశంలో యథేచ్ఛగా సాగిపోతోంది. బహుశా ఇంతకన్నా చెడిపోవల సిన ఆ మిగులుసగులు మంచి ఏమైనా మిగిలిందేమో భూతద్దం పెట్టి చూసినా ఏ మేరకు కనపడుతుందో వెతుక్కోవలసిందేనేమో! ఎందుకంటే, వారం పది రోజుల క్రితమే వెలువడిన ఒక కేంద్రీయ సాధికార విచారణ సంస్థ, పరిశోధనా సంస్థ తాజా నివేదిక ప్రకారం ఇంతవరకూ పార్లమెంటు చరిత్రలో కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో హంతకులుగా, నేరగాళ్లుగా, వేధింపురాయుళ్లుగా, దౌర్జన్యపరులుగా నమోదైన శాసనకర్తల సంఖ్య 4,200 మంది అని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాల నాయకుల, శాసనకర్తల, న్యాయవ్యవస్థల మధ్య నడిచే ‘ఆదానప్రదానా’లు ఎలా ఉంటాయో తేల్చుకోవడం కష్టం. తాజా ఉదాహరణగా, కొద్ది రోజుల లోనే రిటైరైన జస్టిస్ అరుణ్ మిశ్రా పాత్ర. ఆయన తీర్పుల ధోరణి దేశంలో ఎందుకు అంతగా అభాసుపాలు కావలసి వచ్చిందో ఇక ఎంత మాత్రం దాచలేని సత్యంగా బయటపడిపోక తప్పలేదు. మనకు ఏదో ఒక రాజ్యం అయితే ఉంది గానీ, ఉన్న ఆ లౌకిక రాజ్యాంగం కూడా ఆకారంలో తప్ప తొల్లింటి రూపంలోనే, ఆచరణలోనే ఉందని భ్రమించి కూర్చుం దామా? లేదా ధర్మరక్షణకే కట్టుబడి ఉన్నామన్న గుండె నిబ్బరంతో ప్రతి పౌరుడు చాటుకోగల స్థితిలో నేడున్నాడా? ఆ భరోసా ఇవ్వగల స్థానంలో నేడు న్యాయ వ్యవస్థను ఉంచగలిగామా? దీనికి సమాధానాన్ని గుండెమీద చెయ్యి వేసుకుని చెప్పగల్గడమే కాదు, అసలు గుండెకాయే స్పందించగల్గాలి. సంపాదన ఇవాళ రావొచ్చు, రేపు చేజారిపోనూ పోవచ్చు. మనిషికైనా, రాజకీయ అధికా రంలో, న్యాయస్థానంలో కూర్చున్న వారికైనా లోభానికీ, ప్రలోభానికీ మధ్య ఉన్న ఈక్వేషన్ కూడా అంచనాలో ఉండాలి. బహుశా పాలనా రంగంలో ఈ అన్నింటినీ కాచి వడబోసిన ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఆనాడే– కొందరు సమకాలీన న్యాయమూర్తులు ఎలా ఉండేవారో చెబుతూ ఒక విచిత్రమైన సాదృశ్యాన్ని గుర్తుచేశాడు: ‘‘వీధిలో నడిచివెళ్లే ఓ వ్యక్తి పెద్ద పెట్టున శబ్దం వచ్చేలా తన ముక్కును చీదుకుంటూ పోతున్నందుకు అతణ్ణి ఉరి తీయాల్సిందేనం టాడట ఓ న్యాయమూర్తి, ఇక మరో న్యాయమూర్తేమో అసలింతకీ ఆముక్కుచీదుకున్న వ్యక్తి ఏ చేత్తో చీదుకున్నాడో ఫిర్యాదుదారు తేల్చి చెప్పనందుకు ఆ ఉరిశిక్షను కాస్తా రద్దు చేస్తాడ’’ట. (డేవిడ్పానిక్: జడ్జెస్ గ్రంథం– క్వీన్స్ కౌన్సెల్ గౌరవ సభ్యుడు). మన తీర్పులు, తీర్పరులూ ఇందుకు భిన్నంగా ఉండగలరన్న ఆశాభావంతో...! ఈ లెక్కన డాక్టర్ అంబేడ్కర్ తెగేసి చెప్పింది నిజమనిపిస్తుంది: ‘మన దేశం రెండే రెండు జాతులుగా విడిపోయింది. ఒకటి మోతుబరులైన వర్గాలు, రెండు అణగారిన వర్గాలు’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఒక వ్యవస్థను ఇంకో వ్యవస్థ అడ్డుకోవడం సరికాదు
-
న్యాయ నియామకాల్లో జాప్యం
న్యాయవ్యవస్థ కంఠశోషే తప్ప దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టులు భర్తీ కాకుండానే ఉండిపోతున్నాయని మరోసారి వెల్లడైంది. మొత్తంగా 1,079 హైకోర్టు న్యాయమూర్తుల పదవులుండగా అందులో కేవలం 669మంది న్యాయమూర్తులు...అంటే 62 శాతంమంది మాత్రమే ఉన్నారని, 410 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం వల్ల కేసుల పరిష్కా రంలో ఎంత జాప్యం చోటుచేసుకుంటున్నదో, న్యాయం కోసం ఎదురుచూస్తున్న సాధారణ పౌరులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కేంద్రానికి తెలియనిది కాదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా న్యాయమూర్తుల నియామకం విషయంలో నిర్లక్ష్యమే కనబడుతోంది. సుప్రీంకోర్టు కొలీజి యానికీ, కేంద్రానికీ మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలు ఇటీవలికాలంలో చాలానే ఉన్నాయి. అయినా గత అయిదేళ్లలో చేసిన నియామకాలు గమనిస్తే అంతక్రితం కన్నా ఎంతో కొంత మెరుగనే చెప్పాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరిపోదు. అలహాబాద్ హైకోర్టు 60 ఖాళీలతో అగ్రభాగాన ఉండగా, కలకత్తా హైకోర్టులో 32, ఢిల్లీ హైకోర్టులో 23, బొంబాయి హైకోర్టులో 29 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలున్నాయి. అన్నిటికన్నా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిస్థితి మరీ అన్యాయం. అక్కడ 37మంది న్యాయమూర్తులకూ 15మంది మాత్రమే ఉన్నారు. గత జూన్‌లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ కొత్తగా న్యాయమూర్తుల్ని నియమించడంతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే అవసరమైతే రాజ్యాంగంలోని 128, 224ఏ అధికరణల కింద సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తుల్ని నిర్దిష్ట కాలానికి న్యాయమూర్తులుగా నియమిస్తే పెండింగ్ కేసుల బెడద తీరుతుందని సూచించారు. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయమేమిటో తెలియదు. సుప్రీంకోర్టులో మొన్న జూన్ నాటికి 58,669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజూ కొత్తగా దాఖలయ్యే కేసుల సంఖ్య కూడా కలుపుకుంటే ప్రస్తుతం అవి మరింతగా పెరిగివుండొచ్చు. తగినంతమంది న్యాయమూర్తులు అందుబాటులో లేని కారణంగా అనేక ముఖ్య మైన కేసుల పరిష్కారం కూడా ఆలస్యమవుతోంది. కేసుల్లో చిక్కుకోవడం వల్లనో, న్యాయం కోసం న్యాయస్థానాల్ని ఆశ్రయించడం వల్లనో వాటి చుట్టూ తిరగకతప్పనివారికి ఈ జాప్యం వల్ల కలిగే ఖేదమేమిటన్నది బాగా తెలుసు. తమ కేసు చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉందని, త్వరగా పరిష్కరించాలని కోరే కక్షిదారులకు న్యాయస్థానాలనుంచి ఆశాజనకమైన జవాబు రావడం లేదు. అవి నిస్సహాయ స్థితిలో ఉండటమే అందుకు కారణం. మన దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఏభై ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 1,000 వరకూ ఉంటే...25 ఏళ్లనుంచి పెండింగ్‌లో ఉన్న కేసులు రెండు లక్షలపైనే. సివిల్ తగాదాలకు సంబంధించి మొత్తంగా 90 లక్షల కేసులు ఎటూ తెమలకుండా ఉన్నాయి. వీటిల్లో 20 లక్షలకుపైగా కేసుల్లో...అంటే 23 శాతం కేసుల్లో కనీసం సమన్లు కూడా జారీ చేయలేదని గత ఆగస్టులో జస్టిస్ గొగోయ్ చెప్పారంటే న్యాయమూర్తుల నియామకం సమస్య ఎలాంటి పరిస్థితులకు దారితీస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. క్రిమినల్ కేసుల పరిస్థితి ఇంతకన్నా ఘోరం. 2 కోట్ల 10 లక్షల క్రిమినల్ కేసుల్లో కోటి వరకూ కేసులు ఇంకా సమన్లు జారీ చేసే దశలోనే ఉన్నాయి. ఈ క్రిమినల్ కేసుల్లో 45 లక్షల వరకూ చిన్న తగాదాలకు సంబంధించినవి. ఇది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మాత్రమే కాదు... కింది కోర్టుల్లో కూడా న్యాయాధికారుల కొరత తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా 5,000 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఇలా ఎక్కడికక్కడ అన్ని స్థాయిల్లోనూ ఖాళీలుంటే న్యాయం దక్కడం సాధ్యమేనా? ఉన్నత స్థాయి న్యాయస్థానాల్లో పదవుల భర్తీ విషయంలో జరుగుతున్న జాప్యం గురించి కనీసం కొలీజియాన్ని సాకుగా చూపడానికి ఉంది. కానీ జిల్లా కోర్టుల్లోనూ, సబా ర్డినేట్ కోర్టుల్లోనూ పూర్తికావాల్సిన నియామకాల మాటేమిటి? దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో నియామక విధానం తెస్తామని రవిశంకర్ ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. ఆ విషయంలో కేంద్రం నుంచి ప్రతిపాదనలు వస్తే సానుకూలంగా స్పందిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఈమధ్యే అన్నారు గనుక ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందనుకోవాలి. న్యాయ మూర్తుల నియామకంలో చోటు చేసుకుంటున్న జాప్యం కేంద్రం, న్యాయవ్యవస్థల మధ్య నెలకొన్న ఆధిపత్య సమస్య లేదా అహంభావ సమస్య పర్యవసానంగా ఏర్పడిందని కొందరు న్యాయవేత్తలు చెబుతున్నారు. కానీ వీటి పర్యవసానాలు మాత్రం ప్రజలు అనుభవించవలసి వస్తున్నది. ఇది ఎడ తెగకుండా సాగడం సరైంది కాదు. న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యం వల్ల ప్రజలకు సకాలంలో న్యాయం దక్కని దుస్థితి ఏర్పడింది. క్రిమినల్ కేసుల విచారణ ఏళ్లతరబడి పెండింగ్‌లో పడిపోవడం వల్ల ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న నిరుపేదలు జైళ్లలో గడపవలసి వస్తోంది. కొందరైతే తమ నేరానికి అనుభవిం చాల్సిన శిక్షా కాలానికి మించి జైళ్లలో మగ్గుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు బెయిల్ తెచ్చుకుం టున్నారు. అవసరమైన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికాలో పది లక్షలమంది జనాభాకు సగటున 107మంది న్యాయమూర్తులుంటే మన దేశంలో ఆ సంఖ్య పది మాత్రమే. అలాగే అక్కడి న్యాయమూర్తులు సగటున ఏడాదికి 81 కేసులు పరిష్కరిస్తుంటే మన న్యాయమూర్తులు 2,600 కేసులు పరిష్కరిస్తున్నారు. న్యాయమూర్తులపై ఈ స్థాయిలో భారం మోపడం ఎంత మాత్రం న్యాయం కాదు. కనుక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం కదలాలి. న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాలి. -
కొత్త నియోజకవర్గం
ఈ ప్రభుత్వం చట్టమయితే చేసింది కానీ– ఏదీ? దమ్ముంటే ఒక్క కుర్రాడిని ఉరి తీయమనండి. రాజీవ్ గాంధీని మారణ హోమం చేసిన నేరస్థురాలికి 22 సంవత్సరాల తర్వాత కూడా విమోచన లేదు. మా నమశ్శివాయని ఈ కాలమ్ పాతికేళ్లుగా చదువుతున్నవారయితే గానీ ఎరగరు. కొంచెం ముక్కుమీద గుద్దినట్టు మాట్లాడేమనిషి. మనిషి కాస్త ఖండితంగా చెప్తాడు. ఎదుటివాడు ఏమనుకుంటాడో ఆలోచించడు. ఇప్పుడు ఇది చూడండి. ముందు మనదేశంలో రేపుల కథల నమూనాలు చూద్దాం. ఇది ఒక పత్రిక మొదటి పేజీ కథ. బీహార్ జహానాబాద్‌లో కేవలం నలుగురు యువకులు ఒకమ్మాయిపై అత్యాచారం చేశారు. ఇందులో మరో నలుగురయిదుగురు యువకులు కూడా చేయి కలిపారని ఈ వీరులు చెప్పారు. శ్రీనగర్ కథువా జిల్లాలో 8 ఏళ్ల అమ్మాయిని కొందరు అత్యాచారం చేసి చంపేశారు. ఒడిశా కేంద్రపానికా పోలీసు స్టేషన్ పరిధిలో ఒక సొంత మేనమామ నాలుగేళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్ కనుజ్ ప్రధాన్ జిల్లాలో ఇద్దరు ప్రబుద్ధులు ఒక అమ్మాయిని రేప్ చేస్తుండగా మరో ఇద్దరు శృంగార పురుషులు వీడియో తీసి నలుగురికీ పంచారట. ఒడిశా లోని జగన్నాథపూర్‌లో కేవలం 6 ఏళ్ల ఆడపిల్ల అత్యాచారానికి గురై 8 రోజులు ప్రాణాల కోసం పోరాడి చచ్చిపోయింది. జమ్ములో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు 24 ఏళ్ల స్త్రీపై అత్యాచారం జరిపి, వీడియో తీసి, ఈ విషయాన్ని బయటపెడితే వీడియోను అందరికీ పంచుతామని హెచ్చరించారట. అన్నిటికన్నా విడ్డూరం– ఇలా రేప్ చేసిన నేరస్తుల్ని శిక్షించే చట్టాన్ని రాష్ట్రపతి అమలు జరిపే ’రోజున’ కేవలం 110 రేప్‌లు మాత్రమే జరిగాయట. ఉత్తరప్రదేశ్ ఇందులో మళ్లీ అగ్రస్థానం. మన నెల్లూరులో చెన్నూరు గ్రామంలో ఓ ఆరేళ్ల అమ్మాయిపై ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మైనర్ కుర్రాడు అత్యాచారం చేశాడట. బీహార్‌లోని ఉన్నావ్‌లో ఓ 9 ఏళ్ల అమ్మాయిని ముజాఫర్పూర్లో అయిదుగురు అత్యాచారం చేశారు. ఒడిశాలో నయాఘర్ జిల్లాలో దేవరాజ బారిక్ అనే వ్యక్తి ఒక మహిళపై రెండు నెలలుగా అత్యాచారం సల్పుతుండగా ఆ అవమానం భరించలేక ఆమె నిన్న ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి కేసులు 11,12,628 ఉన్నాయని నిన్న సుప్రీం కోర్టు ప్రకటించింది. వీటిలో మళ్లీ అగ్రస్థానం ఉత్తరప్రదేశ్–30,883 కేసులు. తర్వాతి స్థానం చెప్పి ముగిస్తాను: మహారాష్ట్రలో 16,099 కేసులు. ఇంత చెప్పాక వీరినందరినీ ఉరి తీయడం సబబు కాదంటాడు మా నమశ్శివాయ. ఈ ప్రభుత్వం చట్టమయితే చేసింది కానీ– ఏదీ? దమ్ముంటే ఒక్క కుర్రాడిని ఉరి తీయమనండి. రాజీవ్ గాంధీని మారణ హోమం చేసిన నేరస్థురాలికి 22 సంవత్సరాల తర్వాతే విమోచన లేదు. మనకి మానవ హక్కుల చట్టాలున్నాయి. మానవతావాదులున్నారు. మతాలున్నాయి. రైళ్లు తగులబెట్టే కులాలున్నాయి. రైళ్లని ఆపే ప్రాంతాలున్నాయి. జాతులున్నాయి. వర్గాలున్నాయి. చిట్టచివరిగా పార్టీలున్నా యి. నిన్న జైలు శిక్షపడితేనేంగాక – ఆసారాం బాపూలున్నారు. వీరందరూ ఊరుకుంటారా? చచ్చిపోయిన ఆ రేళ్ల బిడ్డ మరణం కంటే చావవలసిన 15 ఏళ్ల కుర్రాడి భ విష్యత్తుని గురించి జెండాలు పట్టుకుని బయలుదేరరా? దేశం పేరు ఇప్పుడు గుర్తులేదు గానీ– ఆ దేశంలో ఒకడు బజారులో పరిగెత్తుతున్నాడు. పోలీసులు వెంట తరుముతున్నారు. ఆ కుర్రాడు కిందపడ్డాడు. కదులుతున్న అతని తలమీద తుపాకీ ఉంచి కాల్చాడు పోలీసు. కుర్రాడు చచ్చిపోయాడు. ఎందుకయినా మంచిదని మరొకసారి కాల్చాడు. బజారులో వందలాది మంది ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. మరి కనిపించని వెనుకవారి మాట? ఆ దృశ్యాన్ని ఒక క్రేన్‌కి కట్టి ఊరేగించారు. భయంకరం. అక్కడ మానవ హక్కుల సంఘం లేదా? మానవ సంఘాలు లేవా? మతప్రముఖులు లేరా? ఒక్కటి మాత్రం ఆ తర్వాత లేదు. రేప్. ఈ దేశంలో ఒక కుర్రాడిని ఉరితీయమనండి. పేపర్లు విరగబడతాయి. ఇంకా మన అభిమాన హీరో సల్మాన్ ఖాన్ నల్లజింక కేసే 20 ఏళ్లుగా నడుస్తోంది. ఇంకా దానికి దిక్కులేదు. మరి రాష్ట్రపతి గారి చట్టం ప్రకారం–ఒక అత్యాచారానికి నలుగురిని వేసుకున్నా 4 లక్షల ఓట్లు వృ«థా. కనుక వీరిని ఒక వర్గంగా గుర్తించి ’రేప్‌లS నియోజకవర్గం’ అనో ఇంకా దమ్ముంటే ’రేపటి నియోజకవర్గం’ అనో గుర్తించాలంటాడు మా నమశ్శివాయ. అందువల్ల మనకి కొందరయినా మంత్రులు మిగులుతారు, మత గురువులు మిగులుతారు. స్థానిక నాయకులు మిగులుతారు. జైళ్లు ఖాళీ అవుతాయి. దేశం ’రేపుయుతం’గా ఉంటుంది. మరి ఈ నియోజకవర్గం ఏ పార్టీని సమర్థించాలా అన్నది అప్పుడే కొందరి మనసుల్లో కదిలిన మీమాంస. అయ్యా, ముందు అత్యాచారాలు విరివిగా జరగనివ్వండి. 2019 దగ్గర పడనివ్వండి. రేపు సంగతి తర్వాత చూద్దాం. ఏమయినా మా నమశ్శివాయ గట్టి పిండం. గొల్లపూడి మారుతీరావు -
న్యాయవ్యవస్థకు అగ్నిపరీక్ష
జడ్జీలు రాజకీయ శక్తిని కొంత కోల్పోవడమేగాక, నైతిక బలాన్ని చేజేతులా వదులుకున్నా రని రాజకీయ నాయకులకు తెలుసు. చేతికందిన ఏ అవకాశాన్నీ వదులుకోని రాజకీయ నేతలు న్యాయమూర్తులు వదులుకున్న న్యాయక్షేత్రాన్ని ఆక్రమించుకోవడానికి సన్నద్ధ మౌతున్నారు. ఈ ధోరణి కేవలం పాలకపక్షానికే పరిమితం కాలేదు. న్యాయవ్యవస్థ ఇలా డీలా పడిన స్థితి కారణంగానే లోక్‌సభలో పది శాతం కూడా ఎంపీలు లేని ఓ రాజకీయ పక్షం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)అభిశంసనకు సాహసించింది. వరుస ఘటనలు, చర్యల ఫలితంగా భారత న్యాయవ్యవస్థ నేడు చిక్కుకున్న ప్రమాదకర స్థితిని మనం ఏమని వర్ణించాలి? భారత అత్యున్నత న్యాయ మూర్తులు ఎదుర్కొంటున్న సంక్షోభం ఎంత తీవ్రంగా ఉంది? జడ్జీలు తమలో తాము వాదించుకుంటున్నారు. వ్యవస్థపై ప్రజా విశ్వాసం సన్న గిల్లింది. కార్యనిర్వాహక వ్యవస్థ గుట్టుచప్పుడు కాకుండా న్యాయవ్యవస్థతో రాజీకి సిద్ధమౌతోంది. ఇదంతా ఒకింత నాటకీయంగా కనిపించవచ్చు. విషయం వివరిస్తాను. ఓ పేద మహిళ హక్కులు హరిస్తే, లేదా ప్రభుత్వం ఆమెపై దాడి చేస్తే ఆమె చివరికి ఎక్కడికి పోవాలి? దేశ సర్వోన్నత న్యాయ స్థానానికే అదే ప్రభుత్వ రక్షణ అవసరమైనప్పుడు ఆమెకు వ్యవస్థపై ఉన్న విశ్వాసం ఏమవుతుంది? భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈ వారం కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు ఆవేశంతో సమర్ధించింది. ప్రధాన న్యాయ మూర్తి పాత్ర నాటకీయంగా మారిపోయిందని మీకు అర్థమౌతుంది. అంతే కాదు, ఇదే వారం సుప్రీంకోర్టు జడ్జీ పదవికి ఆయన నేతృత్వంలోని కొలీ జియం సూచించిన ఇద్దరిలో ఒకరి నియామకాన్ని ఆమోదిస్తూ, రెండో సిఫా ర్సును మరోసారి పరిశీలనకు తిప్పిపంపుతూ ఆయనకు కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ రాశారు. రెండో జడ్జీ పేరు వెనక్కి పంపడానికి కేరళకు చెందిన చాలా మంది జడ్జీలు ఉన్నారని లేదా సీనియారిటీ తగినంత లేదని చెప్పిన కారణాలు నమ్మదగ్గవిగా లేవు. అంటే, రాజ్యాంగం అధికారాలను సమంగా పంపిణీ చేసినాగాని తనదే తుది అధికారమని ప్రభుత్వం న్యాయవ్యవస్థకు ఇలా గుర్తుచేసింది. జడ్జీలు రాజకీయ శక్తిని కొంత కోల్పోవడమేగాక, నైతిక బలాన్ని చేజేతులా వదులుకున్నారని రాజకీయ నాయకులకు తెలుసు. చేతి కందిన ఏ అవకాశాన్నీ వదులుకోని రాజకీయ నేతలు న్యాయమూర్తులు వదు లుకున్న న్యాయక్షేత్రాన్ని ఆక్రమించుకోవడానికి సన్నద్ధమౌతున్నారు. ఈ ధోరణి కేవలం పాలకపక్షానికే పరిమితం కాలేదు. న్యాయవ్యవస్థ ఇలా డీలా పడిన స్థితి కారణంగానే లోక్‌సభలో పది శాతం కూడా ఎంపీలు లేని ఓ రాజ కీయపక్షం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)అభిశంసనకు సాహసించింది. నిజంగా ఈ అభిశంసన తీర్మానం ఆనాలోచితమైనదేగాక అనుచితమైనది. ఈ తీర్మానం ఎలాంటి రాజకీయ ప్రయోజనం సాధించలేదు. ఇది కేవలం సుప్రీం కోర్టును, మరీ ముఖ్యంగా సీజేఐని మరింత బలహీనపరిచింది. న్యాయవ్యవస్థపై పట్టుకోసం ‘రాజకీయం’ బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం ఎంత ద్వేషించుకుంటున్నాగాని న్యాయ వ్యవస్థపై పెత్తనానికి మాత్రం రెండూ ఏకమయ్యాయి. ప్రధాన పార్టీల మధ్య కీచులాట లున్న ఈ పార్లమెంటు శరవేగంతో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) ఏర్పాటుకు చట్టం చేసింది. అత్యున్నత న్యాయవ్యవస్థ ముఖ్యంగా జడ్జీల నియామకంలో కొలీజియం అధికారాలకు కత్తెర వేయడానికి ఈ చట్టం ఆమోదించారు. సుప్రీంకోర్టు కూడా అంతే హడావుడిగా ఈ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటిస్తూ కొట్టివేసింది. రాజకీయ వ్యవస్థ మొత్తం తన అధికారాలు తగ్గించడానికి ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టింది. రెండు ప్రధాన పార్టీలూ పరస్పరం పోరు సాగిస్తున్నట్టు నటిస్తూ ఉమ్మడి ప్రత్యర్థి అయిన న్యాయవ్యవస్థను దెబ్బదీస్తున్నాయి. ఎన్‌జేఏసీ చట్టాన్ని ఐదుగురు జడ్జీల బెంచీ 4–1 మెజారిటీ తీర్పుతో చెల్లకుండా చేయడమేగాక కార్య నిర్వా హక వర్గానికి న్యాయవ్యవస్థ నిరంతరం ‘రుణపడి ఉండేలా’ చేయజాలమని వ్యాఖ్యానించింది. జడ్జీల నియామకానికి సంబంధించిన తమ సిఫార్సులకు విలువ లేక పోవడంతో కొలీజియంలోని మిగిలిన నలుగురు సీనియర్ జడ్జీల నుంచి ఎదు రౌతున్న ప్రశ్నలు, జడ్జీ బీహెచ్ లోయా మృతి కేసు, వైద్య కళాశాలల కేసుల్లో తీర్పులను నిరసిస్తూ సమరశీల లాయర్ల విమర్శలు, కాంగ్రెస్ ప్రతిపాదించిన అభిశంసన తీర్మానం, సుప్రీంకోర్టును సమర్థిస్తూ బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రక టనలతో ప్రధాన న్యాయమూర్తి ఆత్మరక్షణలో పడ్డారు. ఇంత రభస జరిగాక న్యాయవ్యవస్థ కోసం ఆయన తిరిగి పోరాడగలరని ఆశించగలమా? అసంతృ ప్తితో ఉన్న సోదర న్యాయమూర్తులతో ఓ అంగీకారానికి రావడానికి ఆయన సిద్ధంగా లేరు. ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేయగలరని అంచనా వేయ గలం? రాజకీయనేతలు న్యాయవ్యవస్థను పీడిస్తున్న కొత్త బలహీనతలన్నిం టినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. కూపీలాగుతున్నారు. జడ్జీల పదవులకు కొలీ జియం సిఫార్సుల ఆధారంగా నియామకాలను జాప్యం చేయడం సర్వ సాధారణ విషయంగా మారింది. ఇప్పుడు ఓ హైకోర్టు జడ్జీ పదవీకాలానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫార్పును ప్రభుత్వం మార్చేసింది. కొలీ జియం దాన్ని సహించింది. దీంతో దూకుడు పెంచిన కేంద్రసర్కారు సుప్రీం కోర్టుకు జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకం సిఫార్సును మరోసారి పరిశీలనకు వెనక్కి పంపింది. మరోసారి ఈ విషయంలో కొలీజియం మిన్నకుండిపో యినా లేదా తమలో తాము కీచులాడుకున్నా ప్రభుత్వం న్యాయవ్యవస్థను పలుచన చేసే మరింత దుందుడుకు చర్యకు సిద్ధమౌతుందని మీరు నిస్సందే హంగా భావించవచ్చు. సుప్రీంకోర్టు నీరస పోకడలు ఇలాగే కొనసాగితే ప్రభు త్వం జడ్జీల సీనియారిటీ సూత్రానికి తిలోదకాలిస్తుంది. మరుసటి సీజేఐగా అత్యంత సీనియర్ అయిన జస్టిస్ రంజన్ గోగోయ్ నియామకానికి అంగీ కారం తెలపకపోయే ప్రమాదం పొంచి ఉంది. న్యాయమూర్తులపై చిన్నచూపుతో మరింత ప్రమాదం ప్రస్తుతం న్యాయవ్యవస్థ ప్రజల సానుభూతిని చాలా వరకు కోల్పోయిం దని ప్రభుత్వం భావించడంలో ఆశ్చర్యం లేదు. ఓ పక్క విచారణకు నోచుకో కుండా వేలాది కేసులు పడి ఉండగా, మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కే తొందరలో న్యాయవ్యవస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (పిల్స్) స్వీకరి స్తోంది. ఎన్‌జేఏసీ చట్టం చెల్లదంటూ వేగంగా తీర్పు ఇవ్వడం వల్ల జడ్జీలు తమ ప్రయోజనాలు కాపాడుకునే సందర్భాల్లోనే త్వరగా నిర్ణయాలు ప్రకటిస్తారనే భావన బలపడింది. లోయా కేసు తీర్పును విమర్శించేవారిపై చర్యకు డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్(పిల్)ను ప్రధాన న్యాయమూర్తి విచార ణకు తీసుకుంటే పై అభిప్రాయం జనంలో మరింత బలపడే ప్రమాదముంది. న్యాయవ్యవస్థ అందరినీ కాపాడే సంస్థగా కాకుండా తన కోసమే తాను పోరాడే వ్యవస్థగా దిగజారినట్టు కనపిస్తుంది. ఈ విషయంతోపాటు జడ్జీల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఉమ్మడి ప్రయోజనాలు కాపాడే విషయంలో భారత ప్రజలతో న్యాయవ్యవస్థకున్న సామాజిక అంగీకారాన్ని దెబ్బదీస్తాయి. అందుకే తన అధికారాల విషయంలో ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకోవడానికి న్యాయవ్యవస్థకు ఇదే సరైన సమయం. ఆత్మగౌరవం కోసం పాడాల్సిన పాట న్యాయవ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి ఆలోచిస్తుంటే స్వాతంత్య్ర పోరాటం తొలి దశలోని ఓ అధ్యాయం నాకు గుర్తుకొస్తోంది. భూమి యజమానుల ఆస్తులపై తమకు తిరుగులేని అధికారాలిచ్చే కాల నైజేషన్ బిల్లును బ్రిటిష్ పాలకులు 1906–1907లో తీసుకొచ్చారు. భూము లున్న ఏ రైతు(పంజాబ్‌లో సొంత భూములున్న రైతును జాట్ అని పిలిచే వారు) పొలాలనైనా సొంతం చేసుకోవడానికి ఆంగ్ల సర్కారుకు అధికారం ఇచ్చే దుర్మార్గమైన నిబంధన ఈ బిల్లులో పొందుపరిచారు. లాలా లజపత్ రాయ్, భగత్‌సింగ్ చిన్నాన్న అజిత్‌సింగ్ ఈ నిబంధనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నడిపారు. ఈ జనాందోళనకు స్ఫూర్తినిచ్చే పోరాట గీతాన్ని ల్యాల్ పూర్ (ఇది నేటి పాక్ నగరం ఫైసలాబాద్)కు చెందిన పత్రికా సంపాదకుడు బంకే దయాళ్ రాశారు. ‘‘పగ్డీ సంభాల్ జాట్టా, పగ్డీ సంభల్ ఓయే– తేరా లూట్ నా జాయే మాల్ జాట్టా’’ (తల పాగా బిగించే ఉంచు, రైతు సోదరా, లేకుంటే నీ సంపదను, ఆత్మగౌరవాన్ని వారు లూటీ చేస్తారు) అంటూ దయాళ్ రాసిన పాట ఉద్యమాన్ని ముందుకురికించింది. అందుకే ఈ ఉద్యమం పగ్డీ సంభల్ జాట్టా ఆందోళన అనే పేరుతో చరిత్రలో భాగమైంది. బ్రిటిష్ పాలకులు లాలా లజపత్‌రాయ్, అజిత్‌సింగ్‌ను బర్మాలోని మాండలే జైలుకు పంపించారు. అయినా ఈ పోరు గీతం భగత్‌సింగ్ కాలం వరకూ జనం గుండెల్లో నిలిచే ఉంది. తర్వాత అనేక తరాల భారతీయులు ఈ పోరాట పాటను భగత్‌సింగ్‌తో ముడిపెడతారు. అత్యంత జాగ్రత్తతో, గొప్ప ఆలోచనాత్మకత, సావధానతలతో నేను దీన్ని రాస్తున్నాను. ఇది భారతీయ న్యాయవ్యవస్థకు సంబంధించి ‘‘çపగ్డీ సంభాల్ జాట్టా’’ను పాడవలసిన క్షణం. నిబద్ధ న్యాయవ్యవస్థ కోసం ఇంది రాగాంధీ వెదుకులాట, 1973 తర్వాత అదే నిబద్ధతను పెకిలిస్తూ పోయిన ఘటనల పర్యవసానాల తర్వాత మన న్యాయవ్యవస్థ ఇప్పుడు మళ్లీ అత్యంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. కులబంధనాలతో కూడిన కొలీజి యంను సంస్థాగతం చేయడం ద్వారా తాను సురక్షితంగా ఉన్నానని న్యాయ వ్యవస్థ భావించి ఇప్పటికి రెండు దశాబ్దాలయింది. కానీ పేలవమైన నియా మకాలు చేయడం, సత్వర సంస్కరణలను నిర్లక్ష్యపర్చడం, న్యాయ ప్రక్రి యలో జాప్యం పట్ల సాధికారత కలిగిన బృందాల్లో పెరుగుతున్న అసహ నాన్ని గ్రహించడంలో విఫలం కావడం, న్యాయమూర్తుల బలహీనతలను గమనించడంలో సంశయానికి గురికావడం వంటి పరిణామాలతో న్యాయ వ్యవస్థ రాన్రానూ తన్ను తాను బలహీనపర్చుకుంది. అయితే ఈ విషయాలను మళ్లీ చెప్పి న్యాయవ్యవస్థను బాదటానికి ఇది సందర్భం కాదు. ఈ పోరాటంలో న్యాయవ్యవస్థ నష్టపోయినట్లయితే, ఆ శాశ్వత నష్టం నుంచి కోలుకోవడం కష్టం. న్యాయవ్యవస్థే కాదు పౌరులుగా మనందరమూ నష్టపోతాం. ప్రధాన న్యాయమూర్తి ఇష్టపడినా ఇష్టపడకపో యినా.. సుప్రీంకోర్టు కోసం, తన కొలీజియం కోసం పోరాడి తీరవలసిన స్థితిలో తను ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ అంశంపై చర్చ జరప డానికి కూడా నేను సిద్ధపడను. సీజేఐ సోదర జడ్జీలకు సంబంధించినంత వరకు 1973–77 నాటి చరిత్ర జ్ఞాపకం వారిని కాస్త సంతృప్తిపర్చవచ్చు. ఇందిరాగాంధీ తీసివేత చర్యల ఫలితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ ర్తిగా ఎదిగివచ్చిన ఆ న్యాయమూర్తి పేరును కూడా ఇప్పుడు ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు. కానీ ఆమె తప్పు నిర్ణయానికి నిరసనగా పదవికి రాజీ నామా చేసిన న్యాయమూర్తి మాత్రం భారత న్యాయవ్యవస్థ చరిత్రలో శిఖర స్థాయిలో నిలబడిపోయారు. అలాంటి పరీక్షకు మళ్లీ సిద్ధపడేందుకు మన న్యాయమూర్తులలో కొందరయినా ముందుకు రావడానికి ఇష్టపడవచ్చు. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
భయ బీభత్సాల కాలం
ఎమర్జెన్సీలో న్యాయ వ్యవస్థ, మీడియా ఇప్పుడు కొందరు అతిగా ప్రచారం చేస్తున్నదానికంటే తక్కువ ఆదర్శప్రాయంగానే పనిచేశాయి. ఎమర్జెన్సీ విధింపును అత్యున్నత ధర్మాసనం నిస్సిగ్గుగా ఆమోదించింది. ప్రభుత్వ సెన్సార్షిప్ను సవాలు చేసింది కూడా కొందరు పాత్రికేయులు, కొన్ని పత్రికలు మాత్రమే. నలభై ఏళ్ల క్రితం సరిగ్గా ఈ వారంలోనే ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. అది వేయి కోరల విషపు నాగు. దానికి ఇరుసు నియంతృత్వం. ఆ రక్కసి యంత్రపు చక్రాల్లోని కీలకమైన చువ్వల్లాంటి క్రూరులైన పోలీ సు అధికారులు ప్రజాస్వామ్య సౌధపు ప్రతి మూలస్తంభంపైనా పాశవిక రాజ్య ఉగ్ర వాద దాడులు సాగించారు. రాజ్య అతిక్రమణాధికారా లను, వ్యవస్థలను దాటి అనామక ప్రజల జీవితాల్లోకి సైతం విస్తరింపజేశారు. అంత విచక్షణారహితంగా స్వేచ్ఛను ఛిన్నాభిన్నం చేయడం సాధ్యమేనని 1975లో దేశం విశ్వసించలేకపో యింది. అంతకంటే విచిత్రంగా, 1975లో పుట్టని ఈ 2015 నాటి తరం స్వేచ్ఛకు వ్యతిరేకంగా అలాంటి కుట్ర ఒకటి జరిగిందని సైతం విశ్వసించలేకపోతోంది. ఆ వాస్తవం ఆహ్లాదకరంగా కంటే చేదుగా ఉండేది కావడమే అందుకు కారణం కావచ్చు. ఆత్మగౌరవంతో ఉండాలంటే బహుశా కొంత మతిమరుపు, పాత విష యాన్నే తిరిగి కనిపెట్టడం అవసరమేమో. ధీరోదాత్త తకు, లొంగుబాటుకు మధ్య నిష్పత్తి రెండో దాని వైపే బాగా ఎక్కువగా మొగ్గి ఉన్నప్పుడు, జ్ఞాపకశక్తి సక్రమం గా లేకపోవడం జాతీయ ఆరోగ్యానికి బహుశా మంచిది కామోసు. జూన్ 1975 నుండి మార్చి 1977 వరకు ఆ 20 మాసాలు అసాధారణమైనవి. ఆ తదుపరి దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల ఓటర్లు విముక్తి కోసం ఇచ్చిన తీర్పు దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, భావి సవాళ్లకు అతీతంగా దాన్ని పునఃస్థాపించింది. ఆ కాలం గురించి రాసిన వ్యాఖ్యల్లో కొన్ని ఏమంత లోతులేని వాస్తవాన్ని గొప్ప ఐతిహాసికంగా చేసి, అతిగా ప్రచారం చేస్తున్నారు. న్యాయవ్యవస్థ, మీడియా అనే రెండు గొప్ప వ్యవస్థలూ ప్రభుత్వానికి సమీపంగా ఉండేవే అయినా సాంకేతికంగా దాని నియంత్రణకు బయటివే. అవి, వాటి సమర్థకులు నేడు చె బుతున్నదాని కంటే తక్కువ ఆదర్శప్రాయంగానే పనిచేశాయి. కార్యనిర్వాహక వ్యవస్థ అత్యవసర పరిస్థితి విధిస్తూ జారీ చేసిన అనైతిక ఆదేశా లను అత్యున్నత ధర్మాసనం నాలుగు-ఒకటి ఆధిక్యతతో నిస్సిగ్గుగా ఆమోదించి, అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో విషాదకరంగా సుప్రీం కోర్టే పిరికితనానికి మారు పేరుగా మారింది. అంటే అంతరార్థాన్ని ఉన్నది ఉన్నట్టు గా విడమరచాలంటే ఎలాంటి జవాబుదారీతనం వహిం చకుండానే ఎవరినైనా చంపే హక్కు సైతం ప్రభుత్వానికి ఉందనే. కేవలం కొద్ది మంది పాత్రికేయులు, కొన్ని పత్రికలు మాత్రమే ప్రభుత్వాన్ని, సెన్సార్షిప్ను సవాలు చేశాయి. నిజానికి సెన్సార్షిప్ జర్నలిజాన్నే అర్థరహితం చేసేసిందనుకోండి . ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సంపాదకుడు కులదీప్‌నయ్యర్ జైలుపాలైన పాత్రికేయుల్లో అత్యంత సుప్రసిద్ధులు. కానీ మిగతావారు అంత ప్రముఖులు కాకపోవడం వల్లనే ఎక్కువగా బాధలను అనుభవిం చారు. అలాంటి వారిలో వీరేంద్ర కపూర్ ఒకరు. ఆయన భార్య కూమీ కపూర్ అప్పట్లో ఎక్స్‌ప్రెస్‌లో రిపోర్టర్‌గా పనిచేసేవారు. ఆ కాలానికి సంబంధించిన చరిత్రపై తాజాగా ఆమె ఓ పుస్తకాన్ని రచించారు. తన స్వీయాను భవాలతో రాసిన ఆ పుస్తకానికి ఆమె సాదాసీదాగా ’ది ఎమర్జెన్సీ’ అని పేరుపెట్టారు. నేనింకా చదవలేదు. కానీ చదివిన వారు అది సర్వోతృష్టమైన రచన అంటున్నారు. గత 30, 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ దేశాన్ని ప్రత్యక్షం గానో లేక కూటమి రూపంలోనో పాలిస్తోంది. ఆ అధ్యా యాన్ని ప్రజా జ్ఞాపకం నుంచి చెరిపేయడానికి అది అధికారాన్ని ప్రయోగించింది. అదా ప్రయత్నంలో కొంత వరకు విజయవంతం అయ్యింది కూడా. అది చరిత్రను సెన్సార్‌షిప్‌కు గురిచేయడమే. అందుకే కూమీ పుస్తకాన్ని మన చరిత్ర సిలబస్‌లో చేర్చాలి. మొదట హఠాత్తుగా విరుచుకుపడి, ఆ మీదట విస్తరించే విషాదపు వలయా లుగా వ్యాపించిన ఆనాటి అణచివేత భీతి బరువును, ఆందోళనను అనుభవంలోకి తెచ్చేలా వర్ణించడం చాలా కష్టం. అపరిమితంగా, ఇష్టానుసారంగా సాగిన ఆరెస్టు లూ, వాటితోపాటు తప్పనిసరి చిత్రహింసలూ దీనికి ఒక కారణం మాత్రమే. అదీ నా దృష్టిలో అత్యంత ముఖ్య కారణం కాదు. కొద్ది నెలలకే, ప్రత్యేకించి ఇందిరా గాంధీ దర్బారు నిరంకుశ పాలనకు సంజయ్‌గాంధీ కేంద్రంగా మారాక... మాకిక భవిష్యత్తు లేదనీ, చాలా వలసానం తర దేశాల బాటలోనే రాజకీయంగా ప్రతిష్టను కోల్పో యిన నిరంకుశ పాలకుని నియంతృత్వానికి శాశ్వతం గానే మన దేశం కూడా లొంగిపోతుందని అనిపించ సాగింది. అత్యవసర పరిస్థితి విధింపునకు బహిరంగ సమర్థనలన్నీ కపటంతో కూడినవి, స్వీయ ప్రయోజ నాలను ఈడేర్చుకోడానికి ఉద్దేశించినవే. అలా అని అవి వారినేమీ తక్కువ శక్తివంతులను చేయలేదు. అభివృద్ధికి ఆటంకమంటూ ప్రజాస్వామ్యాన్ని కొట్టిపారేశారు. ప్రజా స్వామ్యాన్ని ప్రజలకు శత్రువని, వారి ఆర్థిక ఉన్నతికి అడ్డంకని నమ్మశక్యంకాని రీతిలో దూషించారు. ఆనాటి దర్బారులోని కొందరు సభ్యులు నేడు రూఢి చేస్తున్నట్టు సంజయ్‌గాంధీ కనీసం 20 ఏళ్లపాటైనా ఆ అత్యవసర పరిస్థితి కొనసాగాలని భావించారు. ఇలా ఫాసిజాన్ని రుద్దడాన్ని మన దేశం సహిం చేదేనా? ‘‘కాదు’’ అనేదే సమాధానమని విశ్వసిం చాలనే మనమంతా కోరుకుంటాం. కానీ పూర్తి నిజాయితీగా చెప్పాలంటే అలా అని కచ్చితంగా చెప్పలేం. రాజకీయ వేత్తలలోనూ, ప్రజలలోనూ కూడా నేడు స్పష్టత ఏర్ప డింది. అలాంటి మూర్ఖత్వాన్ని సూచించడం సైతం మాల్టోవ్ కాక్టెయిల్స్ (పెట్రోలు బాంబులు) అవసరం పడటానికి చాలా ముందే అపహాస్యానికి గురై నామ రూపాల్లేకుండా పోతుంది. మన స్వాతంత్య్రం నేడు ప్రచండమైన ఆత్మసంకల్పంతోనూ, సాంకేతికతతో నూ సురక్షితంగా ఉంది. కంప్యూటర్లులేని 1975లో ప్రజా స్వామ్య పరిరక్షకులుగా నిలిచిన వారు నేడు మనం ఎగతాళి చేయడానికి ఇష్టపడే రాజకీయవేత్తలలోని వారే కావడం విశేషం. జయప్రకాష్ నారాయణ్, ఆచార్య కృపలానీ, మొరార్జీ దేశాయ్ వంటి స్వాతంత్య్ర పోరాట కాలపు సీనియర్లు, వారికి కొద్దిగా వెనుక అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ, నానాజీ దేశ్‌ముఖ్, జార్జి ఫెర్నాండెజ్లతరం, అగ్రశ్రేణిలో నిలిచి సాగడానికి సిద్ధం గా ఉన్న అనుచర సేన నాటి ప్రతిఘటనలో ప్రముఖులు. అత్యవసర పరిస్థితి కాలపు జైలు ఖైదీలోని నేటి ప్రముఖు లలో ఒకరు మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ‘ఇందిరే ఇండియా’ అని ప్రకటించిన ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్‌కాంత్ బారువా, అత్యవసర పరిస్థితి ఆదేశాలపై ఆలోచించడానికిగానీ లేదా న్యాయ పరిశీలనకు గానీ ఆగకుండా వెంటనే సంతకం పెట్టేసిన రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ వంటి భజనపరులు సైతం ఉండేవారు నిజమే. అద్భుతమైన వ్యంగ్యచిత్ర కారుడు, రచయిత అబూ అబ్రహ ం... అహ్మద్‌కు సరిగ్గా సరిపోయే కార్టూన్ గీశారు. ఫక్రుద్దీన్ స్నానపు తొట్టె లోంచే అత్యవసర పరిస్థితి ప్రకటనపై సంతకం చేస్తున్న ట్టు చూపుతూ సంక్షిప్త మరణసందేశాన్ని లిఖించారు. దేశ రాష్ట్రపతి నైతికంగా నగ్నంగా నిలిచిన సమయమది. అయితే నేను అలాంటి భజనపరులను గట్టిగా శభాష్ అని మెచ్చుకుంటూ దీన్ని ముగిస్తాను. వారేగనుక లేకపోతే, మనం బహుశా ఎప్పటికీ స్వేచ్ఛను పొంది ఉండేవారమే 1977లోని అంతుబట్టని పెద్ద రహస్యం ఇదే. చట్టపరమైన నిర్బంధమేదీ లేకున్నా ఇందిరాగాంధీ సార్వత్రిక ఎన్నికలకు ఎందుకు పిలుపునిచ్చినట్టు? ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తారని నమ్మారు కాబట్టి. అలా ఆమెకు నమ్మిక కలిగించిందెవరు? ఇంటెలిజెన్స్ బ్యూరోలోని అత్యంత విధేయులైన పోలీసు అధికా రులు. లోక్‌సభలో ఆమె 250కి పైగా స్థానాలను సాధించి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారని వారు చెప్పారు. ఇందిర వారి మాటలు నమ్మింది. బతికించావురా భగవంతుడా! - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు